Sunday, July 29, 2018

27. నాకు నువ్వు నీకు నేను


పడిపోతానేమో అనిపించే
వొక అంచున నిలబడి
లోయ లోనికి చూస్తున్నాను
యిక్కడ లోయ లేదు
కపాల పేటిక అంచులలో
పడిపోయేంత వేగంగా తిరుగుతో
అన్నిటిలోకి చూస్తున్నాను
యిక్కడ యేమీ లేదు
రణగొణ చీకటి
ప్రతిదీ వ్యత్యయమై పోతున్న గోళం
పెదిమల మీద తారాడుతూ చనుబాలు
వూపిరాడనివ్వని మొదటి గాలి
వుమ్మనీటిలో నిద్రపోవాలని వుంది సురక్షితంగా
లేకుంటే కాసేపు యేదైనా వొక అమ్మ వొడిలో
అమ్మ అంటూ వేరే యెవరూ లేరు
నిజానికి ద్రవించిన వేళలలో
నాకు నువ్వూ నీకు నేనూ తప్ప
దుఃఖ దుఃఖాలమై గుక్కపట్టిన వేళలలో
నాకు నీ వొడి నీకు నా వొడి తప్ప.
3.32 AM 4-4-2018

26. వంతెన, అదేనో కాదో


మళ్లీ వంతెన మీదికి వచ్చాను
యిప్పుడు ఆమె లేదు
యెటు వేపు నుంచీ మువ్వలు మోగవు
లోయ అంతా వొక గోధుమ రంగు నిశ్శబ్దం
అయినా యెవరో యెవరి కోసమో యెదురు చూస్తున్నారని తెలుస్తోంది
ఆకులన్నీ వొప్పగించిన చెవుల్లా వున్నాయి
నేను యెటువైపో తెలియదు, యిక్కడ
యెటువైపు రాహిత్యమో యెటు వైపు సాహిత్యమో
వూహలు రాసుకున్న గాయం భుజం మీద వొహటే సలుపుతోంది
వూహించకుండా వుండలేను వూహల్ని యే చెవుల్లోకో విసరడానికి
వ్యూహించకుండానూ వుండలేదు
ఆమె వుంటే బాగుండు, ఆమె సత్యం కాదు
సత్యం వొద్దు ఆమె వుంటే బాగుండు
ఆమె కోసం బీచికెళ్లాల్సిన వొక సాయంత్రమైనా వుంటే బాగుండు
వొద్దు యే మతం యే మతం వొద్దనడమున్నూ వొద్దు
అసల్నువ్వు అరవొద్దలా, పేచీ వొద్దు, కింద పడి కొంచెం మట్టి గొట్టుకున్నా సరే
వొక చిన్న ముద్దు చాలు, అన్నీ ప్రోటకాల్ ప్రకారం చేసినోళ్లకు దొరికేది కాదు
అదెప్పటికీ దొరకదు నాకు, నేను తప్పు చేసినా దొరికే వొక ముద్దు చాలు
చీకటిగా వుంది గాని యిదేమంత రాత్రి కాదేమో
యేదో వొక కొండ మీద సూర్యుడు పునరుత్థానం చెందుతున్నాడేమో
ఆకాశమయితే కనిపిస్తోంది నా వేల కన్నులకు
తొందరపడొద్దు ఆకలేస్తున్నంత మాత్రాన బ్రేక్పాస్ట్ కు సమయం కాకపోవచ్చు
యెక్కడా వొకింత అలికిడి లేదు, ట్యూన్ చేయని ఆలాపన లేదు
వొకదాని మీదొకటి స్వారీ చేస్తూ అన్నీ నిర్మిత గీతాలు సూది మొనల రాగాలు
యెటు చూసినా పట్టాలు వొక్క రైలూ లేదు పొగ పొగ వుట్ఠి పొగ
చలికాలపు కళ్లలో మండుతున్న గర గరల పొగ భగ భగల పొగ
మరణిస్తున్నానేమో, లేకుంటే యెందుకలా నాన్న అంత నొప్పిగా చూస్తాడు నా వేపు
వుయ్యాల ఆపొద్దు,
అంతర్మధ్యంలో వుయ్యాల,
ఆగినా దిగడానికి యేమీ లేదు కాళ్ల కింద, వూగుతూనే వుండాలి,
ఆగితే యేమవుతుందో చెప్పడానికి యెవరూ లేరు, యింకొన్ని వూహలు తప్ప
యెంత వూదినా మండని వూహలు
25-3-2018

