Saturday, October 21, 2017

7. కొంచెం కొంచెం

కొంచెం కొంచెం జీవించాలి
వొక్కొక్క చరణంగా వచన కవిత్వం రాసినట్లు
చెట్టు నుంచి వొక్కొక్క పువ్వు తుంచుకున్నట్లు
కొంచెం కొంచెం జీవించాలి
కొండల్లోంచి గాలి కొంచెం కొంచెం వస్తే బాగుంటుంది
వున్నదంతా వొకేసారొస్తే వూడ్చుకుపోతాం
వున్న గాలి అంతా నీ కోసమే లేదు
చివరికి ఆమె ప్రేమ కూడా నీ కోసమే లేదు
పసిపిల్లలతో కలిసి పంచుకోడం నేర్చుకోవాలి
చొక్కా అంచులో పెట్టి కొరికిన బెల్లం ముక్కలు
పంచుకుని తినలేదా యెప్పుడూ?
కొంచెం కొంచెం ఆనందించాలి
వొక్కొక్క రోజునే అనుభవించాలి
కొంచెం చేదు కొంచెం తీపి వగరు కారం అన్నీ
అన్నీ మంచి రోజులే, ప్రతి వుదయం వొక మిరకిల్
పొద్దున్నే వంటింట్లో గిన్నెలు తోమెయ్
నిద్దర్లేచే సరికి గిన్నెల తళత్తళలు
ప్రేయసి కళ్లలో మిరుమిట్లు గొలపాలి
మధ్యాన్నం భోజనానికి వో అతిథిని సంపాదించుకో
నిన్న నీ ముందెవరో చేయి చాస్తే జేబులో చిల్లర లేదన్నావే
తానే అతిథిగా దొరికితే మరింత మంచిది
సాయంత్రం దగ్గర్లో పేద వాడలో పిల్లలకు
ఓనమాలు నేర్పించు, నిన్నటి పిల్లలు కొందరివాళ రాకున్నా సరే
చీకటి పడిన తరువాత యెవరేనా యే అన్యాయాన్నైనా యెదిరిస్తో
కాగడాలు వెలిగిస్తారేమో చూడు, మంచికి బాసటగా నువ్వూ నడు
యింకేం, దిగులేముంది? కళ్లు మూసినా వెలుగే, హాయిగా నిద్రపో
మళ్లీ రేపు మరింత కాంతిగా మరో అద్భుతాన్ని జీవిద్దువు గాని
17-10-2017

No comments:

Post a Comment