Friday, January 20, 2017

40. బహిరంగమే యుద్ధ రంగం

వర్తమానం మరీ అశాంతిగా వున్నప్పుడు గతం కాగితం మీదికి సౌమ్యంగా ప్రవహించదు. బాహిర జగత్తు అంతరంగం లోనికి విసిరే పెనుగాలులు సృష్టించే తుపానులు... మనస్సును నెమ్మదిగా కదలనీయవు. కల్లోల కడలిని చేస్తాయి. మానసిక శక్తులను వ్యర్థం చేస్తాయి. :-)
‘విమోచన' ప్రారంభ దినాల్ని ఆవిష్కరించాలని కలం సవరించే సమయానికి... నిన్నట్నించీ... ఒకే సారి పలు దిశల నుంచి పెను గాలులు. వీటికి పేరు పెట్టడం కుదరదు. ఆ గాలులను వూదే నోళ్లు నాకు బాగా ఇష్టమైన వాళ్ళవి. అందువల్ల వాటి నుంచి దూరం వుండడం కుదరదు. ఫీలయ్యింది చెప్పే పని మానెయ్యలేను.
ఇవాళ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చూశాను. కొందరు తమకు తాము సెలబ్రిటీలు కావడానికి తెగ ప్రయత్నిస్తారని, ఈ తెగులు మునుపు సాహిత్యానికి పరిమితమయ్యుండేది, ఇప్పుడది ‘యాక్టివిస్టుల’కు పాకుతోందని గడియారం భార్గవ పోస్టు. ఇది తను కొత్తగా కనిపెట్టిన వాస్తవం కాదు. చిరకాల, అనూచాన వాస్తవం. ఇప్పటికీ వుంది. మరి చాల కాలం వుంటుంది. బహిరంగ విమర్శ అనే కుంకుడు రసం పోసుకుని తలంటుకుని వదిలించుకోవాలి> ఎప్పటికప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది అవసరమైన విమర్శ.   
ఇక్కడ యాక్టివిస్టులు అనేది ఛోటా, బడా రాజకీయ నాయకులనబడు వారికి ప్రియ వాచకం (యూఫెమిజం). నాయకులలో తమను తాము సెలబ్రిటీలుగా మలచుకునే దుష్ప్రవర్తన లేకపోతే త్యాగాల చాళ్లు పోసిన విప్లవాల పంటకు ఆ చీలికల తెగుళ్లేమిటి? చీలిక జరిగినప్పుడంతా అది ఆవసరమై జరిగిందా? లేదు. చిన్ని చిన్ని గుంపులు వుండిపోయిన గుంపులు నిజంగా అంత పని వుండి అలా  వుండిపోయాయా? లేదు. అర్థం లేని సెలబ్రేషన్ కోసం.
ఇదంతా బహిరంగంగా, నిర్మొహమాటంగా మాట్లాడుకోడం చాల బాగుంది.
బహిరంగ చర్చ ఒక్కోసారి ఇబ్బందికర మలుపులు తీసుకోవచ్చు. తన్నుకోడం బాగానే జరగొచ్చు. దానికి తగిన జాగర్తలు తీసుకుంటూనే గట్టిగా మాట్లాడవలసిందే. మాట్లాడకుండా వుంటే తన్నుకోమా ఏం? మన స్వభావం తన్నుకోవడమయితే జరిగేది తన్నుకోవడమే. తన్నుకుంటామనే సందేహంతో మౌనం అక్కర్లేదు.    
రాను రాను...  కాస్త తక్కువ ఇంటెన్సిటీ తన్నులు, ఆ తరువాత తన్నులు లేని మాటలు నేర్చుకుంటాం. నేర్చుకోడానికి, అలవర్చుకోడానికి మాట్లాడుకోడం అనే దానికి మించి దారి లేదు. అవసరమైనవన్నీ చదువుకుని.. అనగా.. తగిన సిద్ధాంతాలు  తయారించుకుని.. ఆ తరువాత తలపడదాం అంటే కుదరదు. మనుషులం, అలా వుండం. ఉండక్కర్లేదు. పోరాడుతూ నేర్చుకోవలసిందే. మిత్రులతో తలపడడం కూడా తలపడుతూ నేర్చుకోవలసిందే.
