Monday, July 31, 2017

ఫ్రాంక్లీ టెల్లింగ్


 ప్రతి మనిషీ తన కోసం తాను వెదుక్కుంటున్న వాడే
ప్రతి మనిషీ తన సందేహాల్ని చెప్పడానికి ఒక భాషను వెదుక్కుంటున్న వాడే
తీరని అనుమానాలతో, మెడను చుట్టి వదలని పరిష్వంగాలతో పెనుగులాడుతున్న వాడే.
సందేహాల్లో, పరిష్వంగాల్లోనే వైవిధ్యం.
ప్రతి వస్తువు తనకు తగిన రూపాన్ని తా యెంచుకున్నట్టు
మనుషుల సందేహాలనుమానాల్కౌగలింతలు తమ తాత్వికరూపాల్ని తాము వెదుక్కుంటయ్
కర్తలమని, వక్తలమని చెప్పుకోడానికి మనం వువ్విళ్లూరుతుంటాం

యుద్దాల కోసం చేసిన పరిశోధనల్లో తెలిసి వచ్చిన వస్తు తత్వాల ముక్కలను
వైద్యం కోసం, యితర విద్యల కోసం వినియోగించినట్లుపరిగెడుతూ పెరిగెడుతూ చూసిన లోకాలకు 
ఒక సారి విజ్ఞాన శాస్త్రపు  రంగులు, 
యింకో సారి కవిత్వం, చిత్రలేఖనాది కళలవి, మరోసారి మతావేశాల రంగులు
పులుముతుంటాం, వాటిని దారిపక్క కాల్వల్లో పారేయలేక..

మనుషులు వాక్యాంతాలలోని పూర్ణానుస్వారాలు.
యే వొక్కరితోనూ వాక్యాలంతం కావు
అక్కడితో వాళ్లు అలసిపోయారనడానికవి సంకేతాలు.
అక్కడితో వాచికం అయిపోయిందని కాదు.
వాచికం కాలేకపోయినదేదో, వాచ్యం కావడానికి యిష్టపడనిదేదో
పూర్ణానుస్వారం లోపలి పేలుడుశక్తిగా వుండిపోతుంది.

యిప్పుడు నేనిక్కడ వుంటున్నానంటే మరేం లేదు
కాస్త ఆగానంతే, రగులుతున్నానంతే ఆగిపోలేదు.
ఆగిపోవడానికి
పారిపోవడానికని
యింకో దారి లేదెవ్వరికీ.
30-7-2017

No comments:

Post a Comment