Monday, July 24, 2023

ప్రపంచ యుద్ధం మనకొక పడికట్టు పదమా? ఎమ్మెల్ పార్టీలో ఒక చర్చ: మీరేమంటారూ? 02

1980 ప్రాంతాల్లో ఒక మార్క్సిస్టు లెనినిస్టు పార్టీలో ఒక చర్చ జరిగింది. అది ఏదో ఇన్ ఫార్మల్ (సాదా సీదా) చర్చ కాదు. తరువాత్తరువాత ఆ పార్టీ రెండుగా చీలిపోవడానికి దారి తీసిన పెద్ద చర్చ. అందులో రెండు ముఖ్యాంశాలు:

1. భారత దేశంలో ప్రధాన వైరుధ్యం ఏమిటి అనేది ఒక అంశం.

ఫాసిజానికి, ప్రజాస్వామ్యానికి మధ్య వైరుధ్యమే ఇవాళ ( పోనీ, అవాళ) ప్రధాన వైరుధ్యమని పార్టీలో ఒక బృందం వాదించింది. అందువల్ల ఫాసిజానికి ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్ (ఐ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐక్య సంఘటన కట్టాలన్నారు. ఆ ఐక్య సంఘటనలో కార్మిక వర్గం (అనగా పార్టీ) తో పాటు ఇంకా ఎవరెవరు ఉంటారు? చాల ప్రజాతంత్ర శక్తులతో పాటు ‘కాంగీ’ ఫాసిజాన్ని వ్యతిరేకించే ‘ఆరెసెస్’ కూడా అందులో భాగస్వామి అవుతుంది. (ఎమర్జెన్సీని ఎదిరించి, చెరసాలల్లో మగ్గిన వాళ్లలో ఆరెసెస్ వాళ్లు కూడా ఉన్నారు మరి). ఆ ఐక్య సంఘటనలో ఇంకా ఎవరెవరు భాగస్వాములవాల్సి ఉండిందో ఆ వివరాలు ఇప్పటి చర్చకు అవసరం లేదు.

ఆ బృందం మరో ప్రతిపాదన కూడా చేసింది. అది అంతర్జాతీయ పరిస్థితికి సంబంధించినది.

ఇవాళ (అదే, అవాళ) ప్రపంచం మూడో ప్రపంచ యుద్దం ముంగిట నిలబడి వుంది. బాగా విస్తరించిన అమెరికా సామ్రాజ్యవాదానికి, దాన్ని ఎదిరించి కొత్తగా విస్తరించాలనుకుంటున్న సోవియెట్ సోషల్ సామ్రాజ్యవాదానికి మధ్య ఈ యుద్దం అనివార్యంగా వస్తుంది. యుద్దం అమెరికాకు అవసరం లేదు. అది బాగా బలిసి తన స్థితిని నిలబెట్టుకోవలసిన డిఫెన్సివ్ పొజిషన్ లో ఉంది. రష్యా సోషల్ సామ్రాజ్యవాదం యుద్దం చేసి విస్తరించాల్సిన అఫెన్సివ్ పొజిషన్ లో ఉంది. సో, అమెరికా అనుకూల (ఆరెసెస్ తదితర) శక్తులతో ఐక్య సంఘటన ఇలా కూడా సమర్థనీయమే.

ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ను కావిలించుకోవాలనే మితృల వాదం దాదాపు అలాంటిదే అని నా అభిప్రాయం.

ఫాసిజం అనే దాని ప్రమాదం ఎల్లప్పుడూ ఉంటుందని, ఆ ప్రమాదం ఏ పార్టీ నుంచి వొచ్చినా ఎదిరించడానికి ప్రజలను ప్రేమించే వారు, ప్రజలు సిద్ధంగా ఉండాలని, ఈ విషయంలో యూనిటరీ నిరంకుశాధికారానికి పీఠాలుగా పని చేసే పార్టీల మీద కాకుండా స్థానిక, ప్రాదేశిక శక్తుల సమీకరణ మీద ఆధారపడాలన్నదే ఈ అనుభవాల తరువాత నా ఆభిప్రాయం.

ఇక మీ ఇష్టం. 😊

4.30 ఎ ఎం, మే 16, 2023

 

మీరేమంటారూ 01: అడుగు నుంచి పై వరకు అదే హిపోక్రసీ

 

 హాయిగా జంతువుల్లా బతకండి అన్నాడని రామగోపాల్ వర్మను చాల చాల కోప్పడుతున్నారు. ఇప్పుడు మనుషులు జంతువుల్లా కూడా లేరే, మరి, వర్మ మీద ఎందుకంత కోపం?

