Monday, June 21, 2021

కవిత్వం ఎప్పుడు ఎలా ఎందుకు?__1


హుశా ప్రతి కవికీ చాల మొదట్లోనే వొచ్చే ప్రశ్నలివి. రాకపొతే రావలసిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు... నాకు నేను ఇచ్చుకున్న జవాబులు మీకూ ఆసక్తి కలిగిస్తాయి.

నా లోనికి నేను చూసుకున్నట్టవుతుంది, మీకూ పనికొస్తుందని.. ఒక రకం సిరీస్  రాస్తానిక్కడ.

నేను ఎక్కువ శ్రమ తీసుకోకుండా మీకూ ఎక్కువ శ్రమ ఇవ్వకుండా చిన్న చిన్న వ్యాసాలుగానే ఈ వివేచన చేస్తాను. వీటి కోసం ముందస్తు ప్రణాళికంటూ ఏమీ లేదు. ఎప్పటికప్పడు... నాకు ముఖ్యం అనిపించిన సంగతులే ఇక్కడ రాస్తాను. ముందస్తుగా ఏ ప్రణాళిక లేదు కాబట్టి నా ఇష్టాలతో పాటు, మీ ఫీడ్ బ్యాక్ కూడా ఈ రచనను నడిపిస్తుంది. ఒకరకంగా ఇది మనం కలిసి రాస్తున్నట్టు.

ఉదాహరణకు కవిత్వం ఎప్పుడు రాయాలి?

నా మట్టుకు నేను... నా మనసును తొలుస్తున్న దానికి కవిత్వంలో తప్ప మరొక ప్రక్రియ కుదరదు అనుకున్నప్పుడే కవిత్వం రాయాలని అనుకుంటాను.

మనః కల్లోలాన్ని వ్యాసంలో చెప్పగలననుకుంటే వ్యాసం రాయడమే మంచి పని. అంతెందుకు... ఇప్పుడు నేను చేస్తున్న పని కథలో చెయ్యడం కుదరదు, కవిత్వంలోనూ కుదరదు. వ్యాసమే దీనికి బాగా నప్పుతుంది. ఎందుకంటే, ఇందులో ఊహించి చెప్పేవాటి కన్న నాకు బాగా తెలుసు అని నేను అనుకున్నవాటికే... అంటే, నా దృష్టిలోని ‘ఫ్యాక్ట్స్’కే ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ఉండాలి. పాఠకుడి ఊహలకు వొదిలేసేవి ఏవీ ఇందులో ఉండవు. స్పష్టంగా చెప్పడం ముఖ్యం. ఇందులోని విషయాలు పాఠకుడి జీవితానుభవాలను పోలి ఉండాల్సిన పని కూడా లేదు. పోలి ఉండకపొతేనే మంచిది. అసలు, ఇవి పాఠకుడికి తెలియని విషయాలైతేనే రచయితగా నాకు మంచిది. ఎందుకంటే పాఠకుడికి తెలిసిన వాటిని అతడు/ఆమె చదవరు కదా?!

కథ అలా కాదు. అవి పాఠకుడికి తెలిసిన అనుభవాలే కావొచ్చు. తెలియనివి చెబితే ఫుట్ నోట్స్ ఇవ్వాలి. తెలిసిన వాస్తవాల నుంచి కొత్త పాఠాలు తీసేలా చెబితే కథ బాగుంటుంది. అరే, ఇది నేను రోజూ చూస్తున్నదే, నాకు తెలిసిందే ఆ బస్టాండు, బస్టాండులో పిల్ల, పిల్లాడు మాట్లాడుకోడం... కాని, కథలో... వాళ్ల మాటల లోంచి రచయిత తీసే పాఠాలు భలే బాగున్నాయే?! అనిపించినప్పుడు కాస్త గిలిగింత పెడుతుంది. ఆ గిలిగింత కోసమే కదా, పాఠకుకలు కథ చదువుతారు?! అలాగే కొన్ని అజ్ఞాతాల్ని జ్ఞాతం చేయడం కూడా కథకు బాగుంటుంది. జోసెఫ్ కొన్రాడ్, జాక్ లండన్ కథల్లో... సముద్ర జీవితాలు మనలో చాల మందికి అజ్ఞాతాలే. కాని, చదివే కొద్దీ జ్ఞాతం అవుతాయి. గుహ లోపలకి... లోపలికి... వెళ్లి చూసినట్టు ఉంటుంది. విస్పష్టంగా కాక, అస్పష్టంగానే ‘ఏదో’ తెలిసినట్లయి కలిగే విచికిత్సాత్మక సంతోషమది.

