Thursday, August 3, 2023

శ్రమైక-ప్రేమ వాదం ఒక పరిశీలన: మీరేమంటారూ? 7

 


‘మంచి తనం’ అనేది రాక్షస నాశం కోసం దేవతలు కనిపెట్టిన నీతి.
అప్పులు చెల్లించాల్సిన రుణపీడితుల కోసం వడ్డీ వ్యాపారులు కనిపెట్టిన నీతి.
ఆడవాళ్లపై జులుం తప్ప ప్రేమ తెలియని మగాళ్లు తమ కుటుంబాల కోసం కనిపెట్టిన నీతి.
ఉమ్మడి శ్రమ ఫలితాన్ని పంచుకోడానికి బదులు మోహంతో మోసం చేసే అబద్ధీకుల నీతి.
ఏ నీతి అక్కర్లేకుండా పక్క వాడి క్షేమంతో నా క్షేమం కలగలిసి ఉండే స్థితిని కోరి తెచ్చుకుని, దాన్ని కాపాడుకునే సహజ నీతి ఏర్పడే వరకు...
ఇండియాలో బ్రాహ్మణులు, వేరే దేశాల్లో అక్కడి శ్రుతీ, స్మృతుల వ్రాత గాళ్లు... తయారు చేసి నానా పవిత్రతల రంగులు పులిమి, దాన్ని ఇంద్ర చాపంగా భ్రమింపజేసే నేటి నీతిని, నేటి చదువును చెత్తకుప్పలో కలిపి, అందరం కలిసి మరో సహజ నీతిని, అప్రకటిత రీతిని ఏర్పరుచుకునే వరకు ఇదే ఇదే గతి.
దీనికి వైదికం, ఇస్లాం, క్రైస్తవం, సూఫీ, శైవం, వైష్ణవం, శాక్తేయం... ఇంకా ఏ మతం ఉపయోపడదు. ఆ ప్రతిదీ నష్టం చేస్తుంది. వాటిని ఇక ఏ రూపాల్లోనో బతికింపజేసే ప్రయత్నాలైనా నష్టం చేస్తాయి.
బౌద్ధికంగా హేతుబద్ధ యోచన,
మానసికంగా ప్రేమ ఇస్తేనే ప్రేమ వొస్తుందనే అనుభూతి...
ఇవి మాత్రమే మనిషిని మనిషిగా కాపాడుతాయి.
మిగిలినవన్నీ యథాతథ వాదానికి (తమకు సుఖంగా ఉన్న ఇప్పటి స్థితిని కాపాడే వాదానికి) అనుగుణంగా కట్టిన వేదాలే.
ఆలోచనల్లో, అనుభూతులలో జరగాల్సిన ఈ సమరం ఇక ఊపు అందుకోవాలి.
ప్రతీప శక్తులు అంతిమ ఆయుధంగా మతాహంకారాన్ని, అది అక్కర్లేని (ఐరోపా) చోట్ల వర్ణాహంకారాన్ని బయటకు తీసి ప్రజలను విభజించి పాలిస్తున్నాయి, విభజించి పీడిస్తున్నాయి, విభజించి దోచుకుని శాకా, మాంసా... చెంచాల ప్రదర్శనలు చేస్తున్నాయి. కూడు, గడ్డ, గూడు, వైద్యం, చదువు వంటి మానవావసరాలకు భిన్నంగా, అతీతంగా ధర్మ-వైవిధ్య-రక్షణ వంటి హానికర సెంటిమెంట్లను అవి ప్రచారంలో పెడుతున్నాయి.
గండి కొడదాం ఈ (అ)క్రమానికి.
ప్రతిఘటిద్దాం ఈ దుర్మార్గాన్ని.
పబ్లిక్ న్యాయంలో వివక్షకు తావు లేని ఏకతను,
తిండి, బట్టి, కళల వంటి సాంస్కృతిక విషయాల్లో విశాలమైన అనేకత ( వైవిధ్యం)ను... నెలకొల్పుకుందాం.
అన్ని రకాల బ్రాహ్మణ వాదం... అనగా బౌద్దిక వాదం (ఇంటల్లెక్చువలిజం) నశించాలి.
పని చేసే వాళ్లకే బువ్వ మీద అధికారం అనే శ్రమైక ప్రేమ వాదం వర్థిల్లాలి.
ఇది కొత్త మతం కాదు. పక్కవాడి మిగులును పోగేసుకుని రాజులు, మంత్రులు, పూజారులు తయారవక ముందు చాల కాలం వర్ధిల్లిన బతుకు బాట. ప్రతి ఒక్కరి మాటకు విలువ ఉండిన బ్రతుకు బాట.
మెట్లు ఎక్కడంలో పడి ఆ బాటను పోగొట్టుకున్నాం. అన్ని మెట్ల పైన మళ్లీ అదే బాటను నెలకొల్పుదాం.
మరి, మీరేమంటారు?
ఆగస్టు 3, 2023

No comments:

Post a Comment

సాహిత్యం కళల్లో పాపులిజం మంచిదేనా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన : మీరేమంటారూ? 8

మీరేమంటారూ? 8 // సాహిత్యం కళల్లో పాపులిజంతో మేలా కీడా?: గదర్ మరణ వేళ ఒక ఆలోచన // మరణం వల్ల ఎవరూ అమరులు కారు! ఏమన్నా అయితే గియితే జీవితం వల్ల...