ప్రపంచ
రాజకీయ గతిని మార్చి వేస్తున్న పరిణామం యుక్రెయిన్ యుద్దం. ఇది చాల రకాలుగా కొత్త
కొత్త పరిణామాలను ప్రారంభిస్తున్నది. ఈ రైటప్ లో నేనొక పరిణామం విషయమై నా ఆందోళన
ప్రకటిస్తున్నాను.
ఇది
కేవలం యుక్రెయిన్ కు,
రష్యాకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. నాటో కూటమికి, రష్యా కూటమికి మధ్య జరుగుతున్న యుద్ధం. ప్రాణనష్టం మేరకు మాత్రమే ఇది
యుక్రెయిన్, రష్యాలకు పరిమితం. నిజానికి, ఆ పరిమితి కూడా పూర్తి అర్థంలో కాదు. అటు ఇటు... స్వచ్చంద సైనికులు,
కిరాయి సైనికులు... మనం చూడకుండా ఉంటానికి వీల్లేనంత... ఎక్కువగా
ఉన్నారు. సరే, నిపుణుల రూపంలో, శిక్షకుల
రూపంలో నాటో ఎలీట్ సైనికులు భారీగానే ఉన్నారు. (వీళ్లు లేకుండా జెర్మన్ లెపార్డ్,
అమెరికన్ అబ్రహాం యుద్ద ట్యాంకులు, అమెరికన
పేట్రియట్ క్షిపణి వ్యవస్థలు పని చేసేవి కాదు).
వాగ్నర్
బృందం అనేది రష్యా పక్షాన పోరాడిన కిరాయి సైనిక బృందం. ఎవ్గెనీ ప్రిగోజిన్ దాని
నాయకుడు/అధినేత. ఇదొక కంపెనీ. ఇది యుక్రేన్ లోనే కాదు ఆప్రికాలో బహుశా
లాటినమెరికాలో కూడా ఈ సంస్థ పని చేస్తున్నది. ఇక్కడ ‘పని’ అంటే ఏమిటో వేరే చెప్పనవసరం లేదు. చంపే పని, చనిపోయే
పని. వాగ్నర్ సంస్థ రష్యా అనుకూల సంస్థ. దానికి రష్యా నిధులు కూడా ఉంటాయి. రష్యాకు
వ్యతిరేకంగా పని చేయదు. ఇందులో సభ్యులు కూడా ప్రధానంగా రష్యన్లే. ఇలా ‘కిరాయి’కి పని చేసే సైనిక సంస్థలు వేరే దేశాలవి కూడా
ఉన్నాయి. (వాటి గురించిన సమాచారం నా వద్ద లేదు).
యుక్రేన్
లో బాఖ్మూత్ నగరం,
దాని పరిసరాల్ని రష్యాధీనం చేయడంలో వాగ్నర్ గ్రూపు కీలక పాత్ర
నిర్వహించింది. ఇటీవల ఈ బృందానికీ రష్యా సైనిక బలగాలకూ మధ్య విబేధాలు వచ్చాయి.
దీని నాయకుడైన ఎవ్గెనీ ప్రిగోజిన్ తిరుగుబాటు చేశాడు. రష్యా ఈ తిరుగుబాటుని ‘నివారించ’గలిగింది. బెలారూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్
లుకషెంకో రష్యాకూ వాగ్నర్ కు మధ్య రాజీ కుదిర్చాడు. ప్రిగోజిన్, అతడి సేనా బృందం పక్కన బెలారూస్ వెళ్లి తలదాచుకుంది.
ఇదొక
కొత్త పరిణామం. దేశాల,
వాటి ప్రభుత్వాల అధినంలో స్థిర సైనిక బలగాలు ఉండగానే మానవ జాతి
నిత్యం రక్తపాతంలో లేదా రక్తపాతం అంచులలో బతుకీడుస్తున్నది. ఏ దేశ ప్రభుత్వానికి
ఎప్పుడు యుద్ధ కాంక్ష పుడుతుందో, ఎప్పుడెక్కడ బాంబులు పేలుతాయో,
వాటిలో భాగంగా ఎప్పుడెక్కడ అణు విస్ఫోటం జరుగుతుందో అని ప్రాణాలు
ఉగ్గబట్టుకుని బతుకుతున్నాం. దేశాల మధ్య ఏవేవో ఒప్పందాలు చేసుకుని వాటిని అన్ని
ప్రభుత్వాలు పాటిస్తాయనే పేరాశలతో గడుపుతున్నాం. (ఇక్కడ జీవిస్తున్నాం అనే మాట
రాయాలనిపించడం లేదు నాకు).
అలాంటిది
ఏ దేశానికి పరిమితం కాకుండా మల్టీనేషనల్ కంపెనీల రూపంలో వాగ్నర్ వంటి కిరాయి సైనిక
బృందాలు (మెర్సినరీ గ్రూప్స్) ఇప్పుడు రంగ ప్రవేశం చేస్తున్నాయి. ఇది రష్యా వైపున
మాత్రమే జరుగుతున్న పరిణామమా? నా దగ్గర తగిన సమాచారం లేదు గాని, అలా పరిమితం కాదనే అనుకుంటాను. నికారాగ్వా లో లెఫ్టిస్ట్ ప్రభుత్వానికి
వ్యతిరేకంగా పని చేసిన కాంట్రా గెరిల్లా బృందం రీగన్ కాలంలోనో అంతకు ముందో తయారైన
కిరాయి సైనిక బృందమే. అంగోలా లో కవీ-రాజకీయ నాయకుడు అగస్టినో నెటూ నాటి నుంచి ‘ఎంపీఎల్ ఎ’ లెఫ్టిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా
పని చేసిన ఎఫ్ ఎన్ ఎల్ ఏ అలాంటి కిరాయి సైన్యమే. లిబియా తదితర దేశాలలో కూడా ఇలాంటి
బృందాలు పని చేశాయి. వీటి గురించిన సమాచారం... ఓపెన్ గా ఉన్నది చాల తక్కువ.
ఇక
ముందు... మందుల కంపెనీల మాదిరిగానే, ఆహార కంపెనీల మాదిరిగానే సైనిక కంపెనీలూ
పెరుగుతాయి. (తయారవుతాయి అని నేను అనడం లేదెందుకంటే,
ఇప్పటికే తయారయి ఉన్నాయి). ఇదొక ట్రెండ్ గా మారుతుందా? అణుబాంబు
నియంత్రణ లాగే కిరాయి సైనిక నియంత్రణకు ఆంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు, ఒప్పందాలు అవసరమవుతాయా?
చూద్దాం.
(వాగ్నర్
అనేది ఒక ప్రసిద్ధ జర్మన్ సంగీతకారుని పేరు.
సో, ప్రిగోజిన్
బృందం మరణ రాగం ఆలపిస్తున్నదా?)
జూన్
4 2023
No comments:
Post a Comment