Saturday, October 21, 2017

8. నిబద్ధం


గాలి తనతో తీసుకెళ్లాలనుకుంటుంది
చెట్టు తనతో వుంచుకోవాలనుకుంటుంది
యెటూ చెప్పలేక, వెళ్లలేక వుండలేక
ఆకులు అల్లల్లాడుతాయి
అంతే కదా అని అటిటు తలలూపుతాయి
నేలలో కాళ్లు పాతేసుకున్న రెల్లుపొదలు
అంతా పులకరింత అనుకుంటావు నువ్వు
అసలేం జరుగుతున్నదో నీకు తెలియదు
నిజం తెలుసుకోవాలని నీ కన్ను వువ్విళ్లూరుతుంది
కిటికీ అద్దాలు పగులగొట్టి దూసుకుపోవాలనుకుంటుంది
కపాల పేటిక నుంచి విడవడలేదు, విడివడితే
దానికేం కనపడదు, చూపు వొక పరమ నిబద్ధ
యేమి స్వేచ్ఛ? యెంత స్వేచ్ఛ? యెవరి స్వేచ్ఛ?
నిత్యం నువ్వెవరి యిచ్చా బద్ధుడివో అనిపించడం లేదూ
నియంత్రణ తాళ్లు తెంచుకోవాలని గింజుకోడం లేదూ
వూరికే అలా కుర్చో నిశ్చలంగా నిర్లక్ష్యంగా
యేవరో వొకరు వస్తారిటు వైపు, యిది బాగా రద్దీ బాట
గాలితో కలిసి వస్తారు, చెట్లతో కలిసి వుండిపోతారు
వేట ఆగిపోతుంది, సేద్యం మొదలవుతుంది
వూర్నే చంపి తినడం మానేసి, సృష్టించి, చంపి, మరణం
లోంచి మళ్లీ సృష్టించే పంచాంగం తెలిసిన వాళ్లొస్తారు, వాళ్లు
పోగు పడిన విద్యను కొట్టేసి అమ్మకుని సోమరులై బతకరు
పదుగురితో కలిసి అనుభవించి పలవరిస్తారు
పలవరింతలు కలవరింతల్లోంచి మరో లోకాన్ని ప్రతిసృష్టిస్తారు
యెదురు చూడు
చూస్తూ వుండు, యీ అల్లాడే ఆకుల్లో తలలూపే రెల్లుపొదల్లో
ఔను, మనం మొదలు పెట్టిన చోటే యిది
అంతకంతకు విస్తరించే వర్తుల పయనం
201-2017

No comments:

Post a Comment