Thursday, January 11, 2018

కాలానికి రెండు ముఖాలు… రెండూ అందమైనవే! (హెచ్చార్కె సమయం 3)

పంజర నిబద్ధ కీరంబు బయలు గాంచి
యడ్డు కమ్ముల దాటంగ నాస చేయు
నటు బహిర్ణియమంబుల నతకరించి
మన్మనంబు స్వాతంత్ర్య సీమకు జరించు

కాన యెవరేమి యనుకొన్న దాన నేమి
గలుగు; గాలమనంతము, యిల విశాల;
భావ లోకము క్రమముగా బడయు మార్పు
యేల హృదయము వెలిపుచ్చనింత యళుకు

తన కవిత ఆగమ పుంజములకు చేరిన గతానుగతికము కాదు. స్వాతంత్ర్య సీమను జరించునది. ఏమీ పూర్వీకుల విధులను అతిక్రమించవచ్చునా? వారేర్పచిన విధివిధానములు గాక అన్యములెక్కడైన నున్నవా? అని మూఢ భక్తులెవరైన ఆక్షేపించిన యెడల కాలమనంతము ఇల విశాల; భావలోకము క్రమముగా బడయు మార్పు అని కవి వారిని తిరస్కరించి తన దారిని తానేగెడిని.
ఆ పద్యాలు దువ్వూరి రామిరెడ్డివి. (కృషీవలుడు). తరువాత, వివరణ కట్టమంచి రామలింగా రెడ్డిది.
కాలమనంతము ఇల విశాల అనే మాట చాల గొప్పది. నా మట్టుకు నాకు అది జీవితమంత గొప్పది. ఆ మాటను యెన్ని సార్లు, యెన్ని సందర్భాలలో కోట్ చేసివుంటానో. నాలో నేను యెన్ని సార్లు ఆ మాట చెప్పుకుని వూరట పొంది వుంటానో చెప్పలేను. అంతిష్టం ఆ మాట అంటే.
దువ్వూరి రామి రెడ్డి ఆ మాట సరిగ్గా యెందుకన్నాడో తెలియడానికని కట్టమంచి వివరణ వాక్యాలు చేర్చాను. కవితా రచనలో పూర్వులు పెట్టిన నియమాల్ని విదిల్చుకుని ముందడుగు వేయడానికి కవి తనకు తాను చెప్పుకున్న వాక్యమది. కట్టమంచి మాటల్లో చెప్పాలంటే ఆ కాపు యువకుడు’, రామిరెడ్డి... రైతు జీవితం అనే కొత్త యితివృత్తంతో కావ్య రచనా సాహసం చేయడానికి యీ మాత్రం భరోసా తప్పనిసరి అయి వుంటుంది.   
నేను కూడా దాదాపు అందుకే ఆ మాటను యెన్నో సార్లు గుర్తు చేసుకున్నాను, సంప్రదాయాన్ని ధిక్కరించి మాట్లాడ్డానికి, వుద్యమాలలో పొలిటికల్ గా యిన్కరెక్ట్ మాట చెప్పాల్సి వచ్చినప్పుడు... యెన్నో సార్లు మననం చేసుకున్నాను. ధైర్యం తెచ్చుకున్నాను. ఔరా, కవీ భలే చెప్పావని అనుకున్నాను.... ఆ వొక్క వాక్యం తప్ప పూర్తి పద్యం నాకు తెలియక ముందు కూడా.
అది కవితా రచనే కానక్కర్లేదు. యే పని అయినా అంతే. పూర్వుల అభిప్రాయాలను... సమకాలికుల అభిప్రాయాలను కూడా... కాదని మనం మనంగా నిలబడాల్సిన సందర్భాలు కొల్లలుగా ముందుకు వస్తాయి. చేసే పని సరైనదని మనం మనసారా అనుకుంటున్నట్లయితే... యిక ఆ పని చేయడమే మంచిది. సరైనదని మనం అనుకున్న మాట చెప్పడమే మంచిది,
వొకటి కాదు. అలాంటి సందర్భాలు యెన్ని సార్లు వచ్చినా... కాస్త ఆలోచించి, లౌక్యపు జాగర్తలు తీసుకుని మన పని మనం చేయాలి. ఆ విధంగా మాత్రమే మనం మనంగా వుంటాం. మన బతుకు మనం బతుకుతాం. లేకుంటే జీవితాంతం మన బతుకును యింకెవరో బతుకుతారు. మన బతుకు మనం బతకడం వుండదు.  
