ఏవేవో పనుల్లో పడి చెప్పడం మరిచాను
నిష్ఫలమనిపించే కోటి ప్రయత్నాల ఫలితం జీవితం
ఒడ్డు మీద ఇంత చర్చా ఏరు దాటే ఒక చర్య కోసమే
వస్తువుల మధ్యలో శూన్య మంటూ అసలేమీ లేదు
ఆ మాటకొస్తే, మన మాటల మధ్యలో మౌనం లేదు
మనకన్న ముందు వాళ్లనుకున్నదీ నిజమే
తెల్ల కాగితం మీది ఈ నల్లని అక్షరాలే వాచికం కాదు
మార్జిన్స్ లో, గీతల మధ్యన కూడా బతుకు ఉందట
పాపిష్టి కనులు గాట్టిగా మూసేసుకుని చూడాలంట
అధికారి చెప్పని ఆదేశాలు మనల్ని కబళించే లోగా
మీకూ కొన్ని ప్రశ్నలు, నన్ కోప్పడినా సరే
కథలో సీతమ్మ ఏడవడం మనకు ఎందుకంత ఇష్టం?
ఇల్లంతా రెట్టలు వేసినా బందీ చిలుకలు ఎందుకిష్జం?
మనకేమీ తెలియదని మనకు బేషరతుగా తెలిసినా
చెప్పేదేదో ఇన్బాక్స్ లోనే చెప్పాలని షరతులెందుకు?
శూన్యం మరొకరిది అనుకుంటే ఓదార్పు
పూరించబడాలని మనం నిరంతరం తపిస్తుంటాం
గుళ్లు గోపురాల్లో, బాబాల మాటల్లో వెదుక్కుంటాం
నగరంలో మనం పోగొట్టుకున్న దాని కోసం ఆడివిలో
వెదికి తెచ్చా చూడు, ఈ పిడికిట్లోని శూన్యం మనమే
శూన్యం చుట్టూ కందకాలు దాటి, కోటగోడలు దూకి
దొరలు మన నుంచి దోచేసుకున్న ప్రతి పైసా, ఎకరా
కొల్లగొట్టి చెట్ల సౌరు చెట్లకు, గాలి సౌరభాల్ గాలికి,
మానవుడి మానవత్వాన్ని మానవుడికి ఇచ్చే చర్య
కాకుండా, ఇక చర్చలు ఇంకేముంటయ్
17, జూన్, 2021
No comments:
Post a Comment