Thursday, January 11, 2018

మిరకిల్స్ జరుగుతాయి! (హెచ్చార్కె సమయం 2)

దిగులు పడుతుంటాం. వొకటా రెండా యెన్నో సమస్యలు. దేన్ని ముట్టుకున్నా పరిష్కారం కాకుండా సమస్యే తగులుతుంది. యెవర్ని గుర్తు చేసుకున్నా... వాళ్లు నిన్ను అన్న మాటలో, వాళ్లను నువ్వు అన్న మాటలో గుచ్చుకుంటాయి. వొకటా రెండా, వొకరా యిద్దరా.... దేన్ని, యెవర్ని గుర్తు చేసుకున్నా దిగులేస్తుంది. యింకా వుండాలా అనిపిస్తుంది.
సమస్యలలోంచి, వైమనస్యాల లోంచి తప్పించుకుపోదామంటే కుదరదు. దిగుళ్ల పుట్టలో అలసిన పామువి నువ్వు. పుట్టలోంచి వొక్క యెగ్జిట్ కూడా కనిపించదు.
వురి వేసుకు చనిపోవడమో సముద్రాన పడిపోవడమో ఛాయిస్ అనిపిస్తాయి.
అలాంటప్పుడు మరణంతో సహా యేదీ శాశ్వితం కాదనే వూహ భలే పని చేస్తుంది. మరణమే శాశ్వితం కాకుంటే, యిక యీ కష్టాలొక లెక్కా? అనే వూహ వొక ఫీలింగ్ అఫ్ వెల్ బీయింగ్నిస్తుంది.
యేసుక్రీస్తు తన గోరీ లోంచి లేచి రాలేదూ?! మార్కండేయుడిని శివుడు తిరిగి బతికించలేదూ?! యముడు సత్యవంతుడిని బతికించి సావిత్రమ్మకు యిచ్చిపోలేదూ?! అవన్నీ జరిగినప్పుడు యిప్పటి నా సమస్యలు కూడా పరిష్కారమవుతాయి అని అనుకోడంలో వొక వూరట. వూరట కల్పించే వూహల్లో పడి మరణిద్దామనే సంగతే మరిచిపోవచ్చు.
కఠిన జీవన వాస్తవికత అనే కటకటాలోంచి వొక విముక్తి మిరకిల్స్ సాధ్యం అనే భావన.
విచిత్రం యేమంటే మిరకిల్స్ జరుగుతాయి.  
మరణం గురించే కాదు.
జస్ట్ చిన్ననాటి స్నేహం గుర్తుకొచ్చి కుచేలుడు కృష్ణుడి వద్దకు వెళ్లలేదూ. వెళ్తే అటుకులే అమృతంలా తిని భగవంతుడు దరిద్రుడికి సకల సంపదలు యివ్వలేదూ. యిచ్చింది పని చేసుకుని బతికే వుపాయం కూడా కాదు. యే పని చేయకుండా బతికే సదుపాయం. మన దరిద్రం కూడా యే చెలికాని మహిమ వల్లనో తీరిపోతుందేమోనని ఆశ కలుగుతుంది యీ కథ వింటే.  
అవన్నీ మిరకిల్స్. అద్భుతాలు. అద్భుతాలు జరుగుతాయని మన నమ్మకం. అద్భుతాల మీద నమ్మకం మనకు ధైర్యమిస్తుంది. దాంతో పాటు మిరకిల్స్ చేసే గారడి గాళ్లకు మనల్ని బానిసల్ని చేస్తుంది. నమ్మకం మనల్ని మనుషుల్ని కాకుండా మతస్థుల్ని చేస్తుంది. నమ్మకం బలపడే కొద్దీ బానిస బంధం బిగుసుకుంటుంది. చివరాఖరికి దేవుడు మిరకిల్ గా మన గుడ్డి తనాన్ని, కుంటి తనాన్ని, పిచ్చిని నయం చేస్తాడని ఆనుకుంటాం. దేవుని రోగనిదాన గుణం మనకు నేరుగా అందదు, పూజారి ద్వారా అందుతుంది
యింకేం, బాబాల దగ్గరికి, ఫాదరీల దగ్గరికి, దర్గాల దగ్గరికి తండోపతండాలు. అంత్రాలు, తాయెత్తులు, వేపమండలు, భూతవైద్యాలు, చేతబడులు, చేతబడుల చాటున ఆస్తి తగాదాల ఖూనీలు.
