Thursday, January 11, 2018

దొండ పండ్లు


సామన్నను దేవి అంత తిరస్కారంగా యెందుకు చూసింది?
వాళ్లాయన్ని కాసేపు కట్టేసినందుకే అంత తిరస్కారమా? అతడు పేద వాళ్లకు చేసిన దానిలో సామన్న వాళ్లు చేసింది యేపాటి? ఆతడిని కొట్టడం, కాళ్లు విరగ్గొట్టడం యేమీ చేయలేదు కదా?   
భుజాన తుపాకితో, చిట్టడివి లాంటి చెట్ల మధ్య, చీకట్లో నడుస్తూ ఆలోచిస్తున్నాడు యెర్రమల దళ కమాండర్ సామన్న.
తన పక్కన భుజాలపై తుపాకులతో దళ సభ్యులు నడుస్తున్నారు. సామన్న తల లోని ప్రశ్నార్థకాలే అతడి చుట్టూ చేరి నడుస్తున్నట్లున్నారు వాళ్లు.
సామన్నకు దేవి యివాళ్టి పరిచయం కాదు. యిద్దరు పుట్టి పెరిగిందీ వొకే వూరిలో. అదొక పల్లెటూరు.
సామన్న యింటి వెనుకనే దేవి వాళ్ల కళ్లం. కళ్లం అంటే రైతులు నూర్పిళ్లకు, గడ్డి వామికి వుపయోగించే స్థలం.
సామన్న వాళ్ల యిల్లు పెద్ద యిల్లేం కాదు. వొకే వొక గది. పైన తాటాకుల కప్పు. నేల పేడతో అలికి వుంటుంది. బండ చట్టం వుండదు. సామన్న వాళ్లింటి వెనుక యిక యిళ్లుండవు. అన్నీ కళ్లాలు.
దేవి వాళ్ల కళ్లానికి మూడు వైపుల్లో తుమ్మ, రేగు, ఫారం కంపతో వేసిన ఫెన్సింగ్ వుంటుంది. వెనుక వైపు మాత్రం మనిషి యెత్తున పొడుగాటి గోడ వుంటుంది. గోడకు యివతల, పేటలో సామన్న వాళ్ల యిల్లు. అక్కడి నుంచి సామన్న దేవిని చాల సార్లు చూశాడు
ఆ రోజు దేవి వాళ్ల కళ్లంలో వామి వేస్తున్నారు. పశువుల రకరకాల మేతలను వరుస మీద వరుసగా పేర్చి వామి వేస్తారు. అదొక తలుపులు లేని పొడుగాటి యిల్లులా వుంటుంది. వామి వేయడం రైతుకు చిన్న పాటి యజ్ఞమే. రైతుకు పశువు, పశువుకు మేత ప్రాణ సమానం.
;రోజు, వామి వేసే పని కోసం దేవి వాళ్లు సామన్న అమ్మ, నాన్నల్ని కూలికి పిలుచుకున్నారు. అది యేటా ఆనవాయితీ. సామన్న వాళ్లది దేవి కుటుంబానికి  ‘విశ్వాసంగా వుండే కుటుంబం. అది రైతుకు, కూలీకి మధ్యన వుండే విశ్వాసం.  
వామి వేసే రోజు మధ్యాహ్నం దేవి వాళ్ల అమ్మ కడవలో అంబలి తెస్తుంది కళ్లానికి. అంబలి చాల బాగుంటుంది. చిక్కని మజ్జిగలో జొన్న సంకటి వేసి బాగా కలిపేస్తారు. అదే అంబలి. వామి వేయడానికి వచ్చిన వాళ్లు అందరూ అర్థచంద్రాకారంలో కూర్చుంటారు. దేవి వాళ్లమ్మ కడవ లోంచి వాళ్ల దోసిళ్ల లోకి అంబలి పోస్తుంది. వేళ్ల మధ్య ఆవకాయ బద్ద పెట్టుకుని నంజుకుంటూ, అందరూ కడుపు నిండా అంబలి తాగుతారు. అదే వాళ్ల మధ్యాహ్న భోజనం.
