Monday, August 7, 2023

సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

May be an image of 4 people and temple
మీరేమంటారూ? 8
// సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?:
గదర్ మరణ వేళ ఒక ఆలోచన //
మరణం వల్ల ఎవరూ అమరులు కారు!
ఏమన్నా అయితే గియితే జీవితం వల్లనే అమరులు అవుతారు.
మృత్యువుకు పెద్ద పీట వేసే పాత, కొత్త, అతి కొత్త సెంటిమెంట్లు ఆత్మహత్యాసదృశమైన భావాలను ప్రోత్సహిస్తాయి.
శ్రోతలను ఉద్రిక్త గొర్రెల్ని చేస్తాయి.
చాల కాలం క్రితం ఊస్మానియా ఆర్ట్స్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో
గుడిహాళం రఘునాథం, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, గుంటూరు ఏసుపాదం, అజయ్ తదితర మితృలు ‘ఒ యు రైటర్స్ సర్కిల్’ అధ్యర్యంలో జరిపిన సాహిత్య సమావేశంలో... అప్పటికే తెలుగు జాతి లెజెండ్, గదర్ తో కలిసి మాట్లాడే అదృష్టం నాకు కలిగింది.
టాపిక్ గుర్తు లేదు గాని, యండమూరి వీరేంద్రనాథ్ నవలల ప్రస్తావన నా ప్రసంగంలో బాగా వొచ్చింది. టాపిక్కే అలాంటిది అనుకుంటాను. సాహిత్యం, కళల్లో పాపులిజం (జనామోద వాదం) మంచిది కాదని, అది సామాన్యులను కామం, క్రోధం, భయం వంటి బేసిక్ అనుకంపనలకు గురి చేసి వాళ్లకు (కూడా) హాని చేసే పనులను వాళ్లతోనే చేయిస్తుందని అన్నాను. దానికి ఉదాహరణలుగా (అప్పుడు చాల ప్రచారంలో ఉన్న) యండమూరి, మల్లాది తరహా పాపులిస్టు రచయితల నవలల్ని ప్రస్తావించాను. వాటితో పాటు (వ్యక్తిగత వర్గశతృవును చంపు నరుకు గొంతు కొయ్యి తరహా) జనం పాటల్ని కూడా పాపులిస్టు సాహిత్యంగా నేను పేర్కొన్నాను.
ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు అవి గదర్ కు తగులుతాయనే స్పృహ కలిగి (నా ఉద్దేశం తనను విమర్శించడం కాకపోయినా), నేను గదర్ వైపు చూశాను. ఆయన కళ్లలో నాకు కనిపించిన ఒక రకం నిరసన భావం నా మసను మీద ఇప్పటికీ ముద్ర పడి ఉంది.
గదర్ మరణ వార్త విన్నప్పట్నించీ, ఆయనకు నివాళులర్పిస్తూ స్నేహితుల పోస్టులు చదువుతున్నప్పుడంతా అదిగో ఆ సభలో మనసు మీద పడిన ముద్ర నాలో కదులుతూనే ఉంది.
ఇప్పుడు నేను గదర్ జీవితంలోని మిగతా వివరాల లోనికి పోదల్చ లేదు. సమయం కాదని కాదు. నిజానికి అలాంటి విషయాలు మాట్లాడుకోడానికి మనిషి మరణం మంచి సమయమే. మరణ సమయంలో... అన్నీ మంచి మాటలే మాట్లాడాలనేంతగా... మరణానికి ప్రాముఖ్యం ఇవ్వొద్దు కూడా. కాని, మరీ వివరంగా మాట్లాడితే మీకు విసుగేస్తుందేమో. ఆ రోజు నేను మాట్లాడిన అంశాన్ని కాస్త క్లుప్తంగా చెబుతాను. నా ఆభిప్రాయంలోని ‘అసాధారణత్వం’ వల్ల ఈ రైటప్ మీకు విసుగు కలిగించదనే అనుకుంటున్నాను
*
చివరి రోజుల్లో ఒక భావజాలానికి గులాం అయిన వాడు మొదటి రోజుల్లో, మధ్య రోజుల్లో అప్పటి ఆ భావజాలానికి గులాం కాలేదు అని ఎందుకు అనుకుంటున్నారు? మొదటి, మధ్య రోజుల భావజాలం మీకూ మరొకరికి నచ్చుతున్నది కనుకనా? మీరూ మరొకరు ఇంకా ఆ మునుపటి భావజాలాన్నే పట్టుకు వేలాడుతున్నారు గనుకనా?
