Sunday, January 29, 2017

41. కన్నీటి మరక - రాసే తీరిక

‘విమోచన’ పత్రికను ఎడిట్ చేస్తున్నప్పుడు ‘విరసం’ లో చాల యాక్టివ్ గా వుండే వాడిని.
నిజానికి సాహిత్యమే బతుకై వుండాలని నాకెప్పుడూ వుండేది. ఇప్పటికీ వుంది. సాహిత్య రంగంలో అంత ఎక్కువ క్రియాశీలంగా వుండడం... అప్పుడు... ఆ కొన్ని ‘విమోచన' సంవత్సరాలు... కుదిరింది. ఇప్పుడు సమయం వుంది గాని, స్థలం లేదు.
సాధారణంగా పూర్తి కాలం పార్టీ కార్యకర్తలు (హోల్ టైమర్లు) రాజకీయేతర విషయాల్ని ఎక్కువగా పట్టించుకోరు. పనుల వొత్తిడి వుంటుంది గాని అదే కారణమనడం సరి కాదు. సమయం లేక పోవడం పూర్తి కారణం కాదు. రాజకీయేతరాల మీద ఆసక్తి లేకపోవడమే అసలు కారణం. మనుషుల ఆసక్తుల తీవ్రతను బట్టి వ్యాకోచించే శక్తి వుంటుంది కాలానికి.
కొందరు మనుషులు తమ మేజర్ పని ఏమిటో నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకోక పోతే పని జరగదు. రాయడమే ప్రధానం అనుకుంటే రాజకీయం, రాజకీయమే ప్రధానం అనుకుంటే వ్రాత.... రెండో మెట్టు మీదికి చేరక తప్పదు. హోచిమిన్, మావో గొప్ప కవులు. వారికది రాజకీయం తరువాతే.
కాస్త మన లోకి మనం చూసుకుంటే తెలిసిపోయే సంగతి. మనం పూర్తి నిర్ణేతలం కాదు. పూర్తి నిర్ణేతలమనుకుని, గొప్ప నిర్ణయం చేసుకున్నామని ప్రగల్భిస్తారు కొందరు. నిర్ణయంలో తప్పు జరిగిందని కుంగిపోతారు కొందరు. రెండూ తప్పే. మనం పూర్తి నిర్ణేతలం కాము.
నా మట్టుకు నేను... నా నిర్ణయం ప్రకారమే అయితే ఏ గురజాడ దారిలోనో నేరుగా వ్రాత గాడినయ్యుండే వాడిని. రాజకీయం నా ఆసక్తి కాదు. ( నన్ను నేను గురజాడతో పోల్చుకోడం కాదిది. ఆ దారిలో జీవించే వాడినని అర్థం...).
పత్రిక వుద్యోగం, వ్రాత పని ఒకటి కాదు. అవి ఒకటయ్యుంటే, ఈ వ్యవస్థ రచనాక్తిని కూడా రెమ్యునరేటివ్ చేసిందని మెచ్చుకునే వాడిని. రచన అనే పనినే ఎంచుకునే వాడిని. కాని, కాదు.
ఉద్యోగం కేవల వుద్యోగమే. ఒళ్లమ్ముకోవడమే. అంత కంటె ఎక్కువా కాదు, తక్కువా కాదు.
