Thursday, February 9, 2017

10. నో


అంగీకరించడం కన్న
అంగీకరించకపోవడమే చాల‍ రొమాంటిక్‍
వెన్నెట్లో ఆడుకుంటున్న ఆడపిల్లలు వచ్చి
గాఢమైన చీకట్లో దాక్కున్నట్లు
నిరాకరణ అనేదొక‍ మార్మికమయిన కాంతి
మగవాళ్లు అన్నిటికీ సరే నంటారు
రాత్రింబవళ్లు బద్ధకంగా ఆవులిస్తూ
ఆడపిల్లలు అన్నిటికీ నో చెబుతారు
ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ
అంగీకరించే వాళ్ల వల్ల ప్రపంచం మారదు
అన్నీ ఎక్కడివక్కడ అలా వుండిపోతాయి
అమ్మలు లేని ఇళ్లు అడివి అడివయినట్లు
అందరం ఆడపిల్లలమయిపోయి
లోకం నుంచి మగతనాన్ని తొలగిస్తే?
భలే రొమాంటిక్ వూహ కదూ?!
మగవాళ్లూ వుండొచ్చు, చీకటి మూలల్లో,
ఒక నెసెసరీ ఈవిల్ గా, గట్టి పనిముట్లుగా
ఊహ నిజమైతే
పరస్పరం సామరస్య భావంతో కదిలే
నిరాకరణలతో సకల లోకం అందగిస్తుంది
ఢీకొని బద్దలయ్యే వినాశకర ఆకర్షణ ఆగిపోయి
విస్తృతమయ్యే విముఖ పరుగు నక్షత్రాలతో
విశ్వగోళం చలత్ కాంతులతో విరాజిల్లుతుంది
ఎప్పటికప్పుఢు, అప్పటికి వున్నదాన్ని
కాదనే గొంతుకలు ఎప్పుడూ వుండాలి
అన్నీ అవే అయిపోతే మరీ మంచిది
‘నో’ అనేదొక నిత్యావసర సరుకు
వీథి వీథి ఫెయిర్ ప్రైస్ షాపుల్లో బియ్యం కన్న
ముందు దాన్నే అమ్మాలని
మా ముక్త కంఠ డిమాండు

9-2-2017

Monday, February 6, 2017

9. ఏం జరుగుతోంది?ఏదో జరుగుతోంది
దిక్కుల మధ్య  కళపెళ మరుగుతోంది
భూగోళం గజ గజ వణుకుతోంది
గిర గిర తిరుగుతూ తనను తాను పారేసుకున్న పద్యం నేను
తిరిగి తుట్టె లోనికి దూరి కాసేపుందామని, ప్రవేశద్వారం కోసం
ఝూం ఝుమ్మని పరిభ్రమిస్తున్నాను
అదృష్టవంతులారా! మీకేం, మీకు అంతా గొప్ప శాంతి
ఎవరెవరు ఎందుకోసం పుట్టారో దాన్ని పరిభ్రమిస్తున్నారు
నేను, నేనెవర్నో తెలీదు నేనెందుకో తెలీదు ఎలాగో తెలీదు
నేనొక కక్ష్యను కోల్పోయిన నక్షత్రాన్నా?
మీలో ఎవరికేనా తెలిస్తే చెప్పరా నేనెవర్ని?
ఏ విశ్వ గర్భం లోంచి ఎదిగీ ఎదగక నేల రాలాను?
ఎక్కడి నుంచి ఎగిరి ఇక్కడ వాలాను? ఎవరు మీరు?
నాకేమవుతారు? తల్లులా తండ్రులా గురువులా?
బిస్కెట్లు విసిరి గొలుసులు లాగే యజమానులా?
ఒకే ఒక్క చీకటి ముద్ద బిలియన్ల ముక్కలైనట్లు
తిరిగి ఏకం కావడానికి పరస్పరాభిముఖంగా ఒకసారి,
విముఖంగా ఒకసారి, ఎగువగా దిగువగా ఐమూలగా
నాలోపల నా చుట్టూ సంచలిస్తున్నారు
చెకుముకి పువ్వులై అగ్ని పరాగం వెదజల్లుతున్నారు
నన్నొక భగ భగ మంటల తోటను చేస్తున్నారు?
ఎవరు మీరు, ఎవరు నేను, ఎందుకిలా???

http://epaper.andhrajyothy.com/c/16630472
clip

Sunday, February 5, 2017

8. రెప్పల మధ్య నేను

నిద్ర కోసం ఎదురు చూస్తూ 
మేల్కొని వుండే వాడిని
అందరూ మై మరిచిన చీకటి ఆడివిలో
ముళ్ళడొంకలో ఒక్కడినే నడుస్తున్నట్టు
చాల కష్టంగా వుండేది
ఇప్పుడు, నిద్ర కోసం కాకుండా
నీ కోసం మేల్కొని వుంటాను
నువ్వొస్తావనే ఒక పగటి కల తోడుగా
నువ్వు రావని నాకు తెలియదు
ఈ ఏడాది మంచు కురవదని
శనగ చేను పండదని రైతుకు తెలియనట్లు
నీ కోసం చూస్తూ నేనూ మై మరిచిపోతాను
నన్ను నేను వదిలించుకోడం ఎలాగో
ఆ రహస్యానివి నువ్వు, నీ కోసం
ఎదురుచూసే కొద్దీ, నువ్వు రాకపోతేనేం,
రెప్పల మధ్య నుంచి నేను జారిపోయి
నిద్దర వస్తోంది, థాంక్స్ అండ్ గుడ్నైట్
2 A M 23-1-2017