జంతువులు తమ మీద తాము బాంబులు వేసుకుని చావవు. ఆశ్విజ్ లు, కాన్సెంట్రేషన్ శిబిరాలు నిర్వహించవు. రేపులు, హత్యలు చేయవు. ఇతర స్వజాతి జంతువుల దుఃఖాన్ని, మరణాన్ని ఆనందించవు. ఇతర స్వజాతి జంతువులనైనా, ఏ జంతువులనైనా చిత్ర హింసల పాలు చేయవు. అబద్ధాలు చెప్పవు. ఆహార సేకరణలో, వేటలో మోసాలు చేయవు. ఇవన్నీ చేసే మనుషులు జంతువుల కన్న ఎందువల్ల ఎక్కువ?

 

ఏదో నవలలో ప్రేమికులు అడివిలో పడి జంతువుల్లా తిరుగుతూ బతకడం, మగ పాత్ర గర్భవతి ఐన ఆడ పాత్రను తన్నడం వంటి... జంతువులు చేయని హైన్యాలు చేస్తుంటే.. లొట్టలు వేసుకుంటూ చదివి... అది స్వేచ్ఛ అని ఆనందించడం, సెక్స్ అంటే హింస అనిపించే పోర్నో సినిమాలను కళ్లు పగిలిన పత్తికాయలు చేసుకుని చూడడం... ఇవన్నీ చేసే మనం... జంతువుల కన్న ఎందువల్ల ఎక్కువ?

 

మనం జంతువుల కన్న 'ఎక్కువ'గా ఉండొద్దని కాదు నేను అంటున్నది. లేము అని. ఉంటానికి ప్రయత్నాలు కూడా పెద్దగా లేవు అని. మనుషులుగా ఉండటం ఎలాగో చెప్పడానికి ప్రయత్నించిన బుద్ధుడు, క్రీస్తు, కార్ల్ మార్క్స్, మార్టిన్ లూథర్ కింగ్, అంబేడ్కర్లను వాళ్ల జీవిత కాలాల్లో పట్టించుకోకపోగా రకరకాలుగా హింసించి, దేశ బహిష్కరించి, ఆకలికి మాడ్చి... వాళ్లు పోయాక, విగ్రహాల్ని చేసి ఇంకా హింసించడమేగా మనం చేస్తున్నది?! మరి, వర్మనూ ఆయన గారి అయన్ ర్యాండిజాన్ని ఎందుకు విమర్శించడం?

 

విమర్శించొద్దని కాదు. విమర్శించాలి. విమర్శలలో మన మాటలకు తగినట్టు మనం బతకాలి. 'నా జీవితంలో నేను పక్షీంద్రుడనే’ అని గొప్ప గట్వంగా చెప్పుకునే ఒక దళిత రచయిత, అగ్రవర్ణ శ్రీ శ్రీ కవి సెక్స్ వర్కర్ల తో సెక్సించినందుకు బండ దూషిస్తాడు. అలాంటి అబద్ధపు జీవితాలైనా కాస్త తగ్గిద్దామా?! మన హిపోక్రసీ గురించి మాట్లాడే సాహసం చేసినందుకు స్నేహితులపై 'మలం ఎత్తి పోసే' మనస్తత్వాల్ని, మనల్ని మనం వెలేసుకుని, వెలివేత గురించి సానుభూతికి జోలెలు పట్టే కుయుక్తలనైనా వొదిలేద్దామా?!

 

హిపోక్రసీని తిరస్కరించే పనిలోనే ఎప్పటికైనా నిజాన్ని చేరుతాం. లేకుంటే ఎప్పటికీ అబద్ధాల ఊబిలోనే ఇలాగే ఛస్తాం... నగ్నముని ఎక్కడో అన్నట్టు ‘ఆర్తనాదమే మన ఆఖరి నినాద’మవుతుంది.

 

మార్చ్ 17, 2023

Sunday, July 23, 2023

మరో మొదలు... ?

 


అయితే నా అనుచరుడిగా ఉండు

లేకుంటే నా వ్యతిరేకి అనుచరుడిగా ఉండు.