మిరకిల్స్ మీద నమ్మకం లేకపోతే యే మతం లేదు. మత యాత్రలు లేవు. వొక రాయి మీద రాళ్లేయడానికి అంత దూరాలు వెళ్లక్కర్లేదు. గుండ్లు కొట్టించుకోడానికి కొండలు యెక్కక్కర్లేదు. అంతే కాదు, యెవరి దేవుడు యెక్కువ మహిమాన్వితుడో నిరూపించడానికి కత్తులెత్తి కుత్తుకలుత్తరించాల్సిన అవసరం లేదు. టవర్లు కూల్చాల్సిన అవసరం లేదు. ఆ ప్రిన్సిపుల్స్ తో కొండల్లో రాజ్యాలు నిర్మించక్కర్లేదు, అందు కోసం అప్పటికి అక్కడున్న ప్రజా చొరవలను వురి తీయనవసరం లేదు. అడపిల్లలకు చదువులు వొద్దని, ఆవుమాంసం తినరాదని జనాన్ని చంపనక్కర్లేదు.
యిదంతా అక్కర్లేదు గాని.
కాని...
మిరకిల్స్ మాత్రం వాస్తవం. ఆ భావన అవసరం.
మిరకిల్స్ నిజంగానే జరుగుతాయి.
మతం, మత హత్యలు మానేసినా మిరకిల్స్ జరుగుతాయి. ఆడపిల్లల్ని వంటింటికి పడకటింటికి బానిసల్ని చేయకపోయినా మిరకిల్స్ జరుగుతాయి. పిల్లల్ని, యువకుల్ని అది చెయ్యొద్దు యిది చెయ్యొద్దు అని... యెందుకు చొయ్యొద్దో చెప్పకుండా దుడ్డుకర్రలతో కట్టడి చేయకపోయినా...  మిరకిల్స్ జరుగుతాయి.
ఔను సార్,
యేసు క్రీస్తు పునరుత్ధానం చెందకపోయినా, మహమ్మదు ప్రవక్త యేదో గుర్రం మీద అలివిగాని దూరాన్ని దూకకపోయినా, యెవరో రుషి సముద్రాన్నంతా తాగకపోయినా, మరెవరో రుషి చచ్చిపోయిన వాళ్లను బతికించకపోయినా... అవేవీ జరక్కపోయినా, అవేవీ జరగవు గాని... మిరకిల్స్ జరుగుతాయి.
నువ్వు దిగులు పడినప్పుడు, దిగుళ్ల పుట్ట లోంచి యెటు వైపూ యెగ్జిట్ కనిపించనప్పుడు, నీ వాళ్లనుకున్నవాళ్లందరూ... మిహాయింపు లేకుండా... ప్రతివొక్కరూ... నీకు దూరమైపోయినప్పడు... అప్పుడు నువ్వు కోరుకుంటావే ఆ మిరకిల్స్, అప్పుడు నీకు ఆశ యిస్తాయే ఆ మిరకిల్స్... అవి నిజంగానే జరుగుతాయి.
యెందుకంటే మిరకిల్స్ మత విషయాలు కావు. సో కాల్డ్ ఆధ్యాత్మికాలు కావు. యెవరో కొందరు మనుషుల, దేవుళ్ల మహిమలు కావు.