సామన్న బడి దగ్గర్నించి మధ్యాహ్నం బువ్వ కోసం నేరుగా దేవి వాళ్ల కళ్లానికి వెళ్లాడు. అప్పటికి సామన్న తొమ్మిదో తరగతిలోనో పదో తరగతిలోనో వున్నాడు.
ఆ రోజు దేవి కూడా వాళ్ల అమ్మతో పాటు కళ్లానికి వచ్చింది. కంప ఫెన్సింగ్ వద్ద నిలబడి దేన్నో చూస్తోంది. ఆకుపచ్చ లంగా, నీలం వోణీ, ఆకు పచ్చనిదే మామిడి పిందెల జాకెట్ తో, పసుప్పచ్చని చెంపల మీద జారుతున్న యెండతో... యెవరో అక్కడ నిలబెట్టిన బొమ్మ లాగుంది దేవి.  
తను యేం చూస్తోందా అని సామన్న కంప ఫెన్సింగ్ దగ్గరికి వెళ్లాడు. నలుపు, బూడిద రంగుల్లో తుమ్మ, ఫారంతుమ్మ కొమ్మలు. ఆ కొమ్మల మీద పొడుగాటి ముళ్లు
కంప ఫెన్సింగ్ లో ముళ్ల ముళ్ల కొమ్మల మధ్య ఆకుపచ్చని తీగెలు. తీగెల మీద అక్కడక్కడ యెర్రెర్రగా దొండపండ్లు. యెర్రగా పండిన దొండపండ్లు తియ్యగా చాల బాగుంటాయి. కంపలో చెయి పెట్టి దొండ పండ్లు తీ;సుకుని తినాలనిపిస్తుంది. చేతిలో ముళ్లు దిగుతాయనే భయం వుంటుంది. దొండపండ్లు సాధారణంగా అలా కంప మధ్యలోనే కనిపిస్తాయి, యెందుకో.
కంప ఫెన్సింగ్ లోంచి మెరుపు నవ్వులు రువ్వుతున్న దొండపండ్ల వైపు చూస్తోంది దేవి. కంపలో చెయి పెట్టే ధైర్యం చెయ్యలేకపోతోంది.
దొండపండ్లు బలె బాగుంటాయి, కదూ?అంది దేవి ఆశగా సామన్న వైపు చూసి.
దేవి పల్చని పెదిమలు దొండపండ్ల మాదిరి యెర్రగా వున్నాయని అనిపించింది సామన్నకు.
దేవికి అప్పుడు పద్ధానుగు పదిహేనేళ్లుంటాయి. సామన్న వయసూ అంతే. కాని, తను మొగ పిల్లోడు కదా. నువ్వుండు దేవమ్మా! నేను తీసిస్తా అని కంపలో చెయి పెట్టాడు. వేలి మీద రెండు ముళ్లు కస్సుమని దిగాయి. అయినా వూరుకోలేదు. నాలుగైదు దొండపండ్లు తీసి దేవికి యిచ్చాడు. యెడం చేత్తో తానూ వొక పండు నోట్లో పెట్టుకుని మధ్యకు కొరికాడు. ఆ తరువాతే, ముల్లు దిగిన వేలును నొప్పి కలక్కుండా నోట్లో పెట్టుకున్నాడు.
సామన్న దేవిని దేవిగా, దగ్గరగా చూసింది మొదటి సారి అప్పుడే. అలా దేవి సామన్నను చూసింది కూడా అప్పుడే. ఆ తరువాత బళ్లోనో, బజారులోనో కొంచెం చూసుకోడమే. దేవి వాళ్లు పెద్దోళ్లు. పెద్ద కులమోళ్లు. వూళ్లో ఆ భేదం బాగా వుండేది. యిప్పటికీ వుంది.
