Thursday, February 2, 2017

42. విర‍స‍ం నా స‍ంబ‍ర‍ం

విప్లవాలు చరిత్ర చేసుకునే సంబరాలుఅని ఫ్రెంచ్ సోర్బాన్ (1968) యూనివర్సిటీ విద్యార్టుల గోడ వ్రాతల్లో ఒకటి.
అంత కాలమూ, అలాగే వుండిందని అనలేను. పండుగ నాడు కూడా మూతి ముడుపులుంటాయి కదా?! విప్లవోద్యమంలో నా అస్తిత్వం ఎక్కువ కాలం సంబరంగానే గడిచింది. కనీసం నా వరకు, దానిలో ప్రతి కదలిక గొప్పదే. అందులో అతి ముఖ్య సంబరం విరసం తో నా సహ పయనం. బహుశా కుదరదనుకుంటాను గాని, నా అభిప్రాయాల్ని నేను కలిగివుంటూనే... విరసంలో ఒకడిగా వుండగలిగితే ఎంత బాగుండు అనుకుంటాన్నేనిప్పటికీ. అలా ఎందుకు కుదరదూ... అని... ఒక విచికిత్స కూడా వుంది. అది కుదిరే వరకు విరసం పురోగమించదు. ఇది శాపనార్థం కాదు. భారత దేశ విప్లవ గతిపై ఇది నా అవగాహన. ఎవరికి ఏ ఇబ్బంది వున్నా నేనేం చేయలేను. నా వైఖరి నేను చెప్పక తప్పదు.
ఇలా కేవలం వైఖరులు ప్రకటించుకోడమే అయితే, అది చరిత్ర కాదు, సంబరమూ కాదు. నేను ఉద్యమంతో, ‘విరసంతో నా పయనం గురించి మాట్లాడుతున్నాను. ఈ పయనంలో నేను కలిసి నడిచిన వారెందరో వున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా నన్ను నడిపించిన ముఖ్యుల గురించి చెప్పుకోడం అవసరమే అనుకుంటాను.
యాధాటి కాశీపతి తో పార్టీ పరమైన అనుబంధం వున్నంతగా సాహిత్యానుబంధం లేదు. తను మరీ రాయని భాస్కరుడేంకాదు. (విరసం లో కొందరు రాయని భాస్కరులుండే వారు... వున్నారు... కాబట్టి ప్రత్యేకించి ఈ రైడర్). ఎమర్జెన్సీ కి ముందు పెండ్యాల కిషన్ రావు ఎడిట్ చేసిన విమోచనపత్రికలో సోషల్ ఇంపీరియలిజం మీద కాశీపతి రాసిన వ్యాసాలు చూశాను. ఆ భావనను వివరించి, అప్పటి సొవియట్ రష్యా పోకడలలో సోషల్ ఇంపీరియలిజం లక్షణాల్ని చూపించిన తీరు చాల బాగుంటుంది. తన వచనం భలే పఠనీయంగా వుంటుంది. అర్ఠ శాస్త్ర సమస్యల మీద తనకు మంచి పట్టు వుండేది. ఎందువల్ల అదంతా వ్రాత రూపం తీసుకోలేదో నాకెప్పుడూ ఆశ్చర్యమే.
ఎమర్జెన్సీకి ముందెప్పుడో రెడ్ శాల్యూట్పేరుతో వెలువరించిన ఒక బక్క పల్చని కవితా సంపుటి మినహా కాశీపతి సృజనాత్మక సాహిత్యం జోలికి పోయినట్టు లేదు. నా అనుమానం... మంచి వుపన్యాసకుడు కావడం కోసం కాశీపతి చేసిన కృషి తన సృజనాత్మక రచన శక్తి మీద, ఆసక్తి మీద నెగటివ్ ప్రభావం చూపించిందని.
ఉపన్యాసకుడు తన వాక్యాల్ని వీలయినంత సరళం, సద్యోద్వేగ భరితం చేయాల్సుంటుంది. వినే వాళ్లు అప్పటికప్పుడు ఈలలు వేయాలి, చప్పట్లు కొట్టాలి, వూగిపోవాలి. కాస్త మనసులో ఇంకితే గాని తెలిసిరాని అన్యాపదేశాలు, రెఫరెన్సులు అవసరమయ్యే అల్యూజన్లు, దాచి చెప్పడం, కాస్త మార్మికత... లేకుండా సృజనాత్మక రచన సజీవం కాదు. ఉపన్యాస కళకు, సృజనాత్మక వ్రాతకు చుక్కెదురనేది ఈ మేరకు నిజం. కాశీపతిని చూసినా, జ్వాలా ముఖిని చూసినా అలాగే అనిపిస్తుంది. పెండ్యాల వరవర రావు కూడా దానికి మినహాయింపు కాదు. మంచి వుపన్యాసకుడయ్యే క్రమంలో కవిగా వీవీ పోగొట్టుకున్నదేమీ లేదని అనలేం. చలి నెగళ్లు’. ‘జీవనాడి' సంపుటాల్లోని... ముఖ్యంగా చలినెగళ్లులోని... వీవీ ఆ తరువాత కనిపించడు.