చిన్న వుదాహరణ. నేను ‘ఈనాడు’లో పని చేస్తున్నప్పుడు త్రిపిర్నేని శ్రీనివాస్ ‘ఆంధ్ర జ్యోతి’ ఆదివారం మాగజైన్ పని చూస్తుండే వాడు. ఒక రోజు తను ఫోన్ చేసి, నన్నొక ప్రశ్న అడిగాడు. తను పని చేస్తున్న చోట కాకుండా మరో పత్రికలో తన పొయెమ్స్ ప్రచురించాలంటే ఎలా అని. ఆ పని నువ్వు చేస్తున్నావు కదా ఆ కిటుకేమిటో చెప్పు అని అడిగాడు నన్ను. తనకు అసలు సంగతి చెప్పాను. నేను నా తెలిసిన పేరుతో కాకుండా వేరే పేరుతో రాస్తున్నాను. అది దొంగతనం. నా పేరుతో పుస్తకం వేశాను గాని, అవి వేరే దొంగ పేర్లతో అచ్చయినవని మా ఎడిటర్ కి తెలవదు, ఇక ముందు తెలిసే అవకాశం వుంది, సో, ఇక రాయబోవడం లేదు అని చెప్పాను. (ఆ మాట నిలబెట్టుకోలేకపోయాను. రాసి, సొంత పేరుతో అచ్చేసి, యజమానికి తెలిసిపోయి, ఇక కుదరదని వుద్యోగం వదులుకుని నానా అగచాట్లు పడ్డాను. ఆ సంగతి తరువాత చెబుతా).
త్రీశ్రీ కి, నాకు వచ్చిన కష్టం చూశారుగా. రాయడమనేది ఒక మానసిక వ్యవహారం. దాన్ని ఇవాళ ఎవరూ రెమ్యునరేటివ్ చేయడం లేదు. చేయరు. వ్యాపార దృష్టితో రాసేట్టయితే వ్రాత పనిలో స్వాతంత్ర్యం, స్వచ్ఛందం వుండవు. వ్యాపారి లాభసాటిగా అమ్ముకోగలిగినదే రచయిత రాయాలి. రచయితే వ్యాపారి అయినప్పుడు కూడా యవ్వారం అంతే.
పత్రికలో ఉద్యోగం, వ్రాత అనే ఆసక్తి ఒకటి కాదు. వ్రాతను నా మేజర్ పనిగా నిర్ణయించుకోవడం నాకు సాధ్యం కాలేదు. అది సాధ్యం అనే వూహ కూడా నాకు రాలేదు. వచ్చే అవకాశం లేదు. ఈ అవకాశ రాహిత్యం ఒక వర్గ సమస్య (క్లాస్ క్వెశ్చన్). నేటి భారతంలో... పోనీ, నిన్నటి భారతంలో అదొక కుల సమస్య కూడా. అది ఎట్లన్నన్...
‘రాసే ఆసక్తి సజావుగా నెరవేరే అవకాశం’ కొందరికి మాత్రమే వుంటుంది. ఆ మనిషి దానికి తగిన సాంఘికార్థిక ‘స్థితి'లో పుట్టి, పెరిగి వుంటాడు. లేదా తరువాతయినా ఆ ‘స్థితి’ అతడికి, ఆమెకు దొరికి వుంటుంది. దీనికి నా దుఃఖమే ఉదాహరణ.
నాకు సైన్సు మీద చాల గౌరవం వుంది గాని, ఆసక్తి లేదు. విద్యార్థిగా సైన్సు కాకుండా సాహిత్యం చదువుకోవాలని చాల కోరిగ్గా వుండేది. అది జరిగి వుంటే నాకు ఎంతో మేలు జరిగేది. అలా చదువుకోవచ్చు అనే వూహ కూడా నాకు రాలేదు. నేను వుండిన ‘స్థితి'లో నాకు ఆ వూహ వచ్చే అవకాశం లేదు.
చెప్పాను కదూ! ఎనిమిదో తరగతిలోనో, తొమ్మిదో తరగతిలోనో నేను కవిత్వం రాస్తున్నానని తెలిసి మా నాన్న, చిన్నాన్న పిలిచి “ఉరేయ్, నీకు ఇదేం పనిరా, నువ్వేమన్నా బాపనోడివా” అని తిట్టి, నేను కవిత్వం రాసుకున్న లెక్కల బుక్కును పొయ్యిలో పెట్టి, మళ్లీ అలాంటి పని చెయ్యొద్దని భుజం మీది చర్నాకోల వూపి ‘భయం పెట్టి’న కథ మీకిదివరకే చెప్పినట్లున్నాను.