మరొక రోజు, బహుశా, సామన్న కాలేజీలో చేరాక, సెలవుల్లో యింటి వద్ద, యేమీ తోచడం లేదు. సావాసగాళ్లు యెవరూ లేరు. సామన్న వొక్కడే గూట్లోంచి చిన్నప్పటి తన సిర్రా కట్టె తీసి యింటి వెనక ఆడుకుంటున్నాఢు. సిర్రా కట్టె ఆటలో సిర్ర అంటే జానెడు కర్ర ముక్క. దాన్ని వొక సారి వొంటి పాదం మీద, వొక సారి రెండు వేళ్ల మీద, యింకో సారి మడిచిన మోచేతి మీద, మరో సారి తల వెనక్కి వంచి కంటి మీద పెట్టుకుని....  అక్కడి నుంచి గాల్లోకి యెగరేసి మూరెడు పొడుగు కట్టెతో  ఫట్ మని కొట్టాలి. కట్టెతో సిర్రను యెంత దూరం కొడితే ఆటలో అంత గొప్ప.
ఆ వేళ సామన్నసిర్రను కంటి మీద పెట్టుకుని కండ్లు పోతే పిల్లనియ్యరూ, కండ్లు పోతే పిల్లనియ్యరూ అని తనకు తనే సర్దాగా పాడుకుంటూ సిర్రను యెగరేసి కట్టెతో కొట్టాడు. దెబ్బ సూటిగా, గట్టిగా తగిలినట్లుంది. సిర్ర రయ్ రయ్ మని యెగరి వెళ్లి దేవి వాళ్ల కళ్లంలో పడింది.
సామన్న గోడ దూకి కళ్లంలోకి వెళ్లాడు. కళ్లంలో గోడకూ వామికీ మధ్యన కాస్త నీడ వుంది. నీడలో పచ్చగడ్డి మధ్య దేవి వొక యిచ్చెమల్లె పూల చెట్టు నాటుకుంది. యిచ్చెమల్లె చెట్టుకు నీళ్లు పోయడానికి యింటి దగ్గర్నించి స్టీలు చెంబుతో నీళ్లు తెచ్చుకుంది. సామన్న యిటు నుంచి గోడ దూకే సరికి దేవి వులిక్కి పడింది. తెలిసిన మనిషేనని గుర్తించి నవ్వేసింది. బలె బయపెట్టినావుఅంటూ గుండెల మీద పైట సర్దుకుంది.
 “సిర్రా కట్టె ఆడుకుంటుంటే సిర్ర మీ కల్లం లో పడింది. దాని కోసమని... ....అని నసిగాడు సామన్న.
యీడ యిచ్చెమల్లె సెట్టు యెప్పుడు నాటినారు. నేను సూడనే ల్యా ...అన్నాడు సామన్నే మళ్లీ.
అవ్, నేనే మొన్న తోట కాన్నుంచి పీక్కొచ్చి యీడ నాటిన అంది దేవి.
యిచ్చెమల్లె పూలు భలే బాగుంటాయి. మల్లె పూల మాదిరిగా తెల్లగా, కాంతిగా, పిల్లలు వూదే బూరాల్లా వుంటాయి. ఆడపిల్లలు వాటి పొడుగాటి కాడలను కలుపుతూ పూల దండలు అల్లుతారు. దారం గీరం అక్కర్లేదిక. పూలు పెద్దగా సువాసన వుండవు. ముట్టుకుంటే వేలి దగ్గర్నించి నేరుగా మనస్సును తాకుతున్నట్లు మెత్తగా వుంటాయి.
దీన్లకు దినాం నీళ్లు పొయ్యాల. ల్యాకుంటే వూకూకెనే యెండిపోతాయిఅంది ఆ పువ్వుల్లాగే విచ్చిన మొహంతో దేవి.
నీళ్లు పోశాక, స్టీలు చెంబు గడ్డిలో పడేసి, పువ్వులు తెంచుకోడానికి చెట్టు మీదికి వంగింది దేవి.