చలినెగళ్లుతరహా అచ్చపు కవిత్వంతో జీవితం మొదలెట్టడం వల్లనే కామోసు కాశీపతి, జ్వాలా ముఖి మాదిరి తన శబ్ద లౌల్యానికి తానే బలై పోకుండా, వీవీ కవితాత్మను కాపాడుకోగలిగారని నా వూహ. ఉపన్యాస, కవన కళలపై నా ఈ మాటల్ని ఒక వూహా సిద్ధాంతంగా భావించినా నా కిష్టమే. ఓపిక వున్న వాళ్ళకు ఇదొక మంచి పరిశోధానాంశం అవుతుంది.
విరసంకాలంలో వీవీ... సముద్రంఅనే దీర్ఘ కవిత మినహా ఇక అన్ని చోట్ల... నేరుగా మాట్లాడే పద్దతినే ఎక్కువగా అనుసరించారు. విషయ ప్రాముఖ్యం వల్ల ఈ రకం కవిత సూటిగా పాఠకుడిని చేరుతుంది, మార్చింగ్ గీతం లాగ. ఇప్పుడు యువ మిత్రులు అంటున్నారో లేదో తెలియదు గాని, ఇలాంటి పద్ధతిని అప్పుడు డైరెక్ట్ పొయెంఅనే వాళ్ళం. డైరెక్టుగా వున్నది కూడా పొయెమే అనే అవగాహన వుండేది. కవిగా నా మొదటి రోజుల్లో ఈ పధ్ధతి నాకు బాగా ఇష్టమయ్యేది. (నాలో ఆ మొగ్గు ఇప్పటికీ పోయిందని అనుకోను. కవి మనస్సులో కదిలింది కదిలినట్లు నేరుగా చెప్పిన తరువాత అయితే ఏంటంటాఅనే ప్రశ్నకు జవాబిచ్చుకోబోయి, ఏవేవో మార్పులు చేసి, అయ్యగారిని చేయబోయి కోతిని చేసినట్లు... పద్యాన్ని పాడు చేసే సందర్భాలు... కవులందరికీ బాగానే వుంటాయి).
సూటిగా, ‘అనలంకారంగా మాట్లాడే పద్దతి నాకు ఎంత బాగుండేదంటే, సరిగ్గా అందుకే వీవీ కవితా సంపుటి స్వేచ్ఛ'ను విపరీతంగా ఇష్టపడి, ఆ పుస్తకాన్ని విమోచనఒక సంచికలో సాహిత్యం పేజీనంతా వుపయోగించుకుని మెచ్చికోలు సమీక్ష రాసేశాను. నేను వీవీ పుస్తకాన్ని మెచ్చుకోడం ఆయనకు గొప్ప అని కాదు, పని మాలా ఇప్పుడా మాట చెప్పడం. ఒక రాజకీయ పార్టీ అధికార పత్రికలో మరొక పార్టీకి చెందిన కవిని మెచ్చుకుంటూ రాయడం అసాధారణం. వీవీ అంటే మా పార్టీలోనూ వుండిన మంచి అభిప్రాయం వల్లనేమో, నన్నెవరేమీ అనలేదు. ఒకరిద్దరు కామ్రేడ్సు విమోచన ఆఫీసులో సన్నగా గొణిగారు తప్ప.
వరవర రావు రాసే పద్దతి నాకు నచ్చడం ఒక్కటే కాదు, అయనతో నన్ను సన్నిహితుడిని చేసింది.
ఆయన ఇతర్లతో వ్యవహరించే పద్దతి కూడా నాకు బాగా నచ్చుతుంది. ఆ పద్దతిని ఇష్టపడడమే గాని, దాన్నుంచి నేనేమీ నేర్చుకోలేకపోయాను. నేర్చుకోకపోవడం వల్ల అడుగడుగున తప్పులు చేసి, బాధ పడుతుంటాను ఇప్పటికీ.
సృజన'లో నా రచనలు అచ్చైన ప్రతి సారీ అదొక పండుగ. సంబరం అన్నానందుకే, ఈ కాలమ్ మొదట్లో.