7. రెండు కవిత్వాలు

1.
చెమట ఏమంత రొమాంటిక్ గా వుండదు
రొమాన్స్ లేనిది కవిత్వం కాదు
దేవుడు పని చెయ్యడు
భక్తుడు పని చెయ్యడు
నెత్తిన నెమలీక పెట్టుకుని ఒకరు
తాబేటి చిప్ప పట్టుకుని మరొకరు
బజారు తిరుగుతారిద్దరూ
దేవుడికీ భక్తుడికీ మధ్య రొమాన్స్ కవిత్వం
మీరా, రూమీ, అన్నమయ్య ఎవర్నేనా అడుగు
బజారులో
అక్కడక్కడొక అందమైన భవనం
కాంపౌండులో పచ్చికలా పరుచుకున్న తీరిక
లోనికి వెళ్లి చూడు ఇల్లు, ఎక్కడా
అమ్మల చెమట మరకలుండవు
నాన్నల నుదుటి మడతలుండవు
వస్తువులన్నీ కొత్త యవ్వనంలా నునుపు
ముట్టుకోడానికి భయమేసేంత శుభ్రం
అన్నీ జాగర్తగా తుడిచి వుంచిన గాజు పదాలు
ఆ ఇంటి పెరటిలో ఒక చెట్టు
వేయించడానికి సిద్ధంగా వున్న వరుగుల్లాంటి
ఎండి పోయిన కొమ్మల్ని కొమ్ముల్లా విసిరి
పిచికలు వాలకుండా అదిలిస్తూ
చెట్టు దేని కోసమో ఎదురు చూస్తున్నది
చలి కాలం కప్పుకున్న మంచు దుప్పటి
మూసిన కిటీకీ వెనకాల ఎవరో
వూహల పూవులు విరిసే పానుపు మీద
వసంత మేఘుడు తొందరపడి
గొంతు సవరించుకుంటున్న మెత్తని చప్పుడు
అంతా మెత్తగా మెల్లగా కోజీగా హాయిగా
2.
నా బాధ వేరు
నను దహించే మోహం వేరు
నా పానుపు మీద కురుస్తున్నవి
ఊహలు కాదు, పల్లేర్లు
నాన్న
పెరటి చెట్టుకు వేలాడుతున్న నాన్న
ఆయన నుదుటి కింద తడుస్తున్న చేను నేను
ఒక్కొక్క బొట్టుగా
రాలుతున్న ఘర్మం
విడదీయని మర్మం
ఇప్పుడు నాన్న ఒక అంకె
వెయ్యో వెయ్యి కోట్లో ఎన్నో
ఎండి పోయిన కొమ్మలు
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన
ఏ దుప్పి పోగొట్టుకున్న కొమ్ములో
నా పొట్టలో గుచ్చుకుంటున్నాయి
చాల నొప్పెడుతోంది
రంపంలా
కోసుకు పోయే నొప్పి
ఊరికి నిద్రా భంగం కావొద్దని
నోరు నొక్కుకుని అరుస్తాను
నాన్నల కోసం, అమ్మల కోసం
రుజాగ్రస్తమైన మన వూరి కోసం
నొక్కివేయబడిన శబ్దాన్ని నేను, ఇప్పటి కవిత్వాన్ని
ఆకు అడుగున వణుకుతున్న కకూన్ లోని మర్మం
తొడుక్కుంటున్న రెక్కల కింద కదలనున్న గాలిని
12-1-2017

