Thursday, July 27, 2023

బూర్జువా పార్టీలనుంచి బుర్జువా డెమోక్రసీ డిమాండ్ చేయాలి: మీరేమంటారూ 5


మీరేమంటారూ?

    నా ఫేస్ బుక్ మితృలు మితృలు తిరుపాలు పూసలపాటి ఇలా అన్నారు:

"(జగన్ ప్రభుత్వం మీద) మీది భ్రమ అందామా? ఆశావాదం అందామా? మొదటి నుండి మీరు సానుభూతి చూపిస్తునే ఉన్నారు. సానుభూతి చూపించడం లో తప్పు లేదు. మీలాంటి అనుభవజ్ఞులు చూపించటం ధర్మం కాదు. ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మార్పులు ఏమి ఉండవు. ఒక సన్నని గీత తప్ప!

తిరుపాలు గారి మాట చాల ఆలోచనీయం. ఇది ఆయన ఒక్కరి మాట కాదు. పాలక పార్టీలలో ఏ ఒక్కదానికైనా అనుకూలమైన మాట వినిపిస్తే చాలు, ఇలాంటి మందలింపులు ఎదురవుతాయి. ఈ మందలింపులు సరైనవేనా? చాల మంది స్నేహితులు ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇది సరైన ఆలోచనేనా?
తిరుపాలు గారూ! మరి, ప్రజల మేలు కోరే వాళ్లం ఇవి కాకుండా మరి ఏ పార్టీల మీద ఆధారపడదామంటారు? పాతికో యాభయ్యో అయిపోయిన కమ్యూనిస్టు పార్టీల మీదనా? సాధ్యమా? లాబీయిస్టు సమూహాలుగా, కుల కూపాలుగా మిగిలిపోయిన వాళ్ల మీదనా?
నా మట్టుకు నేను ఇప్పుడు ప్రజా జీవితంలో మెరుగుదల కోసం కమ్యూనిస్టుల మీద ఆధారపడడం సాధ్యం కాదని అనుకుంటున్నాను. సాధ్యమైతే బాగుణ్ను కాని, సాధ్యం కాదు.
ఒక్కుమ్మడి మార్పులతో కూడిన విప్లవాలు జరిగేట్టు ఉంటే, అవి జరగడానికి దశాబ్దాలు, శతాబ్దాలు పట్టగూడదు. ఈలోగా ప్రజా జీవితం సంగతేమిటి? సాయుధ పోరాటం వంటి నినాదాలు సఫలమై ప్రజల చేతికి అధికారం వచ్చే దాక చుట్టూరా కనిపించే ప్రజా సమస్యలు ప్రజలను హింసించక మానవు. కూటికి లేక వలసపోయే నిరుపేదల దుఃఖం అగదు. అందువల్ల, ఉన్న రాజకీయ ఏర్పాట్లతోనే ప్రజా జీవితాల్ని మెరుగుపరుచుకోవాలని నేను భావిస్తున్నాను. జీవితాల మెరుగుదల క్రమంలోనే, దాని కోసం చేసే పోరాటాల క్రమంలోనే ప్రజలు పురోగమిస్తారని, దోపిడి వ్వవస్థ ఆ సమస్యలను తీర్చలేక వరుస సంక్షోభాలకు గురై... జనం కూలదోస్తే కూలిపోతుందని నేను అనకుంటున్నాను.
మరలాంటప్పుడు, ఇప్పటికిప్పుడు ప్రజలకు మరింత మెరుగైన జీవితాల్ని డిమాండ్ చేయాలా వద్దా మనం? ఎవరిని డిమాండ్ చేయాలి? బూర్జువా పార్టీల నుండి బుర్జువా ప్రజాస్వామ్యాన్ని డిమాండ్ చేయాలని నా అభిప్రాయం. కులాలు, మతాలతో ప్రమేయం లేని ప్రజానుకూల పాలనలను డిమాండ్ చేయాలి అని నా అభిప్రాయం. ఆ డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తే ఆ ప్రభుత్వాలు ఉంటాయి. లేకపోతే ఊడుతాయి. అలాంటి త్రెట్ ఎప్పుడూ రాజ్యానికి ఉండాలి.
ఈ అర్థంలోనే... ప్రజల డిమాండ్లకు స్పందించడం అనే అర్థంలేనే... నేను ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం చూడలేకపోతున్నానని అన్నాను. చూడలేకపోతున్నాను కూడా. మీకు అలాంటి ప్రత్యామ్నాయం కనిపిస్తే చెప్పండి. మన మితృలు కొందరికి... రాష్ట్రంలో 'తెలుగుదేశం' పార్టీ అలాంటి ప్రత్యామ్నాయంగా, కనిపించింది.
మరి, మీకు? మీకు కనిపిస్తున్న ప్రత్యామ్నాయం ఏమిటి?
ఇది సీరియస్ ప్రశ్న. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుకుందాం.
కలిసి ఆలోచిద్దాం. మీది నిరాశ అని అనను గాని, ‘ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మార్పులు ఏమి ఉండవు’ అనేది నిరాశ కాకపోతే ఏమిటి, చెప్పండి?
జులై 27, 2023

No comments:

Post a Comment

సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...