ఆ తరువాత సాహిత్యం కాకుండా, సైన్సు చదువుకోడం బలవంత మాఘ స్నానమే.
విజయవాడ లొయోలా కాలేజీలో ఓ సారి ఒక ఎలక్యూషన్ కాంపెటీషన్ జరిగింది. ‘మన దేశానికి ప్రజాస్వామ్యం మంచిదేనా’ అనేది చర్చనీయాంశం. పోటీలో గెలవాలని కాదు గాని, నాకు ఏదో చెప్పాలని వుండి దానిలో పాల్గొన్నాను. చర్చాంశాన్ని వదిలేసి, ‘దేశంలో ఇప్పుడున్నది ప్రజాస్వామ్యం కాదు... ఇది వుంటేనేం వుండకుంటేనేం’ అని మాట్లాడాను.
ఇది ప్రజాస్వామ్యం కాదు అనడానికి నేనిచ్చిన ఉపపత్తి ఏమిటో మీరు వూహించి వుంటారు. ‘నాకు సైన్సు చదువుకోవాలని లేదు. అయినా చచ్చినట్టు సైన్సు చదువుకుంటున్నాను. నాకు సాహిత్యం చదువుకోవాలని వుంది. కాని, అలా చదువుకోలేను. మరి ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?’ అని చాల మనస్సు నొచ్చుకుంటూ మాట్లాడాను.
నా వాదం అక్కడ ఎవరికీ అంతు బట్టలేదు. నా అవేదన ఎవరికీ అర్థం కాలేదు. నా తరువాత మాట్లాడిన ఒక విద్యార్థి ‘నువ్వు సాహిత్యం చదువుకుంటానంటే, ఆ స్వాతంత్ర్యం ఎందుకు లేదు. తప్పు నీది. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని అంటావెందుకు?' అని కోపంగా దెప్పి పొడిచాడు.
నాకు తిరిగి మాట్లాడే అవకాశం రాలేదు గనుక చెప్పలేదో, అప్పుడు నాకు తోచలేదో గాని; ఆ రోజు నేను సరిగ్గానే మాట్లాడానని ఆ తరువాత చాల సార్లు అనుకున్నాను. నేను చదువును చదువు కోసం చదువుకోలేదు. వూరిలో చాలీ చాలని నేల చెక్కతో, ఎండ వానలకు ఎద్దు ముడ్డి పొడుచుకుంటూ బతకొద్దని, ఆ పని నాకు చాత కాదని, పట్నంలో నీడ పట్టున కూర్చుని ఉద్యోగాలు చేసి బతకాలని అనుకున్నాను. అలా బతకడానికి ఉద్యోగం అవకాశం ఇస్తుంది కాబట్టి చదువుకున్నాను. మా అమ్మా నాన్న తమ నెత్తురు, చెమట ఖర్చు పెట్టి చదివించింది నన్ను ‘విజ్ఞాన ఖనిని' చేద్డామని కాదు. కవిని చేద్దామని కాదు. కవిత్వాలు రాసినందుకు నన్ను పట్టుకుని నువ్వేం బాపనోడివా అని నాన్న తిట్టడం వెనుకనున్న సాంఘిక నేపధ్యమది. అదొక సాంఘిక ఆవశ్యకత. నాకు ఎంచక్కా, సేద్యం పనులు నేర్పించి వుంటే యుక్తవయసు రాగానే ఓ పిల్లను చూసి పెండ్లి చేసి, సంసారం అప్పజెప్పి... అనగా... సేద్యం పనులు అప్పజెప్పి... వాళ్లు విశ్రాంతి తీసుకునే వారు. అలా చేసి వుంటే, నా సంగతేమో గాని, అమ్మ నాన్న కాస్త ఎక్కువ సుఖంగా, మరింత ఎక్కువ కాలం జీవించే వారు. నేనొక రివర్స్ యయాతిని. వాళ్ల జీవితం తీసేసుకుని జీవిస్తున్నాను. పరమ కృతఘ్నుడను.
