Sunday, October 29, 2017

రాజకీయ సాహిత్యం సాహిత్య రాజకీయం

రాజకీయ సాహిత్యం సాహిత్య రాజకీయం

రాజకీయ సాహిత్యం అంటే రాజకీయ జీవితం మీద వ్యాఖ్యానంగా, దిశా నిర్దేశకంగా వుండే సాహిత్యం. కవిని అనక్నాలెడ్జెడ్ లెజిస్లేటర్ అంటున్నప్పుడు పి.బి. షెల్లీ మనస్సులో వున్నది యీ విశేషమే . రచయితలు, పాఠకులు దీన్ని గుర్తించి ప్రవర్తించడం వల్ల, ప్రజలకు హానికరమైన హిపోక్రసీ తగ్గుతుంది. ముసుగుల్లేకుండా యెవరు యెవరో తెలుస్తుంది. యిది మంచిది. కొనసాగించాల్సిన సంప్రదాయం. సాహిత్య రాజకీయం అంటే కవులుగా పేరు ప్రతిష్ఠలకోసం, వొకర్ని కిందికి దించడం కోసం, వొకరిని పైకెత్తడం కోసం, కెరీర్ కోసం జరిగే పనులు. అందుకోసం తెలిసి తెలిసీ సత్యాన్ని బలిపెట్టడం. దీన్ని గుర్తించి, యెంత త్వరగా వొదిలించుకుంటే అంత మేలు.
అరసం, విరసం వంటి సంస్థలు వచ్చాకే సాహిత్యంలో రాజకీయం వుండాలా వద్దా అని చర్చ జరిగింది. భావకవిత్వంలోని స్వేచ్ఛ, దేశభక్తి... రాజకీయ విషయాలే. అవి అప్పటి వున్నోళ్లకు యిబ్బందికరం కాదు. ఆ సాహిత్యం వాళ్లు యెంజాయ్ చేసేట్టుగానే వుంది. తరువాత అరసం, విరసం నేపధ్యంలోనే సాహిత్యంలో రాజకీయం వొక చర్చగా ముందుకొచ్చింది. దీని చుట్టూ ఆవేశ కావేశాలు పొంగాయి, యిప్పటికీ పొంగుతున్నాయి. యీ చర్చ పూర్తిగా ఆధునికమైనది. మోడర్నిజంలో భాగం. పాత సాహిత్యానికి ఆ మీమాంస లేదు. పాత సాహిత్యానికి రాజకీయం ప్రాణం.
రాయబడిన చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే అన్న మార్క్స్ మాట సుప్రసిద్ధం. చరిత్ర,లో ప్రతి పోరాటంలో రెండు (సాంఘికార్థిక) వర్గాలు యెదురుబొదురు నిలబడి కనిపిస్తాయని కాదు. ప్రతి పోరాటం అంతిమ విశ్లేషణలో వర్గ పోరాటమే. మన దేశంలో వైదికం, బౌద్ధాల మధ్యన; వైష్ణవులకు, శైవులకు మధ్యన; క్రతు వాదులకు, భక్తి వుద్యమకారులకు మధ్యన.... జరిగినవన్నీ ఆధ్యాత్మిక తగాదాల్లా కనిపిస్తాయి గాని, నిజానికవి వర్గ పోరాటాలే. అప్పటికి ఆధిపత్యంలో వున్న వర్గాలకు, ఆధిపత్యం కోరుకునే వర్గాలకు మధ్య జరిగిన పోరాటాలే.
కర్నాటక కల్బుర్గి హత్య తాజా వుదాహరణ. ఆయన నాస్తికుడు కాడు. వీరశైవుడు. వీరశైవం హిందూ సంస్కృతిలోని కుల వ్యత్యాసాల్ని వ్యతిరేకించింది. కల్బుర్గి తన వీరశైవ ఆచరణలో భాగంగానే చీకటి శక్తులకు కంటగింపు అయ్యాడు. హత్య చేయబడ్డాడు. గతంలో బసవని వీరశైవానికీ దాని వ్యతిరేకులకు మధ్య జరిగిన గలాటాలు మత వివాదాల్లా కనిపిస్తాయి. అది కేవలం మతం కాదు. మతం భాషలో జరిగిన, జరుగుతున్న వట్గపోరాటం.
మార్క్స్ మాటల్ని కుంచెం మార్చి మన సాహిత్యమంతా రాజకీయమేనని అనవచ్చు.