అయితే వైవధ్యం పేరిట వెనుకబాటును కావిలించుకో.

లేకుంటే, ఏకత పేరిట ఏదో ఒక మతం నీడకు చేరిపో.

మధ్యలో ఇదేంది నువ్వు నువ్వుగా ఉంటున్నావు?

అంటున్నారు ఇరువాగుల మనుషులు!

*

ఓర్నీ, ఇదా మీరు. ఒకేసారి ఇద్దరితో, ఇందరితో యుద్ధమా?

మిగిలిన ఈ విరిగిన రథ చక్రం ఒక్కటే ఆయుధమా?

*

ఛెళ్, సాగనీ పోరు.

ప్రతిసారీ ఒకేలా ముగియదు యుద్ధం!

ఈసారి ఈ పద్మ దళాల్ని చేదిస్తాను, నా దారిలో నేను!

Saturday, July 22, 2023

కులాలూ ఊళ్లూ: మీరేమంటారు? 2

 


ఒకప్పుడు ఊళ్లలో అన్నీ కులాలే. బాగా పెద్దాన్ని అయ్యే వరకు జీవించి ఉంటం వల్ల చెప్పగలుగుతున్నాను, ఆ స్థితిని నేను స్వయంగా చూశాను.
తన తండ్రి ఒక ఊరి రెడ్డి పని (మున్సబు పని) చేసినందుకు రెడ్డి అని పేరు కలిగిన ఒక స్నేహితుడు, దూదేకుల ముస్లిం మరొకరు... మేము అప్పుడు మా ఊరి నుంచి చదువుకున్న ముగ్గరు మితృలం. మా కులాలు వేరు అనే స్పృహ మాకు ఉండేది. మతాలు వేరనే ఆలోచన దాదాపు ఉండేది కాదు. ('దాదాపు' అని ఎందుకంటు న్నానంటే, ఆ వేర్బందరాలు పండుగలప్పుడు లీలగా తెలిసేవి. ఆ మాటకొస్తే పూజా పునస్కారాలలో మత ప్రమేయమే గాక, కులాల వ్యత్యాసం కూడా ఉండడం వల్ల ప్రత్యేకించి మతం వేరని అనిపించేది కాదు).
మాయింటికి వచ్చిపొయ్యే వాళ్లు, మేము వెళ్లి వచ్చే ఇళ్లు ఏ కులాల వాళ్లమో ఆ స్పృహ ఉండేది. ఏ మతాలు అనే ఆలోచన ఉండేది కాదు. పరిస్థితి అలా ఉన్నంత వరకు, వాటి వల్ల, హిందూ సమాజంలో ఉండే మిగతా గత్తర మాత్రమే ఉండేది. ఆ గత్తర మీద సన సన్నగా నిరసన స్వరాలు ఉండేవి. (నా స్వరం అందులో ఒకటి, ఆనాడు కూడా). కాని మతాల గోల లేదు. ఆయా కులాలు ఇలా మత వైషమ్యాలుగా వికటించేవి కాదు. సర్టిఫికెట్లలో కులాన్ని పేర్కొనక తప్పని స్థితి వచ్చాకే, ఊరి పిల్లలకు ఆ అవసరం పెరిగాకే... తురకోల్లు, క్రైస్తవులు కులాలుగా కాకుండా మతాలుగా గుర్తింపు మొదలయ్యింది.
రిజర్వేషన్ల దగ్గరే అధికారికంగా ఈ గుర్తింపు మొదలయ్యింది. అత్యవసరం అయ్యింది. ఇప్పటికీ రిజర్వేషన్లు అవసరం లేని స్థితి రాలేదు. కనుక, రాజ్యాంగం పరంగా ఈ గుర్తింపులు అవసరం లేని స్థితికి ఎలా వెళతామో ఆలోచించాలి. ఈ విషయంలో ఎవరి దగ్గరా ఇదమిత్థమైన ఆలోచన ఉందని అనుకోను.
డేవిడ్ వంటి వాళ్లు కోర్టులకెళ్లి కుల, మత రహితంగా ఉండే హక్కుని సంపాదించడం బాగుంది. వాళ్లు సంపాదించింది హక్కా, బాధ్యతా? చదువుల్లో, ఉద్యోగాల్లో తమకు, తమ పిల్లలకు ఉన్న రిజర్వేషన్ సౌకర్యాన్ని ఎలా వొదులుకుంటారు. అందుకు పిల్లలు వాళ్ల పిల్లలు... ఏమంటారు? డేవిడ్ వంటి మితృలు సాధించింది ‘హక్కు’ ఎలా అవుతుంది? పేదలలో కొందరు అదనంగా ఒక బరువు, బాధ్యతను మోయడం తప్ప?
మీరేమంటారు?
july 22 2023

ఓరి భగవంతుడా!

