Monday, August 7, 2023

సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

May be an image of 4 people and temple
మీరేమంటారూ? 8
// సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?:
గదర్ మరణ వేళ ఒక ఆలోచన //
మరణం వల్ల ఎవరూ అమరులు కారు!
ఏమన్నా అయితే గియితే జీవితం వల్లనే అమరులు అవుతారు.
మృత్యువుకు పెద్ద పీట వేసే పాత, కొత్త, అతి కొత్త సెంటిమెంట్లు ఆత్మహత్యాసదృశమైన భావాలను ప్రోత్సహిస్తాయి.
శ్రోతలను ఉద్రిక్త గొర్రెల్ని చేస్తాయి.
చాల కాలం క్రితం ఊస్మానియా ఆర్ట్స్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో
గుడిహాళం రఘునాథం, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, గుంటూరు ఏసుపాదం, అజయ్ తదితర మితృలు ‘ఒ యు రైటర్స్ సర్కిల్’ అధ్యర్యంలో జరిపిన సాహిత్య సమావేశంలో... అప్పటికే తెలుగు జాతి లెజెండ్, గదర్ తో కలిసి మాట్లాడే అదృష్టం నాకు కలిగింది.
టాపిక్ గుర్తు లేదు గాని, యండమూరి వీరేంద్రనాథ్ నవలల ప్రస్తావన నా ప్రసంగంలో బాగా వొచ్చింది. టాపిక్కే అలాంటిది అనుకుంటాను. సాహిత్యం, కళల్లో పాపులిజం (జనామోద వాదం) మంచిది కాదని, అది సామాన్యులను కామం, క్రోధం, భయం వంటి బేసిక్ అనుకంపనలకు గురి చేసి వాళ్లకు (కూడా) హాని చేసే పనులను వాళ్లతోనే చేయిస్తుందని అన్నాను. దానికి ఉదాహరణలుగా (అప్పుడు చాల ప్రచారంలో ఉన్న) యండమూరి, మల్లాది తరహా పాపులిస్టు రచయితల నవలల్ని ప్రస్తావించాను. వాటితో పాటు (వ్యక్తిగత వర్గశతృవును చంపు నరుకు గొంతు కొయ్యి తరహా) జనం పాటల్ని కూడా పాపులిస్టు సాహిత్యంగా నేను పేర్కొన్నాను.
ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు అవి గదర్ కు తగులుతాయనే స్పృహ కలిగి (నా ఉద్దేశం తనను విమర్శించడం కాకపోయినా), నేను గదర్ వైపు చూశాను. ఆయన కళ్లలో నాకు కనిపించిన ఒక రకం నిరసన భావం నా మసను మీద ఇప్పటికీ ముద్ర పడి ఉంది.
గదర్ మరణ వార్త విన్నప్పట్నించీ, ఆయనకు నివాళులర్పిస్తూ స్నేహితుల పోస్టులు చదువుతున్నప్పుడంతా అదిగో ఆ సభలో మనసు మీద పడిన ముద్ర నాలో కదులుతూనే ఉంది.
ఇప్పుడు నేను గదర్ జీవితంలోని మిగతా వివరాల లోనికి పోదల్చ లేదు. సమయం కాదని కాదు. నిజానికి అలాంటి విషయాలు మాట్లాడుకోడానికి మనిషి మరణం మంచి సమయమే. మరణ సమయంలో... అన్నీ మంచి మాటలే మాట్లాడాలనేంతగా... మరణానికి ప్రాముఖ్యం ఇవ్వొద్దు కూడా. కాని, మరీ వివరంగా మాట్లాడితే మీకు విసుగేస్తుందేమో. ఆ రోజు నేను మాట్లాడిన అంశాన్ని కాస్త క్లుప్తంగా చెబుతాను. నా ఆభిప్రాయంలోని ‘అసాధారణత్వం’ వల్ల ఈ రైటప్ మీకు విసుగు కలిగించదనే అనుకుంటున్నాను
*
చివరి రోజుల్లో ఒక భావజాలానికి గులాం అయిన వాడు మొదటి రోజుల్లో, మధ్య రోజుల్లో అప్పటి ఆ భావజాలానికి గులాం కాలేదు అని ఎందుకు అనుకుంటున్నారు? మొదటి, మధ్య రోజుల భావజాలం మీకూ మరొకరికి నచ్చుతున్నది కనుకనా? మీరూ మరొకరు ఇంకా ఆ మునుపటి భావజాలాన్నే పట్టుకు వేలాడుతున్నారు గనుకనా?
గులాంగిరీ మనస్తత్వం వల్ల, ఆ రకం ప్రవర్తన వల్ల చివరి రోజుల్లో ఎంత ప్రమాదమో మొదటి, మధ్య రోజుల్లో కూడా అంతే ప్రమాదం. నిజానికి మొదటి, మధ్య రోజుల గులాంగిరీ వల్ల మరింత ఎక్కువ ప్రమాదం, ఎందుకంటే బయటికి మొహంలో కనిపించే యవ్వన జ్వాల చూపరులకు, శ్రోతలకు ఎక్కువ కన్విన్సింగ్ గా ఉంటుంది.
ఇలా రెండు వయసులలో కనిపించే... ఒక మనిషి భావజాలాలు కాస్త భిన్నంగా కనిపించినా... వాటి ప్రేరణ మూలం మాత్రం ఒకటే.
ఉదాహరణకు గదర్ ఆ రోజుల్లో పాడి ఆడింది అప్పటి పాపులిస్టు సామాజిక వైఖరినే. చివరి రోజుల్లో పాడి-ఆడిందీ ఇప్పటి పాపులిస్టు సామాజిక వైఖరినే. రెండవది ఎవర్ గ్రీన్ పాపులిజం. కాకపోతే, ఏదో ఒక డిగ్రీలో, ప్రజా విజృంభణ ఉన్న కాలంలో ఈ ఎవర్ గ్రీన్ పాపులిజం ను కాదని... టెంపొరరీ పాపులిజం మెరుస్తుంది. గదర్ జీవితంలో జరిగింది ఇదే.
గదర్ విషయంలోనే కాదు, చలం విషయంలో జరిగింది కూడా ఇదే. చలం తాను నిరీశ్వరవాది అయినట్లు ఒకటి రెండు సార్లు అన్నాడు గాని, అవి ఉత్తి ‘పేపర్ ప్రకటన’లే. ఆయన రచనలు చదివినప్పుడు ఆయనలో మీరా తరహా పారవశ్యాలు, వాటికి స్వేచ్ఛ లేకపోవడం మీద విసుర్లు తప్ప అంతకు మించిన అవగాహన కనిపించదు.
మైదానంలో అమీర్ ది వుట్టి ‘మగదురహంకార’ ప్రేమ. దానిలోనే స్వేచ్చ ను చూసిన రాజేశ్వరి, చూపిన చలం జస్ట్ సుఖవాదులే తప్ప, స్వేచ్ఛావాదులు కారు. వాళ్లు తమకు అలా ఎందుకు కనిపించారో ఎవరూ చెప్పరు. అంతే కాదు. అప్పుడు నేను సాహసించి మరో మాట కూడా చెప్పాను. ఆయనలో బ్రాహ్మణవాద ఛాయలు ఉన్నాయని అన్నాను. దానికి 'ఐరనీ' వంటి సాహిత్య అలంకారాలు దాపు కాజాలవని అన్నాను. అవి మనాళ్లకు కనిపించకపోవడానికి... అప్పటికి ఉన్న స్థితిలో ఆయన మనాళ్లకు ఎంతో కొంత బాగుండడమే కారణం అని రాసి, ఉలిపికట్టె బిరుదు ధరించాను.
*
మనుషులు యవ్వన, మధ్య వయస్సులలో అనుసరించే భావజాలానికి, చివరి రోజుల్లో అనుసరించే భావజాలానికి ప్రేరణాత్మక మూలం సాధారణంగా ఒకటే వుంటుంది. దీనికి ఎక్సెప్షన్లు అసలు ఉండవని కాదు. చివరి రోజులకల్లా చాల మౌలికంగా భావజాలం మారిన మనుషులు కూడా కొందరు ఉండొచ్చు. వాళ్లు సూత్రానికి అపవాదాలే గాని సూత్రం కారు అని నా నిశ్చితాభిప్రాయం.
ఉప్పుడు నాకొక అనుమానం నా మీద. నేనూ అంతేనా? విప్లవోద్యమం విషయంలో నా అభిప్రాయాలలో పెద్దగా వ్యత్యాసం లేదా? బయటికి అలా ఉన్నట్లు అనిపిస్తుందేమో గాని అప్పుడు, ఇప్పుడు నా భావజాలం యొక్క ప్రేరణాత్మక మూలాలు ఒక్కటే. ఆ విషయం... మీ సంగతేమో గాని, నాకు బాగా తెలుసు. 😊
*
సో, దేర్ఫోర్ గదర్ గురించి నా పాఠాలు రెండు:
1. పాపులిజం ఎప్పుడైనా హానికరమే. దాని వల్ల జరిగే మేలు కన్న కీడు చాల ఎక్కువ. గదర్ తదితరుల వల్ల అప్పుడు (మొదట) జరిగిందీ కీడే, చివర్లో జరిగిందీ కీడే. వెరసి: పాపులిజం వల్ల జరిగేది ఎక్కువగా కీడే. అన్నిటి కన్న ఎక్కువగా ‘సత్యానికి’, సత్యాన్వేషణ అనే మానవ శ్రమకు పాపులిజం చాల చాల చాల చాల హానికరం.
పాపులిజం మనుషులను గొర్రెల్ని చేస్తుంది. దైహిక శ్రమకు దూరంగా బౌద్దిక శ్రమ ఆధారంగా బతికే పాత కొత్త బ్రాహ్మణులకు అది చేసే మేలు అనన్యం.
2. సాహిత్యం, కళలలో రూప, సారాల మధ్య (ఫామ్ అండ్ కంటెంట్ మధ్య) అవినాభావ సంబంధం ఏమీ లేదు. నీ సాహిత్య, కళా రూపం గొప్ప ప్రజా రూపం అయినప్పటికీ నీ సాహిత్య, కళా సారం అలా ప్రజా సారం కానక్కర్లేదు. వీటిని... దేనికి అదిగా చర్చించి నిర్ణయాలు చేసుకోవలసిందే. ఒకటి బాగుంటే మరొకటి బాగుండాల్సిన అవసరం లేదు. రూపం చాల బాగుంటే, సారం మంచిది కాకపోతే... అప్పుడు ఆ సారం వల్ల ప్రజా జీవితానికి హాని మరింత ఎక్కువ. అందంగా లేని చెడ్డవాడి కన్న అందనైన చెడ్డవాడు ఎక్కువ సులభంగా, ఎక్కువ చెడు చేయగలుగుతాడు.
బివేర్ అఫ్ ది బ్యూటిఫుల్, ఈవెన్ ఈస్తటికల్లీ బ్యూటిఫుల్. 😊

