Monday, August 7, 2017

డేగలూ కపోతాలు


ఆకలి నుంచి స్వాతంత్ర్యం కోసం
ఆకాశాన్ని పంజా గోళ్లతో రక్కుతూ
యెగురుతుంది డేగ
వొక సారి నిట్ట నిలువుగా, దిక్కు నుంచి దిక్కుకు,
మరోసారి ములికిని కిందికి సాచి నేలను తోలవబోతున్న బల్లెంలా
సర్ సర్ మని వురుకుతుందిది డేగ
అడవులు సాశ్చర్యంగా చూస్తాయి
చెయ్యిని మొదట మోచేతి వద్ద తరువాత వేళ్ల వద్ద
విప్పి విప్పి లోకంలోని అర్థాన్నంతా వొక్కసారిగా
ఆక్రమించ దలిచిన వలస వాద వాక్యంలా
విచ్చుకుని గగనమంతా మూసేస్తాయి డేగ రెక్కలు
విస్తారంగా పరుచుకున్న మైదానాల లోంచి కూడా
అన్ని ప్రాణుల కళ్లు దాన్ని సంభ్రమాశ్చర్యంగా చూస్తాయి
గద్ద ముక్కుకు వేలాడతూ కీస్ కీస్ మని అరవబోయే కోడిపిల్ల
అమ్మ రెక్కల మధ్య లోంచి లేదా రెక్కల మధ్యకు వెళ్లడం మరిచి
చూస్తుంది శబ్ద రూపాల్లేని వాయవుకు భయంకరమైన శబ్దాన్నీ,
పదునైన రేఖా రూపాన్నీ యిచ్చే ప్రాణమున్న తటిల్లత వైపు

డేగ అంటే యెంత కోపమో అంత ప్రేమ మనకెందుకో
డేగ అంటే యెంత భయమో అంత ప్రేమ మనకెందుకో
గడ్డిలో గెంతుతూ పురుగులను వేటాడే కపోతాలూ

మీరు చెప్పగలరా?!
o8-082017 

No comments:

Post a Comment