కవిత్వం మరీ విభిన్నం. పాఠకుడికి తెలియని ఫ్యాక్ట్ చెప్పడం కవిత్వం పనిన కాదు. అందుకే ఫుట్ నోట్స్ కవిత్వానికి పెద్దగా నప్పవు. జీవితానుభవాల గ్రాఫిక్ వర్ణనా... దరిమిలా అజ్ఞాతం నుంచి జ్ఞాతానికి ప్రయాణం కాదు... కవిత్వం. చీకట్లో అగ్గిపుల్ల గీచినట్టు వావ్ అనిపించడం, మనస్సు ఉన్నట్టుండి విచ్చుకోడం జరగాలి. మనకేం జరుగుతున్నదో తెలీకుండా మనస్సు వెలగాలి. వెలగాలంటే, మనస్సులో అప్పటికే వెలగడానికి వీలయినది,,, కంబస్టిబుల్ పదార్థం... ఉండి ఉండాలి. ఇది దాదాపు మనుషులందరిలో ఉంటుంది. ఆ లోపలిది ఉన్నట్టుండి వెలిగి... అరే, నేనూ వెలుగుతానే, నేనూ ఒక అగ్గిపుల్లనే... అని... సంభ్రమాశ్చర్యాలు కలగాలి పాఠకుడికి. ఈ పని  తాటాకు మంటలా కేవలం కొద్ది లైన్లలో జరగొచ్చు. ఒక సారి అంటుకున్నది చింత మొద్దులా అలా రాత్రంతా కాలుతుండొచ్చు. కాలాలి. రగలాలి. అదీ ముఖ్యం.  కాసేపు మన ఆకలి, మన దప్పిక, మన ఇంకేదో నొప్పి మరుపున పడాలి. కవిత్వం కల్పించే ఆకలి, కవిత్వం కల్పించే దప్పికే, కవిత్వం కల్పించే నొప్పే అక్కడ ఉండాలి.  

నీ వ్రాతతో నువ్వు పాఠకుడిని ఏం చేయదల్చుకున్నావో ముందుగా నీ అనుభవం/ఊహ నిన్ను ఆ పని చేసి ఉండాలి. అంటే, నీకు చాల నొప్పి కలిగి, చాల అకలేసి, చాల దప్పికేసి ఉంటేనే... ఆ లోపలి భావనను మాత్రమే... నువ్వు పాఠకుడికి అందించగలుగుతావు. అలాంటి అనుభవమేదో నీ లోపల ఇంకిపోయి తిరిగి నిద్రలేచి, దాన్ని చూసి నీకే సంభ్రమాశ్చర్యం వేసి, ఆ మాట పక్క మనిషికి చెప్పకుండా ఉండలేక చెబుతావు చూడు... అదీ కవిత్వం. 'ఆఁ, ఏంటీ, నాకేం అర్థం కాలేదబ్బా, కొంచెం వివరంగా చెప్పూ' అంటే... తిరిగి... దాన్ని మరింకే రూపంలో నువ్వు చెప్పలేకపోతావు చూడు అదీ కవిత్వం. అందుకే, నేను కథను, వ్యాసాన్ని వీలయితే మరొకరికి చూపించి ‘ప్రకటించాల’నుకుంటాను గాని, కవిత్వాన్ని అలా చేయలేను. కవిత్వం రాసింది బాగుంటే బాగుంది లేకుంటే లేదు. రిపేర్లు కుదరవు. ఉన్నదాన్ని చించేసి, దాన్ని దాదాపు మరిచిపోయి, ఇంకోటి రాయడమే జరుగుతుంది. తిరుగ రాసిన ప్రతిసారీ జరిగే పని  అదే. అలా ‘తిరుగ రాయడం’ తప్పేం కాదు. కాని, ప్రతిసారీ నువ్వు రాసింది ఇంకో కవితే. మొదటిది కాదు. దేన్ని ఉంచుకుంటావో దేన్ని చించేస్తావో... నీ ఇష్టం. నా మట్టుకు నేను... రాసిన వర్షన్స్ లో ఏది మెరుగైనదో వెంటనే నిర్ణయం తీసుకోను. పక్కన పడేసి. ఇంకేదో పనిలో లేదా ఇంకేదో వ్రాతలో పడి, తరువాతెప్పుడో, అందులో ఏ వర్షన్ నా వెంట పడుతుందో... దాన్ని మాత్రమే నాది అనుకుంటాను.