అప్పటి వరకు సామన్న దేవిని మరీ అంత దగ్గరగా చూడలేదేమో, కళ్లు తిప్పుకోలేకపోయాడు.
కళ్లం గోడ సామన్న యింటి వెనుక వైపు వున్నా, దేవి వాళ్ల యిల్లు మాత్రం వూరి పెద్ద బజారులోకి వుంటుంది. యింటి ముందు యినుప కడ్డీల కటాంజనం... చిన్నపాటి కోటలా వుంటుంది దేవి వాళ్ల యిల్లు. పెద్ద బజారులోకి వెళ్లి నప్పుడు అటువైపు వోరగా చూసే వాడు సామన్న. దేవిని దగ్గరగా చూసింది మాత్రం వామి వేసిన రోజే. కంప ఫెన్సింగ్ వద్ద దొండపండ్లతో దేవి పెదిమలు పోటీ పడినప్పుడే. వాటి కోసం తన చెయ్యి మీద యెర్రగా నెత్తురు వుబికినప్పుడే.
ఆ యాల నా కోసమే గదా, నీ వేలికి ముల్లు గుచ్చుకునింది... ?అని దేవి నవ్వింది.
గుళ్లోని దేవత వొక చిన్న పిల్లగా మారి తన కోసం వచ్చినట్టనిపించింది సామన్నకు.
అమ్మో, యిదేం ఆలోచన, పెద్దోళ్లు తోలు తీస్తారు అని కొంచెం భయం కూడా వేసింది. అక్కడి నుంచి వెళ్లడం మాత్రం సాధ్యం కాలేదు.
దేవికి సాయం చేస్తున్నట్లు తాను కూడా వంగి కొన్ని యిచ్చె మల్లె పూలు తుంచి ఆమె చేతిలో పోశాడు సామన్న. అప్పుడు తన చేతికి దేవి చెయ్యి తగిలి వొళ్లు జలదరించింది.
దేవి తన చెయ్యి యింకొంచెం పైకి సాచి అలాగే వుంచినట్లు సామన్నకు అనిపించింది.    
వాళ్ల మధ్య మరి కొన్ని మాటలు జరిగాయి. మనసులు మరింత దగ్గరగా జరిగాయి. పర్యవసానాలు స్ఫురించే స్పృహను కోల్పోయారు. వాళ్ల సమాగమాన్ని యిచ్చె మల్లె చెట్టు తన పూలన్నిటితో దీవించింది.
త్వరలోనే యిద్దరు చదువుల కోసం పట్నం వెళ్లిపోయారు. దేవి వాళ్లది పట్నంలో కాస్త ఖరీదైన కాలేజీ. సామన్నేమో పేటలో చాల మందిలానే పేద పిల్లల హాస్టల్లో చేరాడు..
తాము మరి మరి కలుసుకోడం కుదరదని అర్థమయిపోయింది. యెలాగో వీలు చూసుకుని వామికి గోడకు మధ్య చల్లని నీడలో సేదదీరే వారు. అదీ కొన్నాళ్లే.
సామన్న చదువుకు తగిన వుద్యోగంలో చేరి వుంటే యేమయ్యేదో యేమో? బహుశా, వాళ్లిద్దరికి సంబంధించి యేమీ అయ్యేది కాదు. సామన్న వుద్యోగం సంపాదించినా ఆ వూరి కట్టడి వాళ్లను వొకటి కానిచ్చేది కాదు.
సామన్న పేద పిల్లల హాస్టల్లో వుండగా నక్సలైట్ విద్యార్థులతో కలిగిన పరిచయం అతడి జీవితాన్ని మరెటో తీసుకుపోయింది.
తను తీవ్రవాదం వైపు మొగ్గడానికి పేదరికం వొక్కటే కారణం కాదని సామన్నకు తెలుసు. పేద ధనిక వ్యత్యాసాలపై వ్యతిరేకత వొక కారణమే గాని, అసలు కారణం అది కాదు.