గులాంగిరీ మనస్తత్వం వల్ల, ఆ రకం ప్రవర్తన వల్ల చివరి రోజుల్లో ఎంత ప్రమాదమో మొదటి, మధ్య రోజుల్లో కూడా అంతే ప్రమాదం. నిజానికి మొదటి, మధ్య రోజుల గులాంగిరీ వల్ల మరింత ఎక్కువ ప్రమాదం, ఎందుకంటే బయటికి మొహంలో కనిపించే యవ్వన జ్వాల చూపరులకు, శ్రోతలకు ఎక్కువ కన్విన్సింగ్ గా ఉంటుంది.
ఇలా రెండు వయసులలో కనిపించే... ఒక మనిషి భావజాలాలు కాస్త భిన్నంగా కనిపించినా... వాటి ప్రేరణ మూలం మాత్రం ఒకటే.
ఉదాహరణకు గదర్ ఆ రోజుల్లో పాడి ఆడింది అప్పటి పాపులిస్టు సామాజిక వైఖరినే. చివరి రోజుల్లో పాడి-ఆడిందీ ఇప్పటి పాపులిస్టు సామాజిక వైఖరినే. రెండవది ఎవర్ గ్రీన్ పాపులిజం. కాకపోతే, ఏదో ఒక డిగ్రీలో, ప్రజా విజృంభణ ఉన్న కాలంలో ఈ ఎవర్ గ్రీన్ పాపులిజం ను కాదని... టెంపొరరీ పాపులిజం మెరుస్తుంది. గదర్ జీవితంలో జరిగింది ఇదే.
గదర్ విషయంలోనే కాదు, చలం విషయంలో జరిగింది కూడా ఇదే. చలం తాను నిరీశ్వరవాది అయినట్లు ఒకటి రెండు సార్లు అన్నాడు గాని, అవి ఉత్తి ‘పేపర్ ప్రకటన’లే. ఆయన రచనలు చదివినప్పుడు ఆయనలో మీరా తరహా పారవశ్యాలు, వాటికి స్వేచ్ఛ లేకపోవడం మీద విసుర్లు తప్ప అంతకు మించిన అవగాహన కనిపించదు.
మైదానంలో అమీర్ ది వుట్టి ‘మగదురహంకార’ ప్రేమ. దానిలోనే స్వేచ్చ ను చూసిన రాజేశ్వరి, చూపిన చలం జస్ట్ సుఖవాదులే తప్ప, స్వేచ్ఛావాదులు కారు. వాళ్లు తమకు అలా ఎందుకు కనిపించారో ఎవరూ చెప్పరు. అంతే కాదు. అప్పుడు నేను సాహసించి మరో మాట కూడా చెప్పాను. ఆయనలో బ్రాహ్మణవాద ఛాయలు ఉన్నాయని అన్నాను. దానికి 'ఐరనీ' వంటి సాహిత్య అలంకారాలు దాపు కాజాలవని అన్నాను. అవి మనాళ్లకు కనిపించకపోవడానికి... అప్పటికి ఉన్న స్థితిలో ఆయన మనాళ్లకు ఎంతో కొంత బాగుండడమే కారణం అని రాసి, ఉలిపికట్టె బిరుదు ధరించాను.
