Monday, July 10, 2023

సమాధిలో ఎరుక (ఆటొమేటిజం...స్లైట్లీ ఎడిటెడ్)

    తిరిగి తిరిగి ఇదంతా ఒక ఊహ, ఏదో ఒక ఎరుక. చీకటి కలుగులో కదులుతున్న ఒకే ఒక్క ఎలుక. అవు        మల్ల. జాన్ స్టీన్బెక్ నవల లోని లెన్నీ* లాంటి బలమైన మనిషి ప్యాంటు జేబులో చచ్చి బతికున్న            చిన్న తిక్క ఎలుక.

ఎలుకలు కలుగులలో ఉండును. వాటికి ఎప్పుడెక్కడ ఉండాలనిపిస్తే అక్కడ కూడా ఉండును. వాటికి ఎప్పుడు ఎక్కడుండాలనిపిస్తుందో మనిషి చెప్పలేడు. చెప్పలేకనే ఇంటింటా ఇన్నిన్ని బోనులూ, ప్రేమ గోరీలూ, తాజా తాజా మహళ్లూ.
ఇప్పుడు ఈ ఎరుక, ఈ ఊహ అచ్చం ఒక ఎలుక వంటిదే. తిక్కోడు మన లెన్నీ అన్న జేబులోని బతికి చచ్చిన ఎలుక వంటిదే. అదీ ఒక ఎలుకే. ఇదీ ఒక ఎరుకే.
బోనులూ, విషాలు వొద్దు ప్లీజ్. పక్క వీధిలో ఒక మనసున్న పిల్లను చూశాను. చిలుకల్ని, కుక్కపిల్లల్ని వొద్దని ఆమె పెంచుకుంటున్న రెండు ఎలుక పిల్లలు. తన లాగే మీరు నిస్సందేహంగా, ఆరోగ్య నిర్భయంగా ఈ ఎరుకతో ఆడుకోవచ్చు. మీకు ఎలా తోస్తే అలా, చివరికి, ఎలుకకు తన చొక్కా జేబును ఒకసారి ఉయ్యాలలా, ఇంకోసారి గోరీలా ఉపయోగించిన మన లెన్నీ అన్నలా... దానికొక సజీవ మృతిగీతం రాసి మీ ప్రేమను ప్రకటించొచ్చు.
ఈ ఊహలోనే, అటిటు పాదరసంలా ప్రవహించే ఈ ఎరుకలోనే, ఇదిగో, ఇక్కడ, ఎంచక్కా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు ఒక రాజా. ఏ ఆలోచననూ తిరస్కరించని, దేన్నీ ఆవాహన చెయ్యని, రాదలిచిన వారందర్నీ రానివ్వడమే గాని, ఎవరినీ బొట్టు పెట్టి పిలవని, బొట్టు తుడిచి వెళ్లగొట్టని రాజా, రాజాధి రాజ రాజా.

ఇప్పుడు
రాజాకు చాల దిగులుగా ఉంది. కారణంలేని దిగులు. రాజ్యం లేని రాజసం ఉండదూ అలాగే కారణం లేని దిగులు. అతడి లోపల ఎక్కడో ఏదో గడ్డ కడుతున్నట్టు భావన. నిజానికది గడ్డ కట్టడం కూడా కాదు. మరేమిటి? ఇది నాలుగో ద్రవ్య స్థితి. ఏదీ లేక, ఉన్నదాంతో సర్దుకుపోతున్న ఒక ప్రత్యేక పరిస్థితి.

రాజాకు ఏదో కావాలి, అదేమిటో అతడికి తెలీదు. తెలిస్తే ఎవరో దాన్ని తనకు తెచ్చి ఇస్తారని కాదు. తెలియదు. అలా ఏ ప్రయోజనం లేకుండా, ‘ఊర్నే తెలీకపోవడం’... అదొక ప్రత్యేకమైన కళ. రాతి గొడ్డలి నాటినుంచి నరకబడుతున్న, నరకబడే కొద్దీ విప్పారుతున్న... కళ.
ఎవరికీ ఎవరూ ఏదీ ఇవ్వరు. ఒక చచ్చిన ఎలుకను కూడా ఇవ్వరు. ‘దాన్ని పారెయ్’ అని ఉన్న ఒక్క స్నేహితుడూ గోల పెడతాడు. ఊరికే ఆధారపడడమే గాని, ఎవరో ఒకళ్లు వచ్చి ఏదో ఇవ్వలేదని, ఏదీ ఇవ్వలేదని లోపలా, బయటా నిష్ఠూరపడడమే గాని; ఆధారపడే కొద్దీ, నిష్ఠురపడే కొద్దీ దుఃఖమేనని రాజాకు బాగా తెలుసు. జిడ్డు కృష్ణమూర్తి యూ ట్యూబ్ వీడియోలు పరిచయం కాకముందు కూడా తెలుసు ఆ సంగతి రాజాకు.