జాక్విస్ డెరీడా నో, ఆయన అనుయాయిలెవరోనో అన్నారు, అన్ని సిద్దాంతాలూ ‘రిట్రోస్పెక్టవ్’ అని. అంటే, అన్ని సిద్ధాంతాలూ అప్పటి వరకు జరిగిన ఆచరణ ఆధారంగా తయారైనవే. ఆచరణకు ముందు తయారైన సిద్ధాంతం లేదట. నిజమేననిపిస్తోంది.  
పకడ్బందీ సిద్ధాంతం తయారయ్యే వరకు అగడం కుదరదు. నడుస్తూ నడుస్తూనే నడవడం నేర్చుకోవలసిందే. ఆరోగ్యకరమైన వాద పద్ధతిని కూడా వాదించే క్రమంలో నేర్చుకోవలసిందే.
మన తప్పులను మనమే  దిద్దికోవాలి. మన ఒప్పుల నుంచి మనం మేలొందాలి. ఇదే కదా రోజువారీ జీవితం. ఆ పనికి చేయాల్సించి కూడా మాట్లాడుకోడమే. సంగతి నా సొంతం అయితే నాలో నేను మాట్లాడుకోవచ్చు. ఇది ‘మన' (వుమ్మడి) విషయమయితే మనలో మనం మాట్లాడుకోవాలి. నాలో నేను చేసేది రహస్యంగా చెయ్యొచ్చు గాని మనలో మనం చేసేది రహస్యంగా ఎలా చేస్తాం? సామాజిక విషయాల్లో ప్రశంస, విమర్శ రెండూ బహిరంగంగా చేయవలసిందే.
నత్తల్లా గుల్లల్లోకి ముడుచుకుపోతే, నత్త నడక కదలికలు కూడా వుండవు. వీలయినంత బహిరంగం.... మావో మాటల్లో చెప్పాలంటే ... ‘అబౌ ది బోర్డ్’ పద్ధతీ, వేయి పూల వికాసాన్ని సహించే మనస్సూ కావాలి.
ఈ రోజు పేస్ బుక్ పోస్ట్ అంటూ నేను ప్రస్తావించిన ‘సెలబ్రిటీ స్టేటస్ కోసం యావ’ అనేది భార్గవ పొరపడినట్లు ఇవాళ మొదలైంది కాదు. అనూచానమైనది. ఆ మానవీయ దోషం మీద పోరాటమూ అనూచానమైనదే.
ఒక దోషాన్ని ఎత్తి చూపుతున్న ఈ పోస్టులోనే మరొక దోషం వుంది. ఆయన ఈ మాట ఎవరి గురించి అంటున్నారో తెలీదు. అదే ఇందు లోని దోషం. ఎవరో ఒకరి గురించి లేదా ఒక గుంపు గురించి అంటున్నారు. అదెవరో చెప్పకపోతే  ఆ మాట వల్ల ప్రయోజనం లేదు. నష్టం వుంది.
నేను కూడా ఫేస్ బుక్ లో వున్నాను. ఈ మాటల టార్గెట్ నేను కాదు. ఆయన మాటల్లోని ఎవిడెన్సు బట్టి ఇది నా అంచెనా. నా లాగే చాల మంది ఈ మాట తమ కోసమేమో అని లిప్తకాలమైనా అనుకుని వుంటారు. అంతలోనే ఇది తమ కోసం కాదని, పక్క వారి కోసమని సర్దుకుని వుంటారు. ఇది తమ కోసమే అనుకున్న వారు కూడా, ఇది ఎవరికోసమో అయినట్లు మాట్లాడుతారు, యుక్తిగా. ఈ మాట చెప్పింది  గడియారం భార్గవ. సో, ఇది భార్గవ గురించి కాదు. ఇది ఆయనకు వర్తించదు. అలాగే ఈ మాటకు తందాన తాన అనేస్తే చాలు,  ఆ వంత పాతగాడు... ఉదాహరణకు నేను...  కూడా దుష్కీర్తి పరిధిలోకి రాను. తను ఎవరిని ఉద్దేశించి అన్నాడో ఆయనే బహిరంగంగా వంత పలికేసినా, ‘య్యోవ్ అది నువ్వే’ అని భార్గవ అనలేడు. ఇలాంటి విమర్శ వల్ల ప్రయోజనం వుండదు, అనవసరంగా మురిక్కాల్వను కెలకడం తప్ప.