మరి,
మీరేమంటారూ?

ఆగస్టు 7, 2023

Hanumantha Reddy Kodidela
ప్రజలలోనికి కొన్ని భావాలను తీసుకెళ్లదలచిన కార్యకర్తలు లేదా ‘ఎడ్యుకేటర్’లు ప్రధానంగా రెండు మార్గాలు అనుసరిస్తారు. నిజానికి వారికి అందుబాటులో ఉండేవి కూడా ఆ రెండు మార్గాలే.
1. ప్రజలను ఉద్రేకాలకు లోను చేసి, ముందుకో వెనక్కో నడిపించడం మొదటి మార్గం.
2. ప్రజలు ఆయా భావాలపై వివేచన (చర్చ) చేసి తమవైన అభిప్రాయాలకు వచ్చేలా చేయడం రెండవ మార్గం.
మొదటి దానిలో ఆలోచన పాళ్లు బాగా తక్కువగా ఉంటాయి. ఉద్రేకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ మార్గంలో ఆత్మహత్యలు, ఆత్మహత్యల-వంటి- పనులు చాల ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో డ్రామాకు, నటుల వంటి నేతలకు గిరాకీ బాగా ఉంటుంది. ప్రజలు ప్రాణాలు వొదలడ వంటి వాటిని త్యాగాలు అని అంటారు.
రెండవ దానిలో త్యాగాలు అనేవి ఉండవు. ప్రజలు తమ ప్రయోజనాలకు ఏది ఎక్కువ ఉపయోగకరమో... తమ అనుభవాలు, తమ తెలివితేటలు ఆధారంగా.. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని, దాన్నే ఆచరిస్తారు.
చేయాల్సిన ఆలోచన అంతా చేశాక, ఇక ప్రాలుమాలకుండా పని చేయడానికి ఉద్రేకాలు పనికొస్తాయి. (వేటకు వెళ్లే వాళ్లు పాటలు పాడి చిందులు వేసినట్టు, నాట్లేసే స్త్రీలు పాటలు పాడినట్టు). కాని, ఈ (మొదటి) మార్గమే ప్రాథమికం అయిపోతే, ఆలోచన కన్న ఉద్రేకాలే నిర్ణయాత్మకమైపోతే.. ఓహ్, ప్రజలకు సంబంధించినంత వరకు చాల చాల త్యాగాలు, ఏవో కొన్ని చిట్టి పొట్టి ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి.
పాట ప్రచారానికి బాగా పనికొస్తుంది. అంటే, రాజకీయాంశాలను పాపులిస్టు వినాదాలుగా మార్చేస్తుంది. ఆకర్డణీయంగా ఉంటుందు, ఆలోచించనీయదు. ప్రజల చావుబతుకులతో కూడిన ప్రజా రాజకీయంలో పాపులిజానికి పెద్ద పీట వేయడం వల్ల ఆ రకం పేపర్ బ్యాక్ నవవలు చేసే పనే ఈ పాటలు కూడా చేస్తాయి.
పాట ప్రచారానికి బాగా పనికొస్తుంది. అంటే, రాజకీయాంశాలను పాపులిస్టు వినాదాలుగా మార్చేస్తుంది. ఆకర్డణీయంగా ఉంటుందు, ఆలోచించనీయదు. ప్రజల చావుబతుకులతో కూడిన ప్రజా రాజకీయంలో పాపులిజానికి పెద్ద పీట వేయడం వల్ల ఆ రకం పేపర్ బ్యాక్ నవవలు చేసే పనే ఈ పాటలు కూడా చేస్తాయి.
ఇవాల్టి సాహిత్యంలో వచనానికి పెద్ద పీట వేయాలంటారు విజ్ఙలు. వచనంలో ఆలోచన ఎక్కువ. కవనం గొప్పదే గాని, దానికి ఎక్కువ ప్రాధాన్యం మంచిది కాదని కూడా విజ్ఙులు అంటారు. కవిత్వానికి అతి ప్రాధాన్యం ఫ్యూడల్ కాలానికి సహజమనీ, వచనానికి ప్రాధాన్యం పెట్టుబడిదారీ కాలానికి (అంటే, బుర్జువా డెమోక్రసీ కి) సహజమని కూడా అంటారు. 😊 (బుర్జువా డెమోక్రసీ అన్నా డెమోక్రసీ అన్నా ప్రాక్టికల్ గా ఒకటే)

