Wednesday, July 26, 2023

మీరేమంటారూ? 4

 



ఇది నా ఫొటోనే. ఇది ఈ ఏడాది మొదట కర్నూలు వెళ్లినప్పుడు వేదిక మీద మాట్లాడుతున్నప్పటిది. ఫేస్ బుక్ ప్రొఫైల్ లో మళ్లీ నా ఫొటోనే పెడదామని, ఉన్నంతలో మోస్ట్ రీసెంట్ అని ఈ ఫొటో పెట్టేను. దీన్ని అప్లోడ్ చేస్తున్నప్పుడు కలిగిన ఆలోచనలు... టూకీగా..
సుమారు మూడేళ్ల కొకసారి తీసుకున్న ఫోటోల్లో తేడా చిత్రం అనిపిస్తున్నది. ఇంతకు ముందు కూడా తేడాలు ఇలాగే కనిపించి ఉంటాయి. అప్పుడు కూడా అనుకుని ఉంటాను. పెద్దాన్నయిపోతున్నానని.
అది కాదు గాని, మూడేండ్ల కొకసారి నేను ‘మునుపటి నేను' కానప్పుడు, అయినా నాతో నేను సర్దుబాటు చేసుకుంటున్నప్పుడు, అంత సామరస్యంగానే, నా పక్క వాడితో నేను ఎందుకు సర్దుకోను? ఎందుకు వాడో నేనో అన్నట్టు పేచీ పడతాను?
నేనంటే నేనే కాదు. నాలోని నేనే కాదు. నీలోని నీ నేను కూడా. తన లోని తన నేను కూడా.
ఏం లేదు. అలాంటి సహనాన్ని అలవర్చుకునే క్రమంలో, నేను నేను మాత్రమే అనే దుర్భావన పోయి, నేనూ నీ లాగే తన లాగే, ‘కమ్ లెటజ్ ఎంజాయ్ అవర్ స్టే హియర్ టుగెదర్’ అనే మంచితనాన్ని మనలో ఒక స్వభావ విశేషంగా అలవర్చుకోవాలి. చిరకాలంగా టూ వీలర్ ఉపయోగించే మనిషి చాల అప్రయత్నంగానే, ప్రమాద-రహితంగా బండి నడుపుతాడు. ఇది ప్రతి టూ వీలర్ సొంతదారుకూ అనభవమే. అలాగే, ఇంటర్నలైజ్డ్ స్వభావంగా మంచితనంతో వ్యవహరించడాన్ని అందరం అలవర్చుకోవాలి. అందుకు ఒకరికొకరం సాయం చేసుకోవాలి, మాట సాయమూ, చేత సాయమూ.
మన విద్యలో, విద్యాత్మక చర్చల్లో కలివిడి బతుకుల గొప్పతనాల్ని ఉగ్గడించే మెకానిజం తప్పకుండా ఉండాలి.
చివరికి మిగిలేది ఏమీ లేదు.
ఈలోగా ఈ దోపిడి వొద్దు. దోపిడి చేసి ఇతర్లకు లేకుండా చేయడం ద్వారా ‘నేను’ ఉన్నోడిని అయిపోవాలనే యావ వొద్దు. చివరికి మిగిలేది ఏమీ లేదు నీక్కూడా. నాక్కూడా. అందుకని,
ఇంకొకర్ని
నయవంచనతోనో, బలవతంగానో
దోచుకునే మానసిక, భౌతిక హైన్యం వొద్దు. ఎందుకంటే, నువ్వు ఏం సంపాదించావో దాన్ని నీ కొడుకు లేదా కూతురు నుండి నీ కన్న తెలివైనవా(వంచకు)డెవడో దోచేసుకోడని గ్యారంటీ ఏమీ లేదు. దానికి గ్యారంటీ ఇవ్వడానికి, వాళ్లను కాపాడ్డానికి నువ్వు ఉండవెలాగూ.
ఏంటి, ఈ మెట్ట వేదాంతం అనిపిస్తోందా? మెట్ట సంగతేమో గాని, రకరకాల పాపాలతో సహజీవనం చేసిన వాళ్లు రకరకాల సద్గురు వేషగాళ్లకు దోచిపెట్టడం కన్న, అలాంటివేమీ అవసరం లేకుండా ఇలా మనలో మనం మాట్లాడుకోడం తప్పు కాదనుకుంటాను. ఇది మెట్ట-వేదాంతం కాదనుకుంటాను. ఇవి రోజువారీ జీవితానికి పనికొచ్చే సంగతులే అనుకుంటాను.
మరి, మీరేమంటారూ?
19
  • Like

No comments:

Post a Comment

సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...