Monday, October 16, 2017

6. వెర్రి ప్రశ్న

సైడ్ వాక్ మీద వొక తడిసిన మెత్తని యెండుటాకు
వంటింట్లో దభేళ్మని యేదో పడిపోయిన చప్పుడు
రోడ్డు ములుపులో ఆగిపోయినన గార్బేజ్ ట్రక్కు
యేది మరిచిపోయానో మరిచిపోయిన జ్ఞాపకం
క్రిస్మస్ చెట్టు మీద కదిలీ కదలని యెండ పొడ
సోఫాలో నిన్న రాత్రి చదవబడలేకపోయిన పుస్తకం
యెట్నించి యెటో దొర్లుతూ ఆగిన వొక గోలీకాయ
గోడ మీద వొక పేద్ద మంచు ముద్ద నుంచి జారి
సముద్రంలోనికి పడిపోతున్న నీటిబొట్టులా దేశపటం
కిటికీకి కన్నై బయటికి చూస్తున్న మనీప్లాంటు
పియానో మెట్ల మీద పిల్లి నడిచిన శబ్దాలు, అవి
సంగీతం యెందుక్కాదని లోలోపల వెర్రి ప్రశ్న...
16-102017

5. కుక్కపిల్ల

పక్కింటామె 
మళ్లీ కుక్క పిల్లను తెచ్చుకుంది
వారం రోజులయ్యింది
ఆమె కుక్క పిల్ల మరణించింది
ఆమె వొంటరి అయిపోయింది
పొద్దునా సాయంత్రం
దిగులుగా వొక్కతె
యింటి తలుపులు తీయడం మూయడం
వొక్కతె కాసేపు గడ్డిలో నెమ్మదిగా నడవడం
మరేం ఫరవాలేదన్నట్టు బాధగా నవ్వడం
కొత్త కుక్కపిల్ల బాగుంది
ఆమె యింటికి రాగానే
కాళ్ల వద్ద తచ్చాడుతుంది
వొళ్లోకి దూకుతుంది
యిది కూడా బుగ్గలు నాకుతుంది
తలుపులు మూసినప్పుడు తెరిచినప్పుడు
తానే ముందుగా వెళ్లాలని వురుకుతుంది
చెరువు వొడ్డున కాళ్లు బారజాపి కూర్చుంటే
వొక అల వచ్చి వెళ్లాక మరొక దాని కోసం
పాదాలు యెదురు చూస్తాయి
మరో అల రావడం ఆలస్యమయితే మన
ఆలోచన మన పాదాల వద్ద తారాడుతుంది
కుక్క పిల్లలు కూడా అంతేనా? మనుషులు?
అంతా చెరువు నీళ్లేనా? నీళ్ల మీది అలలేనా?
15-10-2017

4. లాస్ట్ లాఫ్

యిక నేను బయల్దేరుతాను
యిప్పటి వరకు సంపాదించినదంతా నీదే
నేను మోసుకుని పోలేను
కొన్ని వేల మణుగుల కన్నీళ్లన్నీ పూర్తిగా నీకే
గరిసెల్లో పోగు పడిన ప్రశ్నల ధాన్యమంతా నీకే
నేను వుత్త చేతులతో వుత్తి జేబులతో వెళ్తాను
వుండబట్టక నువ్వేవైనా
నాతో పాటు పంపించినా
అవి తినడానికి, కట్టడానికి, వాసన చూడడానికి
తగిన పరికరాలు నా దగ్గర వుండవు, అవి లేవని
బాధ కూడా వుండదు అంతులేని ప్రయాణంలో
యెందుకని మనమంతగా వాదులాడుకున్నామో
యెవరం యేమేమి యెంతెంత పోగేసుకున్నామో
కత్తులతో కత్తుల వంటి వాక్కులతో యెందుకంతగా
గాయపరుచుకున్నామో సమీక్షించుకుంటూ వుంటా
న్నేను నువ్వు వచ్చేదాక, వచ్చి యెందుకలా అని
అడక్కుండా నను చూసి నువ్వూ నిను చూసి నేను
పడి పడి నవ్వుకునే దాకా!
13-10-2017