Hanumantha Reddy Kodidela
ఒక మాట. నా పోస్టులో ఎక్కడా నేను గదర్ ను ... ప్రత్యేకించి గదర్ ను విమర్శించలేదు. గదర్ తరహా అతివాద రాజకీయ వీర గీతాల్లో ఉన్న పాపులిజాన్ని ఎత్తి చూపానంతే.
యండమూరి, మల్లాది రచయితలుగా ఆ పాపులిజాన్ని 'క్యాష్' చేసుకున్నారు. తమ నవలల అమ్మకాలు పెంచుకోడానికి ఉపయోగించుకున్నారు. గదర్, వంగపండు వంటి వారు ఒక రాజకీయాన్ని... పెడిల్ చేయడానికి అదే పాపులిజాన్ని ఉపయోగించుకున్నారు. ఆ నవలలకు ఇవాళ అప్పటంత పాపులిస్టు విలువ లేకపోవడంతో యండమూరి పర్సనాలిటీ డెవలప్ మెంట్ తరహా రచనలను ఆశ్రయించారు. ఏది అమ్మకమైతే అదే. మంచిదా చెడ్డదా అనేది ఇక్కడ గీటురాయి కాకపోవడమే విషాదం. అలాంటి చర్చ జరగకపోవడమే విషాదం.
గదర్, వంగపండు తమ యవ్వన కాలాల్లో జనం మనస్సులలో పాపులిస్టు విలువ కలిగి వున్న జావపదగీతాలు రాశారు. వాటిని చంపు, గొంతులు కొయ్యి తరహాలో జనాల్ని ఉద్రేకాలకు గురి చేసే నినాదాలతో నింపి... కీర్తి మంతులయ్యారు. నేను కర్నూలు విరసం సభల్లో మొదటి సారి విన్న గదర్ ఖవాలీ పాటలో నాకు గుర్తుండిపోయిన చరణాలేమిటో తెలుసా? శ్రీకాకుళ జాతర కు వెళ్లే బండికి ఎదురొచ్చినోళ్ల 'గొంతులు కర కర కర కర కోయన్నా' అనే చరణాలు. అప్పటి నా లోక కసికి అది బాగుంది. కాని, ఆ రకం రాజకీయం వల్ల భారత ప్రజా ఉద్యమానికి మేలు కన్న చాల ఎక్కువగా కీడు జరిగింది. అప్పుడు అది పాపులర్. కీర్తిదాయిని. రచయితలు... శేషేంద్ర లాంటి రచయితలు కూడా ఆ ఆ రకం రచనలే చేశారు ('గొరిల్లా', కవిసేన మేనిఫెస్టో). రచయితలుగా మన్నన కోసం. ఇస్మాయిల్ వంటి వాళ్లు... ఆనాటి నేపధ్యంలో... కమ్యూనిస్టు-వ్యతిరేకత కు ఉన్న కొద్దిపాటి స్థలాన్ని... శుద్ధ కవిత పేరుతో... ఎక్స్ప్లాయిట్ చేయడానికి, ఆ విధంగా తమకు ప్రత్యేక పీఠాలు ఏర్పాటు చేసుకోడానికి ప్రయత్నించారు.
ఇక ఇప్పుడు... పోరాటాలు సద్దుమణిగి మిలిటెంటు కవిత గిరాకీ ని కోల్పోయాక, కవుల్లో తిరిగి శుద్ద కవిత ఊపు అందుకునే ప్రయత్నం చేసింది. చేస్తోంది. గదర్ ఎంచక్కా ఇప్పుడు గిరాకీలోనికి వొచ్చిన (బహుశా ఎప్పుడూ గిరాకీలో ఉన్న) ఆధ్యాత్మిక/భక్తి గీతాల వైపు మళ్లడం కాకతాళీయం కాదు. ఇవేవీ ఆయన కేవలం డబ్బు కోసం చేసినవి కాదు. పాపులిస్టు గిరాకీ రాజకీయం కోసమే చేశాడు. అందుకు ఆయనకున్న స్వాతంత్ర్యాన్ని కాదనడం లేదు గాని ఈ సో కాల్డ్ ఆధ్యాత్మికత/మతం ప్రజలకు ఎంత హాని చేస్తుందో ఆయన వంటి మంచి మనిషి తెలుసుకోలేకపోవడానికి కారణం, పాపులిజం పట్ల ఉన్న వ్యామోహమే. ఇది తెలిసి తెలిసి చేసిన తప్పు. పార్టీ పట్ల కాదు, సో కాల్డ్ 'ఉద్యమం' పట్ల కాదు, ఇది ప్రజల పట్ల చేసిన తప్పు.
మరి ఇటువంటి వాటి నుంచి...
ఆనాడు ఆయన ప్రచారం చేసిన అతివాద వామపక్ష రాజకీయం నుంచి, ఆయనే తన జీవితం చివరి రోజులలో ప్రచారం చేసిన సమతామూర్తి కీర్తనల వంటి బూజు రాజకీయం నుంచి... మనను మనం, మన తరువాతి తరాల్ని మనం... కాపాడుకోవాలి కదా? కాపాడుకోవాలంటే మనం, మన తరువాతి తరాలు ఎదుర్కొంటున్న జబ్బు అచ్చంగా ఏమిటో మనకు తెలియాలి కదా? మూసి పెట్టుకుంటే రోగం నయమైతాదా? అదిగో అందుకే... గదర్, చలం వంటి లబ్ధ ప్రతిష్టుల ఆకర్షణీయ ఉదాహరణలతో... 'పాపులిజం' అనే ఒక 'సాంక్రామిక రోగం' గురించి మాట్లాడాను. అంతే గాని, చలం; గదర్, యండమూరి, మల్లాది గారల కీర్తి కి గండి కొట్టి ఆనందించే దురుద్దేశంతో కాదు. :-) 