లోక రీతుల వల్ల చాల నొప్పి కలిగినప్పుడు, యెవరో క్రూరంగా కెలికినప్పుడు, యేదో వైఫల్యం నిట్ట నిలువునా చీరినప్పుడు.... ధూర్త లోకానికి సెలవంటూ వెళిపోకుండా నిలదొక్కుకోడానికి వూతమిచ్చే వాక్యమిది. యింతటితో అయిపోలేదు, యివాల్టితో అయిపోలేదు. యింకా చాల వుంది, చాల కాలం వుంది. వున్నది అనంతం, యీ క్షణాన్ని చూసుకుని అంగలార్చడం అనవసరం అని తెలుసుకోడం గొప్ప వూరట.
యిది కాలానికి వున్న వొక ముఖం. కాలానికి మరో ముఖం కూడా వుంది. మొదటి ముఖం తెంపు లేని అనంతం. రెండవది తెంపు తెంపులుగా సాగే ముఖం..
కాలం యెంత అపరిమితమో అంత పరిమితం. యెందుకంటే నీ కాలం నువ్వు అనే స్థలంలోనే వుంటుంది. నువ్వు శాశ్వతం కాదు. చిన్నదో పెద్దదో వొక జీవిత కాలమే నువ్వు. నువ్వు లేకుంటే నీ కాలం లేదు. (ఆయన కాలమైపోయాడు అనే పల్లెటూరి పలుకు బడి విన్నారా?! ఆయన అంటే ఆయన కాలమే)
అంతేనా?
నా జీవిత కాలమంతానయినా నేను వున్నానా? నేను... యీ నేను... వున్నానా? లేను. వొక్కోసారి వొక్కో నేను మాత్రమే వున్నాను.
వొక నేను యింటి నుంచి పది కిలో మీటర్ల దూరం వున్న మరో వూరిలోని హైస్కూలు నుంచి సొంతూరికి వస్తూ.... మర్రిపాడు చేన్లు అనే యిసుక నేలల వద్ద పెద్ద వానొస్తే... వాన గాలికి రేగిన యిసుక విసురుగా కళ్లల్లో కొడితే...  చేత్తో తుడుచుకుంటూ, అమ్మ కావాలఅనే అక్రోశం కన్నీరై వాన నీళ్లలో కలిసిపోతే.... చీకటి పడే కొద్దీ... యిక యింటికి వెళ్తానో లేదో అని భయపడిన ఆ పది పన్నెండేళ్ల నేను కాదు యీ నేను.
వ్రాత యింగ్లీషే సరిగ్గా రాక, చుట్టూరా యింగ్లీషు మాటలు దంచి కొట్టే కుర్రాళ్ల మధ్య, వొక్క సారిగా మీద పడిన యింగ్లీషు మీడియం పుస్తకాల మధ్య సొంతూరికి బహుదూరంగా విజయవాడలో, లొయోలా కాలేజీలో టెక్స్టు బుక్కు మీద రాలిన నా కన్నీటి మరకలకు నేనే జాలి జాలిగా కరిగిన పదిహేడేళ్ల నేను కూడా కాదు యీ నేను. యిది మరో నేను. యిది మరో దుఃఖం లేదా మరో సుఖం,
గతాన్ని నెవరేసుకుంటూ... నీ పాత నేనులను గుర్తు చేసుకుంటూ, ఆ ప్రాతిపదికన ఆలోచనల్ని చిక్కుముడులు వేసుకుంటూ వుండిపోకు. ఆ నేనునీ నేను కాదు. యిప్పుడు యేది వున్నదో అదే నీది, అదే నువ్వు. పాతది నువ్వు కాదు.
పాతది అనే కాదు. రేపటిది కూడా నువ్వు కాదు. రేపు యేమవుతుందో, నా దగ్గరున్న లక్ష రూపాయలు కోటి రూపాయలుగా, వాటి పాయలుగా మారుతాయో లేదో, నా పిల్లలు డాక్టర్లు యెంజినీర్లు అవుతారో లేదో అని కూడా దిగులు పడకు. అది నీ ధ్యేయమైతే దాని కోసం యివాళేం చేయాలో అది చెయ్యి.
మళ్లీ దువ్వూరి పద్యమే. కాకపోతే యిది ఆయన చేసిన గొప్ప అనువాదం. అసలు కవి వుమర్ ఖయ్యాం.

