Thursday, January 11, 2018

16. వొక పీడ కల

యెప్పటికైనా వస్తావా
యీలోగా యేమేం చేశావో
ఆ కబుర్లన్నీ తెస్తావా అని
అడుగుతున్నయ్ గుమ్మడి కొండ
కొండమీద రంగసామి దేవాలయం

నువ్వెప్పటికైనా వస్తావా
యీలోగా యేమేం చూశావో
ఆ కథలన్నీ చెవుతావా అని
యెదురు చూస్తున్నారు అమ్మ,
చిన్నా పెద్ద తమ్ముళ్లు, చెల్లెళ్లు
వురే పెద్దోడా! కాస్త చూసుకో
బొమ్మలన్నీ తిరగబడినట్లున్నయ్
అడుగుతున్నది నువ్వే, మరి
యెదురు చూస్తున్నదీ నువ్వే

తడిసిన నీ భుజం మీది చిన్న కడవలో
నీరు నింపి పంపిన మద్దులేటి వాగు
నిట్ట నిలువున యెండిపోయిందంట
మునగ బెండ్లు లేకుండానే యీదడం నేర్పిన
గంగమ్మ మడుగును దొంగలెత్తుకుపోయారంట
వాగు పొట్టలో యినుప బాకులు పొడిచి
వుమ్మ నీరు కూడా తోడుకుంటున్నారంట
కొండకు డైనమైట్లు పెట్టి పేల్చి నవ్వేరంట

నీ తడిసిన భుజమ్మీది కడవలోని నీళ్ల కోసం చూసి చూసి
పొయ్యి మీద కుండ యెసరు లేకుండానే వుడుకుతోందంట

30-10-2017
Top of Form


No comments:

Post a Comment