మంచి వుద్యోగాలు వచ్చే చదువులు చదివి కుటుంబాన్ని ‘పై’కి తీసుకెళ్తానని చదివించిన నాన్న... నేను కవిత్వం రాస్తానంటే హర్షించకపోవడం, సాహిత్యం చదువుకోవాలనే వూహను కూడా నాలో మొలకెత్త నీయకపోవడం అతి సహజం. అదొక జీవన వాస్తవికత. ‘విధి' అంటే మరేమీ కాదు, ఈ వాస్తవికతే.
అంతెందుకు, నిన్న మొన్నటి వరకు... మనకు వున్న... బాగా మన్నన పొందిన కవులూ రచయితలెవరు? ఏ వర్గాల వారు? అనూచానంగా బతకడానికి శారీరక శ్రమ చేయనవసరం లేని ‘తీరిక’ వర్గం వారవునా కాదా? టాల్స్టాయ్, రవీంద్రుడు, గురజాడ, శ్రీశ్రీ... నువ్వు కతలు కాకరకాయలు రాస్తే బువ్వెవడు పెడతాడోయ్ అని వాళ్ళను వాళ్ళ అమ్మా నాన్నలు మందలించి వుంటారా?
ఇది కేవలం నా ఒక్కడి కథ కాదు. నా లాంటి వాళ్ళు చాల మంది కథ.
వ్యక్తిగతంగా, నా ఈ దుఃఖం బాగా తెలిసిన ఒకే ఒక మనిషి నా ప్రాణ స్నేహితుడు తమ్మినేని పుల్లయ్య. చెయి చాచి కన్నీరు తుడిచిన వాడి కన్న ప్రాణ స్నేహితుడు ఇంకెవరుంటారు ఎవరికైనా?!
బీఎస్సీ కాలంలో మేమిద్దరం లొయోలా ‘న్యూ హాస్టల్’ లో వుండే వాళ్ళం. ఒక రోజు తను నా గదికి వచ్చే సరికి డైరీ రాసుకుంటున్నాను. ‘నాకీ సైన్సు చదువు వద్దు, నాకిది ఇష్టం లేదు’ అని బాధగా రాసుకుంటున్నాను. తను ఎప్పుడు వచ్చాడో ఏమో. దగ్గరగా వచ్చి ‘ఏందిరా ఏడుస్తున్నావెందుకు' అనే దాక తెలీలేదు. నా కళ్ళలోంచి నీటి బిందువులు జారి డైరీ పేజీ మీద పడుతున్నాయి. పుల్లయ్య తన చేత్తో కన్నీరు తుడిచిన మెత్తని స్పర్శానుభూతి నా చెంప మీద ఇప్పటికీ తాజాగా వుంది. ఆ డైరీ నోట్ బుక్ హైదరాబాదులో మా హబ్సిగూడా ఇంటిలో ఇప్పటికీ వుంది. అందులో అమూల్య విషయాలేం లేకపోయినా, ఆ కన్నీటి మరక కోసమే అప్పుడప్పుడూ చూస్తుంటాను.
బీఎస్సీ లోనే ‘జ్యోతి’ మాస పత్రికలో ‘జీవితం కాగితం’ అని నా కవిత వస్తే, చూసి, ‘నువ్వు ఆర్టిస్టువి రా’ అని పుల్లయ్య నోటి మాట, అదేమంత పెద్ద మాట అని, తను గుర్తొచ్చినప్పుడంతా నాకు గుర్తొస్తుంది. ఎందుకు? ఈ ప్రశ్నకు ఏది జవాబో అదే నేను.
అలాంటి వాడికి ‘విమోచన' వర్కింగ్ ఎడిటర్ పని కారణంగా రాష్ట్ర విప్లవ సాహిత్యోద్యమంతో సన్నిహితంగా మెలగే వీలు దొరికింది. అది కాకుండా ఇంకే పని చేసినా, నాకు ఆ ‘వరం’ దొరికేది కాదు. మధుసూదనరావు, రమణా రెడ్డి, వీవీ, నగ్నముని, చెర వంటి మనుషులతో కలిసి కూర్చుని మాట్లాడే ‘అదృష్టం’ కలిగేది కాదు.