 


అప్పుడు
వాడూ మరొకడు
తనను మట్టి మీద
వెల్లకిలా పడ దోసి
రేప్ చేద్దామా అంతకన్న ఘోరం
ఇంకేమయినా చేద్దామా అని
తీరిగ్గా మాట్లాడుకునే మాటలు వింటూ
అప్పుడు
ఆ అమ్మాయి
ఏమనుకుని ఉంటుంది?
ఉట్టి గాయం అయితే
బాగుణ్ను అది నిత్య
పరిచితమే
ఆత్మ మీద
పదే పదే
మృగ ఖడ్గాల దాడి;
లేదు ఎంత పల్చనిదయినా
ఉల్లిపొర వంటిదైనా, డాలు
మాంసం ముద్దలైన
నాన్న కోసం,
అన్న కోసం ఏడుస్తుందా
త్రిశూలానికి గుచ్చి
ఎత్తబడే తన
మర్మావయాన్ని
కప్పడానికి
చాచలేపోయిన చేతుల
నిస్సహాయతను నిందిస్తుందా
అప్పుడు
ఆ అమ్మాయి ఏమి
ఆలోచించి ఉంటుంది?
చివరాఖరి ఊపిరితో
ఏ దేశాన్ని ఎలా
శపించి ఉంటుంది?
ఏ తెగను ఎలా
అసహ్యించుకుని ఉంటుంది?
ఓరి భగ...వంతుడా
నీకూ ఉందట కదా భగం
నిన్నెప్పుడైనా అలా వాళ్లు
మానభంగం చేశార్రా
నీకు తెలుసట్రా
ఆ గాయం నొప్పి?
జులై 21, 2023

Friday, July 21, 2023

భారత స్త్రీత్వం శపిస్తున్నది: ఈ రాజ్యం కుక్క చావు చస్తుంది: మీరేమంటారూ 3

                                                                         


మీరేమంటారూ?

కుల వైషమ్యాలు, మత వైషమ్యాలు, తెగ వైషమ్యాలు, ఇంకా చాల వైషమ్యాలు చాల ఉన్న అద్భుతమైన దేశం మనది. దీన్నే సాంస్కృతిక వైవిధ్యం అంటున్నామేమో కాస్త ఆలోచించాలి. సాంస్కృతిక వైవిధ్యాల పేరిట తెగల, కులాల, మతాల ప్రత్యేకతలను కొనసాగించాలనడం సరైంది కాదు. ఆధునిక నేపధ్యంలో... ముఖ్యంగా డబ్బు, సంపదల నేపధ్యంలో ఆ వైవిధ్యం/వైరుధ్యం ఇంకా పెరగడానికి దోహడం చేస్తున్నామా ఆలోచించాలి. ఇవాళ మన ప్రగతి వాదులు ఆ ఘనకార్యం చేస్తున్నారని నా అభియోగం. రక రకాల వెనుకబాటుతనాలు వైవిధ్య విశేషాలు కావని గుర్తించాలని విన్నపం.

ఇప్పటికి ఈ వైవిధ్యం దానికి అనుబంధమైన వైరుధ్యం ఒక వాస్తవం. వాటిని వొదిలించుకోడానికి ఎలాంటి చట్టాలు, ప్రచార కార్యక్రమాలు జరగాలో చూడాలి. ఇవాళ మాత్రం మత, కుల, తెగ వైషమ్యాలు వాస్తవం. వాటి పేరిట కొన్ని ఘోరాలను చూసీ చూడనట్టుండే రాజకీయ హైన్యం మాత్ర అస్సలు క్షమించరానిది.

పేదలు, స్త్రీలలో కూడా చెడ్డవాళ్లుంటారు. చెడ్డతనానికి పేదరికం, స్త్రీత్వం ఇన్సులేటర్ కాదు. కాని, పేదల, స్త్రీల నిస్సహాయత మీద జరిగే దాడులను ప్రభుత్వాలు చూసీ చూడనట్టుండడం మాత్రం క్షమించరాని నేరం. గుజరాత్ లో, మణిపూర్ లో జరిగిన ప్రత్యేక విషయం ఇది. తక్షణం ప్రభుత్వాన్ని నిలదీయడమే ఇలాంటి సందర్భాలలో జరగాలి.