6. అడివి పిలుపు

పొద్దట్నించీ 
విసురు గాలి
కిటికీ తెరవమని గోల చేస్తోంది
నిరుటిదే
ఈ ఏడాది మళ్లీ
అదే హోరు
ఒక ప్రాచీన సముద్రానిది
రోడ్డుకు ఒక పక్కగా
పచ్చిక అంటిన టైర్లతో
వొంటరిగా ఒక కారు
దేనికో కాపలా అన్నట్టుంది
మరి, దానికి?... దానికెవరు?
కాపలా వున్నదానికెవరు కాపలా?
ప్లీజ్, మీ దగ్గరొక వాక్యం వున్నదా?
అది ఆరిపోక ముందే, దాని లోంచి
ఒకట్రెండు రవ్వలు తీసి ఇస్తారా?
మీ గుండం మీకు వుంటుందిగా?!
నేను అగ్నికి అధికారిని కాను,
నాగలి వెనక నడిచే ఎద్దును
నేనూ వండుకోడం నేర్చుకున్నాను
నిద్రపోయిన చోట నిద్రపోవడం నేర్చుకున్నాను
స్థలానికి బందీని
ఈ స్థలం నాది కాదు
మహా అయితే
నేనొక కౌలుదారును
పొద్దట్నించీ గాలి
కిటికీని బాదుతోంది
ఇనుప తలుపులు
వాటిలో వురుములు
తమ ప్రతిబింబాలు చూసుకుంటున్నాయి
మెరుపులు అందాక వచ్చి
కరిగిపోతున్నాయి, అంత నలుపు
ఎక్కడో ఒక చిన్ని పగులు
కనిపించీ కనిపించనిది
ఒక సన్నని గాలి తెమ్మెర చెక్కిలి నిమురుతుంది
చల్లని స్పర్శ, ఎక్కడిదో పసరు వాసన,
ఆడివి వాసన; వాసన కూడా ఒక మాటే
వినగల చర్మానికి
పొద్దట్నించీ
హోరు హోరుగా
ఆకు పచ్చగా
పసరు వాసనగా
మంచు స్పర్శగా
ఆడివి పిలుస్తోంది
జంతు చర్మాల దుస్తుల
ఏరిన కాయల బువ్వల అరణ్యం
పొద్దట్నించీ హోరు
ఇనుప కిటికీకి పక్షి రెక్కలు మొలుస్తున్నట్లు
23-1-2017

23-1-2017


పొద్దట్నించీ విసురు గాలి కిటికీ తెరవమని గోల చేస్తోంది న
VAAKILI.COM

ఎవడి ట్రంపు కు వాడి జై జై

చైనా, జపాన్ లాంటి చోట్ల సంగతులు తెలీవు. తెలిసిన మేరకు లోకాన్ని చూస్తే, బుర్ర తిరిగి పోతున్నది.
ట్రంపు ఏదో తప్పు చేశాడని ఇంతగా ఆడిపోసుకుంటున్నాం మనం. అంత పెద్ద తప్పు తాను ఏం చేశాడబ్బా... ?!
హిందువులు తాము హిందువులు అయ్యున్నందుకు తమకు గర్వం అంటున్నారు.
మళ్లీ అందులో రెడ్లు రెడ్ది సంఘాలుగా చేరి సగర్వ వైభవోపేత విందులు చేసుకుంటున్నారు.
కమ్మ వాళ్లు కమ్మగా వన భోజనాలెట్టుకుని కమ్మ వాళ్లుగా పుట్టడం ఎంత గొప్పయో చెబుతున్నారు.
బ్రాహ్మణులు తాము హిందువులు, అదనంగా బ్రాహ్మలు కూడా అయ్యున్నందుకు డబల్ గర్వపడుతున్నా మని అంటున్నారు.
ముస్లిములు ఇస్లాం మతంలోని తప్పులు పేదల తిప్పలు చెప్పొద్దు, మా మతం గొప్ప, మేము గొప్ప అంటున్నారు.
నాస్తికులు వూరూరు దేశ దేశాలు తిరిగి, కొత్త కొత్త మఠాలు పెట్టి తమ మార్గమే శరణం, అన్యధా నాస్తి అని వుత్సవిస్తున్నారు.