పార్టీ హోల్ టైమర్ అయ్యాక గ్రామసీమల్లో పూర్తి కాలం కార్యకర్తను కావాలనుకున్న మాట నిజమే. పార్టీ అప్పటి రాష్ట్ర కార్యదర్శి ప్రసాదాన్నకు (పైలా వాసుదేవ రావుకు) ఉత్తరాల మీద ఉత్తరాలు రాసిన మాట నిజమే. ఇలాగే పట్నంలో వుంచితే పార్టీ నన్ను పోగొట్టుకుంటుంది అని అన్నను బెదిరించిన మాట కూడా నిజమే. కాని ‘విమోచన' పనిలో వుండడం వల్లనే, సాహిత్య రంగంతో సన్నిహితుడినయ్యాను. లేకుంటే అయ్యే వాడిని కాదు.
(చలసాని ప్రసాద రావు గారి మాట పకారం నేను ‘ఈనాడు’ వసుంధర విభాగంలో చేరి వుంటే ఏమయ్యేది? తరువాతెప్పుడో ఆ పనిలో వుండిన బుర్రా సుబ్రహ్మణ్యం గారిని చూశాను. బహుశా, నేనూ ఆయన లాగే జర్దా పాన్ నముల్తూ గడిపే వాడిని. నా వ్రాత నన్ను రాయనీయక, రాయకుండా వూరికే వుండనీయక వెంట పడే ఉద్యోగ బాధ్యత బరువు కింద నలిగి, నేను నేను కాకుండా పోయే వాడిని. బుర్రా సుబ్రహ్మణ్యం గారు ఈ వాక్యాల్ని చూస్తే బాగుండు, నన్ను కోప్పడ్డానికైనా...)
హైదరాబాదులో పార్టి కేంద్ర కార్యాలయంలో వుండడం వల్ల ఇతర్లు ఏం రాస్తున్నారో చూడడానికి ఎక్కువ అవకాశం వుండేది. హైదరాబాదు విరసం యూనిట్ సమావేశాలంటే అప్పుడు ప్రాణం. విశాఖలో ‘అసభ్యుడి'గా ఎలా క్రమం తప్పకుండా వెళ్ళే వాడినో, హైదరాబాదులో సభ్యుడిగా అలా వెళ్ళే వాడిని యూనిట్ సమావేశాలకు. వెళ్ళే వాడిని కాదు, వెళ్ళే వాళ్ళం... నేనూ జయ. మాతో వున్నప్పుడు మమత కూడా వచ్చి, పక్కన ఆడుకుంటూ గడిపేది. అది మా నిజమైన వీకెండ్ పిక్నిక్ లా వుండేది. సమావేశాలు కూడా చాల ఎక్కువగా ఇందిరా పార్కు, ల్యాండ్ స్కేప్ గార్డెన్, పబ్లిక్ గార్డెన్స్ వంటి చోట్లనే జరిగేవి.
మొదట్లో చెరబండరాజు, నగ్నముని, భూపాల్, నమ్ము, నేను, జయ... కాస్త తక్కువగానే కలిసే వాళ్ళం. అప్పుడు నమ్ము వాళ్లిల్లు వనస్థలి పురంలోని రెండు మూడిళ్లలో ఒకటి. ఆ యింట్లో జరిగిన ఒక సమావేశానికి వచ్చిన నగ్నముని, పాపం.... ‘మామకీనాలస రవము మీ మనసు నిల్పగదే’ అన్నట్టు తన భిన్న యోచనలేవో చెప్పడానికి ప్రయత్నించాడు. ఆ యోచనలేవో గుర్తు లేదు గాని, తను భలే జ్ఞాపకం వున్నాడు. నాకు గుర్తున్నంత వరకు నగ్నముని ఒకటి రెండు సమావేశాలకే వచ్చాడు. ఆ తరువాత తొందరలోనే విరసం ను వదిలేసి వెళ్ళాడు. తన ‘పోస్ట్ మార్క్సియన్’ తరహా కొన్ని మాటలతో నాకు ఇబ్బందిగా వున్నా, తను కవిత్వం చెప్పే పద్దతి మీద ఇష్టంతో వీలయినంతగా కలవడానికి ప్రయత్నిస్తుంటాను ఇప్పటికీ.