పాత సాహిత్యమంతా రాజులను దేవుళ్లుగా, మహా మానవులుగా కీర్తించినదే. నా విష్ణుః పృధివీ పతిః అనడం రాజకీయమే. వొక రాజు చనిపోయి మరో రాజు రాజ్యానికి వస్తాడు. వొక విష్ణువు చనిపోయి మరో విష్ణువు రాడు. యెప్పటికి వున్న రాజుకు అప్పటికి అజరామరమనిపించేంత గౌరవం యిచ్చి తమ పబ్బం గడుపుకోడం కోసం అలనాటి బుద్ధి జీవులు పామరులకు చెప్పిన మాట నా విష్ణుః పృధివీపతి’. యెప్పటికప్పుడు రాజ్యం చేస్తున్న వాడు విష్ణువని వారి బోధ. రాజ్యం చేసే వాడిని... అనగా యెస్టాబ్లిష్మెంటుని కీర్తించే వాళ్లను యిప్పుడు సుబ్బరంగా బూట్ లిక్కర్స్ అంటాం. ఆ రోజుల్లో యేమనేవారో తెలీదు.
యేదీ తనంతా తాను, గాలి కారణాలతో ప్రాచుర్యం పొందదు. ‍వొక సాహిత్యం అది అవసరమైన వాళ్లు ప్రాచుర్యం పొందిస్తే పొందుతుంది. వాళ్లు మిగిలిస్తే మిగులుతుంది. దీన్నే మాన్యుఫాక్చరింగ్ అఫ్ కన్సెంట్ అంటారు. భారీ యెత్తున వుత్పత్తి చేయబడే ప్రజా-సమ్మతి’. అభిప్రాయాలు అనేవి మనకు కనిపించేంత అమాయకాలు కాదు. ప్రకృతి సిద్ధమైనవి కాదు. స్పాంటేనియస్ కాదు. భారీగానో, కటీరంగానో వుత్పత్తి చేయబడినవే.
ప్రాచీన సాహిత్యంలో రాజకీయం వుందని అనడానికి, దాని వల్లనే యిప్పటికీ ఆ సాహిత్యం కాపాడబడి, విస్తరిస్తోందని అనడానికి... వొక అతి ప్రాచీన తాజా వుదాహరణ మన వర్తమానాన్ని శాసిస్తున్న గతమే. భారత ప్రధాని నరేంద్ర మోదీ వేదిక యెక్కి డయాస్ కు అటు యిటు చేతులు పెట్టి చెప్పే మొట్టమొదటి మాట జై శ్రీరామ్. ఆ మాట తప్పా వొప్పా అని కాదు. సాహిత్యంలోని రాజకీయానికది కాంక్రీట్ వుదాహరణ.
శ్రీరాముడికి జయం కలగడం కొందరికి యిష్టం. కొందరికి అయిష్టం. అయిష్టం కేవల సాహిత్య విషయం కాదు. వుపమా రూపకాది అలంకారాలు ఆధారంగా వాళ్లు తమ అయిష్టాన్ని వివరించలేరు. యెవరూ అలంకారాల మణిమాణిక్యాలు పొదిగన కత్తితో గొంతు కోసుకోలేరు కదా?! సాహిత్యంలో నిశ్బబ్దం, సాహిత్యమంటే పదాలే.... వంటి ఆధునిక సాహిత్య వాదాలతో కూడా యీ అయిష్టాన్ని వివరించలేరు.;
రామరాజ్యం గొప్ప రాజ్యమని అంటారు. ఆ రాజ్యంలో వొక రాజుగా రాముడు చేసిన గొప్ప పనులేమీ రామాయణంలో లేవు.  లోకులు అపవాదు వేశారని తన అధీనంలోని స్త్రీని అడవులకు పంపాడని వుత్తర రామాయణం. రాముడు చేసిన యింకో పని తపస్సు చేస్తున్నాడనే... వొక ఫిర్యాదు ఆధారంగా రాముడు శంభుకుడు అనే శూద్రుడిని ఖూనీ చేశాడు. (ఖూనీ పేరుతో త్రిపిర్నేని రామస్వామిచౌదరి యీ కథను నాటకీకరించారు). ఆ హత్య సాంఘికం అనిపించే రాజకీయం. ఆధ్యాత్మికం అనిపించే వర్గ సమస్య. యివాళ వొక రాజకీయ పార్టీ ఆ రామరాజ్యం ప్రాతిపదిక మీదనే రాజ్యానికి వచ్చింది. రామాయణంలో రాజకీయం నిస్సందేహం. ఆ రాజకీయాన్ని అంగీకరిద్దామా వద్దా అనేదే చర్చనీయం. రామాయణ కావ్యౌన్నతి ఆ ప్రశ్నకు జవాబివ్వలేదు.
రామాయణమే కాదు; అలాంటి ధర్మాలను యెవరు ప్రచారం చేసినా రాజకీయమే, భారత రాజ్యాంగ వ్యతిరేక రాజకీయమే.
