Sunday, August 6, 2017

గూడు



గూడుకు యెగరడం రాదు
కొమ్మల్లో చిక్కడి పోయింది
యెండను వానను రానివ్వని తన నీడలోంచి 
యెండవానల్లోకి యెగిరిపోయాయి దాని రెక్కలు
ఆకాశం వైపు పైకి బోడగించిన చెవిలా వుందది
నీ చెవిని ఆ కొమ్మల మధ్యకు విసిరి చూడు
రేడియో పెట్టెలో స్టేషన్ అందని చప్పుడులా
పచ్చని పాటలేవో గుసగుసలాడుతాయి

కొంచెం బంకమట్టి, కొన్ని పుడకలు
కొంచెం మాంసం, కొన్ని యెముకలు
దీపం ఆరకుండా వుంచిన చేతుల నుంచి
దీపానికి రెక్కలొచ్చి యెగిరి పోయినట్లుగా
బోసి బోసిగా దిగులు దిగులుగా గూడు

యిక్కడ పుట్టి పెరిగిన పిచికలు
తిరిగి తిరిగి యీ గూటికి యెందుకని రావు?
ఆకాశంలో దారి తప్పి పోయా యేమో!
మా పాప వూరెళ్లింది
వచ్చాక అడగాలి, యిదంతా యేమిటో

6-7-2017


No comments:

Post a Comment