Prabhakar Ak

జాతుల మధ్య వైవిధ్యాన్ని కాపాడుకుంటూ అది వైషమ్యంగా మారకుండా పరస్పరం గౌరవించుకుంటూ ప్రజాస్వామికంగా కలిసి మెలిసి జీవించడమే ఆధునిక సామాజిక విలువ. అది జరగనందువల్లే సోవియట్ యూనియన్ ముక్కలైంది. ఇటీవలి చరిత్ర చెప్పిన పాఠం ఇది


Hanumantha Reddy Kodidela

సోవియెట్ యూనియన్ ముక్కలు కాకుండా ఉండాలంటే అక్కడి రాజ్యం ఎలాంటి వైఖరి అవలంబించాల్సి ఉండిందంటారు?

'జాతుల స్వయంనిర్ణయాధికారం' అనే లెనిన్ సూత్రం ప్రకారం విడిపోవడం లేదా కలిసుండడాన్ని జాతుల నిర్ణయానికి వొదిలేయాలి. ఇది తప్పు అని రోజా లగ్జెంబర్గ్ లెనినిజం మీద పెట్టిన ఒక ముఖ్య విమర్శ. నా మట్టుకు నేను లగ్జెంబర్గ్ వైపే మొగ్గుతాను. ఇతరేతర చట్టపర విషయాలలోనూ జాతుల అతి స్వయంప్రతిపత్తి (అటానమీ) ఒక దేశపు నేషన్ హుడ్ కు చేటు చేస్తుందని నేను భావిస్తాను. ఈ 'చేటు' అభివృద్ది నిరోధకమైన చేటు. సోవియెట్ యూనియన్ కు చేటు తెచ్చింది ఆ వైఖరియే.

ఒకే దేశంలో భిన్న జాతులు ఇలా నిత్యం కొట్టుకు చస్తుంటే ఇక ఆ దేశమేగతి (ఇతర దేశాలతో పోలికలో) బాగుపడుతుందని కూడా నా బాధ. అందుకే చట్టపరమైన యూనిఫార్మిటీ అవసరం ఏ దేశానికైనా. మతం, కులం, తెగ కాదు అందరికీ వర్తించే రాజ్యాంగమే ఉమ్మడి రంగ భూమిగా ఉండాలి. అంటే, జాతులను బలవంతంగా కలిపి ఉంచాలా అని అడుగుతారు. కాదు. ఒప్పించడం ద్వారానే కలిపి ఉంచాలి. ఆపని చివరికంటా చేసి, ఇక వీలు కానప్పుడే విడిపోవాలి. అంత సీన్ లేకపోయినా, విడిపోదామని అనే వాళ్లు ప్రతి జాతిలోనూ ఎప్పుడూ ఉంటారు. దానికి అంతూ పొంతూ ఉండదు. పరిస్థితులు బాగో లేనప్పుడు (ఉదాహరణకు నిరుద్యోగం విపరీతమయినప్పుడు) తమ ప్రయోజనాల కోసం జాతిని విడగొట్టే శక్తులు మెజారిటీ అవుతాయి. విజయం సాధిస్తాయి. విజయం సాధించినంత మాత్రాన ఆ శక్తుల మాట సరైనదని అనలేం

 

అబద్ధానిదే రాజ్యం: మీరేమంటారూ? 01

                       


   