మరిలాంటప్పుడు క్రైస్తవ ట్రంపు అబార్షన్ ను వ్యతిరేకిస్తే మనం ఏ మొహం పెట్టుకుని తప్పు పడుతున్నాం?
మరలాంటప్పుడు శ్వేత జాతి ట్రంపు 'వైట్ సుప్రిమసీ' భాష మాట్లాడాడని, అమెరికా అమెరికాదే... అనగా... తెల్లోడిదే అన్నాడని ఏ నాల్కలు తిప్పి దాన్ని తప్పు పడతాం?
మనకు సిగ్గు లేదబ్బా.
హింసల అమలుదారులుగా కాసేపు, హింసల బాధితులుగా కాసేపు... కత్తికి వున్న అన్ని అంచుల్లో మనమే.
వారెవ్వా, ట్రంపు గారూ!
మీరెలా గెలిచారో తెలిసిపోయిందహో. మా మౌఢ్యాలు బద్దలయ్యే వరకు ఇగ అధికారం మీదే సారో..!
3-2-1017
*
ఏమిటి సారూ, మీరి మ‍రీనూ, ప‍ని చేసి బ‍త‍క‍డానికి, మెరుగైన‍ జీవిత‍ం జీవించ‍డానికి ప‍ని వాళ్లు ఎక్కఢికైనా వెళ్తారు. అలా ఎక్కఢికైనా వెళ్లే వీలుండే లోక‍మే మంచి లోక‍ం. అయినా ట్రంపు చ‍ర్యల‍ను వీసాల‍ గోల‍కు ప‍రిమిత‍ం చేశారేమిటి? అత‍డి సో కాల్డ్‍ ప్రో లైఫ్‍ వైఖరి వ‍ంటి వాటిని కూడా వీసాల‍ లిస్టులో వేస్తారా ఏమిటి? కాస్త గ‍మ‍నించ‍ండి. ఇక్కడి నా పోస్టులో కేంద్ర విషయ‍ం మ‍త (+కుల‍) మౌఢ్యానికి స‍మబ‍ంధించిన‍ది. ఈ వీసాల‍ గోల‍ తాత్కాలిక‍ం. నాకు తెలిసినంత‍ వ‍ర‍కు వాటికేం కాలేదు. ఇక్కఢి పెట్టుబ‍డిదారుల‍కు అవ‍స‍ర‍ం లేక‍పొతే... ట్రంప్‍ ఆర్‍ నో ట్రంప్‍... వీసాలు రావు.  ట్రావెల్‍ బ్యాన్‍ లో వున్నది... కూఢా 'మ‍న‍' వీసాల‍ గోల‍ కాదు. వీళ్లే సృష్టించిన‍ మ‍ధ్య ప్రాచ్య సంక్షోభానికి బ‍లయిన‍ ఇరాకీల‍ను, సిరియ‍న్లను.. .నిస్సహాయ‍ ముస్లిం రెఫ్యుజీల‍ను రానివ్వ‍మ‍న‍డ‍ం ఘోర‍ం, కిరాత‍క‍ం.
*
ఔన‍ంఢీ అదే నేను చెప్పేది. ప‍ని చేసుకోడానికి ఎక్కఢికైనా వెళ్లఢ‍ం స‍రైన‍దే. మీ ఇంట్లో వుండి కూడా మీరు తింటున్నది న‍ర‍మాంస‍మే, పెట్టుదారుఢు ప‍డేసిన‍ కూడే. తెలుగునాట‍ పెట్టుబ‍డిదారుడు ఢిల్లీ పెట్టుబ‍డిదారుఢితో, ఢిల్లీ పెట్టు బ‍ఢిదారుఢు వాషింగ్టన్‍ పెట్టు బ‍ఢిదారుడితో క‍లిసి ప‍ని చేస్తాఢు. పెట్టుబ‍డికి ఎల్లలు వుండ‍వు. ఉండ‍క్కర్లేదు. శ్రామికుల‍కు అస‍లే ఎల్లలు అక్కర్లేదు.
*
సార్లూ నా పోస్టు వీసాల‍కు స‍ంబ‍ంధించిన‍ది కాదు. ఆ గోల‍ ఇక‍ వ‍ద్దు. నేను ట్రంపు చ‍ర్య‍ల‍ను, దానితో స‍ంబ‍ంధ‍ం లేని వాటిని పోల్చాన‍న్న ఒక‍ మిత్రుడికి జవాబుగా నా పై కామెంట్‍ రాశాను. ఇది వీసాల‍ సంగ‍తి కాదు. ఐ వోంట్‍ ఎంట‍ర్టైన్‍ ద‍ట్‍.