25. మహత్కవిప్రతి వొక్కడున్నూ పిచ్చివాడే
తన పిచ్చి పరా బ్రహ్మమని నటించేవాడే.
పిచ్చెక్కి తాండవించడంలో వున్న ఆనందం
అతి శాంతంగా కూర్చోడంలో లేదు.
ఆనందమేదీ బ్రహ్మ నిశ్చల జూకాల్లో వుండదు.
చెలరేగిన పరమేశుని జులపాల్లో వుంటుంది
వుత్తుంగ తరంగమయ్యే జీవితం లేదా యిష్టమైన మరణం.
యెప్పటికైనా ప్రతి వొకడున్నూ విస్మృతుడే, కనీసం
బాగా మందుకొట్టినప్పడు తనకు తాను వలె అస్మృతుడే.
కవుల్ని ప్రేమిస్తాన్నేను, నువ్వు కూడా ప్రేమిస్తావు కవుల్ని
మరణించకుండానే మరణించే వాళ్లు కవులు, సిగ్గు లేకుండా పునర్జీ
వించడానికి సాహసించే మొనగాళ్లు. నిజం కదా? యెవడిష్టపడతాడు
వొక సారి యెంచక్కా చచ్చిపోయి తిరిగి బతకడానికి, వొక్క కవి తప్ప?
కవిని మించిన సాహిసికుడు లేడు, కవిత కన్న దుస్సాహసం లేదు.
పేరేదయితేనేం... ఆంజనేయుడో మార్కండేయుడో, సత్యవంతుడో, క్రీస్తో.
పునర్జీవించిన వొక్కొక్కడూ వొక మహా కవి
నీలోనూ నాలోనూ నిరంతరం నివసిస్తుంటాడు.

23-3-2018

24. వెంటాడే పద్ధతిప్రయత్నించావా, పద్దతి వెంటపడుతుంది
దూకెయ్ నీళ్లు లేని సముద్రం లోనికి
దేవతలు పారేసిన తాడు పట్టుకోకు దా
మెడకు చుట్టుకుంటుంది, గాడిలో పడిపోతావ్
యెలాగూ దూకేశావు, బతికే వున్నావింకా
తవ్వు తవ్వు బాగా తవ్వు యెప్పటివో దిబ్బలు
వొక గొడ్డలి దొరకొచ్చు యినుపదో రాతిదో
నిన్ను నువ్వు దున్నుకోడానికొక నాగలి దొరకొచ్చు
సింధూ, గంగా మైదానాల్లో
యెక్కడెక్కడ కూలిపోయావో అక్కడ
మళ్లీ మళ్లీ మొదలెట్టొచ్చు
కళలు తిని కళలు విసర్జించే వాళ్లక్కూడా
పనికొచ్చే వొక పద్యం దొరకొచ్చు
పద
గెలిచిన యుద్దాన్ని జతగాళ్లకు వొదిలెయ్
వాళ్లు కావాలంటే
వొక యూజర్ మాన్యువల్ కూడా పడెయ్
నువ్ మళ్లీ అడవులు పట్టు, వర్జిన్ అడవులు
వొద్దు పద్దతి, ముఖ్యం తయారై వున్నది
యిప్పటికి బాత్రూంలో తట్టిన జవాబు చాలు
దిశమొలతో పరిగెత్తు
యీ నిజం నిజం కాదని అరుస్తో
11-3-2018