తన వ్రాతను అచ్చులో చూసుకోడం, దాన్ని చదివి తనకు తెలిసిన వారిలో ఎవరెవరు ఎలా ఆనందిస్తుంటారో వూహించి వూహించి ఆనందించడం... సరే... అది ఏ రచయితకైనా వుండేదే. కబుర్లెన్ని చెప్పినా, ఎవరేనా రాసేది ఆ కాస్త మెచ్చికోలు కోసం కాదూ?!
సృజన'లో రచన అచ్చైతే అదనంగా మరో సంతోషం వుండేది. వరవరరావు నుంచి వచ్చే మెచ్చికోలు వుత్తరం.
రాయక రాయక ఒక కథ.. అదీ చాల వరకు ఫాంటసీ అనిపించే కథ, ‘కుక్క బతుకుఅనే పేరిటిది రాసి సృజన'కు పంపితే, దాన్ని మెచ్చుకుంటూ వీవీ రాసిన ఉత్తరం.... నేను కథలు రాయగలనని ధైర్యపడడానికి మొదటి ప్రాతిపదిక. ఆ వుత్తరం లేకపోతే మిగిలిన కొన్ని కథలైనా రాసే వాడినో కాదో. బహుశా, రాసే వాడిని కాదేమో. ప్రశంసాభిశంసల వల్ల ప్రభావితమయ్యే స్వభావం నాలో చాల ఎక్కువ.
ఎమ్మేలో వుండగా రాసిన దొంగలు' అనే కథ నిజానికి ఒక మంచి కథ. చదివి చెప్పమని కారా మాష్టారుకు ఇస్తే, ఎమ్మే అయిపోయి నేను మా వూరికి వెళ్లి పోయినా, ఆయన నుంచి ఒక్క మాట లేదు. ఒక మంచి మాట వుండి వుంటే నా నుంచి మరి కొన్ని కథలు వచ్చేవి. కథలు రాసే విద్య అలవడేది... అనుకుంటాన్నేను. సరిగ్గా అందుకే నా సీనియర్ కవిగా వీ వీ అంటే అంత గౌరవం నాకు. ఐ వో హిమ్ ఎ లాట్.
వీవీ తో సన్నిహితంగా గడిపినప్పుడంతా మంచి కవిత్వంతో గడిపినట్లుంటుంది. కాలుష్యం లేని చెరువు గట్టున కూర్చున్నట్టుంటుంది. ఆయన ఏం చెబితే అది చేద్దామనిపిస్తుంది.
వీవీ నేనూ ఒక పార్టీ కాదని ఇప్పటికే చెప్పాను. విరసంలో మేమిద్దరం ఒక యూనిట్ కూడా కాదు. ఒక వూరు కాదు. నేను యాక్టివ్ గా వున్నంత కాలం వీవీ వరంగల్ లో వుండే వారు. వరంగల్ వెళ్లినప్పుడు మేము డాక్టర్ అట్లూరి రంగారావును కలిసే వాళ్లం. వీవీ ఇంటికి వెళ్లింది లేదెప్పుడూ. ఒకటే పార్టీ కాదు గనుక, కలవాల్సిన పని వుండేది కాదు. పోటీపార్టీల వాళ్ళం కనుక, పని లేకుండా కలిస్తే వేరే అర్థాలు వచ్చేవి. విరసంసాహిత్య పాఠశాలల్లో, మహా సభల్లో కలుసుకోడమే. బహిరంగ సభల్లో ఒకే వేదిక మీంచి మాట్లాడినప్పుడు కల్సుకోడమే. కలిసినప్పుడంతా తనకు వీలయినంత దగ్గరగా వుండడానికీ, తనతో మాట్లాడానికీ ప్రయత్నించే వాడిని. ప్రయత్నానికి వేరే మోటివ్ ఏమీ లేదు. తనను మా పార్టీ వైపు రాబట్టాలని కాదు. :-)అది నాకు ఇష్టం, అంతే.
వీవీ నేనూ ఒక వేదిక మీంచి మాట్లాడిన వాటిలో కర్నూలు జిల్లా పుసులూరు బొల్లారంలో నీలం రామ చంద్రయ్య సంస్మరణ సభ నాకు బాగా గుర్తుండిపోయింది. అప్పడప్పుడే నేను గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వం చదివి ఇది బాగుందే అని అనుకుంటున్నాను. బొల్లారం వెళ్ళడానికి హంద్రీ నది ఇసుకలో నడుస్తూ శేషేంద్ర కవిత్వం బాగుంటోంది, ఎందుకు బాగుంటోంది... అని వీవీ ని ఆడిగాను.
