హాయిగా జంతువుల్లా బతకండి అన్నాడని రామగోపాల్ వర్మను చాల చాల కోప్పడుతున్నారు. ఇప్పుడు మనుషులు జంతువుల్లా కూడా లేరే, మరి, వర్మ మీద ఎందుకంత కోపం?
జంతువులు తమ మీద తాము బాంబులు వేసుకుని
చావవు. ఆశ్విజ్ లు, కాన్సెంట్రేషన్ శిబిరాలు నిర్వహించవు. రేపులు, హత్యలు చేయవు. ఇతర స్వజాతి జంతువుల దుఃఖాన్ని, మరణాన్ని
ఆనందించవు. ఇతర స్వజాతి జంతువులనైనా, ఏ జంతువులనైనా చిత్ర
హింసల పాలు చేయవు. అబద్ధాలు చెప్పవు. ఆహార సేకరణలో, వేటలో మోసాలు
చేయవు. ఇవన్నీ చేసే మనుషులు జంతువుల కన్న ఎందువల్ల ఎక్కువ?
ఏదో నవలలో ప్రేమికులు అడివిలో పడి
జంతువుల్లా తిరుగుతూ బతకడం, మగ పాత్ర గర్భవతి ఐన ఆడ పాత్రను తన్నడం వంటి... జంతువులు
చేయని హైన్యాలు చేస్తుంటే.. లొట్టలు వేసుకుంటూ చదివి... అది స్వేచ్ఛ అని ఆనందించడం,
సెక్స్ అంటే హింస అనిపించే పోర్నో సినిమాలను కళ్లు పగిలిన
పత్తికాయలు చేసుకుని చూడడం... ఇవన్నీ చేసే మనం... జంతువుల కన్న ఎందువల్ల ఎక్కువ?
మనం జంతువుల కన్న 'ఎక్కువ'గా ఉండొద్దని కాదు నేను అంటున్నది. లేము అని. ఉంటానికి ప్రయత్నాలు కూడా
పెద్దగా లేవు అని. మనుషులుగా ఉండటం ఎలాగో చెప్పడానికి ప్రయత్నించిన బుద్ధుడు,
క్రీస్తు, కార్ల్ మార్క్స్, మార్టిన్ లూథర్ కింగ్, అంబేడ్కర్లను వాళ్ల జీవిత కాలాల్లో
పట్టించుకోకపోగా రకరకాలుగా హింసించి, దేశ బహిష్కరించి,
ఆకలికి మాడ్చి... వాళ్లు పోయాక, విగ్రహాల్ని
చేసి ఇంకా హింసించడమేగా మనం చేస్తున్నది?! మరి, వర్మనూ ఆయన గారి అయన్ ర్యాండిజాన్ని ఎందుకు విమర్శించడం?
విమర్శించొద్దని కాదు. విమర్శించాలి. విమర్శలలో
మన మాటలకు తగినట్టు మనం బతకాలి. 'నా జీవితంలో నేను పక్షీంద్రుడనే’ అని గొప్ప గట్వంగా చెప్పుకునే ఒక దళిత రచయిత, అగ్రవర్ణ
శ్రీ శ్రీ కవి సెక్స్ వర్కర్ల తో సెక్సించినందుకు బండ దూషిస్తాడు. అలాంటి అబద్ధపు
జీవితాలైనా కాస్త తగ్గిద్దామా?! మన హిపోక్రసీ గురించి
మాట్లాడే సాహసం చేసినందుకు స్నేహితులపై 'మలం ఎత్తి పోసే'
మనస్తత్వాల్ని, మనల్ని మనం వెలేసుకుని,
వెలివేత గురించి సానుభూతికి జోలెలు పట్టే కుయుక్తలనైనా వొదిలేద్దామా?!
హిపోక్రసీని తిరస్కరించే పనిలోనే
ఎప్పటికైనా నిజాన్ని చేరుతాం. లేకుంటే ఎప్పటికీ అబద్ధాల ఊబిలోనే ఇలాగే ఛస్తాం...
నగ్నముని ఎక్కడో అన్నట్టు ‘ఆర్తనాదమే మన ఆఖరి నినాద’మవుతుంది.
మార్చ్ 17, 2023
No comments:
Post a Comment