దేవి...
అసలు కారణం దేవి.
దేవి తనది. కాని, తనది కాదు.
డిగ్రీ తరువాత దేవికి పెళ్లి చేసేశారు. ఆమె వూరి నుంచి వెళ్లిపోయింది.
సామన్న, దేవి... తాము ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటామని వూళ్లో చెప్పడం జరిగే పని కాదు. చెబితే పెద్ద కులమోళ్లు సామన్నను చంపేస్తారు. అంత క్రూరం కుల వ్యవస్థ.
వామి పక్కన యిచ్చెమల్లె చెట్టు వద్ద కలుసుకున్నట్లుగా భయం భయంగా దొంగచాటుగా కలుసుకోవలసిందే. అదీ దొంగతనం సాగినంతవరకే. బయట పడితే యేమవుతుందో ననే భయం యెలాగూ వుంటుంది.
సామన్న ఆడపిల్లయి, దేవి మగపిల్లవాడు అయ్యుంటే అది వేరు. ధనిక మగపిల్లవాడు పేద ఆడపిల్లను వుంచుకునేవాడేమో. వూళ్లలో అలాంటి వుదాహరణలు బాగానే వుంటాయి. సామన్న, దేవి కోరుకునే వుదాహరణలు మాత్రం వుండవు.
దేవిని తనకు కాకుండా చేసిన లోకం మీద కసి సామన్నకు. సమాజంతో అమీ తుమీ తేల్చుకుందామనే నక్సలైటు భావాలు... అచ్చం తన రక్తం లోంచి పుట్టినవే అనిపిందింది అతడికి.
డిగ్రీ చివరి పరీక్షలు కూడా రాశాక, సామన్న నక్సలైట్ దళాళ్లోకి వెళ్లిపోయాడు. తన అంకిత భావం, ధైర్యం, తెలివి తేటలు అన్నీ కలిసి తొందర్లోనే దళ కమాండరు కూడా అయ్యాడు. ఆ వుత్సాహాలలో, ప్రమాదకర పనుల హడావిడిలో కూడా సామన్న దేవిని మరిచిపోలేదు. దేవిని చూడాలనే కోరిక అతడిని దహించేది.    
సామన్న నాయకత్వంలోని యెర్రమల దళం ఆ ప్రాంతంలో బాగా పేరుకెక్కింది. దళం పేరు చెబితే  భూస్వాములు వణికిపోయే వారు. కొత్త గ్రామంలో కాంటాక్టు దొరకగానే, దాన్ని స్థిరపరుచుకోడానికి యేదైనా వొక దళ చర్య చేసే వారు. చర్యలలో భూస్వాముల దుర్మార్గాలను బట్టి శిక్షలుండేవి. కాళ్లు విరగ్గొట్టడం నుంచి, హతమార్చడం వరకు... ప్రజలు యేమి కోరుకుంటారని తాము అనుకుంటారో ఆ శిక్ష విధించే వారు. దాని వల్ల తమకు ప్రమాదం మరింత పెరిగినా వూరి మీద పట్టు దొరికేది.
ఆ రోజు సామన్న దళం కెవులూరు అనే పెద్ద గ్రామంలో దళ చర్యను ప్లాన్ చేసింది.
కెవులూరు గ్రామంలో సుబ్బరంగయ్య వొక భూస్వామి. వూరంతటికీ అతడే పెద్ద భూస్వామి కాడు గాని, అవుతున్నాడు. వూరంతటి మీద పెత్తందారుగా మారుతున్నాడు. దానికి అతడు యెన్నుకున్నవి చాల సూటి మార్గాలు. క్రూరత్వం, జబర్దస్తీ.
