Thursday, January 26, 2017

‘తెంస్కృత’ మీడియం తీసేద్దురూ!


ఆంధ్ర ప్రదేశ్ పభుత్వం పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తోంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియమే. ఇది తిరోగమన చర్య అని కొందరి కోపం. ఈ కోపం పురోగామి ముసుగేసుకున్న తిరోగామి. తెలంగాణ కూడా ఈ బాట పట్టాలి. నిజానికిది, వుమ్మడి రాష్ట్రంలోనే వినిపించిన ఆలోచన. సక్రమంగా అమలు జరగాలి. అసలు సర్కారు బడులకే ఎసరు పెట్టే పథకం కాగూడదు.
తెలుగు వాళ్ళం ఏనాడూ తల్లి భాషలో చదువుకోలేదు. గతంలో విద్య సంస్కృతంలో వుండేది. వేదాలు అవే కదా? మధ్యలో... సాంతం సంస్కృతమై చివర చిన్ని తెలుగు తోకల భాషలో వుండేది. ఇవాళ పుస్తకాల్లో కనిపించేది దాని అపభ్రంశ రూపం. ఆ ‘మీడియం’ వాళ్ళే ఇప్పటికీ మన తెలుగు వ్రాతగాళ్ళు.  
ఇంట్లో ఒక భాష, స్కూలులో ఒక భాష, పై చదువులకు ఇంకో భాష. ఇదే ఇన్నాళ్ళు తెలుగు జీవితం. పోరాడాల్సింది దేని కోసం? ఇన్నాళ్ళ ‘తెంస్కృత’ మాధ్యమం కోసమా? దానికి బదులు ఇంట్లో తెలుగు, బడిలో ఇంగ్లీషు ఎందుకు నేర్వ రాదు? మన పిల్లలు బతకడానికి అవసరమైన శిక్షణ ఎందుకు పొందరాదు,?  
మీడియం తెలుగులో వుండాలనే వారు దానికి చేసిందేం లేదు. దానికి తగిన ఆలోచనలు ఇచ్చిందీ లేదు. వట్టి సెంటిమెంటు. తెలుగు వారు ఒక రాష్ట్రంగా ఏర్పడడం, బోరు కొట్టి విడిపోవడం… ఓహ్, చాల చాలా జరిగాయి. తెలుగులో చదువుకున్నా బతకొచ్చని భరోసా ఇవ్వలేకపోయారు. ఇవ్వలేరు.  
తెలుగు మాధ్యమ ప్రేమికులు దాదాపు అందరూ ‘వున్నతులే’. వారి పిల్లలను ఇంగ్లీషులోనే చదివించారు, మునుపు సంస్కృతం చదువుల్లాగ. వారు పోగొట్టుకున్నదేమీ లేదు. చాల గెల్చుకున్నారు. నేడు దేశ దేశాలలో తెలుగు సంస్కృతికి వారే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అన్ని  అవకాశాల్ని ‘సొమ్ము’ చేసుకుంటున్నారు. అందరూ ఇంగ్లీషులో చదివితే తమ ప్రత్యేకత పోతుందనే భయం వారికి లేదని అనలేం.  
ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకున్న పిల్లలు త్వరగా నైపుణ్యాలు సంపాదించి ‘లాభసాటి’ పనుల్లో వ్యవహర్తలవుతున్నారు. తెలుగు మీడియం పిల్లలకు.. కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఇంగ్లీష్ భాషా శక్తి సంపాదించుకోడానికే సగం యవ్వనం గడిచిపోతున్నది.
తెలుగు పత్రికల్లో పని చేయాలన్నా ఇంగ్లీషు అవసరం. తెలుగు సాహిత్యాన్ని సరిగ్గా అధ్యయనం చేయాలన్నా ఆంగ్ల భాష, సాహిత్య రీతులు తెలిసిన పిల్లల ముందు తెలుగు మీడియం పిల్లలది తెల్ల మొగం. తెలుగు కవిత్వం విరివిగా రాసే వాళ్ళంతా ఇంగ్లీషు బాగా వచ్చిన వారే. సాహిత్యం, కళల్లో మెరవాలన్నా ఇంగ్లీషు తప్పదు. ఇంట్లో మాట్లాడే తెలుగు వుంటే పాటలు పాడే తెలుగు, వూహలు చేసే తెలుగు వస్తాయి. అమ్మ నేర్పిన మాటగా, తెలుగు వుంటుంది. ఉండదంటారా, పోనివ్వండి, దిగులెందుకు? అమ్మలు నేర్పేది ఇంగ్లీషే అయితే రేపదే మన తల్లి భాష.  
ఇంకో దైనందిన ఉదాహరణ: ఒక కమ్యూనిస్టు కార్యకర్త మార్క్సిస్టు పుస్తకాలు చదువుకుని పని చేస్తేనే తన పనికి న్యాయం చేయగల్గుతాడు. లేకుంటే గొర్రె దాటే కదా?! చావు బతుకుల పోరులో తెలిసీ తెలియక దిగి, తెలిసీ తెలియనివి మాట్లాడుతూ, వింటూ, తెలిసీ తెలీని దేనికో బలవుతాడు. సుమారు డెభ్భై ఏండ్ల ప్రగతిశీల వుద్యమంలో పుస్తకాలకు ఆధారపడదగిన అనువాదాలు లేవు. దానికి కూడా ‘ఇంగ్లీషు’ వాళ్ళ మీద ఆధారపడడమే.