Thursday, February 2, 2017

42. విర‍స‍ం నా స‍ంబ‍ర‍ం

విప్లవాలు చరిత్ర చేసుకునే సంబరాలుఅని ఫ్రెంచ్ సోర్బాన్ (1968) యూనివర్సిటీ విద్యార్టుల గోడ వ్రాతల్లో ఒకటి.
అంత కాలమూ, అలాగే వుండిందని అనలేను. పండుగ నాడు కూడా మూతి ముడుపులుంటాయి కదా?! విప్లవోద్యమంలో నా అస్తిత్వం ఎక్కువ కాలం సంబరంగానే గడిచింది. కనీసం నా వరకు, దానిలో ప్రతి కదలిక గొప్పదే. అందులో అతి ముఖ్య సంబరం విరసం తో నా సహ పయనం. బహుశా కుదరదనుకుంటాను గాని, నా అభిప్రాయాల్ని నేను కలిగివుంటూనే... విరసంలో ఒకడిగా వుండగలిగితే ఎంత బాగుండు అనుకుంటాన్నేనిప్పటికీ. అలా ఎందుకు కుదరదూ... అని... ఒక విచికిత్స కూడా వుంది. అది కుదిరే వరకు విరసం పురోగమించదు. ఇది శాపనార్థం కాదు. భారత దేశ విప్లవ గతిపై ఇది నా అవగాహన. ఎవరికి ఏ ఇబ్బంది వున్నా నేనేం చేయలేను. నా వైఖరి నేను చెప్పక తప్పదు.
ఇలా కేవలం వైఖరులు ప్రకటించుకోడమే అయితే, అది చరిత్ర కాదు, సంబరమూ కాదు. నేను ఉద్యమంతో, ‘విరసంతో నా పయనం గురించి మాట్లాడుతున్నాను. ఈ పయనంలో నేను కలిసి నడిచిన వారెందరో వున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా నన్ను నడిపించిన ముఖ్యుల గురించి చెప్పుకోడం అవసరమే అనుకుంటాను.
యాధాటి కాశీపతి తో పార్టీ పరమైన అనుబంధం వున్నంతగా సాహిత్యానుబంధం లేదు. తను మరీ రాయని భాస్కరుడేంకాదు. (విరసం లో కొందరు రాయని భాస్కరులుండే వారు... వున్నారు... కాబట్టి ప్రత్యేకించి ఈ రైడర్). ఎమర్జెన్సీ కి ముందు పెండ్యాల కిషన్ రావు ఎడిట్ చేసిన విమోచనపత్రికలో సోషల్ ఇంపీరియలిజం మీద కాశీపతి రాసిన వ్యాసాలు చూశాను. ఆ భావనను వివరించి, అప్పటి సొవియట్ రష్యా పోకడలలో సోషల్ ఇంపీరియలిజం లక్షణాల్ని చూపించిన తీరు చాల బాగుంటుంది. తన వచనం భలే పఠనీయంగా వుంటుంది. అర్ఠ శాస్త్ర సమస్యల మీద తనకు మంచి పట్టు వుండేది. ఎందువల్ల అదంతా వ్రాత రూపం తీసుకోలేదో నాకెప్పుడూ ఆశ్చర్యమే.
ఎమర్జెన్సీకి ముందెప్పుడో రెడ్ శాల్యూట్పేరుతో వెలువరించిన ఒక బక్క పల్చని కవితా సంపుటి మినహా కాశీపతి సృజనాత్మక సాహిత్యం జోలికి పోయినట్టు లేదు. నా అనుమానం... మంచి వుపన్యాసకుడు కావడం కోసం కాశీపతి చేసిన కృషి తన సృజనాత్మక రచన శక్తి మీద, ఆసక్తి మీద నెగటివ్ ప్రభావం చూపించిందని.
ఉపన్యాసకుడు తన వాక్యాల్ని వీలయినంత సరళం, సద్యోద్వేగ భరితం చేయాల్సుంటుంది. వినే వాళ్లు అప్పటికప్పుడు ఈలలు వేయాలి, చప్పట్లు కొట్టాలి, వూగిపోవాలి. కాస్త మనసులో ఇంకితే గాని తెలిసిరాని అన్యాపదేశాలు, రెఫరెన్సులు అవసరమయ్యే అల్యూజన్లు, దాచి చెప్పడం, కాస్త మార్మికత... లేకుండా సృజనాత్మక రచన సజీవం కాదు. ఉపన్యాస కళకు, సృజనాత్మక వ్రాతకు చుక్కెదురనేది ఈ మేరకు నిజం. కాశీపతిని చూసినా, జ్వాలా ముఖిని చూసినా అలాగే అనిపిస్తుంది. పెండ్యాల వరవర రావు కూడా దానికి మినహాయింపు కాదు. మంచి వుపన్యాసకుడయ్యే క్రమంలో కవిగా వీవీ పోగొట్టుకున్నదేమీ లేదని అనలేం. చలి నెగళ్లు’. ‘జీవనాడి' సంపుటాల్లోని... ముఖ్యంగా చలినెగళ్లులోని... వీవీ ఆ తరువాత కనిపించడు.
చలినెగళ్లుతరహా అచ్చపు కవిత్వంతో జీవితం మొదలెట్టడం వల్లనే కామోసు కాశీపతి, జ్వాలా ముఖి మాదిరి తన శబ్ద లౌల్యానికి తానే బలై పోకుండా, వీవీ కవితాత్మను కాపాడుకోగలిగారని నా వూహ. ఉపన్యాస, కవన కళలపై నా ఈ మాటల్ని ఒక వూహా సిద్ధాంతంగా భావించినా నా కిష్టమే. ఓపిక వున్న వాళ్ళకు ఇదొక మంచి పరిశోధానాంశం అవుతుంది.