మీ ప్రశ్న తప్పక రిలవెంట్. ప్రజలకు నష్టకరమని నాకు అనిపించినది మీకు అనిపించకపోవచ్చు. నేను నాకేమనిపించిందో అది చెప్పాను. గదర్ సమతామూర్తి కీర్తనల వల్ల ప్రజలకు నష్టం అని నేను అనుకుంటున్నాను. అదే చెప్పాను. సాయుధపోరాటమంటే... భూస్వాములను వ్యక్తులుగా చంపడమేనని ఆనాటి తన రాజకీయం ప్రజలకు నష్టకరమని నేను అనుకుంటున్నాను. అదే చెప్పాను
  • Hanumantha Reddy Kodidela
    మళ్లీ చెబుతున్నాను. 'నా పోస్టులో ఎక్కడా నేను గదర్ ను ... ప్రత్యేకించి గదర్ ను... విమర్శించలేదు. గదర్ తరహా అతివాద రాజకీయ వీర గీతాల్లో, సమతామూర్తి తరహా భక్తి గీతాల్లో ఉన్న పాపులిజాన్ని ఎత్తి చూపానంతే.'
    నా అబ్జర్వేషన్ మీకు నచ్చకపోతే అదెలాగో చెప్పండి. నా వైఖరి కాని దాన్ని నా వైఖరిగా చెప్పి నన్ను విమర్శించడం అన్యాయం. చర్చలో ఈ మాత్రం న్యాయంగా ఉండలేరా?
    మీకేదో తెలిసినట్లు మాట్లాడారు కనుక ఒక ప్రశ్న. 'సాగాల్సిన దారి పట్ల' నా ;అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం' ఏమటి? నా అభిప్రాయం ఏమటీ దానికి భిన్నమైన గదర్ అభిప్రాయం ఏమిటి?

Hanumantha Reddy Kodidela
Raghava Ramireddy రాఘవ, మీ అభిప్రాయం వివరంగా చెప్పినందుకు చాల థాంక్స్.
ఒక వ్యక్తి లేదా సమూహం పలు మంచి పనులు చేసి ఉండొచ్చు. ఒక రచయిత పలు మంచి రచనలు చేసి ఉండొచ్చు. కాని, చేసిన వాటిలో ప్రధానమైనది ఏమిటి, ఆ పనులు (ప్రధానంగా) ఏ దిశగా ఉన్నాయి అనే దాన్ని బట్టే... అతడిని/ఆమెను/సమూహాన్ని చారిత్రకంగా అంచనా వేయాల్సి ఉంటుంది. ఆ విధంగానే వారి జీవితాలూ, పనుల నుంచి పాఠాలు తీసుకోవాల్సి ఉంటుంది. గదర్, వంగపండు, ఇంకా ఇతర వాగ్గేయకారులు రాసింది కవిత్వమే. (పాటలు కవిత్వం కాదనే వాళ్లలో నేను లేను). ఆ కవిత్వం మన సమాజాన్ని ఏ దిశగా ప్రభావితం చేస్తుంది అనేదే నా పరిశీలనలో నేను ప్రధానంగా చేసింది. ఆ ప్రభావం... ఆత్మహత్యా సదృశ పోరాటాలే అని నేను అనుకుంటున్నాను. ఆ పోరాటాలలో ఒక మేరకు నేను కూడా పాల్గొన్నాను (గదర్ బాటలో కాకపోయినా).
ఆ పోరాటాలు రాజకీయార్థికంగా ప్రకటించుకున్న ఆశయం నెరవేరలేదు. నెరవేరదు. ఏం జరిగినా ప్రజల చొరవ వున్న బహిరంగ పోరాటాల వల్లనే జంరిగింది. అలాగే జరుగుతుంది. విప్లవం అనగానే అది... సారభూతంగా... ఒక 'రహస్యోద్యమం' అనేది దురూహ. రహస్య పోరాటాలు యుద్ధంలో బ్యారికేడ్ల వంటివి. బ్యారికేడ్లే యుద్దం కాదు. కాని వాటి కోసమే... ఆ ప్రాథమిక పోరాట దశ కోసమే... వేల మంది జీవితాలు నాశనమయ్యాయి. ఆ విషయం గదర్ కు, వంగపండు కు తెలుసు. అందుకే గత ఇరవయ్యేళ్లుగానో అంతకన్న ఎక్కువగానో గదర్ బహిరంగ పోరాటాలకు బ్యాలెట్ పోరాటాల వైపు మొగ్గాడు. మరీ ఎక్కువగా మొగ్గాడు. ఇందులో కూడా అతివాదమే. అప్పుడూ ఇప్పుడూ 'పాపులిస్టు' విలువ ఉన్న పాత బాణీలను వదల లేదు, పాట లోనూ బాట లోనూ.
నా కంటెన్షన్ ఏమిటంటే చారుమజుందార్ వంటి నాయకుడికి, గదర్ వంటి గాయకుడికి, చెరబండరాజు వంటి కవికి ఆ మాత్రం తెలియదా? తెలుసు. కాని పాటకు, వీరోచిత నినాదాలకు ఉన్న పాపులిస్టు విలువలకు వాళ్ల ఆలోచనలు బలి అయ్యాయి. ఇక బతికి ఉన్న వాళ్లమైనా తగిన విమర్శ-ఆత్మవిమర్శ చేసుకుని సరైన దారిలో పడాలి.
ఇది చెప్పడానికి నా చిరు వ్యాసంలో (పోస్టులో) నేను ప్రయత్నించాను. నా భావాల్ని, ఫీలింగ్స్ ను సరిగ్గా చెప్పగలిగానని అనుకుంటాను.