ఇలా చెప్పడమంటే... సద్యో గర్భ సంజాతమైనదే గొప్పది, చాల కాగితాల్ని నవిలి మింగినది తక్కువది అని చెప్పడం కాదు. నా వెంట పడినదే గొప్పది, వెంట పడనిది తక్కువది అని కాదు. ఇది మినిమమ్ టెస్ట్ మాత్రమే. నా వెంట పడనిది నా వంటి మరొక వ్యక్తి వెంట పడుతుందని నేను అనుకోలేను కదా?! కవిత మరొకరికి చేరనంతవరకు ఆ మరొకరు నేనే.

కాదంటారా?

 

22nd 6, 2021

నీటి పిల్లలు


ఉన్నట్టుండి దారిలో

ఎంతో శ్రద్ధగా మలచిన రాళ్లతో కట్టిన

పెద్ద కోనేరు పక్కన

ఎవరో శుభ్రంగా ఊడ్చిన అరుగులతో

నాటకాల వేదికలా తీర్చిన ఒక సత్రం

సత్రాన్నీ కోనేటినీ... తన చల్లని నీడల

కొంగుతో కప్పుతూ ఓ మర్రిమాను తల్లి

ఎన్ని సార్లు చూసి ఉంటానో ఆ స్థలం

దారిలో నడుస్తూ, ఎన్ని  నిజం సార్లో

నడుస్తున్న కలల నిద్దట్లో ఎన్ని సార్లో

 

నిజానికది ఇప్పుడు లేని

ఒక ఊరి పొలిమేర. ఊరు లేదు గాని,

కోనేరుంది, దూరంగా పడిన గోడలూ.

 

సాయంకాలాలు ఊరి లోంచి

నా వంటి పిల్లకాయలు వొచ్చి

సత్రం అరుగు మీద కూర్చుని

ఇప్పుడు నేను మీతో చెబుతున్నట్లే

ఎన్నో పోసికోలు చెప్పుకుని ఉంటారు

ఇట్టాగే మాటల మధ్య తూకం కోసం

మాటకు మాటకు మధ్య లయ కోసం

తడబడి, కుదరకపోతే కొసరుగా ఒక

చిన్నదో పెద్దదో లేక మధ్య తరహాదో

హాసం పడేసి ఉంటారు, ఇవి కాదా

తరచి చూస్తే మన ఇతిహాసాలన్నీ

మేఘుడు చూచిన యువతి వక్షోజాల

వంటి పక్కపక్క కొండగుట్టల వర్ణనల్తో

వివృతజఘన యగు వనిత పోలికల్తో

అతడు అలంకరించిన విరహవేదనలు

 