విరసంకాలంలో వీవీ... సముద్రంఅనే దీర్ఘ కవిత మినహా ఇక అన్ని చోట్ల... నేరుగా మాట్లాడే పద్దతినే ఎక్కువగా అనుసరించారు. విషయ ప్రాముఖ్యం వల్ల ఈ రకం కవిత సూటిగా పాఠకుడిని చేరుతుంది, మార్చింగ్ గీతం లాగ. ఇప్పుడు యువ మిత్రులు అంటున్నారో లేదో తెలియదు గాని, ఇలాంటి పద్ధతిని అప్పుడు డైరెక్ట్ పొయెంఅనే వాళ్ళం. డైరెక్టుగా వున్నది కూడా పొయెమే అనే అవగాహన వుండేది. కవిగా నా మొదటి రోజుల్లో ఈ పధ్ధతి నాకు బాగా ఇష్టమయ్యేది. (నాలో ఆ మొగ్గు ఇప్పటికీ పోయిందని అనుకోను. కవి మనస్సులో కదిలింది కదిలినట్లు నేరుగా చెప్పిన తరువాత అయితే ఏంటంటాఅనే ప్రశ్నకు జవాబిచ్చుకోబోయి, ఏవేవో మార్పులు చేసి, అయ్యగారిని చేయబోయి కోతిని చేసినట్లు... పద్యాన్ని పాడు చేసే సందర్భాలు... కవులందరికీ బాగానే వుంటాయి).
సూటిగా, ‘అనలంకారంగా మాట్లాడే పద్దతి నాకు ఎంత బాగుండేదంటే, సరిగ్గా అందుకే వీవీ కవితా సంపుటి స్వేచ్ఛ'ను విపరీతంగా ఇష్టపడి, ఆ పుస్తకాన్ని విమోచనఒక సంచికలో సాహిత్యం పేజీనంతా వుపయోగించుకుని మెచ్చికోలు సమీక్ష రాసేశాను. నేను వీవీ పుస్తకాన్ని మెచ్చుకోడం ఆయనకు గొప్ప అని కాదు, పని మాలా ఇప్పుడా మాట చెప్పడం. ఒక రాజకీయ పార్టీ అధికార పత్రికలో మరొక పార్టీకి చెందిన కవిని మెచ్చుకుంటూ రాయడం అసాధారణం. వీవీ అంటే మా పార్టీలోనూ వుండిన మంచి అభిప్రాయం వల్లనేమో, నన్నెవరేమీ అనలేదు. ఒకరిద్దరు కామ్రేడ్సు విమోచన ఆఫీసులో సన్నగా గొణిగారు తప్ప.
వరవర రావు రాసే పద్దతి నాకు నచ్చడం ఒక్కటే కాదు, అయనతో నన్ను సన్నిహితుడిని చేసింది.
ఆయన ఇతర్లతో వ్యవహరించే పద్దతి కూడా నాకు బాగా నచ్చుతుంది. ఆ పద్దతిని ఇష్టపడడమే గాని, దాన్నుంచి నేనేమీ నేర్చుకోలేకపోయాను. నేర్చుకోకపోవడం వల్ల అడుగడుగున తప్పులు చేసి, బాధ పడుతుంటాను ఇప్పటికీ.
సృజన'లో నా రచనలు అచ్చైన ప్రతి సారీ అదొక పండుగ. సంబరం అన్నానందుకే, ఈ కాలమ్ మొదట్లో.
తన వ్రాతను అచ్చులో చూసుకోడం, దాన్ని చదివి తనకు తెలిసిన వారిలో ఎవరెవరు ఎలా ఆనందిస్తుంటారో వూహించి వూహించి ఆనందించడం... సరే... అది ఏ రచయితకైనా వుండేదే. కబుర్లెన్ని చెప్పినా, ఎవరేనా రాసేది ఆ కాస్త మెచ్చికోలు కోసం కాదూ?!
సృజన'లో రచన అచ్చైతే అదనంగా మరో సంతోషం వుండేది. వరవరరావు నుంచి వచ్చే మెచ్చికోలు వుత్తరం.
రాయక రాయక ఒక కథ.. అదీ చాల వరకు ఫాంటసీ అనిపించే కథ, ‘కుక్క బతుకుఅనే పేరిటిది రాసి సృజన'కు పంపితే, దాన్ని మెచ్చుకుంటూ వీవీ రాసిన ఉత్తరం.... నేను కథలు రాయగలనని ధైర్యపడడానికి మొదటి ప్రాతిపదిక. ఆ వుత్తరం లేకపోతే మిగిలిన కొన్ని కథలైనా రాసే వాడినో కాదో. బహుశా, రాసే వాడిని కాదేమో. ప్రశంసాభిశంసల వల్ల ప్రభావితమయ్యే స్వభావం నాలో చాల ఎక్కువ.
ఎమ్మేలో వుండగా రాసిన దొంగలు' అనే కథ నిజానికి ఒక మంచి కథ. చదివి చెప్పమని కారా మాష్టారుకు ఇస్తే, ఎమ్మే అయిపోయి నేను మా వూరికి వెళ్లి పోయినా, ఆయన నుంచి ఒక్క మాట లేదు. ఒక మంచి మాట వుండి వుంటే నా నుంచి మరి కొన్ని కథలు వచ్చేవి. కథలు రాసే విద్య అలవడేది... అనుకుంటాన్నేను. సరిగ్గా అందుకే నా సీనియర్ కవిగా వీ వీ అంటే అంత గౌరవం నాకు. ఐ వో హిమ్ ఎ లాట్.
వీవీ తో సన్నిహితంగా గడిపినప్పుడంతా మంచి కవిత్వంతో గడిపినట్లుంటుంది. కాలుష్యం లేని చెరువు గట్టున కూర్చున్నట్టుంటుంది. ఆయన ఏం చెబితే అది చేద్దామనిపిస్తుంది.