‘విమోచన’ కాలం మొత్తం ‘విరసం’ మా జీవితంలో అతి ముఖ్య భాగం. విరసం యూనిట్ సమావేశం వస్తోందంటే రెండు మూడు రోజుల నుంచి ఎదురు చూసే వాడిని. సమావేశంలో ఏవో సభల ఏర్పాట్ల గురించి, పోస్టర్లు అతికించడం వంటి పనుల గురించి, వాటి కయ్యే ఖర్చుల గురించి... మాట్లాడుకోడం కాగానే కొందరు వెళ్ళడానికి లేచే వారు. అదేమిటి కవిత్వం చదువుకోమా అని ఆడిగి మరీ కూర్చోబెట్టాల్సి వచ్చేది. విరసంలో వ్రాసే వారే కాదు, వ్రాత ఆసక్తి లేని వారు కూడా కొందరుండే వారు. వాళ్ళు అక్కడ ఎందుకబ్బా అనిపించేది. ఆ పరిస్థితి ఇప్పటికీ వుండొచ్చు.
హైద‍రాబాదు విర‍స‍ం యూనిట్‍ లో ఆర్కే, కొండ‍న్న మొద‍లైన‍ వారు అప్పుడేం చేస్తున్నారో ఇప్పుడూ అదే చేస్తున్నారు. ఎప్పుడూ బిజీ. కవనం, కథనం వారి ప్రధాన ఆసక్తులు కాదు. ఎన్‍. వేణు గోపాల్‍ అప్పుఢు వ‍ర‍ంగ‍ల్‍ విర‍స‍ంలో వుండే వాఢు. 'సృజ‍న‍'తో అనుబ‍ంథం వ‍ల్ల తన‍ 'కొమ‍ర‍య్య' రోజుల‍ నుంచీ తెలుసు. సృజ‍న‍లో కొమ‍ర‍య్య వ‍చ‍న‍ ర‍చ‍న‍ ఒకటి చూసి, చాల‍ బాగుంద‍ని, ఎవ‍రా అని అడిగి మ‍రీ తెలుసుకున్నాను. అంత‍ చిన్న వ‍య‍సులో ఇంత‍ మ‍ంచి తెలుగు అని ఆశ్చర్యపోయాను. వేణు 'పావుర‍ం' కవితా స‍ంపుటి చూసే వ‍ర‍కు త‍ను క‍విత్వ‍ం రాస్తాఢ‍నే స‍ంగ‍తి నాకు తెలీదు. విమ‍ల‍క్క విద్యార్థినిగానే ప‍రిచ‍య‍మ‍యినా, త‍న‍ను ర‍చ‍యిత‍గా క‍లుసుకున్నది బాగా త‍రువాతే.
హైద‍రాబాదు యూనిట్‍లో అప్పుఢు ర‍త్నమాల‍, అమర్, రాజగోపాల్, ప్రశాంత్, దామెర రాములు, గన్ మ్యాన్, నర్సా గౌడ్ మరి కొందరు అంత చురుగ్గా రాస్తూ, తరువాతెందుకు ఆగిపోయారనేది నన్ను పీడించే ప్రశ్న. వాళ్ళు ఉద్యమాలకు దూరమయ్యారు అనేది సరైన జవాబు కాదు. వాళ్ళు తాము అభిమానించిన పార్టీలకి దూర(?)మయ్యుండొచ్చు. ఆ కారణంగానూ... విరసం నిర్మాణ, స్వభావాల కారణంగానూ... విరసం కు కూడా దూరమయ్యుండొచ్చు. దట్స్ ఓకే. కవిత్వానికి, కథకు, జనరల్ గా సాహిత్యానికి ఎందుకు దూరమయ్యారు? చాల కాలం తరువాత, ఇటీవల హెచ్ ఎం టీ వీ తో ఒకటిన్నర నెలల చిన్న స్టింట్ లో రాజగోపాల్ తో గడిపాను. తనలో అదే సరదా ఫెర్వర్ ను చూశాను. మరి వాళ్ళంతా కవులుగా కథకులుగా ఎందుకు మూగవోయారు? అప్పుడు వారితో రాయించిన ‘భావన’ల్లోనే, ఆ భావనలతో వారి సంబంధంలోనే లోపం వున్నదా?
