బహుశా ప్రతి కవికీ చాల మొదట్లోనే వొచ్చే ప్రశ్నలివి. రాకపొతే రావలసిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు... నాకు నేను ఇచ్చుకున్న జవాబులు మీకూ ఆసక్తి కలిగిస్తాయి.
నా లోనికి నేను చూసుకున్నట్టవుతుంది, మీకూ
పనికొస్తుందని.. ఒక రకం సిరీస్ రాస్తానిక్కడ.
నేను ఎక్కువ శ్రమ తీసుకోకుండా మీకూ ఎక్కువ శ్రమ
ఇవ్వకుండా చిన్న చిన్న వ్యాసాలుగానే ఈ వివేచన చేస్తాను. వీటి కోసం ముందస్తు
ప్రణాళికంటూ ఏమీ లేదు. ఎప్పటికప్పడు... నాకు ముఖ్యం అనిపించిన సంగతులే ఇక్కడ రాస్తాను.
ముందస్తుగా ఏ ప్రణాళిక లేదు కాబట్టి నా ఇష్టాలతో పాటు, మీ ఫీడ్ బ్యాక్ కూడా ఈ
రచనను నడిపిస్తుంది. ఒకరకంగా ఇది మనం కలిసి రాస్తున్నట్టు.
ఉదాహరణకు కవిత్వం ఎప్పుడు రాయాలి?
నా మట్టుకు నేను... నా మనసును తొలుస్తున్న దానికి
కవిత్వంలో తప్ప మరొక ప్రక్రియ కుదరదు అనుకున్నప్పుడే కవిత్వం రాయాలని అనుకుంటాను.
మనః కల్లోలాన్ని వ్యాసంలో చెప్పగలననుకుంటే వ్యాసం
రాయడమే మంచి పని. అంతెందుకు... ఇప్పుడు నేను చేస్తున్న పని కథలో చెయ్యడం కుదరదు,
కవిత్వంలోనూ కుదరదు. వ్యాసమే దీనికి బాగా నప్పుతుంది. ఎందుకంటే, ఇందులో ఊహించి
చెప్పేవాటి కన్న నాకు బాగా తెలుసు అని నేను అనుకున్నవాటికే... అంటే, నా దృష్టిలోని
‘ఫ్యాక్ట్స్’కే ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ఉండాలి. పాఠకుడి ఊహలకు వొదిలేసేవి ఏవీ ఇందులో
ఉండవు. స్పష్టంగా చెప్పడం ముఖ్యం. ఇందులోని విషయాలు పాఠకుడి జీవితానుభవాలను పోలి
ఉండాల్సిన పని కూడా లేదు. పోలి ఉండకపొతేనే మంచిది. అసలు, ఇవి పాఠకుడికి తెలియని
విషయాలైతేనే రచయితగా నాకు మంచిది. ఎందుకంటే పాఠకుడికి తెలిసిన వాటిని అతడు/ఆమె చదవరు కదా?!
కథ అలా కాదు. అవి పాఠకుడికి తెలిసిన అనుభవాలే
కావొచ్చు. తెలియనివి చెబితే ఫుట్ నోట్స్ ఇవ్వాలి. తెలిసిన వాస్తవాల నుంచి కొత్త
పాఠాలు తీసేలా చెబితే కథ బాగుంటుంది. అరే, ఇది నేను రోజూ చూస్తున్నదే, నాకు తెలిసిందే ఆ
బస్టాండు, బస్టాండులో పిల్ల, పిల్లాడు మాట్లాడుకోడం... కాని, కథలో... వాళ్ల మాటల లోంచి
రచయిత తీసే పాఠాలు భలే బాగున్నాయే?! అనిపించినప్పుడు కాస్త గిలిగింత పెడుతుంది. ఆ
గిలిగింత కోసమే కదా, పాఠకుకలు కథ చదువుతారు?! అలాగే కొన్ని అజ్ఞాతాల్ని జ్ఞాతం
చేయడం కూడా కథకు బాగుంటుంది. జోసెఫ్ కొన్రాడ్, జాక్ లండన్ కథల్లో... సముద్ర
జీవితాలు మనలో చాల మందికి అజ్ఞాతాలే. కాని, చదివే కొద్దీ జ్ఞాతం అవుతాయి. గుహ లోపలకి...
లోపలికి... వెళ్లి చూసినట్టు ఉంటుంది. విస్పష్టంగా కాక, అస్పష్టంగానే ‘ఏదో’
తెలిసినట్లయి కలిగే విచికిత్సాత్మక సంతోషమది.