Thursday, August 3, 2023

శ్రమైక-ప్రేమ వాదం ఒక పరిశీలన: మీరేమంటారూ? 7

 


‘మంచి తనం’ అనేది రాక్షస నాశం కోసం దేవతలు కనిపెట్టిన నీతి.
అప్పులు చెల్లించాల్సిన రుణపీడితుల కోసం వడ్డీ వ్యాపారులు కనిపెట్టిన నీతి.
ఆడవాళ్లపై జులుం తప్ప ప్రేమ తెలియని మగాళ్లు తమ కుటుంబాల కోసం కనిపెట్టిన నీతి.
ఉమ్మడి శ్రమ ఫలితాన్ని పంచుకోడానికి బదులు మోహంతో మోసం చేసే అబద్ధీకుల నీతి.
ఏ నీతి అక్కర్లేకుండా పక్క వాడి క్షేమంతో నా క్షేమం కలగలిసి ఉండే స్థితిని కోరి తెచ్చుకుని, దాన్ని కాపాడుకునే సహజ నీతి ఏర్పడే వరకు...
ఇండియాలో బ్రాహ్మణులు, వేరే దేశాల్లో అక్కడి శ్రుతీ, స్మృతుల వ్రాత గాళ్లు... తయారు చేసి నానా పవిత్రతల రంగులు పులిమి, దాన్ని ఇంద్ర చాపంగా భ్రమింపజేసే నేటి నీతిని, నేటి చదువును చెత్తకుప్పలో కలిపి, అందరం కలిసి మరో సహజ నీతిని, అప్రకటిత రీతిని ఏర్పరుచుకునే వరకు ఇదే ఇదే గతి.
దీనికి వైదికం, ఇస్లాం, క్రైస్తవం, సూఫీ, శైవం, వైష్ణవం, శాక్తేయం... ఇంకా ఏ మతం ఉపయోపడదు. ఆ ప్రతిదీ నష్టం చేస్తుంది. వాటిని ఇక ఏ రూపాల్లోనో బతికింపజేసే ప్రయత్నాలైనా నష్టం చేస్తాయి.
బౌద్ధికంగా హేతుబద్ధ యోచన,
మానసికంగా ప్రేమ ఇస్తేనే ప్రేమ వొస్తుందనే అనుభూతి...
ఇవి మాత్రమే మనిషిని మనిషిగా కాపాడుతాయి.
మిగిలినవన్నీ యథాతథ వాదానికి (తమకు సుఖంగా ఉన్న ఇప్పటి స్థితిని కాపాడే వాదానికి) అనుగుణంగా కట్టిన వేదాలే.
ఆలోచనల్లో, అనుభూతులలో జరగాల్సిన ఈ సమరం ఇక ఊపు అందుకోవాలి.
ప్రతీప శక్తులు అంతిమ ఆయుధంగా మతాహంకారాన్ని, అది అక్కర్లేని (ఐరోపా) చోట్ల వర్ణాహంకారాన్ని బయటకు తీసి ప్రజలను విభజించి పాలిస్తున్నాయి, విభజించి పీడిస్తున్నాయి, విభజించి దోచుకుని శాకా, మాంసా... చెంచాల ప్రదర్శనలు చేస్తున్నాయి. కూడు, గడ్డ, గూడు, వైద్యం, చదువు వంటి మానవావసరాలకు భిన్నంగా, అతీతంగా ధర్మ-వైవిధ్య-రక్షణ వంటి హానికర సెంటిమెంట్లను అవి ప్రచారంలో పెడుతున్నాయి.
గండి కొడదాం ఈ (అ)క్రమానికి.
ప్రతిఘటిద్దాం ఈ దుర్మార్గాన్ని.
పబ్లిక్ న్యాయంలో వివక్షకు తావు లేని ఏకతను,
తిండి, బట్టి, కళల వంటి సాంస్కృతిక విషయాల్లో విశాలమైన అనేకత ( వైవిధ్యం)ను... నెలకొల్పుకుందాం.
అన్ని రకాల బ్రాహ్మణ వాదం... అనగా బౌద్దిక వాదం (ఇంటల్లెక్చువలిజం) నశించాలి.
పని చేసే వాళ్లకే బువ్వ మీద అధికారం అనే శ్రమైక ప్రేమ వాదం వర్థిల్లాలి.
ఇది కొత్త మతం కాదు. పక్కవాడి మిగులును పోగేసుకుని రాజులు, మంత్రులు, పూజారులు తయారవక ముందు చాల కాలం వర్ధిల్లిన బతుకు బాట. ప్రతి ఒక్కరి మాటకు విలువ ఉండిన బ్రతుకు బాట.
మెట్లు ఎక్కడంలో పడి ఆ బాటను పోగొట్టుకున్నాం. అన్ని మెట్ల పైన మళ్లీ అదే బాటను నెలకొల్పుదాం.
మరి, మీరేమంటారు?
ఆగస్టు 3, 2023

Friday, July 28, 2023

అసలు విషాదం మనమే: మీరేమంటారూ 6

 

మణిపూర్ ఘటన సందర్భంగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం మీద ఆయా పార్టీల వైఖరిపై నేను వెలిబుచ్చిన అభిప్రాయం వద్ద మితృల వ్యాఖ్యానాలన్నీ చూశాక ఒక మాట చెప్పాలనిపించింది.
రాష్ట్రంలో వైసిపి, జగన్ వొద్దనుకుంటే మన దగ్గరున్న ఆల్టర్నేటివ్‌ ఏమిటి? తెలుగుదేశమా? పవన్ కల్యాణా? సిపిఐ నారాయణా? సిపిఎం పార్టీనా? ఏదీ లేదు.
ఇక్కడ నా ఖండన మణిపూర్ స్త్రీలపై జరిగిన ఘోరకలికి, మారణహోమానికి పరిమితం. రాజకీయంగా ఎంత తప్పనిసరి పరిస్థితి అయినప్పటికీ, ఇది జగన్ కు మచ్చగానే మిగుల్తుంది అని నా అభిప్రాయం. దాదాపు ఆత్మహత్య వంటిదే అయినప్పటికీ జగన్ అవిశ్వాస తీర్మానాన్ని సమర్థించే సాహసం చేయాల్సింది అని నా అభిప్రాయం.
ఈ చర్చ మిగతా రాజకీయ 'చెద'రంగానికి సంబంధించి కాదు. ఆ చెదలులో మనం కూడా ఉన్నాం. ప్రత్యామ్నాయం సృష్టించడానికి ఏమీ చేయ(లే)ని మనం కూడా ఆ చెదలులో ఉన్నాం.
*

Thursday, July 27, 2023

బూర్జువా పార్టీలనుంచి బుర్జువా డెమోక్రసీ డిమాండ్ చేయాలి: మీరేమంటారూ 5


మీరేమంటారూ?