అది ఎక్కడో చదవడం వల్ల, వినడం వల్ల తెలుసుకున్నది కాదు. అలా తెలిసేది కాదు. తెలిసేదాన్ని దేన్నైనా అలా తెలుసుకునే అవకాశం రాజా కు లేనే లేదు. ఎందుకంటే రాజా చాల అహంభావి. మూసుకుపోయిన బావి.

ఏంటీ, ఏమన్నానూ? అలా అన్నానా? రాజా అహంభావి అన్నానా?

ఆ పదం కరెక్ట్ కాదేమో. కాదూ కాగూడదు. ఏం చూసుకుని అహంభావం ఉంటుంది రాజాకు. అమ్మనాన్నలు సంపాదించి పెట్టిన డబ్బుల్లేవు. పొలం పుట్రల్లేవు, రియల్ ఎస్టేట్ ఆస్తిపాస్తుల్లేవు. ఉట్టి కూలోడు. ఇవాళ ఈ ఊరు రేపు ఏదో రేవు.

చదివినచో గౌరవమని ఏదో చదివెను, అంతే. చదివినట్లు రుజువు చేసే డిగ్రీ కాయితాలున్నాయి. వాటితో ఉద్యోగాలు రావనుకున్నాడు అప్పుడు. అలా అనుకున్నాడు గనుక ఉద్యోగం రాలేదు. ప్రయత్నించలేదు, రాని దాని కోసం ప్రయత్నం ఎందుకని.

ఎప్పుడో ఏ అరాచకత్వం వల్లనో విసిగిపోయి... మరొకరిది కాదు, తన సొంత అరాచకత్వం వల్లనే తను విసిగిపోయి... ఒక రాచకం పరిధిలో తనకున్న డిగ్రీ(ల)తో ఉద్యొగం వచ్చేట్లుందని కర్ణకర్ణిగా విన్నా, ప్రయత్నం చేద్దామనుకోలేదు రాజా. భయం. కాగితాలున్నాయి గాని, అవి తన వద్ద ఎందుకున్నాయో కూడా మరిచిపోయాడు. వాటిని తెచ్చిపెట్టిన చదువు కుంచెం కూడా గుర్తు లేదు. ఉదాహరణకు రాజా డిగ్రీ తెలుగెమ్మే అనుకుందాం, జస్ట్, సపోజ్, మాట వరుసకి అలా అనుకుంటే, బాలవ్యాకరణం లో ఒక్క సూత్రం కూడా రాజాకు గుర్తు లేదు.

అదెలా అంటారా? అదెలా జరుగుతుంది అంటారా?

చెబుతా, అంతా చెబుతా. అది చెప్పడానికి కాదూ ఇదంతా?! అది చెప్పే నెపం కోసమని, ఇలాంటిదే మరొక నెపం దొరికి తనను బ్రతికించే వరకు, తనతో బతికే ఒక అందమైన నెపం కోసమని... ఒకానొక అర్ధరాత్రి... పాప ఇంకో ఇంట్లో తన స్నేహితురాళ్లతో ‘స్లీప్ ఓవర్’ కి వెళ్లి ఇల్లు బోసిపోయిన రాత్రి, ఆమె అందంగా అలంకరించుకున్న ఆమె అందమైన గదిలో, పిల్లల పుస్తకాల మధ్య మోచెయ్యి ఆనించి కూర్చుని ... ఓహ్, ఆ గది కథ కూడా ఒకటుంది, అదీ చెబుతా, చెప్పడానికి తగినది లేదా తగనిది ఇంకేదీ లేనప్పుడు చెబుతా. చెప్పగలగినదాన్ని దేన్నీ వొదిలేది లేదు. అస్సలు వొదిలేది లేదు, లేదు, లేదు.

ఎందుకంటే ఇప్పుడు రాజాకు చాల దిగులుగా ఉంది.