ఎవరయితే ఏం? పేరు పెట్టి మరీ విమర్శించాలి. అంతకు మించి దారి లేదు. విమర్శించకుండా వుండే దారి కూడా లేదు. ఈ ఊరూ పేరూ చెప్పకుండా బండలేసే ధోరణి సోషల్ మీడియా, అచ్చు పత్రికల్లో అస్సలు బాగోదు. మీరు ఎవరినైనా ఏమైనా అనదల్చుకున్నారా? మీరు అంటున్నది మీ ఇద్దరి మధ్య వివాదం కాకుండా లోకానికి సంబంధించినదా? అయితే, మీరు తప్పకుండా ఫేస్ బుక్ వంటి రచ్చబండ మీద ఆ సంగతి మాట్లాడవచ్చు. మాట్లాడాలి కూడా.
పబ్లిక్ ప్రశంస పబ్లిక్ విమర్శ అవసరం. పబ్లిక్ ప్రశంస మంచిని పెంచుతుంది. పబ్లిక్ విమర్శ చెడును తుంచుతుంది.
ఇదిగో ఈ పాయింటు వద్దనే నా ‘విమోచన’ తొలి దినాల జీవితం గుర్తుకొస్తోంది.
అప్పటికి ఛైనాలో మావో నేత్రుత్వంలో మొదలయిన సాంస్కృతిక విప్లవం ముగిసి, దాని మీద ఈరుమారుగ చర్చ జరుగుతోంది. నా మట్టుకు నాకు... సాంస్కృతిక విప్లవం గురించి అంతకు ముందు తెలిసినా, ఆ డిబేట్ నుంచి నేర్చుకున్నదే ఎక్కువ. ‘విమోచన' వర్కింగ్ ఎడిటర్ గా కాస్త కుదురు దొరికిన తరువాత ఆ డిబేట్ ని  పట్టించుకోగలిగాను.
చైనా సాంస్కృతిక విప్లవం అంటే నాకు చాల ఇష్టం. కొంత ‘అతి’ జరిగిందని, కొందరు దాన్ని దుర్వినియోగం చేశారని పెద్ద విమర్శ వుంది. ఉండాల్సిన విమర్శే. అయినా సాంస్కృతిక విప్లవమంటే నాకు ఇష్టం. అసలు సాంస్కృతిక విప్లవమే ‘విమర్శ’కు సంబంధించినది. రెడ్ గార్డుల అతి ముఖ్య పోరాట రూపం బహిరంగ విమర్శ. నాయకుల మీద, నాయకులలోని ధోరణుల మీద బహిరంగ విమర్శ. రోడ్ల మీద విమర్శ. ‘బొంబార్డ్ ది హెడ్ క్వార్టర్స్'  వుద్యమ కేంద్ర నాదం. ‘హెడ్ క్వార్టర్స్’ అంటే పార్టీ నాయకత్వమే.
అందులో విమర్శ పూర్తిగా బహిరంగం. యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పేడ తట్టలు మోయించి, శరీర శ్రమ అంటే ఏమిటో తెలుసుకోండని నినదించడం ఆ బహిరంగ విమర్శలోని ఒక అద్భుత ఘట్టమే. అది పెద్ద అత్యాచారమని కొందరు మాట్లాడుతుంటారు. ప్రొఫెసర్లు పేడతట్టలు మోస్తే ఏం?  
ఈ బహిరంగ విమర్శా ధోరణి కేవలం చైనాకు పరిమితం కాదు.  
రహస్యంగా కారడవుల్లో కాకుండా, బహిరంగ వీధుల్లో చెలరేగిన 1968 విద్యార్ఠుల వీర చర్యలు కూడా అందుకే గొప్పవి. తరువాత్తరువాత అతి 'రహస్యం'లో కూరుకు పోకపోయి వుంటే, నక్సల్బరి స్ఫూర్తి కూడా అదే. అందుకే నక్సల్బరి కుదురులో పెరిగిన యువతీ యువకులు బహిరంగ/ఇంటింటి పోరాట రూపాలైన స్త్రీవాద/ దళిత వాదాల్ని దాదాపు అవి కనిపించిన తక్షణం గుండెలకు హత్తుకున్నారు. చేతులు చాచి, కావిలించుకున్నారు. ఈ విషయంలో, నక్సల్బరి ఎలిమెంట్స్ కన్న దళిత వాద నాయకులు వెనుకబడ్డారని నా అభియోగం.  