    నా ఫేస్ బుక్ మితృలు మితృలు తిరుపాలు పూసలపాటి ఇలా అన్నారు:

"(జగన్ ప్రభుత్వం మీద) మీది భ్రమ అందామా? ఆశావాదం అందామా? మొదటి నుండి మీరు సానుభూతి చూపిస్తునే ఉన్నారు. సానుభూతి చూపించడం లో తప్పు లేదు. మీలాంటి అనుభవజ్ఞులు చూపించటం ధర్మం కాదు. ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మార్పులు ఏమి ఉండవు. ఒక సన్నని గీత తప్ప!

తిరుపాలు గారి మాట చాల ఆలోచనీయం. ఇది ఆయన ఒక్కరి మాట కాదు. పాలక పార్టీలలో ఏ ఒక్కదానికైనా అనుకూలమైన మాట వినిపిస్తే చాలు, ఇలాంటి మందలింపులు ఎదురవుతాయి. ఈ మందలింపులు సరైనవేనా? చాల మంది స్నేహితులు ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇది సరైన ఆలోచనేనా?
తిరుపాలు గారూ! మరి, ప్రజల మేలు కోరే వాళ్లం ఇవి కాకుండా మరి ఏ పార్టీల మీద ఆధారపడదామంటారు? పాతికో యాభయ్యో అయిపోయిన కమ్యూనిస్టు పార్టీల మీదనా? సాధ్యమా? లాబీయిస్టు సమూహాలుగా, కుల కూపాలుగా మిగిలిపోయిన వాళ్ల మీదనా?
నా మట్టుకు నేను ఇప్పుడు ప్రజా జీవితంలో మెరుగుదల కోసం కమ్యూనిస్టుల మీద ఆధారపడడం సాధ్యం కాదని అనుకుంటున్నాను. సాధ్యమైతే బాగుణ్ను కాని, సాధ్యం కాదు.
ఒక్కుమ్మడి మార్పులతో కూడిన విప్లవాలు జరిగేట్టు ఉంటే, అవి జరగడానికి దశాబ్దాలు, శతాబ్దాలు పట్టగూడదు. ఈలోగా ప్రజా జీవితం సంగతేమిటి? సాయుధ పోరాటం వంటి నినాదాలు సఫలమై ప్రజల చేతికి అధికారం వచ్చే దాక చుట్టూరా కనిపించే ప్రజా సమస్యలు ప్రజలను హింసించక మానవు. కూటికి లేక వలసపోయే నిరుపేదల దుఃఖం అగదు. అందువల్ల, ఉన్న రాజకీయ ఏర్పాట్లతోనే ప్రజా జీవితాల్ని మెరుగుపరుచుకోవాలని నేను భావిస్తున్నాను. జీవితాల మెరుగుదల క్రమంలోనే, దాని కోసం చేసే పోరాటాల క్రమంలోనే ప్రజలు పురోగమిస్తారని, దోపిడి వ్వవస్థ ఆ సమస్యలను తీర్చలేక వరుస సంక్షోభాలకు గురై... జనం కూలదోస్తే కూలిపోతుందని నేను అనకుంటున్నాను.
మరలాంటప్పుడు, ఇప్పటికిప్పుడు ప్రజలకు మరింత మెరుగైన జీవితాల్ని డిమాండ్ చేయాలా వద్దా మనం? ఎవరిని డిమాండ్ చేయాలి? బూర్జువా పార్టీల నుండి బుర్జువా ప్రజాస్వామ్యాన్ని డిమాండ్ చేయాలని నా అభిప్రాయం. కులాలు, మతాలతో ప్రమేయం లేని ప్రజానుకూల పాలనలను డిమాండ్ చేయాలి అని నా అభిప్రాయం. ఆ డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తే ఆ ప్రభుత్వాలు ఉంటాయి. లేకపోతే ఊడుతాయి. అలాంటి త్రెట్ ఎప్పుడూ రాజ్యానికి ఉండాలి.
ఈ అర్థంలోనే... ప్రజల డిమాండ్లకు స్పందించడం అనే అర్థంలేనే... నేను ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం చూడలేకపోతున్నానని అన్నాను. చూడలేకపోతున్నాను కూడా. మీకు అలాంటి ప్రత్యామ్నాయం కనిపిస్తే చెప్పండి. మన మితృలు కొందరికి... రాష్ట్రంలో 'తెలుగుదేశం' పార్టీ అలాంటి ప్రత్యామ్నాయంగా, కనిపించింది.
మరి, మీకు? మీకు కనిపిస్తున్న ప్రత్యామ్నాయం ఏమిటి?
ఇది సీరియస్ ప్రశ్న. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుకుందాం.
కలిసి ఆలోచిద్దాం. మీది నిరాశ అని అనను గాని, ‘ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మార్పులు ఏమి ఉండవు’ అనేది నిరాశ కాకపోతే ఏమిటి, చెప్పండి?
జులై 27, 2023

ఇప్పటికీ మిగిలిన కులాల మూలాలు: మీరేమంటారూ?

 

 ఆ మధ్య అరిజోనా న్యూ మెక్సికో ప్రాంతాల్లో తిరుగుతూ చాల చోట్ల చూసిన ఒక బోర్డుకంపెనీ నేమ్ గురించి రాశాను. రెడ్షీ ఐస్ అనే ఆ కంపెనీ నాకు చిత్రమనిపించి మీతో పంచుకున్నాను. దాన్ని చూసినప్పుడు గుర్తుకొచ్చిన దానే మితృడు శివ పేజీలో చూసిన ఈ ఫోటో మళ్లీ గుర్తు చేసింది.

నాకు పట్నం పరిచయమైందే 16 వ ఏడు (ఎస్సెస్సెల్సీ) తరువాత. అలా పరిచయమైన పట్నంలో... దాదాపు ప్రతి పట్నంలో కనిపించిన రెండు బోర్డులు... ఎందుకలా అని నన్ను కాసేపు నిలబెట్టేవి. ఒకటి ‘బ్రాహ్మణ శాకాహార హోటల్’ అనేది. రెండోది ‘రెడ్డి మిలిటరి హోటల్’ అనేది. మిలిటరీ అంటే అక్కడ సైనికులు తింటారని కాదు. మాంసాహార హోటల్ అని దాని అర్థం. మటన్ చికెన్ తో బువ్వ తినాలంటే రెడ్డి లేక రెడ్ల ‘మిలిటరీ’ హోటల్ కే వెళ్లాలి. తరువాతి రోజుల్లో మిలిటరీ తీసేసి రెడ్డి హోటల్ అని రెడ్డి మాంసాహార హోటల్ అని బోర్డులు ఉండేవి.

ఈ రెడ్డికీ మాంసాహారానికీ సంబంధం ఏమిటి?

నాకి ఇలా అనిపిస్తున్నది.