గతము గతంబె, యెన్నటికి కన్నులఁ గట్టదు; సంశయాంధ సం
వృతము భవిష్యదర్థము; వివేకవతీ, యొక వర్తమానమే
సతత మవశ్య భోగ్యమగు సంపద; రమ్ము విషాద పాత్రకీ
మతమునఁ దావులేదు; క్షణమాత్ర వహింపుము పానపాత్రిక/న్  (పాన శాల)
తాగుబోతు మాట కాదిది, ప్రాక్టికల్ సత్యం.
గతము అనే మాటకు వెళ్లిపోయినది అని అర్థము. యిక రాదని అర్థం. అప్పుడు అలా కాకుండా యిలా  చేయాల్సింది అని దిగులు పడుతూ కూర్చోడం వల్ల యేమీ వొరగదు. యెందుకంటే నువ్వలా చేయలేవు. చెయ్యడానికి గతంలోనికి వెళ్లలేవు.  
యిక, భవిష్యత్తు... రేపు... వుందో లేదో యెప్పుడూ సందేహాస్పదమే. (యే నిమిషానికి యేమి జరుగునో యెవ రూహించెదరు?) రేపు యెలా వుంటుందో పూర్తి సమాచారం నీ దగ్గర వుండదెప్పుడూ, నువ్వు సమాచారం సేకరించాక, కొత్త సమాచారం చేరుతుంది. పాతది కొంత యిర్రిలవెంట్ అవుతుంది. వూహించిన వూహలు తలకిందులవుతాయి. సో, బ్రిడ్జి వచ్చినప్పుడే బ్రిడ్జి దాటాలి. మెట్టు రాకముందే అది వొచ్చినట్లు కాలు యెత్తి వేస్తే బొక్కబోర్లా పడతావు.
నీ చేతిలో వున్నది యిప్పుడు యిక్కడ అనేది మాత్రమే. దీన్ని గాఢంగా జీవించు. యిప్పుడు చేయాల్సిందేమిటో అది... శ్రమించి, మనసుంచి, ప్రేమించి, యిష్టించి చెయ్యి.
నువ్వు యీ రోజు చేసే పనిలో నిన్న జీవించిన జ్ఞానం వుంటుంది. గతం గురించి నువ్వు దిగులు పడినా, పడకపోయినా అది జ్ఞానమై నీతో వుంటుంది. నీకు యిప్పుడు దొరికిన జీవితం గతం యిచ్చినదే. వెనక్కి వెళ్లి గతాన్ని మార్చలేవు. గతం గారూ, యిది కాదు యింకో జీవితాన్ని యివ్వండి అని అడగలేవు. నీ చేతుల్లో వున్న వర్తమానంతోనే పని చేయగలవు. పని చేయడం ద్వారానే మార్చగలవు. యీ రోజు నువ్వు సక్రమంగా పని చేస్తే అదే రేపటి నీ వర్తమానం.
యిప్పుడు పుస్తకం తీసి చదువు. యీ చదువు రేపటి పరీక్షలో నిన్నాదుకుంటుంది. రేపటి పరీక్ష గురించి భయపడతావే అది యిప్పుడు నిన్ను మనసారా చదవనివ్వదు. రేపటి పరీక్షలో నిన్నాదుకోనూ ఆదుకోదు.
యిప్పుడు నీ ముందున్న రాజకీయార్థిక సవాళ్లను వున్నవి వున్నట్టుగా అర్థం చేసుకో. పశ్చాత్తాపాల దిగులు, అత్యాశల ఆరాటం అవగాహనని కలుషితం చేస్తాయి.. వున్న దాన్ని అర్థం చేసుకోడానికి గతం సమాచారం పనికొస్తుంది. అర్థం చేసుకున్న దాన్ని మార్చడానికి నువ్వు చేసే ప్రయత్నమే యిప్పడు నీ పని.
దీన్నే డే టైట్ కంపార్ట్మెంట్స్ లో బతకడమని అంటాడు డేల్ కార్నీ (How to stop worrying and Start Living’ - Dale Carnegie)
కంపార్ట్మెంట్ అంటే రైలు బోగీ. యే బోగీకి ఆ బోగీగా వుండే రైలు వంటిది జీవితం. నువ్వు ప్రతి సారీ వొక బోగీలో మాత్రమే వుండగలుగుతావు. వొకే సారి వొకటికి మించిన బోగీలలో వుండడం నీకు కుదరదు. నువ్వు వొక్క రోజులోనే జీవించగలవు. రేపటిలో జీవించలేవు. నిన్నటిలో జీవించలేవు. వున్న వొక్క రోజులోనే జీవించగలవు.
యీ వొక్క రోజును యిష్టంగా జీవించు, గాఢంగా జీవించు.  యిదే యిప్పటి, రేపటి నిన్ను ఆదుకుంటుంది.
నిన్న కాదు, రేపు కాదు, నిన్నాదుకునేది యీ రోజే.
 *

Adugu.in December 2017 No comments:

Post a Comment