మీరేమంటారూ? 3
కాసేపటి ముందు మితృడు సురేంద్ర రాజుకూ నాకు మధ్య సంభాషణ. కింది కాపీ లో నా భాషణమే ఎక్కువ . ఇదే వెయిన్ లో, శీను వంటి మరికొందరు స్నేహితులు కూడా నన్ను పోక్ చేసి వుండడం వల్ల నా వ్యాఖ్య కాస్త పొడుగయ్యింది. అయినా బాంటుంది, చదవండి. చదివి, మీరేమంటారో చెప్పండి
వైవిధ్యం / భిన్నత్వం / బహుళత్వం - పైన మీ అసహనం హిందూత్వ అసహనాన్ని మించిపోతున్నది. హ్యాట్సాఫ్ ! కీపిటప్ ... గుడ్ లక్ ...
Hanumantha Reddy Kodidela
థాంక్స్.
నా మీద మీ అసహనం దేన్ని మించి పోయిందో చెప్పలేను.
నా అసహనం భిన్నత్వం మీద కాదు, ఆ పేరుతో బ్రాహ్మణవాదులు పరోక్షంగా బ్రాహ్మణ వాదాన్ని కాపాడడం మీద. తెగలూ కులాల వాదాన్ని కాపాడే యథాతథ వాదం మీద. మీరు అందులోంచి బయటికి రాలేరు. అది మీరు కూర్చున్న కొమ్మ. మీరంటే నాకు ఇష్టం, కాని ఇలాంటి ఇష్టాల కోసం నన్ను నేను వొదులుకోలేను. భిన్నత్వం పేరిట తెగలూ, కులాలతో కూడిన యథాతథ స్థితికి మీ అందరి తెలివైన కాపలాను అంగీకరించలేను. ఈ ఇస్యూలో మనం వ్యతిరేక శిబిరాలలో ఉన్నాం. ఒకే శిబిరంలో ఉన్నట్టు నటన అక్కర్లేదు.
నిజానికి గతంలో కూడా ఇదే నా వైఖరి. అంటే హిందూత్వ అనే పదం పుట్టక ముందు నుంచీ... బీజేపీ ప్రభుత్వంలోకి వస్తుందని అనుకోక ముందు నుంచీ... ఇదే నా వైఖరి. ఇప్పటికీ అదే. గతంలో నేను మంచి వాడినని మీరు భ్రమ పడినట్టున్నారు. మీ ప్రమాణాల ప్రకారం నేను మంచి వాడిని కాను. పేరు హనుమంతుడిదైనా నేను ఆసాంతం అసురుడను. అన్ని రకాలుగా దేవతల వ్యతిరేకిని. అన్ని దేవతల వ్యతిరేకిని. గిరిజన దేవతల వ్యతిరేకిని కూడా.
మా ఊరికి వెళ్లినపప్పుడు వాళ్ల పూజలకు... అవి దాదాపు గిరిజనుల పూజల వంటివే... కూడా వ్యతిరేకిని. ఈ చివరి ఆచరణాత్మక-వ్యతిరేకత వల్ల, ఇంట్లో అందరికీ దూరమై అనుభవించిన (ఇప్పటికీ అనుభవిస్తున్న) నొప్పిని చెబుతూ, గతంలో నా లాంటి వాళ్లది ఒక మైనారిటీ ఘోష అని రాసినందుకు మైనారిటీ మహాకవి ఖాదర్ నా అగ్రవర్ణ దురహంకారాన్ని ఇప్పటికీ క్షమించలేదు.
క్షమించబడాలంటే, నేను ఆయన మతాభినివేశాన్ని... ఇదిగో ఇప్పటి మీ వైవిధ్య భరిత హేతుత్వం సాయంతో... మెచ్చుకుని గౌరవించాలనుకుంటా. అది నాతో అయ్యే పని కాదు. నేను ఏ మతాన్నీ గౌరవించను. సూఫీ అని మెత్తని పేరు పెట్టుకున్న మతాన్ని కూడా గౌరవించను.
ఇప్పుడు మీ వంటి స్నేహితులు నా మీద చూపిస్తున్న పిటీ అప్పుడు ఖాదర్ కలిగించిన నొప్పి వంటిదే అనుకుంటాను సురేంద్రా!
ఈ డైలాగు కొనసాగాలి గాని, 'పిటీ చేయడం' వంటి హైహాండెడ్ నెస్ ను నివారిద్దాం.
No comments:
Post a Comment