ఉన్నట్టుండి దారిలో
ఎంతో శ్రద్ధగా మలచిన రాళ్లతో కట్టిన
పెద్ద కోనేరు పక్కన
ఎవరో శుభ్రంగా ఊడ్చిన అరుగులతో
నాటకాల వేదికలా తీర్చిన ఒక సత్రం
సత్రాన్నీ కోనేటినీ... తన చల్లని నీడల
కొంగుతో కప్పుతూ ఓ మర్రిమాను తల్లి
ఎన్ని సార్లు చూసి ఉంటానో ఆ స్థలం
దారిలో నడుస్తూ, ఎన్ని నిజం సార్లో
నడుస్తున్న కలల నిద్దట్లో ఎన్ని సార్లో
నిజానికది ఇప్పుడు లేని
ఒక ఊరి పొలిమేర. ఊరు లేదు గాని,
కోనేరుంది, దూరంగా పడిన గోడలూ.
సాయంకాలాలు ఊరి లోంచి
నా వంటి పిల్లకాయలు వొచ్చి
సత్రం అరుగు మీద కూర్చుని
ఇప్పుడు నేను మీతో చెబుతున్నట్లే
ఎన్నో పోసికోలు చెప్పుకుని ఉంటారు
ఇట్టాగే మాటల మధ్య తూకం కోసం
మాటకు మాటకు మధ్య లయ కోసం
తడబడి, కుదరకపోతే కొసరుగా ఒక
చిన్నదో పెద్దదో లేక మధ్య తరహాదో
హాసం పడేసి ఉంటారు, ఇవి కాదా
తరచి చూస్తే మన ఇతిహాసాలన్నీ
మేఘుడు చూచిన యువతి వక్షోజాల
వంటి పక్కపక్క కొండగుట్టల వర్ణనల్తో
వివృతజఘన యగు వనిత పోలికల్తో
అతడు అలంకరించిన విరహవేదనలు
నేను అప్పుడు చిన్న పిల్లాడిని కదా,
నాకు గోధుమ రంగు గుర్రం ఉండేది,
ఇప్పట్లా ఊహల గిట్టలది కాదు, నిజ
మైనది, నాది కాదు, కళ్లెం వొదిలేసినా
మామ వెంటనే నడిచే మచ్చిక గుర్రం
చందమామ వెంట నడిచే ఆకాశమది
మామా, అమ్మ అన్నా చెల్లెలు కదా
వాళ్ల అమ్మానాన్నలు చనిపోయాక
ఒకరికి ఒకరు నిర్భయమై పెరిగిన
బతుకు పోరాట జోదులు వాళ్లిద్దరు.
మా ఊరి నుంచి మామ ఊరి దారిలో
ఆ మర్రిమానూ ఆ కోనేరూ ఆ సత్రం
కోనేట్లో ఎప్పుడూ
తళతళ ఎండ పొడలతో ఆడుకునే
నీటి పిల్లలు; అమ్మా వాళ్ల కంటె ముందు
నిజ గుర్రం మీద ఉడాయించి, అప్పుడా
కోనేటి నీటి పిల్లలతో నేను చెప్పిన మాటల కొసలే,
కొన్ని కొసలే, ఆ అలల మీది తెలి నలి నురుగులే
ఇదిగో ఇప్పుడు మీరు వింటున్నట్టున్న.. పాటలు
☺️
5 AM, 21st June, 2021; Pennigton
No comments:
Post a Comment