Friday, July 21, 2023

భారత స్త్రీత్వం శపిస్తున్నది: ఈ రాజ్యం కుక్క చావు చస్తుంది: మీరేమంటారూ 3

                                                                         


మీరేమంటారూ?

కుల వైషమ్యాలు, మత వైషమ్యాలు, తెగ వైషమ్యాలు, ఇంకా చాల వైషమ్యాలు చాల ఉన్న అద్భుతమైన దేశం మనది. దీన్నే సాంస్కృతిక వైవిధ్యం అంటున్నామేమో కాస్త ఆలోచించాలి. సాంస్కృతిక వైవిధ్యాల పేరిట తెగల, కులాల, మతాల ప్రత్యేకతలను కొనసాగించాలనడం సరైంది కాదు. ఆధునిక నేపధ్యంలో... ముఖ్యంగా డబ్బు, సంపదల నేపధ్యంలో ఆ వైవిధ్యం/వైరుధ్యం ఇంకా పెరగడానికి దోహడం చేస్తున్నామా ఆలోచించాలి. ఇవాళ మన ప్రగతి వాదులు ఆ ఘనకార్యం చేస్తున్నారని నా అభియోగం. రక రకాల వెనుకబాటుతనాలు వైవిధ్య విశేషాలు కావని గుర్తించాలని విన్నపం.

ఇప్పటికి ఈ వైవిధ్యం దానికి అనుబంధమైన వైరుధ్యం ఒక వాస్తవం. వాటిని వొదిలించుకోడానికి ఎలాంటి చట్టాలు, ప్రచార కార్యక్రమాలు జరగాలో చూడాలి. ఇవాళ మాత్రం మత, కుల, తెగ వైషమ్యాలు వాస్తవం. వాటి పేరిట కొన్ని ఘోరాలను చూసీ చూడనట్టుండే రాజకీయ హైన్యం మాత్ర అస్సలు క్షమించరానిది.

పేదలు, స్త్రీలలో కూడా చెడ్డవాళ్లుంటారు. చెడ్డతనానికి పేదరికం, స్త్రీత్వం ఇన్సులేటర్ కాదు. కాని, పేదల, స్త్రీల నిస్సహాయత మీద జరిగే దాడులను ప్రభుత్వాలు చూసీ చూడనట్టుండడం మాత్రం క్షమించరాని నేరం. గుజరాత్ లో, మణిపూర్ లో జరిగిన ప్రత్యేక విషయం ఇది. తక్షణం ప్రభుత్వాన్ని నిలదీయడమే ఇలాంటి సందర్భాలలో జరగాలి.


Prabhakar Ak

జాతుల మధ్య వైవిధ్యాన్ని కాపాడుకుంటూ అది వైషమ్యంగా మారకుండా పరస్పరం గౌరవించుకుంటూ ప్రజాస్వామికంగా కలిసి మెలిసి జీవించడమే ఆధునిక సామాజిక విలువ. అది జరగనందువల్లే సోవియట్ యూనియన్ ముక్కలైంది. ఇటీవలి చరిత్ర చెప్పిన పాఠం ఇది


Hanumantha Reddy Kodidela

సోవియెట్ యూనియన్ ముక్కలు కాకుండా ఉండాలంటే అక్కడి రాజ్యం ఎలాంటి వైఖరి అవలంబించాల్సి ఉండిందంటారు?

'జాతుల స్వయంనిర్ణయాధికారం' అనే లెనిన్ సూత్రం ప్రకారం విడిపోవడం లేదా కలిసుండడాన్ని జాతుల నిర్ణయానికి వొదిలేయాలి. ఇది తప్పు అని రోజా లగ్జెంబర్గ్ లెనినిజం మీద పెట్టిన ఒక ముఖ్య విమర్శ. నా మట్టుకు నేను లగ్జెంబర్గ్ వైపే మొగ్గుతాను. ఇతరేతర చట్టపర విషయాలలోనూ జాతుల అతి స్వయంప్రతిపత్తి (అటానమీ) ఒక దేశపు నేషన్ హుడ్ కు చేటు చేస్తుందని నేను భావిస్తాను. ఈ 'చేటు' అభివృద్ది నిరోధకమైన చేటు. సోవియెట్ యూనియన్ కు చేటు తెచ్చింది ఆ వైఖరియే.

ఒకే దేశంలో భిన్న జాతులు ఇలా నిత్యం కొట్టుకు చస్తుంటే ఇక ఆ దేశమేగతి (ఇతర దేశాలతో పోలికలో) బాగుపడుతుందని కూడా నా బాధ. అందుకే చట్టపరమైన యూనిఫార్మిటీ అవసరం ఏ దేశానికైనా. మతం, కులం, తెగ కాదు అందరికీ వర్తించే రాజ్యాంగమే ఉమ్మడి రంగ భూమిగా ఉండాలి. అంటే, జాతులను బలవంతంగా కలిపి ఉంచాలా అని అడుగుతారు. కాదు. ఒప్పించడం ద్వారానే కలిపి ఉంచాలి. ఆపని చివరికంటా చేసి, ఇక వీలు కానప్పుడే విడిపోవాలి. అంత సీన్ లేకపోయినా, విడిపోదామని అనే వాళ్లు ప్రతి జాతిలోనూ ఎప్పుడూ ఉంటారు. దానికి అంతూ పొంతూ ఉండదు. పరిస్థితులు బాగో లేనప్పుడు (ఉదాహరణకు నిరుద్యోగం విపరీతమయినప్పుడు) తమ ప్రయోజనాల కోసం జాతిని విడగొట్టే శక్తులు మెజారిటీ అవుతాయి. విజయం సాధిస్తాయి. విజయం సాధించినంత మాత్రాన ఆ శక్తుల మాట సరైనదని అనలేం

 

No comments:

Post a Comment

సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...