బూర్జువా గ్లిట్టరింగ్' అని ఆయన ఇచ్చిన జవాబు. నెగటివ్ వర్డ్ అయినప్పటికీ శ్రామిక వర్గపు కన్ను కలిగిన వాడికి శేషేంద్ర అలా కనిపించడం సహజం. ఆ మాట నాకు నేను కవిత్వం చదువుకోడానికి, నా నిర్ణయం నేను చేసుకోడానికి చాల సార్లు వుపయోగపడింది. మెరిసేదంతా బంగారం కాదు. అది కవిత్వమో కాదో చూడ్డానికి దాని మీద గ్లిట్టర్ను కాస్త తుడిచి చూడాలని అనుకుంటాన్నేను... ఇప్పటికీ.
రెండు వేర్వేరు పార్టీల వాళ్ల మధ్య ఒక రకం వైమనస్యం, ‘అనుమానంవిరసంలో బాగానే వుండేవి.
చిన్న వుదాహరణ.
ఏదో సాహిత్య పాఠశాల. బహుశా వరంగల్ అనుకుంటాను. నేనూ, అరుణోదయ రామారావు సభకు దగ్గరగా రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటున్నాం. అటుగా వచ్చిన శివసాగర్ (సత్యమూర్తి) మమ్మల్ని పలకరించడానికి రాబోయి, మేము మాటలు ఆపేసి నుంచునే సరికి, బాధగా మా వేపు చూసి వెళ్ళడం... ఎప్పుడు గుర్తొచ్చినా చాల నొప్పవుతుంది, శివసాగర్ మా దగ్గరికి రావడం గొప్ప అనుకోవలసింది పోయి, అలా చేశామేమిటా అని. అలా వుండేవి రెండు పార్టీల మధ్య సంబంధాలు.
విరసం ప్రవేశార్హతలను విశాలం చేస్తూ నిబంధనావళిని సవరించాలని మేము పేచీ పెట్టుకున్నాక వైమనస్యాలు ఇంకా పెరిగాయి.
ఇలాంటప్పుడు వీవీ స్నేహ శీల స్వభావాన్ని నేను మరింత బాగా గమనించగలిగాను.
విజయవాడలో జరిగిన ఒక విరసంసర్వ సభ్య (జెనెరల్ బాడీ) సమావేశంలో.. నమ్ము డాక్యుమెంటుపేరిట మేము ప్రవేశపెట్టిన ప్రత్యామ్నాయ ప్రణాళిక మీద ఈరుమారుగా చర్చ జరుగుగుతోంది. ఏదో ఒక దైనందిన అంశం మీద నేను వీవీ తో విబేధించాను. మీరు చెబుతున్నది ఫ్యాక్చువల్ కాదు అని వీవీని అనేశాను. ఆ పక్కనే వున్న ఉషా ఎస్ డానీ నా మీదికి పరుష వాక్కులతో లేచాడు. వీవీని అంటావా కొడతాం చూడు అన్నట్టుంది డానీ దూకుడు. వీవీ వెంటనే కల్పించుకుని, హెచ్చార్కె చెప్పిన దానిలో కోప్పడాల్సిందేమీ లేదు అని డానీని కూర్చోబెట్టారు. వీవీ నుంచి ఆ సముదాయింపు లేకుంటే ఆ రోజు సర్వ సభ్య సమావేశం పరమ అసభ్యం, బీభత్సం అయ్యేది. తను విజయవాడ రౌడీ అయితే నేను రాయల సీమ ఫ్యాక్షనిస్టును కదా? :-)
సరిగ్గా ఈ ఘటన మనస్సులో వుండడం వల్లనే మిత్రుడు డానీ ఇటీవల ఫేస్ బుక్ లో ఇస్లాం మతం గొప్పలు చెప్పేసరికి నేను అవాక్కు కావలసి వచ్చింది. ఆ సర్వ సభ్య సమావేశంలో మేము చర్చించిన విషయం, అందులో నేనూ డానీ ప్రభృతులు తీసుకున్న వైఖరులు అలాంటివి మరి.
విరసంలో సభ్యత్వానికి మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానం గీటురాయిగా వుండాలని నిబంధనావళిలో వుంది. అది మారాలన్నాం మేం. భూస్వామ్యాన్ని, సామ్రాజ్య వాదాన్ని ఎదిరించే రచనలు చేసే వారంతా విరసం సభ్యులు కావడానికి వీలుగా నిబంధనావళిని సవరించాలన్నాం. కాదు మునుపటి వలెనే, మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానం మీద అంగీకారం విరసంప్రవేశార్హతగా వుండాలని... డానీ, వేణూ, వీవీ తదితరుల (ఆ పార్టీ వారి) పట్టు.