సుబ్బరంగయ్య పేద వాళ్ల మీద తూష్ణీభావాన్ని బయటికి కనిపించనివ్వడు. ధర్మం కావాల, ధర్మం అంటూ వుంటాడు. కాస్త భూములున్న పేద వాళ్లకు... చిన్నా పెద్ద అవసరాలకు... అడిగీ అడగక ముందే అప్పులిస్తాడు. ఖాళీ ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు, వేలి ముద్రలు వేయించుకుంటాడు. వాళ్లకున్న ఆ కాస్త పొలం తన పరం చేసుకుంటాడు.
పేదలు అప్పులు కట్టలేకపోతే, భూములు రాసివ్వపోతే కోర్టుకు వెళ్లడం అంటూ యేమీ వుండదు. వాళ్లను యింటికి పిలిపించి, కట్టేసి చావబాదడమే.
ఆ రోజు సామన్న దళం కెవులూరును యెన్నుకుంది. అందులో మొదటి దాడి సుబ్బరంగయ్య యింటి మీదనే చేద్దామనుకున్నారు. కెవులూరు చుట్టూ చిట్టడివిలా చెట్లు వుంటాయి. అందువల్ల, వూరి చుట్టూ సెంట్రీలను యేర్పాటు చేసుకోడం సులభమైంది.
సామన్న దళంలో కొద్ది మందిని తీసుకుని నేరుగా సుబ్బరంగయ్య యింటికి వెళ్లాడు.
చలి కాలం. యెవరూ యిళ్ల ముందు లేరు. అందరూ యిళ్ల లోపల మంచాలేసుకుని పడుకున్నారు. యెర్రమల దళం వాళ్లు సుబ్బరంగయ్య యింటి తలుపులు తట్టారు. లోపలికి వెళ్లగానే తుపాకులు చూపించి సుబ్బరంగయ్యను మధ్య యింట్లో స్తంభానికి చేతులు వెనక్కి విరిచి కట్టేశారు.
బలహీనుల మీద ధాష్టీకం చేసే వాళ్లందరూ మానసిక బలహీనులే. పిరికి పందలే. వాళ్లకు ప్రాణమంటే బహు తీపి. సుబ్బరంగయ్య యువకుడే అయినా, వణికిపోయాడు. కిక్కురు మనకుండా దళం చెప్పిన మాట విన్నాడు. లోపలి అరుగు మీద వున్న యినప్పెట్టెకు తాళాలు యిచ్చేశాడు. దళం వాళ్లు అందులో వున్న మేరకు డబ్బు తీసుకుని, రసీదు వంటిది రాసి సుబ్బరంగయ్య జేబులో పెట్టారు.
యినప్పెట్టె నిండా వున్న ప్రామిసరీ నోట్లను తెచ్చి మధ్య యింట్లో కుప్ప పోసి, తగలబెట్టారు. అవి సరిగ్గా కాలడానికి యెండు చొప్ప కూడా జత చేశారు. అవన్నీ తగలబడుతూ క్యాంప్ పైర్ ని తలపించాయి.
అప్పుడు చూశాడు సామన్న దేవిని. ప్రామిసరీ నోట్ల మంటల వెలుగులో ఆమె స్తంభం చాటు నుంచి కాస్త ముందుకు వచ్చి నుంచుంది.
అయితే, దేవిని కెవులూరులో సుబ్బరంగయ్యకు యిచ్చి చేశారా? యింతా చేసి, ఆమె యిక్కడుందా?
దేవి కూడా సామన్నను గుర్తించింది. గుర్తించి చెట్టు మాదిరి నిలబడిపోయింది.
ప్రామిసరీ నోట్ల కాగితాలు, యెండు చొప్ప కలిసి తగలబడుతున్న మంటల వెలుగులో చూశాడు సామన్న. ఆమె మొహంలో కాస్త భయం వుంది. కోపం లేదు. సామన్నను చూసిన సంభ్రమాశ్చర్యమేదో వుంది. నువ్వు యిలాంటి పని చేస్తావా అనే వ్యతిరేక భావన సామన్నకు కనిపించ లేదు.