*
మనుషులు యవ్వన, మధ్య వయస్సులలో అనుసరించే భావజాలానికి, చివరి రోజుల్లో అనుసరించే భావజాలానికి ప్రేరణాత్మక మూలం సాధారణంగా ఒకటే వుంటుంది. దీనికి ఎక్సెప్షన్లు అసలు ఉండవని కాదు. చివరి రోజులకల్లా చాల మౌలికంగా భావజాలం మారిన మనుషులు కూడా కొందరు ఉండొచ్చు. వాళ్లు సూత్రానికి అపవాదాలే గాని సూత్రం కారు అని నా నిశ్చితాభిప్రాయం.
ఉప్పుడు నాకొక అనుమానం నా మీద. నేనూ అంతేనా? విప్లవోద్యమం విషయంలో నా అభిప్రాయాలలో పెద్దగా వ్యత్యాసం లేదా? బయటికి అలా ఉన్నట్లు అనిపిస్తుందేమో గాని అప్పుడు, ఇప్పుడు నా భావజాలం యొక్క ప్రేరణాత్మక మూలాలు ఒక్కటే. ఆ విషయం... మీ సంగతేమో గాని, నాకు బాగా తెలుసు. 😊
*
సో, దేర్ఫోర్ గదర్ గురించి నా పాఠాలు రెండు:
1. పాపులిజం ఎప్పుడైనా హానికరమే. దాని వల్ల జరిగే మేలు కన్న కీడు చాల ఎక్కువ. గదర్ తదితరుల వల్ల అప్పుడు (మొదట) జరిగిందీ కీడే, చివర్లో జరిగిందీ కీడే. వెరసి: పాపులిజం వల్ల జరిగేది ఎక్కువగా కీడే. అన్నిటి కన్న ఎక్కువగా ‘సత్యానికి’, సత్యాన్వేషణ అనే మానవ శ్రమకు పాపులిజం చాల చాల చాల చాల హానికరం.
పాపులిజం మనుషులను గొర్రెల్ని చేస్తుంది. దైహిక శ్రమకు దూరంగా బౌద్దిక శ్రమ ఆధారంగా బతికే పాత కొత్త బ్రాహ్మణులకు అది చేసే మేలు అనన్యం.
2. సాహిత్యం, కళలలో రూప, సారాల మధ్య (ఫామ్ అండ్ కంటెంట్ మధ్య) అవినాభావ సంబంధం ఏమీ లేదు. నీ సాహిత్య, కళా రూపం గొప్ప ప్రజా రూపం అయినప్పటికీ నీ సాహిత్య, కళా సారం అలా ప్రజా సారం కానక్కర్లేదు. వీటిని... దేనికి అదిగా చర్చించి నిర్ణయాలు చేసుకోవలసిందే. ఒకటి బాగుంటే మరొకటి బాగుండాల్సిన అవసరం లేదు. రూపం చాల బాగుంటే, సారం మంచిది కాకపోతే... అప్పుడు ఆ సారం వల్ల ప్రజా జీవితానికి హాని మరింత ఎక్కువ. అందంగా లేని చెడ్డవాడి కన్న అందనైన చెడ్డవాడు ఎక్కువ సులభంగా, ఎక్కువ చెడు చేయగలుగుతాడు.
బివేర్ అఫ్ ది బ్యూటిఫుల్, ఈవెన్ ఈస్తటికల్లీ బ్యూటిఫుల్. 😊

మరి,
మీరేమంటారూ?

ఆగస్టు 7, 2023

Hanumantha Reddy Kodidela
ప్రజలలోనికి కొన్ని భావాలను తీసుకెళ్లదలచిన కార్యకర్తలు లేదా ‘ఎడ్యుకేటర్’లు ప్రధానంగా రెండు మార్గాలు అనుసరిస్తారు. నిజానికి వారికి అందుబాటులో ఉండేవి కూడా ఆ రెండు మార్గాలే.