వీవీ నేనూ ఒక పార్టీ కాదని ఇప్పటికే చెప్పాను. విరసంలో మేమిద్దరం ఒక యూనిట్ కూడా కాదు. ఒక వూరు కాదు. నేను యాక్టివ్ గా వున్నంత కాలం వీవీ వరంగల్ లో వుండే వారు. వరంగల్ వెళ్లినప్పుడు మేము డాక్టర్ అట్లూరి రంగారావును కలిసే వాళ్లం. వీవీ ఇంటికి వెళ్లింది లేదెప్పుడూ. ఒకటే పార్టీ కాదు గనుక, కలవాల్సిన పని వుండేది కాదు. పోటీపార్టీల వాళ్ళం కనుక, పని లేకుండా కలిస్తే వేరే అర్థాలు వచ్చేవి. విరసంసాహిత్య పాఠశాలల్లో, మహా సభల్లో కలుసుకోడమే. బహిరంగ సభల్లో ఒకే వేదిక మీంచి మాట్లాడినప్పుడు కల్సుకోడమే. కలిసినప్పుడంతా తనకు వీలయినంత దగ్గరగా వుండడానికీ, తనతో మాట్లాడానికీ ప్రయత్నించే వాడిని. ప్రయత్నానికి వేరే మోటివ్ ఏమీ లేదు. తనను మా పార్టీ వైపు రాబట్టాలని కాదు. :-)అది నాకు ఇష్టం, అంతే.
వీవీ నేనూ ఒక వేదిక మీంచి మాట్లాడిన వాటిలో కర్నూలు జిల్లా పుసులూరు బొల్లారంలో నీలం రామ చంద్రయ్య సంస్మరణ సభ నాకు బాగా గుర్తుండిపోయింది. అప్పడప్పుడే నేను గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వం చదివి ఇది బాగుందే అని అనుకుంటున్నాను. బొల్లారం వెళ్ళడానికి హంద్రీ నది ఇసుకలో నడుస్తూ శేషేంద్ర కవిత్వం బాగుంటోంది, ఎందుకు బాగుంటోంది... అని వీవీ ని ఆడిగాను.
బూర్జువా గ్లిట్టరింగ్' అని ఆయన ఇచ్చిన జవాబు. నెగటివ్ వర్డ్ అయినప్పటికీ శ్రామిక వర్గపు కన్ను కలిగిన వాడికి శేషేంద్ర అలా కనిపించడం సహజం. ఆ మాట నాకు నేను కవిత్వం చదువుకోడానికి, నా నిర్ణయం నేను చేసుకోడానికి చాల సార్లు వుపయోగపడింది. మెరిసేదంతా బంగారం కాదు. అది కవిత్వమో కాదో చూడ్డానికి దాని మీద గ్లిట్టర్ను కాస్త తుడిచి చూడాలని అనుకుంటాన్నేను... ఇప్పటికీ.
రెండు వేర్వేరు పార్టీల వాళ్ల మధ్య ఒక రకం వైమనస్యం, ‘అనుమానంవిరసంలో బాగానే వుండేవి.
చిన్న వుదాహరణ.
ఏదో సాహిత్య పాఠశాల. బహుశా వరంగల్ అనుకుంటాను. నేనూ, అరుణోదయ రామారావు సభకు దగ్గరగా రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటున్నాం. అటుగా వచ్చిన శివసాగర్ (సత్యమూర్తి) మమ్మల్ని పలకరించడానికి రాబోయి, మేము మాటలు ఆపేసి నుంచునే సరికి, బాధగా మా వేపు చూసి వెళ్ళడం... ఎప్పుడు గుర్తొచ్చినా చాల నొప్పవుతుంది, శివసాగర్ మా దగ్గరికి రావడం గొప్ప అనుకోవలసింది పోయి, అలా చేశామేమిటా అని. అలా వుండేవి రెండు పార్టీల మధ్య సంబంధాలు.
విరసం ప్రవేశార్హతలను విశాలం చేస్తూ నిబంధనావళిని సవరించాలని మేము పేచీ పెట్టుకున్నాక వైమనస్యాలు ఇంకా పెరిగాయి.
ఇలాంటప్పుడు వీవీ స్నేహ శీల స్వభావాన్ని నేను మరింత బాగా గమనించగలిగాను.
విజయవాడలో జరిగిన ఒక విరసంసర్వ సభ్య (జెనెరల్ బాడీ) సమావేశంలో.. నమ్ము డాక్యుమెంటుపేరిట మేము ప్రవేశపెట్టిన ప్రత్యామ్నాయ ప్రణాళిక మీద ఈరుమారుగా చర్చ జరుగుగుతోంది. ఏదో ఒక దైనందిన అంశం మీద నేను వీవీ తో విబేధించాను. మీరు చెబుతున్నది ఫ్యాక్చువల్ కాదు అని వీవీని అనేశాను. ఆ పక్కనే వున్న ఉషా ఎస్ డానీ నా మీదికి పరుష వాక్కులతో లేచాడు. వీవీని అంటావా కొడతాం చూడు అన్నట్టుంది డానీ దూకుడు. వీవీ వెంటనే కల్పించుకుని, హెచ్చార్కె చెప్పిన దానిలో కోప్పడాల్సిందేమీ లేదు అని డానీని కూర్చోబెట్టారు. వీవీ నుంచి ఆ సముదాయింపు లేకుంటే ఆ రోజు సర్వ సభ్య సమావేశం పరమ అసభ్యం, బీభత్సం అయ్యేది. తను విజయవాడ రౌడీ అయితే నేను రాయల సీమ ఫ్యాక్షనిస్టును కదా? :-)
