Tuesday, July 18, 2023

గురి మరిచిన బాణాలు: మీరేమంటారూ 1

 కొన్ని ఫేస్ బుక్ పోస్టులు మరీ అన్యాయం. పోస్టుల్లో చాల తీవ్రమైన విమర్శ ఉంటుంది. అంత కన్న తీవ్రమైన పదజాలం ఉంటుంది. అది ఎవరి గురించో తెలీదు. ఎవరి గురించి అంత తీవ్రంగా మాట్లాడుతున్నారో తెలీదు. ఔను కదా, ఔనంతే, అలాంటోళ్లు అంతే... అని దాని కింద అదేదో రకం ఆనందం వ్యక్తం చేసే కామెంట్లు ఉంటాయి. ఆ విమర్శ ఎవరెవరి గురించో వాళ్లు కూడా ఆ కామెంటేటర్లలో ఉంటారు, ఎంచక్కా.

ఇలాంటి వాటి వల్ల ఏమిటి ప్రయోజనం? ఏ కెనడా కార్చిచ్చుకో ఏ అమెరికాలోనో గాలి అసయ్యంగా తయారయినట్టు, ఫేస్ బుక్ లో వాతావరణం కలుషితం కావడం తప్ప అలాంటి వాటి వల్ల ఏమిటి ప్రయోజనం?
పబ్లిక్ విమర్శ, చర్చ అనేవి చాల గొప్ప సాంఘిక ఉపకరణాలు. చైనా సాంస్కృతిక విప్లవంలో 'బొంబార్డ్ ది హెడ్ క్వార్టర్స్' పేరిట సాగిన పబ్లిక్ విమర్శ దీనికి మంచి ఉదాహరణ. చైనీస్ మావోయిస్టులు ఈ రూపంలో ఒక గొప్ప ప్రజా మార్గాన్ని రాజకీయాలలో ప్రవేశ పెట్టారు. చైనా సాంస్కృతిక విప్లవంలో 'అతి' పనులు జరిగాయనే విమర్శలో నిజం కన్న అనిజాలే ఎక్కువ. (యూనివర్సిటీ ప్రొఫెసర్లతో రైతుల్లా పేడతట్టలు మోయించడంలో 'అతి' ఏమి ఉన్నదో నాకు అర్థం కాదు). దానిపై సరైన స్వతంత్ర పరిశీలన ఏదీ లేదు. దాని ప్రాపంచిక ప్రభావాలు మాత్రం చాల గొప్పవని నా అభిప్రాయం.
చైనా లోనే కాదు. విప్లవం వంటి తీవ్ర విషయాల్లోనే కాదు, మన దైనందిన జీవితాలలోని చిన్న చిన్న ఘటనలలోనూ అలాంటి మొహమాటం లేని బహిరంగ విమర్శ అత్యవసరం. మనుషులు తమ మనస్సులను కడుక్కోడానికి అంతకు మించి మార్గం లేదు. దానిలో 'అతి' ఏదైనా ముందుకు వస్తే దాన్నుంచి మనల్ని మనం కాపాడుకోడం కూడా ఆచరణలో నేర్చుకోవలసిందే.
ప్లీజ్, నేరుగా మాట్లాడండి. సూటిగా మాట్లాడండి. సుత్తి లేకుండా మాట్లాడండి. 'నా నుంచి తప్పులు దొర్లితే ఒప్పుకుని దిద్దుకుంటాను' అనే వైఖరిని అందరం అలవర్చుకుంటే ఇక దేనికీ భయపడక్కర్లేదు. అలా అలవర్చుకోడం కూడా బహిరంగ విమర్శా క్రమంలో జరగాల్సిందే కదా?! ఎవరిని అంటున్నారో వారిని, ఆ సమస్యను వీలయినంత వివరంగా చెప్పి మరీ మాట్లాడాలని నా విన్నపం.
మీరేమంటారు?

No comments:

Post a Comment

సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...