చెకోవ్ కథలు చదువుతున్నానని చెప్పాను కదా. చాల నిదానంగా నడుస్తోంది బండి. చాల గొప్పగా ఉన్నాయి కథలు. ఒక్కో కథ ఒక మహా కావ్యం. ఇదిగో ఈ 'ది బ్రేక్డౌన్' అనే కథ. వ్యభిచార గృహానికి వెళ్లిన నలుగురు యవకులు... ఒకరు కళాకారుడు, ఒకరు వైద్య విద్యార్థి, ఒకరు మానవ వాది, మరొకరు వాళ్లతో పాటు చాల అయిష్టంగా వెళ్లిన మరో యువకుడు. వాళ్లు ఇంటికి నడుస్తున్నప్పుడు...
‘
వ్యాసిల్యేవ్ తన స్నేహితుల వెనుక నడిచాడు. వాళ్ల వీపులను చూస్తూ ఆలోచించాడు:
“రెండింటిలో ఏదో ఒకటి: వ్యభిచారం తప్పని మనం ఊరికే అతిగా ఆలోచిస్తూ అయినా ఉండాలి. లేకపోతే, వ్యభిచారం మనం అనుకునేంత తప్పే అయితే, అప్పుడు ఈ నా ప్రియతమ స్నేహితులు కూడా బానిస-యజమానులే, రేపిస్టులే, హంతకులే. ఇప్పుడు వీళ్లు పాటలు పాడుతున్నారు, నవ్వుతున్నారు, హేతుబద్ధంగా మాట్లాడుతున్నారు గాని, ఇంతకు ముందే వీళ్లు కూడా ఆకలిని, అజ్ఙానాన్ని, మూర్ఖత్వాన్ని వాడేసుకోలేదా? నేను చూశాను, వాడేసుకున్నారు. వీళ్ల మానవత్వం, వైద్యశాస్త్రం, కళలు అప్పుడు ఏమయ్యాయి? వాటికీ, ఈ వాడేసుకోడానికీ మధ్య సంబంధం ఏమీ లేదా? ఈ హంతకుల ఉన్నత భావాలను, వీళ్ల విద్య ను చూస్తే నాకొక పంది మాసం ముక్క కథ గుర్తుకొస్తోంది. ఇద్దరు దొంగలు అడివిలో ఒక బిచ్చగాణ్ని చంపేశారు. బిచ్చగాడి బట్టలు పంచుకోడం మొదలెట్టారు. బిచ్చగాడి సంచిలో వాళ్లకు ఒక పంది మాంసం ముక్క కనిపించింది. “భలే. అదృష్టం, పట్టు, తినేద్దాం” అన్నాడొకడు. “వొద్దు, ఎట్టా తింటాం?”, కోప్పడ్డాడు రెండో వాడు. “మరిచిపోయావా? ఇవాళ బుధవారం కదా?” (సాంప్రదాయిక క్రైస్తవులు బుధ, శుక్రవారాలు మాంసం తినరు). అంతే. వాళ్లా మాంసం ముక్క తినలేదు. అప్పుడే ఒక మనిషిని చంపిన వాళ్లు తాము ఉపవాస దీక్ష ఎంత చక్కగా పాటించారో గర్వపడుతూ అడివి నుంచి బయటికి నడిచారు. ఈ ఇద్దరు నా స్నేహితులు కూడా అంతే. వీళ్లు ఆడవాళ్లను కొంటారు, మళ్లీ తాము కళాకారులమని, పండితులమని చెప్పుకుంటారు..."
'
‘ది బ్రేక్డౌన్’ అనే కథ.
ఆంటన్ చెకోవ్ ‘యాభై రెండు కథలు’, ఇంగ్లీషు: రిచర్డ్ పెవియార్, లారిస్సా వోల్వోఖోన్స్కీ.
july 8, 2023
No comments:
Post a Comment