సరిగ్గా ఈ ఘటన మనస్సులో వుండడం వల్లనే మిత్రుడు డానీ ఇటీవల ఫేస్ బుక్ లో ఇస్లాం మతం గొప్పలు చెప్పేసరికి నేను అవాక్కు కావలసి వచ్చింది. ఆ సర్వ సభ్య సమావేశంలో మేము చర్చించిన విషయం, అందులో నేనూ డానీ ప్రభృతులు తీసుకున్న వైఖరులు అలాంటివి మరి.
విరసంలో సభ్యత్వానికి మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానం గీటురాయిగా వుండాలని నిబంధనావళిలో వుంది. అది మారాలన్నాం మేం. భూస్వామ్యాన్ని, సామ్రాజ్య వాదాన్ని ఎదిరించే రచనలు చేసే వారంతా విరసం సభ్యులు కావడానికి వీలుగా నిబంధనావళిని సవరించాలన్నాం. కాదు మునుపటి వలెనే, మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానం మీద అంగీకారం విరసంప్రవేశార్హతగా వుండాలని... డానీ, వేణూ, వీవీ తదితరుల (ఆ పార్టీ వారి) పట్టు.
ఒక రచయితగా అప్పుడు డానీ విరసంలో సభ్యుడు. విరసం మార్క్సిజానికీ కట్టుబడుతుంది. మార్జ్సిజం మతాన్ని, భగవంతుని భావనను పూర్తిగా తిరస్కరిస్తుంది. అంటే ఆనాడు డానీ తాను స్వయంగా అజ్ఞేయ వాది మాత్రమే కాదు... రచయితలు సామ్రాజ్యవాదాన్ని, భూస్వామ్యాన్ని వ్యతిరేకించినా సరే విరసంలో సభ్యులు కావాలంటే మార్క్సిజానికి కట్టుబడితీతారాలని వాదించిన మనిషి.... ఆ కట్టుబాటు అక్కర్లేదన్న నా మీదికి ఒంటి కాలి మీద లేచిన వాడు.... మరిప్పుడిదేమిటి అని నేను ఆ ఫేస్ బుక్ చర్చలో ఆశ్చర్యపోయాను.
మిత్రుడు డానీ ఏం చెబుతారో గాని, ఈ సందర్భం నాకు మళ్లీ రాదు గనుక, నా ఆశ్చర్య కారణాన్ని సష్టం చేశాను.
నిజానికి అదొక క్లాసిక్ సైద్ధాంతిక చర్చ (డిబేట్). ఇప్పటికైనా విరసం తన పని పద్దతి మార్చుకుంటే మేలు. ఒక పార్టీ రాజకీయ ఎత్తుగడలను, దైనందిన చర్యలను పైకెత్తడం, ఎత్తకపోవడం కవులూ రచయితల ఇష్టం. అది గొప్పా కాదు, తక్కువా కాదు. ఒక పార్టీ మీద మీద విమర్శ పెట్టే వారు సహా.... భూస్వామ్యాన్ని, పెట్టుబడిదారీ విధానాన్నీ, సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి రాసే వాళ్ళందరి వేదిక కావాలి విరసం.
చెడుగు మీద అలాంటి నిర్దిష్ట వ్యతిరేకత, నిరసన, ధిక్కారం వుండడం వూరికే జరగదు. దిక్కారం తప్పనిసరి అయిన వర్గాల నుంచి, ఆ అవసరాల నుంచి అలాంటి రచయితలు నిరంతరం పుడుతూనే వుంటారు. వారందరి వేదిక కావాలి విరసం’.
ఒక నాడు, నా కవిత ఒక దాన్ని 'సృజన'లో ప్రచురిస్తూ వీవీ రాసిన మరో వుత్తరాన్ని, అందులోని ఒక వాక్యాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. ఆ కవిత శీర్షిక పదును దేరిన పాట’. దాన్ని అచ్చేస్తూ నీ పాట నిజంగానే పదునుదేరింది' అంటో వీ వీ రాశారు.
థాంక్సె లాట్, వీవీ. ఇదంతా సందర్భోచితమని మీకు అనిపించకపోతే మన్నించండి. సరి దిద్దండి.
//పదును దేరిన పాట//
గుండె మండి రాసిన గీతం
మళ్లీ గుండెను మండిస్తుంది
మండే పొయ్యి లోంచి తీసిన కట్టె
మంచు గడ్డలా ఎందుకుంటుంది
ఆకలికి అన్నం అడిగిన నేరానికి
మనుషుల్లా బ్రతుక జూచిన పాపానికి
భర్తల కట్టెదుట చెరచబడిన స్త్రీల నుండి
చెట్లకు కట్టేసి కాల్చబడిన ప్రజా వీరుల నుండి
రాస్తున్నానీ పాట
మరి ఈ పాట నీకు
హృదయ రంజనమెలా కలిగిస్తుంది
హృదయమంటూ వుంటే కదిలిస్తుంది
జీవితమనే గరుకు రాయి మీద
పదును దేరిన పాట
ఇది అలీనమెట్లా అవుతుంది
అందరికీ ఆనందం ఎట్లా యిస్తుంది
నువ్వు నా వాడివైనా కావాలి
నాకు పగవాడివైనా కావాలి
సమరంలో నాకు
పాట కూడా ఆయుధమే
(పేజ్ 20. ‘రస్తా’ 1980)
(వచ్చేవారం మళ్లీ కలుద్దాం)
1-2-2017
Top of Form