దాదాపు ప్రతి దళిత వాద చలనం నక్సల్బరి ఎలిమెంట్స్ వల్ల ‘పదును దేరింది’. వీళ్లే స్త్రీవాద, దళిత వాదాలకు నిలకడ కలిగిన కుదురు కల్పించారు. తొలి రోజులలో ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళను ఒక సారి చూడండి. దాదాపు వారందరి నేపధ్యం నక్సల్బరీయే.
చైనా సాంస్కృతిక విప్లవం, 1968 విద్యార్ఠులు, పెద్ద అమెరికా మీద చిన్న వీత్కాంగ్ విజయం... వీటన్నిటిలో... ఒక వుమ్మడి లక్షణం నిర్భయమైన బహిరంగ విమర్శ.
ఇప్పుడు ఎరీనా మరింత పెరిగింది. పెరిగిన ఈ ఎరీనా లోంచి కొదమ సింగాలు ఆవులిస్తున్నాయి.
ఎవరూ ఎవరి మీదా ములాయిజా చూడక్కర్లేదు. అది బ్రాహ్మణ వాదం కాచొచ్చు, అంబానీ వాదం కావొచ్చు. శిష్టులకు, భోజన సుష్టులకు 'అల్లరి' అవసరం వుండదు. సో, ఇష్టం వుండదు. అన్నీ మెల్లగా మెత్తగా వుండాలంటారు. అన్నీ పడగ్గదిలో ప్రేయసీ ప్రియుల గుసగుసలుగా వుండాలి. ఎవరూ గట్టిగ కేకలు వేయగూడదు.
నొప్పి కలిగినోళ్లు మరీ అంత గొంతు చించుకుంటారేం, కలిగినోళ్ల తోటల్లో సున్నిత పూబాలలు రాలిపడేలా అని వాళ్ళ ఆశ్చర్యం, కోపం. ఇదొక రకం శిష్ట వ్యావహారికం. గ్రాంధికానికి దగ్గరి చుట్టం. ఈ భాష అక్కర్లేదు. రహస్యం అక్కర్లేదు. గుసగుసలు అక్కర్లేదు.
సూటిగా సుత్తి లేకుండా మాట్లాడితేనే ఏది సన్మార్గమో ఏది దుర్మార్గమో నిగ్గు తేలుతుంది.
సూటిగా సుత్తి లేకుండా మాట్లాడడమంటే ఏం లేదు. నిర్భయంగా, నిస్సందేహంగా మాట్లాడడం. నిర్భయంగా, నిస్సందేహంగా మాట్లాడే మనిషికి... తాను ఎవరి గురించి మాట్లాడుతున్నాడో వారి పేరు(లు) చెప్పి మాట్లాడడానికేం? అప్పుడవతలి మనిషి లెజిటిమేట్ గా తన మాట తానూ చెబుతాడు. తన విమర్శ తాను చేస్తాడు లేదా అత్మవిమర్శ చేసుకుంటాడు. మీ భయం గాని, సందేహం గాని అతడు మాట్లాడబోయే మాటల్లో వుండబోతున్న సత్యం వల్లనే నేమో అని మేము (మిగతా థర్డ్ పర్సన్ గాళ్ళం) ఎందుకు అనుకోగూడదు?
నేను తప్పు మాట్లాడితే విమర్శించండి. దొంగ దెబ్బలు ఎవరి మీద ఎవరూ వద్దు.
సోవియట్ యూనియన్ పతనమైన రోజుల్లో, ఈనాడు ఛేర్మన్ రామోజీ రావు ‘ఇపుడేమంటావ’ని అడిగారు. ‘వర్కర్స్ ఓడిపోయారండీ, రెండో రంగం వుంది. బహుశా మన జీవితకాలాల్లోనే దాని చిన్నెల్ని చూస్తాం’ అన్నాను. ఆయన నవ్వుతూ నాతో విభేదించారు.
నేను వింటున్నాను, ‘సెకండ్ ఫ్రంట్’ యొక్క రంబ్లింగ్స్. ప్రతి శ్రామిక పోరాట కదలికకూ లాల్ సలామందాం, విమర్శా హక్కును వుంచుకుంటూనే.