కవిత్వం మరీ విభిన్నం. పాఠకుడికి తెలియని ఫ్యాక్ట్ చెప్పడం కవిత్వం పనిన కాదు. అందుకే ఫుట్ నోట్స్ కవిత్వానికి పెద్దగా నప్పవు. జీవితానుభవాల గ్రాఫిక్ వర్ణనా... దరిమిలా అజ్ఞాతం నుంచి జ్ఞాతానికి ప్రయాణం కాదు... కవిత్వం. చీకట్లో అగ్గిపుల్ల గీచినట్టు వావ్ అనిపించడం, మనస్సు ఉన్నట్టుండి విచ్చుకోడం జరగాలి. మనకేం జరుగుతున్నదో తెలీకుండా మనస్సు వెలగాలి. వెలగాలంటే, మనస్సులో అప్పటికే వెలగడానికి వీలయినది,,, కంబస్టిబుల్ పదార్థం... ఉండి ఉండాలి. ఇది దాదాపు మనుషులందరిలో ఉంటుంది. ఆ లోపలిది ఉన్నట్టుండి వెలిగి... అరే, నేనూ వెలుగుతానే, నేనూ ఒక అగ్గిపుల్లనే... అని... సంభ్రమాశ్చర్యాలు కలగాలి పాఠకుడికి. ఈ పని తాటాకు మంటలా కేవలం కొద్ది లైన్లలో జరగొచ్చు. ఒక సారి అంటుకున్నది చింత మొద్దులా అలా రాత్రంతా కాలుతుండొచ్చు. కాలాలి. రగలాలి. అదీ ముఖ్యం. కాసేపు మన ఆకలి, మన దప్పిక, మన ఇంకేదో నొప్పి మరుపున పడాలి. కవిత్వం కల్పించే ఆకలి, కవిత్వం కల్పించే దప్పికే, కవిత్వం కల్పించే నొప్పే అక్కడ ఉండాలి.
నీ వ్రాతతో నువ్వు పాఠకుడిని ఏం చేయదల్చుకున్నావో ముందుగా నీ అనుభవం/ఊహ నిన్ను ఆ పని చేసి ఉండాలి. అంటే, నీకు చాల నొప్పి కలిగి, చాల అకలేసి, చాల దప్పికేసి ఉంటేనే... ఆ లోపలి భావనను మాత్రమే... నువ్వు పాఠకుడికి అందించగలుగుతావు. అలాంటి అనుభవమేదో నీ లోపల ఇంకిపోయి తిరిగి నిద్రలేచి, దాన్ని చూసి నీకే సంభ్రమాశ్చర్యం వేసి, ఆ మాట పక్క మనిషికి చెప్పకుండా ఉండలేక చెబుతావు చూడు... అదీ కవిత్వం. 'ఆఁ, ఏంటీ, నాకేం అర్థం కాలేదబ్బా, కొంచెం వివరంగా చెప్పూ' అంటే... తిరిగి... దాన్ని మరింకే రూపంలో నువ్వు చెప్పలేకపోతావు చూడు అదీ కవిత్వం. అందుకే, నేను కథను, వ్యాసాన్ని వీలయితే మరొకరికి చూపించి ‘ప్రకటించాల’నుకుంటాను గాని, కవిత్వాన్ని అలా చేయలేను. కవిత్వం రాసింది బాగుంటే బాగుంది లేకుంటే లేదు. రిపేర్లు కుదరవు. ఉన్నదాన్ని చించేసి, దాన్ని దాదాపు మరిచిపోయి, ఇంకోటి రాయడమే జరుగుతుంది. తిరుగ రాసిన ప్రతిసారీ జరిగే పని అదే. అలా ‘తిరుగ రాయడం’ తప్పేం కాదు. కాని, ప్రతిసారీ నువ్వు రాసింది ఇంకో కవితే. మొదటిది కాదు. దేన్ని ఉంచుకుంటావో దేన్ని చించేస్తావో... నీ ఇష్టం. నా మట్టుకు నేను... రాసిన వర్షన్స్ లో ఏది మెరుగైనదో వెంటనే నిర్ణయం తీసుకోను. పక్కన పడేసి. ఇంకేదో పనిలో లేదా ఇంకేదో వ్రాతలో పడి, తరువాతెప్పుడో, అందులో ఏ వర్షన్ నా వెంట పడుతుందో... దాన్ని మాత్రమే నాది అనుకుంటాను.
ఇలా చెప్పడమంటే... సద్యో గర్భ సంజాతమైనదే గొప్పది, చాల కాగితాల్ని నవిలి మింగినది తక్కువది అని చెప్పడం కాదు. నా వెంట పడినదే గొప్పది, వెంట పడనిది తక్కువది అని కాదు. ఇది మినిమమ్ టెస్ట్ మాత్రమే. నా వెంట పడనిది నా వంటి మరొక వ్యక్తి వెంట పడుతుందని నేను అనుకోలేను కదా?! కవిత మరొకరికి చేరనంతవరకు ఆ మరొకరు నేనే.
కాదంటారా?
22nd 6, 2021