ఎక్కడో, ఏ చిరిగిపోయిన డైరీలోనో, ఎవరో చింపి పారేసిన పొయెం ముక్క లోనో రాసి ఉంటుందొక మాట. ఇప్పుడది మీకు చెప్పొచ్చు. అది ప్లేగియారిజం అనే నేరం కిందికి రాదెందుకంటే, దాన్ని మీరెవురూ చదివి ఉండరు... రాయబడకముందే దాన్ని చదివ్వుండకపోతే అన్నమాట. 😊 ఓహ్, డైగ్రెషన్. ఇంతకూ ఎప్పుడో రాయబడిన డైరీ చిరిగిపోవడమో, పలకబడిన పద్యం లోంచి పగిలి రాలడమో జరిగిన ఆ మహత్ వాక్యం ఏమిటి?

మరే... అదీ... అదీ... ‘పాడుతున్నత కాలమే నువ్వు బతికి ఉంటావ’ని (ఎవరో ఎవరికో దీవించిన) శాపం. ఆ ఎవరు ఎవరైనా కావొచ్చు. ఆ శప్తుడు... అంటే, నువ్వూ నేనూ తానూ మనం... చివరి వరకు పాడుతూనే ఉంటారట. ఉండాలట. మరీ ఖండిత హస్తంతో గీతాలు రాసి, ఖండిత గళంతో వాటిని పాడిన విక్టర్ హారా మాదిరి కాదు. రాయడం మన శప్తుడు గారి వ్యసనం. పాడడం అని బడాయి ఎందుగ్గాని, ఇప్పుడిక్కడ ఆంటున్నది రాయడం గురించే. ఇవాళ్రేపు ఎవురు పాడుతున్నారు, అందరూ రాసే వాళ్లే. ఒక్కోసారి రాసిందే పాడి, రాపాడి ఆటను రక్తి కట్టిస్తారంతే.

రాజాకు మటుకు పాడడం అస్సలు రాదు. తనవి గాయాలవునో కాదో గాని గేయాలు మాత్రం కాదని, గానం వాటికి ఊతంగా లేదని ఒక మొలమువ్వల పోశన్న తనను ప్రేమగా ఆక్షేపిస్తే, అప్పుడేదో చెప్పాడనుకోండీ, వంట చేసుకోడానికి చేతుల్లేని పిల్ల తన కాళ్లతో వండుకుని, కాళ్లతోనే నోటికి అందించుకోక ఆకలితో చనిపోతుందా ఏం, ఏమిటి పోశన్నా, ఏందన్నా అని దబాయిస్తాడు రాజా.
సో, దేర్ఫోర్ పాట అంటే కవిత/కథ కూడా. కథలో కవిత, కవితలో కథ ఉండడం పెద్ద ఒప్పూ కాదు తప్పూ కాదుగా, అట్లే. పాట కవిత ఒకదానికొకటి ఒకపరి అండగా... ఇంకొకపరి ఒకదానికి ఒకటి బదులుగా ‘ప్రజెంట్ సార్’ చెప్పినట్లుగా ఉండడం తప్పేం కాదని... నా అదృశ్య సభా సదులకు… అదృశ్యులు గనుక అస్మద్ నయనాల వెనుక భయ సందేహాలను... మీకే కాదు నాక్కూడా వినిపించకుండా చెప్పి మరిక మన కథాకథనాన్ని కొన సాగిద్దాం. ఇదిగో ఇక్కడ, అంటే అచ్చు ఇక్కడ కాదు, ఇదిగో ఇది రాయడానికి కుంచెం ముందన్నమాట, నా వేళ్లకు అలుపొచ్చి వాటి నడక మందగిస్తే లేచి, మంచి నీళ్ల గాజుగ్లాసు... పవన కల్యాణ్ ను పర్మిషన్ అడక్కుండానే... ఎత్తి తాగబుద్దయినన్ని తాగొచ్చి కూర్చున్నాను. మీరు కూడా ఇలాంటి పన్లు చెయ్యొచ్చు, దప్పికేసినా వేయకపోయినా, తాగొచ్చి కూర్చోవచ్చు.
*
లెన్నీ: జాన్ స్టీన్ బెక్ గారి ‘ఎలకలూ మనుషులు’ నవలలోని ఒక ముఖ్య పాత్ర. చుట్టూ ఆవరిస్తున్న పరాయీకరణాన్ని భరించలేక జేబులో ఒక చచ్చిన ఎలుకను ఉంచుకుని, దాన్ని చేత్తో తడుముతూ సాంత్వన పొందుతుంటాడు లెన్నీ.

(జులై 23 నెల కవితాలో వెలువడిన కవిత)

No comments:

Post a Comment

సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...