ఇప్పటి వరకు యవ్వారం మరోలా ఉందని కాదు.
ఇంతకు ముందు దేవదానవుల మధ్య తేడా తెలిసేది.
(దానవులంటే నువ్వూ నేనూ అనబడే సామాన్యులం.
దేవతలంటే ‘వాళ్లు’ అనబడు బలిసినోళ్లూ, బలిసినోళ్ల వకాల్తా దారులూ).
దేవతలు అన్ని అబద్ధాలూ ఆడే వాళ్లూ. అన్ని వేషాలూ వేసే వాళ్లు. నాకు తెలిసి మొదటి వేషం విష్ణువు అనే దేవుడు వేసిన మోహిని వేషం. మొదటి అబద్ధం దేవతలు దానవులకు చేసిన మొదటి మోసం.
ఇక చూడండి; లిఖిత, అలిఖిత చరిత్ర సమస్తం (సో కాల్డ్ హిస్టరీ, పురాణ గాథలన్నీ) వాక్కాయ కర్మల లో అబద్దమే రాజ్యం చేసింది. (మాటల్లో అబద్ధమే, పనుల్లో అబద్ధమే).
దేవదానవులంటే కేవలం హిందువులే అనుకోనక్కర్లేదు. యూరోపియన్లు, అమెరికన్లు, ఆస్ట్రేలియన్లు, ఉత్తర దక్షిణ ధ్రువాలలో ఎవరేనా ఉంటే వాళ్లూ... అందరిలో దేవదానవులున్నారని అస్మదీయ ఉవాచ.
ఇంతకూ చెప్పొచ్చిందేమిటంటే...
దానవులు కూడా... అంటే, ‘మనోళ్లు’ అని నా వంటి వాళ్లం వ్యవహరించే వాళ్లు కూడా... ఇప్పుడు అబద్ధం నేర్చుకుంటున్నారు. ‘మనోళ్లు’ కూడా అబద్ధాన్ని అలవర్చుకుంటున్నారు. ఫాఫం, దేవతలు వాళ్ల చివరి ఆయుధం మీద అధికారం కోల్పోతున్నారు.
ఆయుధాల వినిమయం లోనే కాదు,
గుర్రాలూ, రథాల ప్రయోగంలోనే కాదు,
అణ్యాయధాలతో మనుషుల సామూహిక హననాలలోనే కాదు, పర భూముల ఆక్రమణల్లోనే కాదు
వీటన్నిటిలో ఉండి, విజేతల విజయాలకు కారణమైన అబద్ధంలోనూ ‘బలిసినోళ్ల’తో ఇప్పుడు ‘మనోళ్లు’ (దేవతలతో దానవులు) పోటీ పడుతున్నారు. ఆ ఆధిక్యతను కూడా వాళ్ల చేతుల్లోంచి తీసేస్తున్నారు.
ఇది మంచి పరిణామమే.
ఇది చాల చిన్న విషయం అనుకుంటున్నారా? ఏదో చిన్న చమత్కార విషయమనుకుంటున్నారా?
కాదు.
ఇది నిర్ణయాత్మకమైన, కీలకమైన విషయం.
ఇన్నాళ్లూ ఆర్థికమే పునాది అనుకున్నాం చరిత్ర గతికి. కాదు అనిపిస్తున్నది.
ఈ ‘అంతానికి ఆరంభం’లో నిర్ణయాత్మకమైనది, కీలకమైనది అబద్ధమే. అబద్ధమే ఇప్పుడు నిర్ణయాత్మక ఆయుధం.
ఒక రకంగా ఇది మానవుడు చేసుకుంటున్న సెల్ఫ్-హిప్నాటిక్ థెరపీ. మానసిక రోగ- స్వయం చికిత్స.
సరే, అబద్ధానికి సంబంధించి ఇప్పుడే అందిన వార్త:
ఎవ్గెనీ ప్రిగోజిన్ నాయకత్వం లోని ‘వాగ్నర్’ కిరాయి సేనలు వాళ్ల అసలు బాస్, రష్యా మీద తిరుగుబాటు చేశాయని, వాగ్నర్ సేనలు మాస్కోకు చాల దగ్గరగా వచ్చేశాయని వార్తలు వచ్చేయి కదా?! సిఎనెన్, బీబీసీ వంటి పశ్చిమ-విధేయ గొట్టాలు ఆ వార్తను లొట్టలు వేస్తూ చెప్పాయి కదా?!
ఇందులో ఏదో మతలబు ఉంది అని కాస్త నసిగారు గాని, ఆ మతలబును చూడలేకపోయారు, లొట్టలు వేసే ‘బిజి’నెసు లో పడి.
ఇప్పుడు తెలుస్తోంది మతలబు.