విరసం ఒక సంస్థగా ఆ లోపాన్ని దిద్దుకోడానికైనా, ఈ విచికిత్స అవసరం.
ఈ విచికిత్స కొత్తది కూడా కాదు. దాన్ని సరి చేసుకుని, విరసం మరింత ఇంక్లూజివ్ గా మారాలని నేనూ మరి కొందరం అప్పుడు కూడా ఆశ పడ్డాం. వాదించాం. ఈ ఆశ, ఈ వాదం మాలో వున్నందువల్లనే... ఈ దిశగా పని చేసే ఉద్దేశంతోనే మేము... మా రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం... రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ జిల్లాలకు వెళ్లి యువ రచయితలను కలిసే వాళ్లం. పిడిఎస్యూ, పిఓడబ్ల్యూ, ఇతర ప్రజా సంఘాల లోని యువ రచయితలతో మాట్లాడి ఆభిప్రాయాల్ని కూడ గట్టే వాళ్ళం.
‘విమోచన'లో చివరి పేజీలో సగం భాగం సాహిత్యానికి కేటాయించి అప్పుడప్పుడే రాస్తున్న ఉద్యమ కవుల కవిత్వాలు ప్రచురించడం నాకు ఒక గొప్ప అనుభవం. ఇప్పుడు ‘ఈమాట’, ‘వాకిలి’ వంటి కొన్ని ఆన్లైన్ పత్రికలు చేసే పని ఆ అర పేజీ కోసం నేను చాల ఇష్టంగా చేసే వాడిని. కుప్పలు తెప్పలుగా కవితలు వచ్చేవి. వాటి కోసం మంచి ఫైలు నిర్వహించేది. కవిత ఏమాత్రం బాగున్నా ఆ రచయితతో మాట్లాడి, ఉత్తరం రాసి.. దాన్ని మెరుగు పరిచి ప్రచురించే వాళ్లం. లక్నా రెడ్డి అంత బాగా కవిత్వం రాస్తాడు కదా, అక్షరాలకు పొల్లు ఇవ్వకపోవడం మాకు భలే తమాషా అనిపించేది. నారాయణ స్వామి (వెంకటయోగి) కవితను మరీ పెంచి రాసే వాడు. కవిత్వానికి బ్రివిటీ ప్రాణమని తనతో తరచు చెప్పే వాడిని.
తరువాత్తరువాత నిజామాబాద్ నుంచి బిఎన్బీ, సిహెచ్ మధు, కరీంనగర్ నుంచి తోట మహదేవ్, నూతన్, దేవేందర్, ఖమ్మం నుంచి ఎన్ తిర్మల్, రోషన్ షుకూర్, మహబూబ్ నగర్ నుంచి జనజ్వాల, రేడియం... నాకు ఇలా పరిచయమైన వారే.
ఇదంతా విరసంలో మా పనికి అనుబంధం. తరువాత్తరువాత, మా అభిప్రాయాలతోనే ఒక సంస్థ (కూడా) వుంటే బాగుంటుందని ‘ఉదయ సాహితి' అనే సంస్థను మొదలెట్టినప్పుడు... ఈ పరిచయాలు మాకు ప్రారంభ పెట్టుబడి అయ్యాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే, పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా, ‘విమోచన’ పని కాకుండా మరో పనిగా యువ రచయితలను సమీకరించే పని తీసుకునే వాడిని. అందుకోసం.. నిజామాబాదు, ఖమ్మం, కరీంనగర్, విశాఖ, నెల్లూరు, ప్రకాశం... జిల్లాలకు వెళ్లి వచ్చే వాడిని. పనిలో పనిగా పార్టీ, ప్రజా సంఘాల బహిరంగ సభల్లో పాల్గొనే వాడిని.