ఒకానొక నాడు రాజుల వద్ద స్థిర సైన్యం అనేది లేదు. ఉన్నా చాల కొద్దిగా ఉండే. పరాయి వాడు డండెత్తి వచ్చినాతామే దండు పోవాలన్నా అప్పటికప్పుడు సాధారణ ప్రజల నుంచి సైన్యాన్ని మొబిలైజ్ చేసుకోవలసిందే. అలా మొబిలైజ్ చేయబడే వారిలో అత్యధికులు. ఊరి నుంచి మొబిలైజ్ చేసే వారిలో మరింత అధికులు ఆ పనినే వృత్తిగా కలిగి ఉండే వారు. శాంతి కాలంలో ఊరి రక్షణఊరిలో శాంతి భద్రతల వంటి పనులు చూసే వారు. రాజుకు పన్నులూ అవీ వసూలు చేసి ఇచ్చే వారు. అలాంటి స్థానికులనే రెడ్డి అని పిలిచే వారు. మొదట వాళ్లు తక్కువ సంఖ్య అయినా తరువాత... ఆ వృత్తి ‘లాభసాటి’ కావడం వల్ల సంతానోత్పత్తి ఎక్కువగా జరిగి చాల ఎక్కువ మంది అయ్యారు. ఒక కులం అయ్యారు. చాల ఉప కులాలు అయ్యారు. మంది ఎక్కువయ్యే కొద్దీ ఒక చోటి నుంచి ఒక చోటికి వలసలు పోయారు. తమ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారో తరువాతి వాళ్లకు తలియనంతగా ఆయా స్థలాల్లో తామర తంపరలయ్యారు. (అలా మరిచిపోబడిన పూర్వీకుల గురించి చెప్పే రెడ్డి శాఖ ఒకటుంది. వాళ్లను పిచ్చికుంట్ల రెడ్లు అంటారు. కర్నూలు దగ్గరి ఓబులాపురం గ్రామం తదితర చోట్లి వీరు ఉన్నారని విన్నాను. వెళ్లి కలుసుకోవాలని ఉంది. బద్ధకం. 😊 )

ఈ వలసలు ఎక్కువగా ఏ ప్రాంతం నుంచి జరిగాయో చెప్పడం కష్టం. విజయ నగర రాజ్య పతనం తరువాతకాకతీయ రాజ్యపతనం తరువాత విడిపోయి చెల్లా చెదురైన ఆ రకం అస్థిర సైన్యాలే కొన్ని చోట్ల రెడ్లుగాకొన్ని చోట్ల వెలమలుగాకాపులుగారెడ్లుగా ‘స్థిరపడ్డారు. అంతెందుకు ఈ నాలుగు గుంపుల సామాన్య నామం కాపు అని నా ఆభిప్రాయం. అలా అనుకోడానికి కారణాలు: 1. చాల చోట్ల ఊళ్లలో ఈ నాలుగు గుపంపుల వాళ్లను... మిగతా ఊరి ‘కాపదనం అనికాపులు అని వ్యవహరిస్తుంది. 2. మా ఊళ్లో టీచరుగా వచ్చిన రామకృష్ణను మా ఊళ్లో ఆ చుట్టు పక్కల రామకృష్ణా రెడ్డి అనే వారు. 3. నా ఎస్సెస్సెల్సీ సర్టిఫికెట్ లో జయమమత సర్టిఫికెట్లలో కూడా కులం పేరు దగ్గర రెడ్డి అని ఉండదు. కాపు అని ఉంటుంది.

ఎక్కడో చదివాను... విజయనగర రాజ్య చరిత్రకు చెందిన పుస్తకంలో అనుకుంటాను... రెడ్ల వలసలు కోస్తా వైపు నుంచి జరిగాయని. తిరుపతి వేంకటేశ్వరాలయం దేవుడు చుట్టు పక్క రైతులకు వ్యవసాయం పనుల కోసం అప్పులు ఇచ్చే వాడు. ఆ విధంగానే దేవాలయం ప్రసిద్ధమైంది. కృష్ణదేవరాయలు (?) ఆ దేవాలయానికి మాన్యాలు ఇచ్చాడు ఈ పర్పస్ కోసమే అని నేను చదివాను.

శివా! మీ ఫోటో తో ఇన్ని ఆలోచనలు రేపారు. చాల కృతజ్ఙతలు. మీ పోస్టులోని ఫోటల్లో హోటల్ నేమ్ బోర్డు నేరుగా ఉన్నవి కూడా ఉన్నాయి. నేను వాటిని కాకుండాఅద్దంలో ప్రతిబింబంలా అక్షరాలు తిరుగబడిన బోర్డునే ఎంచుకున్నాను. ఇది సకారణంమన మన గతాలకు సంబంధించిన అవగాహనలు మన మనస్సులలో తిరుగబడి ఉన్నాయి. వాటిని సరిగ్గా చదివితప్పొప్పులు సరదిద్దుకుని ఆ అనుభవాల నుంచి ఇప్పటికి తగిన పాఠాలు మాత్రం తీసుకునిపాత వైషమ్యాలను తుంగలో తొక్కి ముందుకు నడుద్దాం.

 

 


Wednesday, July 26, 2023

ఇది భిన్నత్వమా తెగలూ కులమతాలకు కాపలాయా?



