Thursday, January 11, 2018

17. లోపలి వెలుగు

ప్రతి యెడారి యిసుక లోపల 
ప్రవహిస్తూ వుంటుందొక నది
తనకూ వుంటుంది 
ఆకాశంలో మొహం చూసుకుని మురిసిపోవాలని
పూల తోటలను పచ్చిక బాటలను ముట్టుకోవాలని
సాయంత్రాలు యెవరెవరో వచ్చి 
తీరిగ్గా తనలో కాళ్లు కడుక్కోవాలని
కొందరు యిద్దరులు కూర్చుని చల్లని తనను శ్వాసిస్తూ
తమకంతో ముద్దులు పెట్టుకోవాలని
తను వాళ్ల బొమ్మలను లోలకాల వలె వూపి 
ఫెళ్లున నవ్వాలని 
యెక్కడి నుంచో యెక్కడికో నడిచి నడిచి 
అలసిన బాటసారికి
బెల్లం అక్కర్లేని తీపితో పానక పంద్యారం చేయాలని
అతడు మోహంతో తనను మొహం మీద చల్లుకుని 
ఆహా అని పరమశివుడై పరవశించాలని, తను అతడి
నెత్తిన చిక్కువడిన మంటలను చల్లార్చే గంగ కావాలని
వొక్కో కడవగా తనను తీసుకుపోయి
యెండిపోయిన మొక్కలను వోదార్చే 
రైతు నాన్నను తాను వోదార్చాలని
లోలోపల తపిస్తుంటుంది
నది లోపలి తపనుని వల్లనే 
యిసుక అంతగా కాలిపోతూ వుంటుంది
యిసుకను చల్లబర్చడానికి తానే వుబికి
వొయాసిస్సు అవుతుంటుంది
లోపలి నది ప్రవహిస్తూనే వుంటుంది
రాత్రి లోపలి వెలుగులా
నిద్దరలోని మెలకువలా
3-11-2017


No comments:

Post a Comment