రష్యాకు మెయిన్ ల్యాండుకు కాస్త దూరంగా కలినిన్ గ్రాడ్ అనే నగర ప్రాతం ఉంది. అది రష్యా భూభాగమే. ఈ ప్రాతం నుంచి బయటికి బెలారూస్ కి ఉన్న 100 కిలో మీటర్ల భూమార్గాన్ని ‘సువాకీ గ్యాప్’ అంటారు. ఇది పని చేయకపోతే కలినిన్ గ్రాడ్ సంగతేమో గాని; పోలండ్, లిథువేనియా, లాట్వియా అనే మూడు బాల్టిక్ దేశాలు తమ నాటో మితృలతో సంబంధం కోల్పోతాయి. అంటే ఈ మూడు నాటో సభ్య దేశాలకు ఊపిరాడదు. ఇదొక ‘చోక్ పాయింట్’. గొంతు నొక్కబడడానికి వీలున్న ప్రాతం. ఎవరి గొంతు? నాటో గొంతు.
(సరిగ్గా ఇలాంటి చోక్ పాయింటు ఇండియాకు కూడా ఉంది. ఇండియాకూ ఈశాన్య భారత రాష్ట్రాలకూ మధ్య ఉన్న ‘సిలిగురి’ కారిడార్ అలాంటిదే. (సిలిగురి అంటే ‘కోడి మెడ’ అని అర్థమట 😊 ). ‘భారత శతృవులు’ సిలిగురి గొంతు నొక్కితే మనం ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాల్ని కోల్పోతాం. (సంబంధాలు ఇప్పుడున్నాయా, సరిగ్గా?! పటం: కింద)
పొడుగాటి కథను కాస్త కుదిద్దాం.
ఉప్పుడు
వాగ్నర్ కిరాయి సేనలు ఎక్కుడున్నాయి? సువాకి గ్యాప్ అనే చోక్ పాయింటు ముఖద్వారమైన బెలారూస్ లో ఉన్నాయి. ఇక్కడి నుంచి అడ్డగిస్తే... పోలండ్, లిథువేనియా, లాట్వియా... మూడు బాల్టిక్ దేశాలు తమ నాటో మితృలతొ సంబంధాల్ని కోల్పోతాయి. ఊపిరాడని స్థితిలోనికి వెళిపోతాయి.
రష్యా ప్రభుత్వం నేరుగా, అధికారికంగా అనలేదు గాని, అనలేదు కూడా గాని,
అసలు సంగతి
అసలు రష్యా మీద వాగ్నర్ తిరుగుబాటు అనేదే పెద్ద అబద్ధం.
వాగ్నర్ సేనలు రష్యా మీద తిరుగుబాటు చేసినట్టు నటించాయి. బెలారూస్ నేత లుకషెంకో చేసిన రాజీ ప్రయత్నాలకు తల వంచినట్లు నటించాయి. ఆ రాజీ బేరాలలో భాగంగానే పెద్ద ఎత్తున బెలారూస్ చేరాయి. అక్కడ బెలారూస్ ప్రభుత్వ సేనలకు శిక్షణ ఇవ్వడం మొదలెట్టాయి.
ఇప్పుడిక ‘షువాకీ గ్యాప్’ వద్ద... బెలారూస్ లో ఇప్పటికే సిద్ధంగా ఉన్న ‘వాగ్నర్ హస్తాన్ని ఉపయోగించి... ‘గొంతు నొక్కితే’ బాల్టిక్ ప్రాతంలో నాటో ఊపిరాడని స్థితికి లోనవక తప్పదు.
యుక్రెయినియన్ ద్వారా మీరు మా క్రిమియా వంతెన మీద బాంబు లేయడం వంటి పనులు చేస్తే మేము ‘షువాకీ గ్యాప్’ ను మూసేస్తాం అని రష్యా అంటున్నది. రష్యా ఆధికారికంగా అనకపోయినా ఆ దేశ పార్లమెంటేరియన్లు అంటున్నారు.
ఆ పని జరుగుతుందా, లేక, నాటో పొదిలో వేరే అమ్ములేమైనా ఉన్నాయా అనేది వేచి చూడాల్సిందే.
కాని, ప్రిగోజిన్ గారి వాగ్నర్ సేనల రష్యా-వ్యతిరేక తిరుగుబాటు అనేది మాత్రం... కావాలని చెప్పిన (చేసిన) చారిత్రాత్మక అబద్ధం. ఇండియా పురాణాల్లో దానవులు, ప్రాపంచికంగా పశ్చిమేతరులు అబద్ధాన్ని ఒక ఆయుధంగా వాడిన దృష్టాంతం ఇంతకు ముందెప్పుడైనా ఉన్నదా?
నాకూతే అనుమానమే.
జులై 20, 2023



సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...