1. ప్రజలను ఉద్రేకాలకు లోను చేసి, ముందుకో వెనక్కో నడిపించడం మొదటి మార్గం.
2. ప్రజలు ఆయా భావాలపై వివేచన (చర్చ) చేసి తమవైన అభిప్రాయాలకు వచ్చేలా చేయడం రెండవ మార్గం.
మొదటి దానిలో ఆలోచన పాళ్లు బాగా తక్కువగా ఉంటాయి. ఉద్రేకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ మార్గంలో ఆత్మహత్యలు, ఆత్మహత్యల-వంటి- పనులు చాల ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో డ్రామాకు, నటుల వంటి నేతలకు గిరాకీ బాగా ఉంటుంది. ప్రజలు ప్రాణాలు వొదలడ వంటి వాటిని త్యాగాలు అని అంటారు.
రెండవ దానిలో త్యాగాలు అనేవి ఉండవు. ప్రజలు తమ ప్రయోజనాలకు ఏది ఎక్కువ ఉపయోగకరమో... తమ అనుభవాలు, తమ తెలివితేటలు ఆధారంగా.. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని, దాన్నే ఆచరిస్తారు.
చేయాల్సిన ఆలోచన అంతా చేశాక, ఇక ప్రాలుమాలకుండా పని చేయడానికి ఉద్రేకాలు పనికొస్తాయి. (వేటకు వెళ్లే వాళ్లు పాటలు పాడి చిందులు వేసినట్టు, నాట్లేసే స్త్రీలు పాటలు పాడినట్టు). కాని, ఈ (మొదటి) మార్గమే ప్రాథమికం అయిపోతే, ఆలోచన కన్న ఉద్రేకాలే నిర్ణయాత్మకమైపోతే.. ఓహ్, ప్రజలకు సంబంధించినంత వరకు చాల చాల త్యాగాలు, ఏవో కొన్ని చిట్టి పొట్టి ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి.
పాట ప్రచారానికి బాగా పనికొస్తుంది. అంటే, రాజకీయాంశాలను పాపులిస్టు వినాదాలుగా మార్చేస్తుంది. ఆకర్డణీయంగా ఉంటుందు, ఆలోచించనీయదు. ప్రజల చావుబతుకులతో కూడిన ప్రజా రాజకీయంలో పాపులిజానికి పెద్ద పీట వేయడం వల్ల ఆ రకం పేపర్ బ్యాక్ నవవలు చేసే పనే ఈ పాటలు కూడా చేస్తాయి.
పాట ప్రచారానికి బాగా పనికొస్తుంది. అంటే, రాజకీయాంశాలను పాపులిస్టు వినాదాలుగా మార్చేస్తుంది. ఆకర్డణీయంగా ఉంటుందు, ఆలోచించనీయదు. ప్రజల చావుబతుకులతో కూడిన ప్రజా రాజకీయంలో పాపులిజానికి పెద్ద పీట వేయడం వల్ల ఆ రకం పేపర్ బ్యాక్ నవవలు చేసే పనే ఈ పాటలు కూడా చేస్తాయి.
ఇవాల్టి సాహిత్యంలో వచనానికి పెద్ద పీట వేయాలంటారు విజ్ఙలు. వచనంలో ఆలోచన ఎక్కువ. కవనం గొప్పదే గాని, దానికి ఎక్కువ ప్రాధాన్యం మంచిది కాదని కూడా విజ్ఙులు అంటారు. కవిత్వానికి అతి ప్రాధాన్యం ఫ్యూడల్ కాలానికి సహజమనీ, వచనానికి ప్రాధాన్యం పెట్టుబడిదారీ కాలానికి (అంటే, బుర్జువా డెమోక్రసీ కి) సహజమని కూడా అంటారు. 😊 (బుర్జువా డెమోక్రసీ అన్నా డెమోక్రసీ అన్నా ప్రాక్టికల్ గా ఒకటే)

Hanumantha Reddy Kodidela
ఒక మాట. నా పోస్టులో ఎక్కడా నేను గదర్ ను ... ప్రత్యేకించి గదర్ ను విమర్శించలేదు. గదర్ తరహా అతివాద రాజకీయ వీర గీతాల్లో ఉన్న పాపులిజాన్ని ఎత్తి చూపానంతే.