అధునిక సాహిత్యంలో విశ్వనాథ వేయిపడగలుఅలాంటి వర్ణాశ్రమ ధర్మాలనే ప్రవచిస్తుంది. నవల కథానాయకుడు ధర్మారావు తండ్రి పరమేశ్వర శాస్త్రి ముందుగా బ్రాహ్మణ స్త్రీని, తరువాత కింది కులాల స్త్రీలను పెళ్లి చేసుకుంటాడు. యీ సో కాల్డ్ అనులోమ వివాహ విధానాన్ని నవల వివరిస్తుంది. గొప్ప చేస్తుంది. మొదట బ్రాహ్మణ స్త్రీతో పెళ్లి పూర్తిగా లెజిటిమేట్. కిందికి పోయే కొద్దీ ఆ స్త్రీలు తక్కువ రకం భార్యలు. పిల్లలు తక్కువ రకం పిల్లలు. చివరికి శూద్ర స్త్రీని బ్రాహ్మణుడు వుంచుకుంటాడు... తన యింట్లో వుండిపొమ్మంటాడు. ఆమె బలవంతాన మెడలో పుస్తె కడతాడు. లోకంలో యిలా జరుగుతుందా? జరుగుతోంది. విలోమప్రేమలు. వివాహాలు మాత్రమే హింసాత్మకం అవుతున్నాయి. దీనికి సాహిత్యపు సమ్మతి వేయిపడగలు. యీ సంప్రదాయం చెడ్డది. దీన్నిన్యాయంగా చిత్రించడం సాహిత్యంలోని రాజకీయం. సమాజంలో దీనికి లభించే ఆదరణ, వ్యతిరేకత రెండూ రాజకీయ విషయాలే.
సాహిత్యంలో రాజకీయం వల్ల, రాజకీయాల బరువు కింద సాహిత్య విలువలు, సౌందర్య విలువలు నాశనమవుతాయనే హెచ్చరిక సరైనదే. సాహిత్యంలో రాజకీయం వుండొచ్చు అనుకునే వారికే కాదు, నిషిద్ధం అనుకునే వారికి కూడా యీ హెచ్చరిక వర్తించాలి. వొక కథలోని, కవిత్వంలోని రాజకీయాలు మంచివి కాకుంటే ఆ మాట చెప్పాలి, వివరించాలి. (యీ వ్యాసంలో రామాయణం, వేయిపడగలులోని రాజకీయం తప్పు అని నేను రాశాను). సాహిత్యంలో అసలు రాజకీయాలే వుండరాదని చెప్పదలిచారా అదెలాగో సహేతుకంగా చెప్పాలి. పుస్తకాలలో వున్న రాజకీయాల్ని లేవని అనొద్దు. వాటిని యెత్తి చూపితే వులికిపడొద్దు.
యే రాజకీయాన్ని అనుసరించే కవులైనా వారి రాజకీయాల వల్లనే గొప్ప కారు. అరసం, విరసం, సరసం.... యెవరు రాసిందయినా సాహిత్యం కాదనిపించినప్పుడు చెప్పడానికి సందేహించని వాడే మంచి విమర్శకుడు. దీనికి భిన్నమైన సాహిత్య రాజకీయం అసయ్యకరమైనది. ఆ టెండెన్సీ యెవరిలో కనిపించినా, వొకరికొకరు చెప్పుకోవాలి. వెంటనే వొదులుకోవాలి, చేతికి అంటిన బురదను కడుక్కున్నట్లు.
ప్రాపగాండా సాహిత్యం అనేది రాజకీయ సాహిత్యం మీద వున్న వొక అభియోగం. కేవలం ప్రాపగాండా సాహిత్యం కాదు. కాని, యేదో వొక దాన్ని ప్రచారంలో పెట్టకుండా సాహిత్యం వుండదు. వొకసారి రాసి అచ్చేసి, పంచడమంటే కొన్ని ఐడియాలను ప్రచారం చేయడమేనంటారు చైనా మహాకవి లూ సున్. మనం రాసి ప్రచురించి, పంచి పెట్టే ప్రతిదీ యేవో కొన్ని ఐడియాలను ప్రచారం చేసేదే. లోకానికి మేలు చేసే మంచి ఐడియాలనే ప్రచారంలో పెడదాం.  యేది మంచి యేది కాదనేది నిగ్గు తేలాల్సింది తిరిగి చర్చలోనే.
(యీ రోజు సోమవారం, అక్టోబర్‍ 29న సాక్షిలో ప్రచురించిన వ్యాసం) 

No comments:

Post a Comment