సుమారు పన్నెండేళ్లు.... ఒక అద్బుత అనుభవం. ఒక అనుభవం కాదు. పలు అనుభవాలు.
నాకు రాయడం అంతకు ముందూ తెలుసు గాని, రాయడం మంచి పని, రాయి అని ప్రోత్సహించే వాళ్ళు కుటుంబంలో లేరు, కుటుంబ స్నేహాలలో లేరు. విమోచన, విరసం అనేవే లేకపోతే అంత పట్టుదలగా ఆ పని కొనసాగించే వాడిని కాదు. జెనరల్ మిల్యూలో కరిగిపోయే వాడిని కూడా. మా నాన్న చర్నాకోల విసుర్ల నుంచి కాపాడి నన్ను ఒక రచయితను చేసింది నక్సల్బరి రాజకీయం, విరసం సాహిత్యం.
మా నాన్న చర్నాకోల నా పాఅయింటాఫ్ డిపార్చర్. పార్టీ నుంచి వైదొలగాక నా మొదటి కవితా సంపుటి ‘అబద్ధం’ అంకితం పేజీ చర్నాకోలతో మొదలై నన్ను మీ దగ్గర వదిలేసి వెళ్తుంది.
//అసలు బయల్దేరింది//
ఎర్రకనుల నాన్న గారి చర్నాకోల చలచ్ఛలాంచలాల మీదుగా మారుమూల పల్లెటూరి మారుమూల ఇంటిలో గుడ్డి కిరసనాయిలు బుడ్డి దీపం పొగ చూరిన కళ్ళు నులుముకుంటూ తేలు కుట్టి చనిపోయినా నా స్మృతి వదలని సావాసకాడు శివరామూ నేనూ భట్టీయం వేసిన భాస్కర శతకోత్పలమాలావృత భయంకర బాల్య సశేషాన్ని ఈ బృహద్వాక్య గుహాంతర్భాగ కుడ్యాల మీద భవిష్యత్తరాల కోసం లిఖించడానికి తగిన ఓజో గుణమూ నారికేళమో మరేదో పాకమూ ఒప్పిన సుదీర్ఘ కవితా శకలాన్నొకదాన్నయినా కనడానికి పనికొచ్చే గడ్డీ గాదం తిని తిని మరి మరి నెమరేయడం కోసమైనప్పుడు తొందరపడి ఇదేమిటిలా క్షణం క్షణం రెప్పలతో కత్తిరించిన దృశ్యాల ముక్కల్ని అవి పూలో మంచి ముత్యాలో పులుకడిగిన సత్యాలో అయినట్లు మాలలు మాలలుగా కూర్చి కలల సుగంధాలద్ది మిత్రుడు రవి కుంచె సాయమడిగి రఘునూ రఘుబాబునూ సలహాలడిగి శామిక హస్తాల్ని అక్షరాలకు ఆకారాలడిగి బైండింగ్ ప్రాకారాలడిగి ముస్తాబై ఓసారి నన్ను నీ హృదయం కొసలతో స్పృశించవా అని ఒకటో రెండో వందో క్షణాలో దినాలో నీ కపాల పేటికలో ఓ మూల దాక్కోనివ్వవా అని అడుగుతూ ప్రేమగా ఎందుకిలా నిలబడ్డానో
అందుకే
ఈ కవిత్వం
నీకే
అంకితం
(‘అబద్దం’ 1987-92)
(వచ్చేవారం మరి కొన్ని విరసం కబుర్లు)
25-1-2071

No comments:

Post a Comment