నోరు పెగిల్చి అడగలేదు గాని, దేవీ! నువ్వా... నేను సామన్నను... నన్ను గుర్తుపట్టినావా అని అడగాలనిపించింది.
యినప్పెట్టె లోంచి డబ్బు తీసుకోడం, ప్రామిసరీ నోట్లు తగలబెట్టడం అయ్యాక యిక సుబ్బరంగయ్యను యేం చేద్దాం అనే ప్రశ్న కనిపించింది దళ సభ్యుల కళ్లలో. ఆ ప్రశ్న సామన్న తలలోనూ తిరిగింది.
పేదోళ్లకు యిచ్చిన అప్పులన్నీ మాఫీ చేయాలి. రెండు మూడు రోజుల్లో వూరిలో రైతుకూలి సంఘమోళ్లు నిన్ను పంచాయతీకి పిలుస్తారు. నువ్వు అక్కడికి వెళ్లాలి. యిప్పటి వరకు నువ్వు ఆక్రమించుకున్న భూములు వాళ్లకు యివ్వాలి. సంఘానికి వ్యతిరేకంగా పని చేస్తే బతకనియ్యం యిలా కొన్ని మాటలు చెప్పి, అన్నిటికీ సుబ్బరంగయ్యతో సరేనని అనిపించుకుని దళ సభ్యులను వెంట దీసుకుని వూరి బయటికి నడిచాడు సామన్న.
సామన్న వెళ్లిపోతుంటే దేవి మొహంలో సంభ్రమాశ్చర్యం పోయి, కోపం, తూష్ణీభావం వచ్చేశాయి.
సుబ్బరంగయ్య వూళ్లో పేదలకు మాత్రమే కాదు. యింట్లో ఆడవాళ్లకు కూడా దుర్మార్గుడే.
దేవికి వొక పేద యువకుడి మీద ప్రేమ వుందని తెలిసిన తరువాత, దేవి వాళ్ల నాన్న ఆమెను వూరికి దూరంగా సుబ్బరంగయ్యకు యిచ్చి పెళ్లి చేశాడు. సుబ్బరంగయ్య స్వతహాగానే.... ఆడది అంటే చెప్పు కింది పురుగులా పడి వుండాలనుకునే హీనుడు. దేవి బతుకు పూర్తిగా చెప్పు కింది పురుగు బతుకే అయుపోయింది.
సామన్న గురించి, అతడి నక్సలైటు కార్యకలాపాల గురించి విన్నప్పుడంతా దేవి అతడి గురించి మధురోహలకు లోనవుతూ వుండేది. సామన్న తన కోసం వస్తాడని, తనను ఆ కాపురం అనే నరకం నుంచి తీసుకుపోతాడని కలలు కంటూ వుండేది, అవి కలలే అని తెలిసి కూడా.
అలాంటిది, సామన్న స్వయంగా తన యింటికి వచ్చాడు. తనను హీన పరిచే మొగుడిని యేమీ చేయకుండా, తను యెలా వుందో కూడా అడగకుండా వెళ్లిపోతున్నాడని ఆమె కడుపు రగిలిపోయింది. ఆ రగిలే మంటలలోంచే చివరి సారి సామన్న వైపు బాధగా, కోపంగా, తిరస్కారంగా చూసింది దేవి
కోప కారణం సామన్నకు యెప్పటికీ తెలియదు.
కారణం తెలిసే అవకాశం యెప్పటికీ లేదనే నొప్పిని మోస్తూ సామన్న కెవులూరు చిట్టడివి లోంచి మరింత పెద్ద అడివి లోనికి నడిచాడు తన దళ సభ్యులతో పాటు.
-        హెచ్చార్కె
hrkkodidela@gmail.com
609 647 2863 (యు ఎస్ ఎ). 
Published in Andhera Jyothi Dated Sunday, 24th Sptember 2016No comments:

Post a Comment