మిరకిల్స్ భౌతిక ఘటనలు. యీ భూమ్మీదే, యీ మన జీవితాల్లోనే, చాల సార్లు మన వల్ల కూడా మిరకిల్స్ జరుగుతాయి. మన కోసం మాత్రమే జరుగుతాయని కాదు గాని. అవి మనల్నీ బతికిస్తాయి. యీ మిరకిల్స్ ను నువ్వు శ్రద్ధగా భక్తిగా నమ్మనక్కర్లేదు. అవి జరుగుతాయని వూరక, అలవోకగా తెలుసుకుంటే చాలు. గొప్ప ధైర్యమిస్తాయి.
నన్ను నమ్ముకో అనే యే శ్లోకమూ వొద్దు. యే పుస్తకంలోని యే సూక్తీ వొద్దు. యే వుపదేశమూ వొద్దు. అసలు నమ్ముకోడమే వొద్దు. తెలుసుకుంటే చాలు. వూరట యిస్తాయి మిరకిల్స్.
సోదరా, సోదరీ! కాస్త చెబుతావా!
పొద్దున్నే... ప్రతి పొద్దున్నే పొద్దు పొడుస్తుంది. సూర్యుడుదయించగానే జగమంతా వెలుగు. పిచికల కిలకిలారావాలు. యెవరో యెవర్నో కేకేసి పిలుస్తుంటే నీకు పలకాలనిపించేంత సంగీతం, పొద్దున్నే నువ్వు తాగ బోయే పొగలు వెదజల్లే కాఫీ, నువ్వు గుడ్ మార్నింగ్ చెబితే నవ్వుతూ నీకు గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్లే బాటసారి.... యివి రోజూ జరుగుతాయి.  రోజూ జరుగుతాయి కాబట్టి నువ్వు పట్టించుకోవంతే.
అతి పరిచయా దవజ్ఞా
సంతత గమనాదనాదరో భవతి
మలయే భిల్ల పురంధ్రీ
చందన తరు కాష్ట మింధనం కురుతే
అతిగా పరిచయమైన దాని గొప్పతనం మనకు తెలియదు. వొక యింటికి మరీ యెక్కువ సార్లు వెళితే అనాదరణకు గురవుతాం. కొండల్లో నివసించే భిల్ల స్త్రీ చందనపు కట్టెను (దాని విలువ గుర్తించక) వంటచెరుకుగా పొయ్యిలో పెడుతుంది కదా, అలాగే... అని యీ శ్లోకం అర్థం.
మనం అడక్కుండా జరిగేవి... మహిమలు అనిపించవు, మిరకిల్స్ అనిపించవు. కాని అవి మిరకిల్స్. అవి అద్భుతాలు. సూర్యోదయమే కాదు, సూర్యుని చుట్టు భూమి, తన చుట్టు తానే భూమి, మరి దేని చుట్టూరానో మొత్తం సూర్యకుంటుంబం... (బాబోయ్ నాకు ఖగోళ శాస్త్రం తెలీదు).... యివన్నీ మిరకిల్సే. యిందులో యే వొక్కటి గతి తప్పినా మనం మటాష్. అలా యుగ యుగాలుగా యివి జరుగుతూ వుండడం... అదీ వాటి వాటి క్రమాలు తప్పకుండా వుండడం మిరకిల్ కాకపోతే మరేమిటి?
మనకు తెలీని మరెన్నిటి వెనుకనో మరెన్నో, మరేవో మిరకిల్స్ వుంటాయి. వాటిలోని క్రమాలను కనుక్కునే పనిని మన శాస్త్రవేత్తలకు వొదిలేద్దాం.
విశ్వగోళాల వంటి పెద్ద థింగీ లకే కాదు. యిప్పుడు మీ మనస్సును అంతగా కలచి వేసే దిగులు కారక క్రమాలలోనూ మిరకిల్స్ జరుగుతాయి. మీ బిడ్డకు వుద్యోగం వస్తుంది. మీరనుకున్నవుద్యోగం కాకపోవచ్చు. అలాంటిదే యేదో వొకటి. మీరనుకున్నదాని కన్న పెద్దది కూడా కావొచ్చు. ఆ మిరకిల్ జరుగుతుంది. మీరు అప్పిచ్చిన వాడు మీకు తిరిగి యిస్తాడు. ఆ మిరకిల్స్ జరుగుతాయి. లేదా వాటిని కాంపెన్సేట్ చేసేవి యేవో జరుగుతాయి. అసలు కన్న కాంపెన్సేషన్ యెక్కువ కావొచ్చు. అవి మిరకిల్సే.