విశాల ప్రజానీకానికి తప్పక తెలియాల్సిన వాటికే ఈ గతి. గహనమైన విజ్ఞాన శాస్త్రాల మాటేమిటి? శాస్త్ర ‘భావన’లు ఊహా సిద్ధాంతాలుగా మొదలై, సత్యాలుగా రుజువై పురోగమిస్తాయి. విద్యార్థి నిరంతరం ఒక డైలాగులో పాల్గొంటూ వుంటాడు. డైలాగు క్లాసు రూంలో కావొచ్చు, పుస్తకంతో కావొచ్చు. కాన్ఫరెన్సులో కావొచ్చు. మాధ్యమం ఇంగ్లీషు కాకుంటే నత్తి మాటలు తప్పవు. ఎందుకలా? ఏ పరమార్థానికి?
పురోగామి (అడ్వాన్స్డ్) శాస్త్రాలు తెలుగులో లేవు. మునుపు హైస్కూలు తరువాత చదువులకు తెలుగు పుస్తకాలుండేవి కావు. ఇప్పుడు డిగ్రీ స్టాయి వరకు పుస్తకాలు అనువాదమయి వుండొచ్చు. ‘భాషా సంపాదకుడి’గా అలా తయారయ్యే పుస్తకాల్ని, అవి తయారయ్యే క్రమంలో చూసే మహదవకాశం నాకు కలిగిందొక సారి. విద్యార్థుల మీద జాలి వేసింది.  తెలుగు మీద, శాస్త్రం మీద ఏమైనా ప్రేమ వుంటే, ఆ పుస్తకాల తెలుగు దెబ్బకు దయ్యం దిగిపోక తప్పదు.
పిల్లలు ఇంటా బయటా ఒకే భాషలో వ్యవహరించాలనడం హేతు విరుద్ధం. రెండు భాషల పిల్లల్లోనే  వివేచన, లోకజ్ఞానం ఎక్కువ. ఇంట్లో తెలుగు నేర్చిన పాప బడిలో ఇంగ్లీషు ఇట్టే నేర్చుకోగలుగుతుంది. ఒక భాష నేర్చుకున్న అనుభవం మరో భాషకు పనికొస్తుంది.
శాస్త్ర భావనలు పారిభాషిక పదాలలో వుంటాయి. పరిభాష పట్టుబడితే పదాలు మోసే విజ్ఞానం పట్టుబడినట్టే. భావనలను చాల కాలం కొన్ని పదాలుగా నేర్చుకుని, కొన్నాళ్ళయ్యాక అదే భావనలను వేరే పదాలుగా వ్యవహరించాల్సి వస్తే విద్యార్థికి అంతా కొత్త గా నేర్చుకున్నట్టుంటుంది. అతడి మదిలో అనుక్షణ అనువాదం జరగాల్సిన క్లేశం వుంటుంది. ఇంగ్లీషు-మాత్రు-భాషీయులతో, ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకున్న తెలుగు పిల్లలతో.... అంత వరకు తెలుగులో చదివిన వాడు పూర్తి స్థాయిలో పోటీ పడలేడు. అప్పుడప్పుడే తరుణులవుతున్న పిల్లలకు ఈ మార్పు పెద్ద  షాక్. ఆత్మ న్యూనతకు గురవుతారు. వీళ్లు కొత్తదానికి అలవాటు పడేలోగా... ఆ కష్టం లేని పిల్లలు నాయకత్వ స్థానాలకు చేరి వుంటారు. ఇదేం పోటీ? ఇదేం న్యాయం?
ప్రభుత్వ బడులలో తెలుగు మాధ్యమం లేకపోతే పిల్లలు బడి మానేస్తారననడం మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టే సామెతే. టీచర్లు, సౌకర్యాలు లేకపోతే విద్యార్థులు రారు. రాకపోవడం ఇప్పటికే జరుగుతోంది. ‘తెలుగు మీడియం’ ఈ పతనాన్ని ఆపలేదు. బడులు బాగా నడపాలని పాలకుల మీద ఒత్తిడి చేయాలి, వ్యర్థ పోరాటాలలో యువశక్తిని వృధా చేసే బదులు.
పేద పిల్లలు ప్రభుత్వ బడులకు వచ్చేది తెలుగు కోసం కాదు. తెలుగు మీడియం అనే ‘అవాంఛనీయం’ వున్నా ప్రైవేటు స్కూళ్ల వలె రుసుములుండవని వస్తారు. మరిన్ని బడుల కోసం, వాటి బాగు కోసం ప్రభుత్వాన్ని డిమాండు చేయాలి.
ఈ చర్య కార్పొరేట్ సంస్థలకు మేలని ఒక వాదం. విద్య ఏ మాధ్యమంలో వున్నా మేలు కార్పొరేట్ సంస్థలకే. పాలిస్తున్నది కార్పొరేట్ సంస్థలే. ప్రజలు వాటి నుంచి తమను తాము కాపాడుకోడానికి విద్యా మాధ్యమం రక్షా కవచం కాదు.
published in AJ 23 1 2017
http://epaper.andhrajyothy.com/c/16342174

clip

No comments:

Post a Comment