యండమూరి, మల్లాది రచయితలుగా ఆ పాపులిజాన్ని 'క్యాష్' చేసుకున్నారు. తమ నవలల అమ్మకాలు పెంచుకోడానికి ఉపయోగించుకున్నారు. గదర్, వంగపండు వంటి వారు ఒక రాజకీయాన్ని... పెడిల్ చేయడానికి అదే పాపులిజాన్ని ఉపయోగించుకున్నారు. ఆ నవలలకు ఇవాళ అప్పటంత పాపులిస్టు విలువ లేకపోవడంతో యండమూరి పర్సనాలిటీ డెవలప్ మెంట్ తరహా రచనలను ఆశ్రయించారు. ఏది అమ్మకమైతే అదే. మంచిదా చెడ్డదా అనేది ఇక్కడ గీటురాయి కాకపోవడమే విషాదం. అలాంటి చర్చ జరగకపోవడమే విషాదం.
గదర్, వంగపండు తమ యవ్వన కాలాల్లో జనం మనస్సులలో పాపులిస్టు విలువ కలిగి వున్న జావపదగీతాలు రాశారు. వాటిని చంపు, గొంతులు కొయ్యి తరహాలో జనాల్ని ఉద్రేకాలకు గురి చేసే నినాదాలతో నింపి... కీర్తి మంతులయ్యారు. నేను కర్నూలు విరసం సభల్లో మొదటి సారి విన్న గదర్ ఖవాలీ పాటలో నాకు గుర్తుండిపోయిన చరణాలేమిటో తెలుసా? శ్రీకాకుళ జాతర కు వెళ్లే బండికి ఎదురొచ్చినోళ్ల 'గొంతులు కర కర కర కర కోయన్నా' అనే చరణాలు. అప్పటి నా లోక కసికి అది బాగుంది. కాని, ఆ రకం రాజకీయం వల్ల భారత ప్రజా ఉద్యమానికి మేలు కన్న చాల ఎక్కువగా కీడు జరిగింది. అప్పుడు అది పాపులర్. కీర్తిదాయిని. రచయితలు... శేషేంద్ర లాంటి రచయితలు కూడా ఆ ఆ రకం రచనలే చేశారు ('గొరిల్లా', కవిసేన మేనిఫెస్టో). రచయితలుగా మన్నన కోసం. ఇస్మాయిల్ వంటి వాళ్లు... ఆనాటి నేపధ్యంలో... కమ్యూనిస్టు-వ్యతిరేకత కు ఉన్న కొద్దిపాటి స్థలాన్ని... శుద్ధ కవిత పేరుతో... ఎక్స్ప్లాయిట్ చేయడానికి, ఆ విధంగా తమకు ప్రత్యేక పీఠాలు ఏర్పాటు చేసుకోడానికి ప్రయత్నించారు.