దిగులు పడొద్దు. జరగాల్సిన వాటిని మిరకిల్స్కి వొదిలేసి, నీ పనులు నువ్వు చేసుకో. నువ్వు రాయాల్సినవి నువ్వు రాసుకో. నీ చేతుల్లో వున్నవి సంవత్సరాలో, క్షణాలో... మనసారా అనుభవించు. జీవించు. జరగబోయే మిరకిల్స్ జరుగుతాయి. నువ్వు జీవించడం ముఖ్యం. జీవించడం అంటే నీ పని నువ్వు చేయడం. యెవడో నీకు నిబంధించిన పని కాదు. వున్నంతలో నీకు యిష్టమైన పని.
ఆంధ్ర లొయొలా కాలేజీలో ప్రీ యూనివర్సిటీ కోర్సులో చేరినప్పుడు నేను యెంబీబియెస్ చదివి డాక్టర్ ని కావాలని అనుకున్నాను. మార్కులు కాస్త తగ్గాయి. డాక్టర్ని కాలేదు. చాల దిగులేసింది. మరేదో అయ్యాను. మరేదేదో అయ్యాను. యిప్పుడు నాకు అరవై ఆరేండ్లు. అప్పటి నా దిగులును తల్చుకుంటే నవ్వొస్తుంది. నా స్నేహితులలో డాక్టర్లయిన వారిలో కొందరి కంటే నేను మరింత అర్థవంతంగా బతికాను. చివరాఖర్న చూస్తే, వాళ్లు నా కన్న యెక్కువగా మంచి పనులు చేశారని అనిపించదు. నా కన్న సంతోషంగా వున్నారనీ అనిపించదు. ఆ నాడు నా సహాధ్యాయులలో కనీసం నలుగురి జీవితాల్ని వస్తుగత దృష్టితో గుర్తు చేసుకుని మరీ చెబుతున్న మాట యిది.
బాగా యిటీవల మరో సంగతి. వివరంగా చెబితే.... ప్రస్తావించాల్సిన పాత్రలకు అది యిష్టం కాకపోవచ్చు... టూకీగానే చెవుతాను. నాలుగైదేళ్ల క్రితం... యెటు చూస్తే అటు పటు నిరాశ అనిపించే దిక్కుతోచని స్థితిలో వున్నాను. చుట్టూరా వొక్క దానికీ పరిష్కారం కనిపించనినిస్సహాయతలో వున్నాను. నాకు దూరమై బాధ కలిగించిన స్నేహాలు, అందుకుందామని ప్రయత్నించే కొద్దీ... ట్యాంటలస్ రాజు నోటి ముందు నీళ్లూ, ద్రాక్షపళ్లలా.. అందక బాధించిన భరోసాలు. ఆ పుట్ట లోంచి యెగ్జిట్ లేదనిపించింది. అయినా నేనున్నాను. నా పని నేను చేస్తున్నాను. అందువల్ల సంతోషంగా వున్నాను. దీనికి కారణం చాల వరకు మిరకిల్స్ గురించిన నా అవగాహన. నేను అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోయినా ఏవో జరుగుతాయి. జరిగేవే నేను ఆశించిన వాటి కన్న గొప్పవి కావొచ్చు.
అప్పటి దుఃఖంలో నన్ను మిరకిల్స్ గురించి ఆలోచింపజేసిన నా అనంతపురం దోస్తు, జేకే అనుయాయి కొండ మీది రాయుడు గారికి కృతజ్ఞతలు. మిరకిల్స్ గురించిన యీ వ్రాత వెనుక వుత్తేజం కె యెం రాయుడు గారి మాటలే, J   

24-10-2017
published in November 2017, Adugu

No comments:

Post a Comment