సెకండ్ ఫ్రంట్చీకటి ముట్టడిస్తొంది
కంపాస్ పగిలిపోయింది
గడుసు దయ్యాల దిగంబర నృత్యానికి
మరోసారి ఆసుర సంధ్య సిద్ధమవుతోంది
పిల్లా పాపా వున్నవాళ్ళం
బేఫికరుగా విశ్రమించలేం, పదండి


ఇది నిప్పులు నిర్మించే చోటు కాదు
ఇక్కడ అగ్గిపెట్టెలు మంచుగడ్డలవుతాయి
ఇది జీవితం చిగురించే తోట కాదు
పావురాళ్ళకు విషం కోరలు మొలుస్తుంటాయి
హంతకులెవరో తెలుసు కదా
శవ పరీక్షలెందుకు
అనుకున్న తీరం అందకపోయినా
కొత్త దుఃఖాన్నయితే కనుక్కున్నాం కదా
ఇంకా ఇక్కడేందుకు, పదండి


తీనన్మెన్ స్క్వేర్ లో
యవ్వనం గ్లాస్నోస్తయిపోయింది
మాసియంగు దేశంలోనూ
సొంత చెట్టు ఫాంగ్ లిజీనే పూచింది
క్రెమ్లిన్ గంట వాటికన్ లో మోగింది
బేర్లిన్లో కూలిపోవలసిందే కూలిపోయింది
మిగిలిపోయిన చెకుముకి రాళ్ళు మూట కట్టండి
మనమెందుకిక్కడ, పదండి


బుడాపెస్టులో జెండాలు చింపి
ఎవడో మనల్ని వెక్కిరించాడని
శ్రీమతి సీసెస్కూ చెప్పులు
ఎవడో మనపై విసిరేశాడని
ఎందుకలా దిగులు పడడం
వాడి పండక్కి మౌన ప్రేక్షకులమై
ఎందుకిలా నుంచోవడం, పదండి


మనం గోడలు పడగొట్టే వాళ్ళమే గాని
జనాన్ని విడగొట్టే వాళం కాదు
మనం చెప్పులు కుట్టే వాళ్ళం కావొచ్చు
జనం నెత్తిన మొట్టే వాళ్ళం కాదు
బెల్విలీ కొండల్లో ప్రాణాలొడ్డిన వాళ్ళం
పోటెమ్కిన్ నావను నడిపించిన వాళ్ళం
ప్రపంచాన్ని వూపేసిన పది రోజులం
వరదలెత్తిన టాటూ నదికి
వంతెనగా మారిన వాళ్ళం
మనం.... ... గెలిచే దాక
ఆగడానికి వీల్లేని పోరాటాలం, పదండి


వేసుకున్న చిక్కుముడులు
ఇప్పుడిప్పుడే విడవు
దారాలు తెంపి పోగులు పెట్టకండి
నడవడం ఎలాగో నడుస్తూనే నేర్చుకుందాం
మంచి మజిలీ చేరాకే అలసట తీర్చుకుందాం
మనసు చెదరనివ్వకండి
చెమట ఆరనివ్వకండి, పదండి


ఎవరికీ అర్థం కాని ఎవరూ ఆక్షేపించని
సంకేతాల ఇనుప కమ్ములు లెక్కపెడుతూ కూర్చోకండి
ఆ మలుపు తిరిగాక సంగతేమిటని
వాదిస్తూ నిలవకండి, అసలిక్కడ ఆగకండి


ఇది వంతెన
ఎక్స్పైరీ డేట్ ముగిసిన వంతెన
వంతెన మీద సైనికులెవరూ
కుడి ఎడమల కవాతులు తొక్కరు
పడురూ లేస్తూనే పదండి ముందుకు


(పేజీలు 14,15,16 ‘అబద్దం’ !987- 92)

(వచ్చే వారం మళ్లీ కలుద్దాం)

No comments:

Post a Comment