Saturday, July 22, 2023

ఓరి భగవంతుడా!

 


అప్పుడు
వాడూ మరొకడు
తనను మట్టి మీద
వెల్లకిలా పడ దోసి
రేప్ చేద్దామా అంతకన్న ఘోరం
ఇంకేమయినా చేద్దామా అని
తీరిగ్గా మాట్లాడుకునే మాటలు వింటూ
అప్పుడు
ఆ అమ్మాయి
ఏమనుకుని ఉంటుంది?
ఉట్టి గాయం అయితే
బాగుణ్ను అది నిత్య
పరిచితమే
ఆత్మ మీద
పదే పదే
మృగ ఖడ్గాల దాడి;
లేదు ఎంత పల్చనిదయినా
ఉల్లిపొర వంటిదైనా, డాలు
మాంసం ముద్దలైన
నాన్న కోసం,
అన్న కోసం ఏడుస్తుందా
త్రిశూలానికి గుచ్చి
ఎత్తబడే తన
మర్మావయాన్ని
కప్పడానికి
చాచలేపోయిన చేతుల
నిస్సహాయతను నిందిస్తుందా
అప్పుడు
ఆ అమ్మాయి ఏమి
ఆలోచించి ఉంటుంది?
చివరాఖరి ఊపిరితో
ఏ దేశాన్ని ఎలా
శపించి ఉంటుంది?
ఏ తెగను ఎలా
అసహ్యించుకుని ఉంటుంది?
ఓరి భగ...వంతుడా
నీకూ ఉందట కదా భగం
నిన్నెప్పుడైనా అలా వాళ్లు
మానభంగం చేశార్రా
నీకు తెలుసట్రా
ఆ గాయం నొప్పి?
జులై 21, 2023

No comments:

Post a Comment

సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...