నేను అప్పుడు చిన్న పిల్లాడిని కదా,

నాకు గోధుమ రంగు గుర్రం ఉండేది,

ఇప్పట్లా ఊహల గిట్టలది కాదు, నిజ

మైనది, నాది కాదు, కళ్లెం వొదిలేసినా

మామ వెంటనే నడిచే మచ్చిక గుర్రం

చందమామ వెంట నడిచే ఆకాశమది

మామా, అమ్మ అన్నా చెల్లెలు కదా

వాళ్ల అమ్మానాన్నలు చనిపోయాక

ఒకరికి ఒకరు నిర్భయమై పెరిగిన

బతుకు పోరాట జోదులు వాళ్లిద్దరు.

 

మా ఊరి నుంచి మామ ఊరి దారిలో

ఆ మర్రిమానూ ఆ కోనేరూ ఆ సత్రం

కోనేట్లో ఎప్పుడూ

తళతళ ఎండ పొడలతో ఆడుకునే

నీటి పిల్లలు; అమ్మా వాళ్ల కంటె ముందు

నిజ గుర్రం మీద ఉడాయించి, అప్పుడా

కోనేటి నీటి పిల్లలతో నేను చెప్పిన మాటల కొసలే,

కొన్ని కొసలే, ఆ అలల మీది తెలి నలి నురుగులే

ఇదిగో ఇప్పుడు మీరు వింటున్నట్టున్న.. పాటలు

☺️

5 AM, 21st June, 2021; Pennigton

Friday, June 18, 2021

చర్య

        ఏవేవో పనుల్లో పడి చెప్పడం మరిచాను

 నిష్ఫలమనిపించే కోటి ప్రయత్నాల ఫలితం జీవితం

ఒడ్డు మీద ఇంత చర్చా ఏరు దాటే ఒక చర్య కోసమే

వస్తువుల మధ్యలో శూన్య మంటూ అసలేమీ లేదు

ఆ మాటకొస్తే, మన మాటల మధ్యలో మౌనం లేదు


        మనకన్న ముందు వాళ్లనుకున్నదీ నిజమే


తెల్ల కాగితం మీది ఈ నల్లని అక్షరాలే వాచికం కాదు

మార్జిన్స్ లో, గీతల మధ్యన కూడా బతుకు ఉందట

పాపిష్టి కనులు గాట్టిగా మూసేసుకుని చూడాలంట

అధికారి చెప్పని ఆదేశాలు మనల్ని కబళించే లోగా


        మీకూ కొన్ని ప్రశ్నలు, నన్ కోప్పడినా సరే


కథలో సీతమ్మ ఏడవడం మనకు ఎందుకంత ఇష్టం?

ఇల్లంతా రెట్టలు వేసినా బందీ చిలుకలు ఎందుకిష్జం?

మనకేమీ తెలియదని మనకు బేషరతుగా తెలిసినా

చెప్పేదేదో ఇన్బాక్స్ లోనే చెప్పాలని షరతులెందుకు?


        శూన్యం మరొకరిది అనుకుంటే ఓదార్పు


పూరించబడాలని మనం నిరంతరం  తపిస్తుంటాం

గుళ్లు గోపురాల్లో, బాబాల మాటల్లో వెదుక్కుంటాం

నగరంలో మనం పోగొట్టుకున్న దాని కోసం ఆడివిలో

వెదికి తెచ్చా చూడు, ఈ పిడికిట్లోని శూన్యం మనమే


శూన్యం చుట్టూ కందకాలు దాటి, కోటగోడలు దూకి

దొరలు మన నుంచి దోచేసుకున్న ప్రతి పైసా, ఎకరా

కొల్లగొట్టి చెట్ల సౌరు చెట్లకు, గాలి సౌరభాల్ గాలికి,

మానవుడి మానవత్వాన్ని మానవుడికి ఇచ్చే చర్య


        కాకుండా, ఇక చర్చలు ఇంకేముంటయ్

 

17, జూన్, 2021

 


సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...