Thursday, January 11, 2018

20. వెలుగు

రాత్రి కళపెళ మరుగుతోంది
చీకటి కుండలో యేదో వుడుకుతోంది
ఆకాశం లోంచి నక్షత్రాలు నిప్పుల కళ్లై చూస్తున్నాయి
జరగకూడనిదేదో జరుగుతోందని నీలో నువ్వు గొణుగుతావు
జరుగుతున్న ప్రతిదీ జరగవలసి వున్నదే
ప్రతి ఘటనా నిన్న నువ్వేసిన విత్తనానికి మొలిచిన మొలక
యూనివర్సిటీలలో వాళ్లు పుస్తకాల్ని చదవడమే కాదు, తగలేస్తారు కూడా
అక్షరమైనదంతా శాశ్వతం కాదు, మంత్రం అయినదంతా శాసించనూ లేదు
మనుషుల్ని హింసించే చట్టాల్ని మనుషులు కాక యింకెవరు తగలేస్తారు?
వడ్డీ వ్యాపారి బీరువాలోని ప్రామిసరీ నోట్లూ అక్షరాలే, వేలి ముద్రలతో
పద్దులు రాసి వున్నవీ పుస్తకాలే, వాటిని తగలేసే యోధులకు సలామ్
పుస్తక దహనం కొన్ని సార్లు తప్పక జరగాల్సిన పని
భయపడకు
యిదంతా చీకటి తగలబడుతున్న వెలుగు
26-12-2017

No comments:

Post a Comment