నువ్వు నమ్మవు గాని, ఆ రోజు పొద్దున్నే
ఒక సీతాకోక చిలుక మా ఇంటి కొచ్చింది
పిట్టల కోసం చూరుకు కట్టిన
జొన్న కంకి మీది సుంకు ను పుప్పొడి అనుకుని
పాపం, చాల సేపు అక్కడే తచ్చాడింది
సీతాకోక చిలుక తొడుక్కున్న రంగు బొమ్మల అంగీ చూసి
దానితో మాట్లాడాలని
అప్పుడే పుట్టిన ఒక పిచిక పిల్ల చాల చాల ఆశపడింది
సీతాకోక చిలుకకు పక్షుల భాష తెలియదు
అప్పుడే పుట్టిన పిట్టల భాష అసలే తెలీదు
తనకంటూ ఒక భాష
లేదని కూడా, పాపం,
సీతాకోక చిలుక మరిచిపోయింది
నాల్కకు బదులు రెక్కలాడించి
ఆ ఏడాది ఉత్తమ కవితల్లా కంకి సుంకు మీద
కొన్ని నిశ్శబ్ద వర్ణాలు విదిలించి ఎగిరి పోయింది
గాలికి లేచిన చప్పుడు లేని రంగులు ఆకాశానికి చేరి,
ఏ సనాతన సౌందర్యానికో పదును బాణం సంధించే
దృశ్యాన్ని
చూశాను
చూరు కింద మంచమేసుకుని కూర్చున్న నేను
చూశాను గాని ఏం చేయను,
రైతు నాన్న రెక్కల నీడలో ఊరి వాగు ఇసుకలో
కవిత్వాలు రాసుకుంటున్న వయస్సది,
సీతాకోక చిలుక కాల్పనికతను వదిలి నిజం పువ్వులు
వెదుక్కుంటూ
ఎటో ఎగిరిపోయింది, పిచిక పిల్ల కూడా
చూరు పట్టుకుని వేలాడడం లేదిప్పుడు
అసలు, చూరే లేదు
యాస్బెస్టాస్ రేకుల ఇనుప అలల కింద నలిగిపోయిన
పాత పక్షి ఈకల మరకలను వదిలించుకుంటే గాని
నగరం నన్ను అంగీకరించదు, ఇక ఏం
చేస్తాను?
ఏదో చేసి ఎట్టాగో ఎగరగలిగినా ఎక్కడికని పోను?
అయినా, నేనేమైనా సీతాకోక చిలుకనా?
నవ జాత పిట్ట పిల్లనా?
రంగులున్నవో లేనివో
తోలువో ఇనుపవో
నా రెక్కలతో నేను ఎగురుతాను
అడివి అడివంతా తిరుగుతాను
ఎటు పోయినా ఎంత ఎగిరి చూసినా
చెట్ల కొమ్మల్లోంచి పడిపోయిన పిట్టల గూళ్లు
చెట్ల కింద దేవుళ్లు వేసుకున్న చలిమంటలు
మంటల్లో చిటపటలాడుతూ, పిట్టగూళ్ల
పుల్లలు
సీతాకోక చిలుక సరే, మాట్లాడ్డానికి నోరు
లేనిది
పిచిక పిల్లలైనా వాళ్ల అమ్మా నాన్నలైనా
నాకు చెప్పాల్సింది
ఆ ఇంటిని, ఇంటి ముందు
రెల్లుగడ్డి చూరును,
చూరుకు కట్టిన కొత్త జొన్న కంకులు గాలికి ఊగుతూ చేసే
నిశ్శబ్దాలను
విడిచి వెళ్లొద్దని,
ఇల్లు విడిస్తే పోరు మధ్యలో
విల్లు విడిచిట్లేనని!
· సుంకు:
కొత్త జొన్నకంకి మీద రజను వంటి పొడి పదార్థం. కంకిలోని పువ్వులన్నీ గింజలైపోగా
మిగిలిన పుష్ప దళాలు అనుకుంటానవి.
+16096472863
May 8, 2023
Sent to AJ (Meher)
No comments:
Post a Comment