ఇక ఇప్పుడు... పోరాటాలు సద్దుమణిగి మిలిటెంటు కవిత గిరాకీ ని కోల్పోయాక, కవుల్లో తిరిగి శుద్ద కవిత ఊపు అందుకునే ప్రయత్నం చేసింది. చేస్తోంది. గదర్ ఎంచక్కా ఇప్పుడు గిరాకీలోనికి వొచ్చిన (బహుశా ఎప్పుడూ గిరాకీలో ఉన్న) ఆధ్యాత్మిక/భక్తి గీతాల వైపు మళ్లడం కాకతాళీయం కాదు. ఇవేవీ ఆయన కేవలం డబ్బు కోసం చేసినవి కాదు. పాపులిస్టు గిరాకీ రాజకీయం కోసమే చేశాడు. అందుకు ఆయనకున్న స్వాతంత్ర్యాన్ని కాదనడం లేదు గాని ఈ సో కాల్డ్ ఆధ్యాత్మికత/మతం ప్రజలకు ఎంత హాని చేస్తుందో ఆయన వంటి మంచి మనిషి తెలుసుకోలేకపోవడానికి కారణం, పాపులిజం పట్ల ఉన్న వ్యామోహమే. ఇది తెలిసి తెలిసి చేసిన తప్పు. పార్టీ పట్ల కాదు, సో కాల్డ్ 'ఉద్యమం' పట్ల కాదు, ఇది ప్రజల పట్ల చేసిన తప్పు.
మరి ఇటువంటి వాటి నుంచి...
ఆనాడు ఆయన ప్రచారం చేసిన అతివాద వామపక్ష రాజకీయం నుంచి, ఆయనే తన జీవితం చివరి రోజులలో ప్రచారం చేసిన సమతామూర్తి కీర్తనల వంటి బూజు రాజకీయం నుంచి... మనను మనం, మన తరువాతి తరాల్ని మనం... కాపాడుకోవాలి కదా? కాపాడుకోవాలంటే మనం, మన తరువాతి తరాలు ఎదుర్కొంటున్న జబ్బు అచ్చంగా ఏమిటో మనకు తెలియాలి కదా? మూసి పెట్టుకుంటే రోగం నయమైతాదా? అదిగో అందుకే... గదర్, చలం వంటి లబ్ధ ప్రతిష్టుల ఆకర్షణీయ ఉదాహరణలతో... 'పాపులిజం' అనే ఒక 'సాంక్రామిక రోగం' గురించి మాట్లాడాను. అంతే గాని, చలం; గదర్, యండమూరి, మల్లాది గారల కీర్తి కి గండి కొట్టి ఆనందించే దురుద్దేశంతో కాదు. :-) 


మీ ప్రశ్న తప్పక రిలవెంట్. ప్రజలకు నష్టకరమని నాకు అనిపించినది మీకు అనిపించకపోవచ్చు. నేను నాకేమనిపించిందో అది చెప్పాను. గదర్ సమతామూర్తి కీర్తనల వల్ల ప్రజలకు నష్టం అని నేను అనుకుంటున్నాను. అదే చెప్పాను. సాయుధపోరాటమంటే... భూస్వాములను వ్యక్తులుగా చంపడమేనని ఆనాటి తన రాజకీయం ప్రజలకు నష్టకరమని నేను అనుకుంటున్నాను. అదే చెప్పాను
  • Hanumantha Reddy Kodidela
    మళ్లీ చెబుతున్నాను. 'నా పోస్టులో ఎక్కడా నేను గదర్ ను ... ప్రత్యేకించి గదర్ ను... విమర్శించలేదు. గదర్ తరహా అతివాద రాజకీయ వీర గీతాల్లో, సమతామూర్తి తరహా భక్తి గీతాల్లో ఉన్న పాపులిజాన్ని ఎత్తి చూపానంతే.'
    నా అబ్జర్వేషన్ మీకు నచ్చకపోతే అదెలాగో చెప్పండి. నా వైఖరి కాని దాన్ని నా వైఖరిగా చెప్పి నన్ను విమర్శించడం అన్యాయం. చర్చలో ఈ మాత్రం న్యాయంగా ఉండలేరా?
    మీకేదో తెలిసినట్లు మాట్లాడారు కనుక ఒక ప్రశ్న. 'సాగాల్సిన దారి పట్ల' నా ;అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం' ఏమటి? నా అభిప్రాయం ఏమటీ దానికి భిన్నమైన గదర్ అభిప్రాయం ఏమిటి?