మీరేమంటారూ? 3

కాసేపటి ముందు మితృడు సురేంద్ర రాజుకూ నాకు మధ్య సంభాషణ. కింది కాపీ లో నా భాషణమే ఎక్కువ 😊. ఇదే వెయిన్ లో, శీను వంటి మరికొందరు స్నేహితులు కూడా నన్ను పోక్ చేసి వుండడం వల్ల నా వ్యాఖ్య కాస్త పొడుగయ్యింది. అయినా బాంటుంది, చదవండి. చదివి, మీరేమంటారో చెప్పండి 😊
Surendra Raju Ambati
వైవిధ్యం / భిన్నత్వం / బహుళత్వం - పైన మీ అసహనం హిందూత్వ అసహనాన్ని మించిపోతున్నది. హ్యాట్సాఫ్ ! కీపిటప్ ... గుడ్ లక్ ...
Hanumantha Reddy Kodidela
థాంక్స్.
నా మీద మీ అసహనం దేన్ని మించి పోయిందో చెప్పలేను.
నా అసహనం భిన్నత్వం మీద కాదు, ఆ పేరుతో బ్రాహ్మణవాదులు పరోక్షంగా బ్రాహ్మణ వాదాన్ని కాపాడడం మీద. తెగలూ కులాల వాదాన్ని కాపాడే యథాతథ వాదం మీద. మీరు అందులోంచి బయటికి రాలేరు. అది మీరు కూర్చున్న కొమ్మ. మీరంటే నాకు ఇష్టం, కాని ఇలాంటి ఇష్టాల కోసం నన్ను నేను వొదులుకోలేను. భిన్నత్వం పేరిట తెగలూ, కులాలతో కూడిన యథాతథ స్థితికి మీ అందరి తెలివైన కాపలాను అంగీకరించలేను. ఈ ఇస్యూలో మనం వ్యతిరేక శిబిరాలలో ఉన్నాం. ఒకే శిబిరంలో ఉన్నట్టు నటన అక్కర్లేదు.
నిజానికి గతంలో కూడా ఇదే నా వైఖరి. అంటే హిందూత్వ అనే పదం పుట్టక ముందు నుంచీ... బీజేపీ ప్రభుత్వంలోకి వస్తుందని అనుకోక ముందు నుంచీ... ఇదే నా వైఖరి. ఇప్పటికీ అదే. గతంలో నేను మంచి వాడినని మీరు భ్రమ పడినట్టున్నారు. మీ ప్రమాణాల ప్రకారం నేను మంచి వాడిని కాను. పేరు హనుమంతుడిదైనా నేను ఆసాంతం అసురుడను. అన్ని రకాలుగా దేవతల వ్యతిరేకిని. అన్ని దేవతల వ్యతిరేకిని. గిరిజన దేవతల వ్యతిరేకిని కూడా.
మా ఊరికి వెళ్లినపప్పుడు వాళ్ల పూజలకు... అవి దాదాపు గిరిజనుల పూజల వంటివే... కూడా వ్యతిరేకిని. ఈ చివరి ఆచరణాత్మక-వ్యతిరేకత వల్ల, ఇంట్లో అందరికీ దూరమై అనుభవించిన (ఇప్పటికీ అనుభవిస్తున్న) నొప్పిని చెబుతూ, గతంలో నా లాంటి వాళ్లది ఒక మైనారిటీ ఘోష అని రాసినందుకు మైనారిటీ మహాకవి ఖాదర్ నా అగ్రవర్ణ దురహంకారాన్ని ఇప్పటికీ క్షమించలేదు.
క్షమించబడాలంటే, నేను ఆయన మతాభినివేశాన్ని... ఇదిగో ఇప్పటి మీ వైవిధ్య భరిత హేతుత్వం సాయంతో... మెచ్చుకుని గౌరవించాలనుకుంటా. అది నాతో అయ్యే పని కాదు. నేను ఏ మతాన్నీ గౌరవించను. సూఫీ అని మెత్తని పేరు పెట్టుకున్న మతాన్ని కూడా గౌరవించను.
ఇప్పుడు మీ వంటి స్నేహితులు నా మీద చూపిస్తున్న పిటీ అప్పుడు ఖాదర్ కలిగించిన నొప్పి వంటిదే అనుకుంటాను సురేంద్రా!
ఈ డైలాగు కొనసాగాలి గాని, 'పిటీ చేయడం' వంటి హైహాండెడ్ నెస్ ను నివారిద్దాం.

హరివిల్లు విరవొద్దని!

 



నువ్వు నమ్మవు గాని, ఆ రోజు పొద్దున్నే

ఒక సీతాకోక చిలుక మా ఇంటి కొచ్చింది

 

పిట్టల కోసం చూరుకు కట్టిన

జొన్న కంకి మీది సుంకు ను పుప్పొడి అనుకుని

పాపం, చాల సేపు అక్కడే తచ్చాడింది

సీతాకోక చిలుక తొడుక్కున్న రంగు బొమ్మల అంగీ చూసి

దానితో మాట్లాడాలని

అప్పుడే పుట్టిన ఒక పిచిక పిల్ల చాల చాల ఆశపడింది

 

సీతాకోక చిలుకకు పక్షుల భాష తెలియదు

అప్పుడే పుట్టిన పిట్టల భాష అసలే తెలీదు

తనకంటూ ఒక  భాష లేదని కూడా, పాపం,

సీతాకోక చిలుక మరిచిపోయింది

నాల్కకు బదులు రెక్కలాడించి

ఆ ఏడాది ఉత్తమ కవితల్లా కంకి సుంకు మీద

కొన్ని నిశ్శబ్ద వర్ణాలు విదిలించి ఎగిరి పోయింది

 

గాలికి లేచిన చప్పుడు లేని రంగులు ఆకాశానికి చేరి,

ఏ సనాతన సౌందర్యానికో పదును బాణం సంధించే

దృశ్యాన్ని  చూశాను

చూరు కింద మంచమేసుకుని కూర్చున్న నేను

 

చూశాను గాని ఏం చేయను,

రైతు నాన్న రెక్కల నీడలో ఊరి వాగు ఇసుకలో

కవిత్వాలు రాసుకుంటున్న వయస్సది,

సీతాకోక చిలుక కాల్పనికతను వదిలి నిజం పువ్వులు వెదుక్కుంటూ

ఎటో ఎగిరిపోయింది, పిచిక పిల్ల కూడా

చూరు పట్టుకుని వేలాడడం లేదిప్పుడు

అసలు, చూరే లేదు

యాస్బెస్టాస్ రేకుల ఇనుప అలల కింద నలిగిపోయిన

పాత పక్షి ఈకల మరకలను వదిలించుకుంటే గాని

నగరం నన్ను అంగీకరించదు, ఇక ఏం చేస్తాను?

ఏదో చేసి ఎట్టాగో ఎగరగలిగినా ఎక్కడికని పోను?

అయినా, నేనేమైనా సీతాకోక చిలుకనా? నవ జాత పిట్ట పిల్లనా?

 

రంగులున్నవో లేనివో

తోలువో ఇనుపవో 

నా రెక్కలతో నేను ఎగురుతాను

అడివి అడివంతా తిరుగుతాను

ఎటు పోయినా ఎంత ఎగిరి చూసినా

చెట్ల కొమ్మల్లోంచి పడిపోయిన పిట్టల గూళ్లు

చెట్ల కింద దేవుళ్లు వేసుకున్న చలిమంటలు

మంటల్లో చిటపటలాడుతూ, పిట్టగూళ్ల పుల్లలు 

 

సీతాకోక చిలుక సరే, మాట్లాడ్డానికి నోరు లేనిది

పిచిక పిల్లలైనా వాళ్ల అమ్మా నాన్నలైనా

నాకు చెప్పాల్సింది

ఆ ఇంటిని, ఇంటి ముందు రెల్లుగడ్డి చూరును,

చూరుకు కట్టిన కొత్త జొన్న కంకులు గాలికి ఊగుతూ చేసే నిశ్శబ్దాలను 

విడిచి వెళ్లొద్దని,

ఇల్లు విడిస్తే పోరు మధ్యలో

విల్లు విడిచిట్లేనని!

 

·       సుంకు: కొత్త జొన్నకంకి మీద రజను వంటి పొడి పదార్థం. కంకిలోని పువ్వులన్నీ గింజలైపోగా మిగిలిన పుష్ప దళాలు అనుకుంటానవి.

+16096472863

 

 May 8, 2023

Sent to AJ (Meher)

సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...