3. రేపు

 యేదో మొలకెత్తుతోంది
మొలకెత్తడానిక్కొంచెం భయపడుతోంది
మొతకెత్తాలా అని సందేహపడుతోంది
నేల మీద చలి చలి యీదురు గాలి
చిన్ని ప్రాణాన్ని వొణికిస్తోంది
అంతకు ముందు వురుకులు పరుగులై
వెళ్లిన వరద దాన్ని వూడ్చేయబోయింది
చెట్టు మీంచి వొక పల్చని రెక్కల పిట్టపిల్ల
నీకేం భయం లేదని ధైర్యం పాట పాడింది
గొంతు గూడులో తారాడే తీపి డిస్టర్బెన్సు
బెరుకు బెరుకు పదాలు కొత్త రాగం కోసం
మెల్లగా మెత్తగా కదులుతున్నాయి
వరదలకేం వస్తాయి గాలులకేం వీస్తాయి
మట్టి యెగరిపోయి రాళ్లు బయటడతాయి
బండరాళ్ల పగుళ్ల మధ్య మృత్కణాలలోంచి
చిన్నారి విత్తనం యెదురు చూస్తోంది
అదును కోసం, వొకింత పదును కోసం
మట్టి గూటి లోని యీ పిట్ట పిల్ల యెగురుతుంది
నీలి శాఖలు బార్లా చాచి ఆకాశాన్ని పిలుస్తుంది
తన బలమైన బాహువుల మధ్య పుడకల పొత్తిళ్లు
పరిచి పిట్టపిల్లల్ని నిద్ర పెడుతుంది
యేదో మొలకెత్తబోతోంది పచ్చగా తళుకెత్తబోతోంది
వచ్చి చూద్దాం పద మనిద్దరం, మళ్లీ రేపు యిటేపు
12-10-2017

Sunday, October 8, 2017

2. వూరు

వాగు నీళ్లలో మునుగుతున్న కడవ
అలసి నడిచే యెద్దుల మెడ గంటలు
వారపాకు చూరులో పిచిక పిల్లలు నోళ్లు
పిచికల కోసమే నాన్న చూరుకు కట్టిన
జొన్న కంకి మీదుగా మెత్తగా వీచే గాలి
యేవీ లేవు
ఆర్తి ఆరని డొంకలోనుంచి కీచురాయి పాట
వేపచెట్టు కొమ్మలపై దయ్యాల వూర్పులు
కోట బురుజులను తాకి పగుల్తున్న చీకటి
చలిలో ఆకలితో ఆకాశానికి కుక్కల మొర
అమ్మ వొడిలో వొక గుక్కపట్టిన పిల్లవాడు
మినహాయించి
8-102017

1. చిరుత

వొక వూయల
నేను వూగానందులో
యింకా వూగుతున్నానో
దానిలోపల నేను
నా లోపల అది
యినుప పూవుల వూయల
యెప్పటిదో యెన్ని తరాలదో
బహుశా అందులో వొక పాపగా
అమ్మమ్మ వూగి వుంటుంది
అంతే వూళ్లు
అరుగు మీద దంతెలకు కొక్కెం
వున్నది వూయల తాళ్ల కోసమే
యినుపది కదా
వూయల అక్కడ అలా వుంటుందంతే
నేను దాని లోంచి నిద్దర్లేచి వచ్చేశాను
వూయల వూగుతూనే వుంటుంది
దాని తాడు లాగుతూ
అమ్మ జోలపాట పాడుతూనే వుంటుంది
దాని లోంచి నిద్ర లేవడానికి
వొక పాపాయి మనస్సు
పొంచి చూస్తూనే వుంటుంది
రక్తమాంసాల పొదల్లో చిరుతపులి వలె.
4-10-2017

Monday, September 18, 2017

చీమిడి ముక్కు చిన్నోడు


నాకు సొంతం అంటూ యేమీ లేదు
అసలు నేను వున్నానో లేనో తెలీదు
అప్పుడప్పుడు వొక గుడి ముందు నిలబడి
వురేయ్ అని కాతర స్వరంతో పిలుస్తాను
అప్పుడెవడు చీమిడి ముక్కు చీదుకుంటూ
బయటికొచ్చి వెక్కిరిస్తాడో ఆ పిల్లవాడే నేను
నీకు నేనులా కనిపించే యింకేదీ నేను కాదు,
నీకు కనిపించేదంతా నువ్వు చూసేది మాత్రమే,
అది నేను కాదు
యింకా నాకంత వయసు లేదు,
మరీ అంత జ్ఞానం లేదు, తెలసుకోడంలో వున్న
ఆనందం మరెందులోనూ లేదు. తెలిసిన వాడు
యింకేం తెలుసుకుంటాడు సా ... నాకు తెలీదు.

18-9-2017