Hanumantha Reddy Kodidela
Raghava Ramireddy రాఘవ, మీ అభిప్రాయం వివరంగా చెప్పినందుకు చాల థాంక్స్.
ఒక వ్యక్తి లేదా సమూహం పలు మంచి పనులు చేసి ఉండొచ్చు. ఒక రచయిత పలు మంచి రచనలు చేసి ఉండొచ్చు. కాని, చేసిన వాటిలో ప్రధానమైనది ఏమిటి, ఆ పనులు (ప్రధానంగా) ఏ దిశగా ఉన్నాయి అనే దాన్ని బట్టే... అతడిని/ఆమెను/సమూహాన్ని చారిత్రకంగా అంచనా వేయాల్సి ఉంటుంది. ఆ విధంగానే వారి జీవితాలూ, పనుల నుంచి పాఠాలు తీసుకోవాల్సి ఉంటుంది. గదర్, వంగపండు, ఇంకా ఇతర వాగ్గేయకారులు రాసింది కవిత్వమే. (పాటలు కవిత్వం కాదనే వాళ్లలో నేను లేను). ఆ కవిత్వం మన సమాజాన్ని ఏ దిశగా ప్రభావితం చేస్తుంది అనేదే నా పరిశీలనలో నేను ప్రధానంగా చేసింది. ఆ ప్రభావం... ఆత్మహత్యా సదృశ పోరాటాలే అని నేను అనుకుంటున్నాను. ఆ పోరాటాలలో ఒక మేరకు నేను కూడా పాల్గొన్నాను (గదర్ బాటలో కాకపోయినా).
ఆ పోరాటాలు రాజకీయార్థికంగా ప్రకటించుకున్న ఆశయం నెరవేరలేదు. నెరవేరదు. ఏం జరిగినా ప్రజల చొరవ వున్న బహిరంగ పోరాటాల వల్లనే జంరిగింది. అలాగే జరుగుతుంది. విప్లవం అనగానే అది... సారభూతంగా... ఒక 'రహస్యోద్యమం' అనేది దురూహ. రహస్య పోరాటాలు యుద్ధంలో బ్యారికేడ్ల వంటివి. బ్యారికేడ్లే యుద్దం కాదు. కాని వాటి కోసమే... ఆ ప్రాథమిక పోరాట దశ కోసమే... వేల మంది జీవితాలు నాశనమయ్యాయి. ఆ విషయం గదర్ కు, వంగపండు కు తెలుసు. అందుకే గత ఇరవయ్యేళ్లుగానో అంతకన్న ఎక్కువగానో గదర్ బహిరంగ పోరాటాలకు బ్యాలెట్ పోరాటాల వైపు మొగ్గాడు. మరీ ఎక్కువగా మొగ్గాడు. ఇందులో కూడా అతివాదమే. అప్పుడూ ఇప్పుడూ 'పాపులిస్టు' విలువ ఉన్న పాత బాణీలను వదల లేదు, పాట లోనూ బాట లోనూ.
నా కంటెన్షన్ ఏమిటంటే చారుమజుందార్ వంటి నాయకుడికి, గదర్ వంటి గాయకుడికి, చెరబండరాజు వంటి కవికి ఆ మాత్రం తెలియదా? తెలుసు. కాని పాటకు, వీరోచిత నినాదాలకు ఉన్న పాపులిస్టు విలువలకు వాళ్ల ఆలోచనలు బలి అయ్యాయి. ఇక బతికి ఉన్న వాళ్లమైనా తగిన విమర్శ-ఆత్మవిమర్శ చేసుకుని సరైన దారిలో పడాలి.
ఇది చెప్పడానికి నా చిరు వ్యాసంలో (పోస్టులో) నేను ప్రయత్నించాను. నా భావాల్ని, ఫీలింగ్స్ ను సరిగ్గా చెప్పగలిగానని అనుకుంటాను.





No comments:

Post a Comment

సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...