ఒక రచయితగా అప్పుడు డానీ విరసంలో సభ్యుడు. విరసం మార్క్సిజానికీ కట్టుబడుతుంది. మార్జ్సిజం మతాన్ని, భగవంతుని భావనను పూర్తిగా తిరస్కరిస్తుంది. అంటే ఆనాడు డానీ తాను స్వయంగా అజ్ఞేయ వాది మాత్రమే కాదు... రచయితలు సామ్రాజ్యవాదాన్ని, భూస్వామ్యాన్ని వ్యతిరేకించినా సరే విరసంలో సభ్యులు కావాలంటే మార్క్సిజానికి కట్టుబడితీతారాలని వాదించిన మనిషి.... ఆ కట్టుబాటు అక్కర్లేదన్న నా మీదికి ఒంటి కాలి మీద లేచిన వాడు.... మరిప్పుడిదేమిటి అని నేను ఆ ఫేస్ బుక్ చర్చలో ఆశ్చర్యపోయాను.
మిత్రుడు డానీ ఏం చెబుతారో గాని, ఈ సందర్భం నాకు మళ్లీ రాదు గనుక, నా ఆశ్చర్య కారణాన్ని సష్టం చేశాను.
నిజానికి అదొక క్లాసిక్ సైద్ధాంతిక చర్చ (డిబేట్). ఇప్పటికైనా విరసం తన పని పద్దతి మార్చుకుంటే మేలు. ఒక పార్టీ రాజకీయ ఎత్తుగడలను, దైనందిన చర్యలను పైకెత్తడం, ఎత్తకపోవడం కవులూ రచయితల ఇష్టం. అది గొప్పా కాదు, తక్కువా కాదు. ఒక పార్టీ మీద మీద విమర్శ పెట్టే వారు సహా.... భూస్వామ్యాన్ని, పెట్టుబడిదారీ విధానాన్నీ, సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి రాసే వాళ్ళందరి వేదిక కావాలి విరసం.
చెడుగు మీద అలాంటి నిర్దిష్ట వ్యతిరేకత, నిరసన, ధిక్కారం వుండడం వూరికే జరగదు. దిక్కారం తప్పనిసరి అయిన వర్గాల నుంచి, ఆ అవసరాల నుంచి అలాంటి రచయితలు నిరంతరం పుడుతూనే వుంటారు. వారందరి వేదిక కావాలి విరసం’.
ఒక నాడు, నా కవిత ఒక దాన్ని 'సృజన'లో ప్రచురిస్తూ వీవీ రాసిన మరో వుత్తరాన్ని, అందులోని ఒక వాక్యాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. ఆ కవిత శీర్షిక పదును దేరిన పాట’. దాన్ని అచ్చేస్తూ నీ పాట నిజంగానే పదునుదేరింది' అంటో వీ వీ రాశారు.
థాంక్సె లాట్, వీవీ. ఇదంతా సందర్భోచితమని మీకు అనిపించకపోతే మన్నించండి. సరి దిద్దండి.
//పదును దేరిన పాట//
గుండె మండి రాసిన గీతం
మళ్లీ గుండెను మండిస్తుంది
మండే పొయ్యి లోంచి తీసిన కట్టె
మంచు గడ్డలా ఎందుకుంటుంది
ఆకలికి అన్నం అడిగిన నేరానికి
మనుషుల్లా బ్రతుక జూచిన పాపానికి
భర్తల కట్టెదుట చెరచబడిన స్త్రీల నుండి
చెట్లకు కట్టేసి కాల్చబడిన ప్రజా వీరుల నుండి
రాస్తున్నానీ పాట
మరి ఈ పాట నీకు
హృదయ రంజనమెలా కలిగిస్తుంది
హృదయమంటూ వుంటే కదిలిస్తుంది
జీవితమనే గరుకు రాయి మీద
పదును దేరిన పాట
ఇది అలీనమెట్లా అవుతుంది
అందరికీ ఆనందం ఎట్లా యిస్తుంది
నువ్వు నా వాడివైనా కావాలి
నాకు పగవాడివైనా కావాలి
సమరంలో నాకు
పాట కూడా ఆయుధమే
(పేజ్ 20. ‘రస్తా’ 1980)
(వచ్చేవారం మళ్లీ కలుద్దాం)
1-2-2017
Top of Form

No comments:

Post a Comment